భారీగా భూములు కొనుగోలు చేసిన కవిత.. ఈడీ అభియోగం!
ఢిల్లీ మద్యం కుంభకోణంలో ఈడీ అధికారులు తాజాగా దాఖలు చేసిన మూడో ఛార్జ్ షీట్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితతో పాటు ఆమె భర్త అనిల్ పేరు కూడా చేర్చారు. ఈ చార్జిషీట్ లో కవితపై కీలక అభియోగాలు మోపారు. ప్రధానంగా సౌత్ గ్రూప్ కు సంబంధించిన కీలక విషయాలను ఈడీ ఈ ఛార్జ్ షీట్ లో పొందుపరిచింది. ఎమ్మెల్సీ కవిత ఆమె భర్తతో పాటు ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా, వైసిపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు అరబిందో ఫార్మా డైరెక్టర్ శరత్ రెడ్డిపై ఈడీ అభియోగాలు మోపింది.
తాజా చార్జిష్టీట్లో పలు కీలక అంశాలను, పలు కొత్త కోణాలను పొందుపరిచింది. మద్యం వ్యాపారంతో పాటు ఆర్థిక లావాదేవీలకు సంబంధించి కీలక సమాచారాన్ని ఈడీ ఈ చార్జిషీట్ లో పొందుపరిచింది. మాగుంట శ్రీనివాస్ రెడ్డి, రాఘవ, కవిత, శరత్ చంద్రారెడ్డిలతో కూడిన సౌత్ గ్రూప్ 100 కోట్ల ముడుపులు హవాలా రూపంలోనే ఇచ్చారన్న దర్యాప్తు సంస్థ. ముడుపులు యివ్వడం ద్వారా తమకు అనుకూలంగా మద్యం పాలసీ రూపొందేలా చేశారనీ, దీంతో హోల్ సేల్, రిటైల్ వ్యాపారంలో సౌత్ గ్రూప్ భారీగా లబ్ది పొందిందని దర్యాప్తు సంస్థ ఈడీ పేర్కొంది.
హవాలా రూపంలో నగదు బదిలీ, ముడుపులు చెల్లింపుతో పాటు భూముల కొనుగోళ్ళ వ్యవహారాలను కూడా ఈడీ ఈ చార్జ్ షీట్ లో పొందు పరిచింది. అలాగే కీలకమైన వాట్సాప్, సిగ్నల్, ఈ మెయిల్, కాల్ డేటా, హోటల్ రికార్డ్స్ ను జత చేసిన ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు అరుణ్ రామచంద్రన్ పిళ్ళై, బుచ్చిబాబు, మాగుంట రాఘవ తాజాగా వెల్లడించిన కీలక సమాచారాన్ని కూడా ఛార్జ్ షీటులో పొందుపరిచారు. ఛార్జిషీటులో ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, మనిష్ సిసోడియా, వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాస్ రెడ్డి, ఆయన కుమారుడు రాఘవ, బీఆర్ ఎస్ ఎంఎల్ సి కవితపై పలు అభియోగాలు మోపింది.
ఢిల్లీ లిక్కర్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో కవిత అరుణ్ పిళ్ళై ద్వారా హైదరాబాద్ లో భూములు కొన్నారని, భూముల కొనుగోలుకు పిళ్ళై బ్యాంకు అకౌంట్ల ద్వారానే నగదు లావాదేవీలు జరిగాయనీ పేర్కొంది. హైదరాబాద్ లో కవిత మూడు ఆస్తులు కొనుగోలు చేశారని, తనకు వున్న రాజకీయ పలుకుబడి కారణంగా తక్కువ రేటుకు కవిత భూములు దక్కించుకున్నారని ఈడి పేర్కొంది. ఈడి ఛార్జిషీటులో కవిత తో పాటు భర్త అనిల్ కుమార్ పేరును ప్రస్తావించిన ఈడి హైదరాబాద్ కు చెందిన ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ ఫీనిక్స్ పేరునూ ప్రస్తావించింది. లిక్కర్ లాభాలతో భూములు కొనేందుకు కవిత కు ఫీనిక్స్ కు చెందిన శ్రీహరి సహకరించారని పేర్కొంది.