అవినాష్ సెల్ఫీ వీడియో.. లాజిక్ మిస్సయ్యారు!
posted on Apr 28, 2023 @ 9:53AM
వైఎస్ వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాష్ రెడ్డి పీకల్లోతు ఇరుక్కున్నారు. అందులో సందేహం లేదు. దర్యాప్తు సంస్థ సీబీఐ మాత్రమే కాదు పులివెందుల మొత్తం వివేకా హత్య వెనుక ఉన్నది అవినాషేనని నమ్ముతున్నారు. ఎందుకంటే వివేకా హత్య కేసు దర్యాప్తులో ఎదురైన అడ్డంకులు, వాటికి కారణం ఏమిటన్నది ఈ నాలుగేళ్ల కాలంలో అందరూ గమనించారు.
ఇక గొడ్డలి పోటుకు గురైన వివేకానందరెడ్డి.. గుండెపోటుతో మరణించాడంటూ తొలుత ప్రచారం చేయడం దగ్గర నుంచి సంఘటనా స్థలంలో సాక్ష్యాలను చెరిపివేయడానికి చేసిన ప్రయత్నాలు, వివేకా భౌతిక కాయానికి కుట్టు వేసి బ్యాండేజీలు కట్టడం వరకూ అన్నీ అవినాష్ సమక్షంలోనే జరిగాయన్నది కేసు దర్యాప్తులో భాగంగా సీబీఐ బాగా ఎస్టాబ్లిష్ చేయగలిగింది. వాస్తవంగా గంటల వ్యవధిలో ఛేదించేయడానికి అవకాశం ఉన్న వివేకా హత్య కేసు దర్యాప్తు ఏళ్ల తరబడి కొనసాగడానికి.. హత్య జరిగిన నాటికి విపక్షంలో ఉన్న వైసీపీ, ఆ పార్టీ అధినేత జగన్ కారణం. ఈ హత్య నారాసుల రక్త చరిత్రలో భాగమనీ, స్థానిక పోలీసుల దర్యాప్తుపై నమ్మకం లేదనీ, సీబీఐకి అప్పగించాల్సిందేననీ డిమాండ్ చేశారు. ఆ తరువాత అధికారంలోకి వచ్చిన తరువాత సీబీఐ అవసరం లేదంటూ ఈ కేసు దర్యాప్తు కోసం సిట్ ఏర్పాటు చేశారు.
అక్కడ వైఎస్ వివేకా కుమార్తె రంగ ప్రవేశం చేసి సిట్ కాదు.. సీబీఐ దర్యాప్తు కావాలంటూ న్యాయపోరాటం చేసి సాధించుకున్నారు. ఇక అప్పటి నుంచీ కూడా వివేకా హత్య కేసు ఇటీవలి కాలం వరకూ ఒక అడుగు ముందుకు.. రెండడుగులు వెనక్కుఅన్నచందంగా సాగి.. మళ్లీ సునీత న్యాయపోరాటం కారణంగానే.. కేసు విచారణ ఏపీ నుంచి తెలంగాణకు మారి వేగం పుంజుకుంది. కేసు తెలంగాణకు మారిన తరువాతే.. వివేకా హత్య కేసులో పాత్రధారులు, సూత్రధారులు ఎవరన్నది మరింత స్పష్టత వచ్చింది. ఈ నేపథ్యంలో సీబీఐ అరెస్టు నుంచి తప్పించుకోవడానికి అవినాష్.. చేయగలిగిన అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. ముందస్తు బెయిలు కోసం తెలంగాణ హైకోర్టులో పిటిషన్ వేశారు. సీబీఐ దర్యాప్తు సవ్యదిశలో సాగడం లేదని ఆరోపణలు గుప్పించారు. హత్యకు వివేకా కుటుంబంలో ఉన్న ఆస్తి తగాదాలే కారణమంటూ ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నించారు. వివేకా రెండో పెళ్లి, అక్రమ సంబంధాలు, లైంగిక వేధింపులు అంటూ మరణించిన తరువాత ఆయన క్యారెక్టర్ అసాసినేట్ చేయడానికి కూడా వెనుకాడ లేదు. వివేకాను ఆస్తి కోసం ఆయన కుమార్తె, అల్లుడే హత్య చేశారంటూ ఆరోపణలు గుప్పించారు.
అయితే ఇంత చేసిన అవినాష్ రెడ్డి సంఘటన జరిగిన రోజు సాక్ష్యాల మాయం, మృతదేహానికి కుట్లు, బ్యాండేజీల సమయంలో తాను అక్కడే ఉండి కూడా ఏం చేశారు?ప్రేక్షక పాత్ర వహించారా? అన్న ప్రశ్న ఉత్పన్నమౌతుందన్న లాజిక్ ఎలా మిస్సయ్యారు? అంతేనా.. వివేకా కుటుంబంలో ఆస్తి తగాదాలు అన్నవి నిజంగా ఉంటే.. అవి హత్యకు ముందురోజు వచ్చినవి కాదు కదా? అన్న లాజిక్ కూడా మిస్సయ్యారు. ఈ విషయం ఆయనకు తప్ప ఆయన విడుదల చేసిన సెల్ఫీ వీడియో చూసిన అందరికీ బాగానే అర్ధమయ్యింది. అదీ కాకుండా ఇన్నివిషయాలు తెలిసీ ఆయన ఈ నాలుగేళ్లూ ఎందుకు మౌనం వహించారు? నారాసుర రక్త చరిత అంటూ తాను ప్రాతినిథ్యం వహిస్తున్న వైసీపీ ఆరోపణలు గుప్పిస్తున్నప్పుడు వాస్తవం ఎందుకు చెప్పలేదు.
సీబీఐ తొలుత అనుమానితులుగా బీటెక్ రవి, ఆదినారాయణ రెడ్డి వంటి వారిని విచారించినప్పుడు ఎందుకు నోరెత్తలేదు. ఇప్పుడు తన దాకా వచ్చేసరికి ఇంత కాలం కనిపించని వివేకా కుటుంబంలో ఆస్తితగాదాలు గుర్తొచ్చాయా? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
అవినాష్ సెల్ఫీ వీడియోలో చేసిన ఆరోపణల్లోని డొల్ల తనాన్ని ఏపీ సీఎం జగన్ కు స్వయాన సోదరి అయిన వైఎస్సార్టీపీ అధినేత్రి షర్మిల బట్టబయలు చేశారు. వివేకా హత్య కేవలం కడప ఎంపి సీటు కోసమే జరిగిందనీ, ఆస్తుల తగాదా అన్నప్రశక్తే లేదనీ ఆమె కుండ బద్దలు కొట్టేశారు. ఒక వేళ ఆస్తుల కోసమే అయితే సునీతను హత్య చేసి ఉండేవారని చెప్పడం ద్వారా అవినాష్ నన్ను నమ్మండి నిజమే చెబుతున్నానంటూ సెల్ఫీ వీడియోలో చెప్పినవన్నీ అబద్ధాలేననీ, తనను తాను డిఫెండ్ చేసుకోవడానికి అల్లిన కట్టకథలనీ తేటతెల్లమైపోయిందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.