కమలానికి విజయం ఎంతో దూరం!
posted on Apr 28, 2023 @ 4:37PM
కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ రాష్ట్రంలో రాజకీయ వేడి భగ్గుమంటోంది. నిజానికి, మే 10న జరిగేది అసెంబ్లీ ఎన్నికలే అయినా, ఈసంవత్సరం చివరి వరకు మరో ఆరేడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలను, అలాగే, 2024 లోక్ సభ ఎన్నికలకు కర్ణాటక ఫలితాలు టర్నింగ్ పాయింట్ కావడంతో, కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ, చేజారిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు అందిపు చ్చుకు నేందుకు కాంగ్రెస్, అధికారం కోసం హంగ్ కలలు కంటున్న జేడీఎస్ మాత్రమే కాకుండా కర్నాటక ఎన్నికలు జాతీయ స్థాయిలో కూడా అందరూ ఆసక్తి చూపుతున్నారు.
ఈ నేపథ్యంలోనే కర్నాటక ఎన్నికలలో విజయం ఎవరిదన్న దానిపై ఇప్పటి వరకూ వచ్చిన పలు ప్రీ పోల్ సర్వేలు రాష్ట్రంలో హంగ్ అనివార్యం అని పేర్కొన్నాయి. అయితే తాజాగా కర్నాటక ఎన్నికలపై శ్రీ ఆత్మసాక్షి సర్వే మాత్రం ఆ రాష్ట్రంలో బీజేపీకి విజయం చాలా దూరం అని పేర్కొంది. కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ అధికారాన్ని హస్తగతం చేసుకోవడానికి అవసరమైన స్థానాలను సాధిస్తుందనీ, అధికారాన్ని చేజిక్కించుకోవడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్ అయిన 113 స్థానాల కంటే ఎక్కువ స్థానాలనే కాంగ్రెస్ కైవసం చేసుకుంటుందని పేర్కొంది.
శ్రీ ఆత్మసాక్షి సర్వే ప్రకారం కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ 115 నుంచి 127 స్థానాల వరకూ గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి. ఇక ప్రస్తుతం ఆ రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీజేపీ విజయం సాధించే స్థానాలు 77 నుంచి 88 వరకూ ఉండోచ్చని తేల్చింది. ఇక రాష్ట్రంలో ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషిస్తుందనీ, హంగ్ ఏర్పడితే కింగ్ మేకర్ పాత్ర పోషిస్తుందనీ అంచనాలున్న జేడీఎస్ 29 నుంచి 36 స్థానాలకు పరిమితమౌతుందనీ శ్రీ ఆత్మసాక్షి సర్వే తేల్చింది. ఇతరులు మూడు నుంచి ఎనిమిది స్థానాలలో విజయం సాధించే అవకాశాలున్నాయని పేర్కొంది.
ఆత్మసాక్షి సర్వే 2018లో జరిగిన కర్నాటక అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా చేసిన సర్వే అంచనాలు కచ్చితంగా రావడంతో తాజా ప్రీపోల్ సర్వేపై కూడా రాజకీయ పరిశీలకులు విశ్వసనీయత వ్యక్తం చేస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికలలో శ్రీ ఆత్మసాక్షి సర్వే బీజేపీ 102 నుంచి 105 స్థానాలలో విజయం సాధిస్తుందని అంచనా వేయగా.. ఆ పార్టీ 104 స్థానాలలో విజయం సాధించింది. అదే విధంగా కాంగ్రెస్ 76 నుంచి 78 స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయని పేర్కొనగా ఆ పార్టీ 78 స్థానాలలో విజయం సాధించింది. అలాగే జేడీఎస్ కు 35 నుంచి 38 స్థానాలలో గెలిచే అవకాశాలున్నాయని అంచనా వేస్తే ఆ పార్టీ 37 స్థానాలలో గెలుపొందింది.
ఈ సారి కర్నాటకలో కాంగ్రెస్ పార్టీకి సంపూర్ణ మెజారిటీ సాధించి అధికారాన్ని హస్తగతం చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయని శ్రీ ఆత్మసాక్షి సర్వే పేర్కొంది. రాష్ట్రంలో హంగ్ పరిస్థితి లేదని ఆ సర్వే తేల్చింది.