షిర్డీ బంద్.. ఎందుకంటే..?
posted on Apr 28, 2023 @ 3:24PM
మహారాష్ట్రలోని ప్రఖ్యాత పర్యాటక ప్రాంతమైన షిర్డీ లో మే 1నుంచి నిరవధికంగా బంద్ చేయనున్నారు. సాయిబాబా ఆలయాన్ని సంరక్షించేందుకు సెంట్రల్ ఇండస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ ని నియమించాలన్న ప్రభుత్వ నిర్ణయానికి నిరసనగా ఆలయ నిర్వాహకులు ఈ నిర్ణయం తీసుకున్నారు.
ఆలయ భద్రతా అవసరాలను నిర్వహించడానికి సెంట్రల్ ఇండస్టియల్ సెక్యూరిటీ ఫోర్స్ అవసరం లేదని సాయిబాబా ఆలయ నిర్వాహకులు విశ్వసిస్తున్నారు. షిర్డీ పట్టణంలోని సాయిబాబా ఆలయం అత్యంత ముఖ్యమైన ఆలయం. ఈ చిన్న పట్టణం ఒక ప్రసిద్ధ పర్యాటక కేంద్రం, ప్రపంచవ్యాప్తంగా అన్నీ మతాలకు చెందిన లక్షలాది మంది ప్రజలు షిర్డీ ఆలయాన్నిసందర్శించుకుందుకు వస్తుంటారు.
అహ్మద్‌నగర్-మన్మాడ్ రహదారిపై ఉన్నఈ ఆలయాన్ని శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ నిర్వహిస్తోంది. 2018లో షిర్డీ విమానాశ్రయం భద్రతా వ్యవహారాలను సిఐఎస్ఎఫ్కి అప్పగించారు. ఇప్పుడు సాయిబాబా ఆలయ రక్షణ బాధ్యతలను సైతం ప్రభుత్వం కేంద్ర బలగాలకు అప్పగించాని నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్న వివిధ సంస్థలు .. ఇక్కడ అన్ని మార్కెట్లు, రవాణాదారులు, వాణిజ్య మరియు ఆతిథ్య పరిశ్రమల మూసివేతకు పిలుపు నిచ్చాయి.
పట్టణ ప్రజల సమ్మెతో శ్రీ సాయిబాబా సంస్థాన్ ట్రస్ట్ కి ఎలాంటి సంబంధం లేదని ఆలయ అధికారి ఒకరు తెలిపారు. కానీ సాయిబాబా ఆలయంలో కార్యకలాపాలన్నీ యథావిధిగా పనిచేస్తాయి... కేంద్ర బలగాలు భద్రత బాధ్యతను ఎప్పుడు తీసుకుంటాయన్నది తెలియదని ట్రస్ట్ చెబుతోంది. ప్రస్తుతం మహారాష్ట్ర పోలీసులే ఇక్కడి భద్రతను పర్యవేక్షిస్తున్నారనీ, మెటల్ డిటెక్టర్లు, ఇతర భద్రతా ఏర్పాట్లు ఆలయ ప్రాంగణంలో ఉన్నాయని ట్రస్ట్ పేర్కొంది. ప్రధాన ఆలయం 4.5 ఎకరాలలో విస్తరించి ఉండగా... కార్యకలాపాలు దాదాపు 350 ఎకరాలలో ఉన్నాయి. అయినప్పటికీ భద్రత పర్యవేక్షణ ఆలయ ప్రాంతాలకు మాత్రమే పరిమితం అవుతుంది.
షిర్డీ పట్టణంలో దాదాపు 25,000 మంది జనాభా ఉన్నారు. సాయిబాబా ఆలయాన్ని ప్రతిరోజూ 50,000 మంది భక్తులు సందర్శిస్తారు. షిర్డీ వంటి మతపరమైన పుణ్యక్షేత్రం ప్రత్యేక భద్రతా సవాళ్లను నిర్వహించడానికి ప్రత్యేక దళం అవసరం లేదని పట్టణ ప్రజలు అంటున్నారు. ఈ షట్‌డౌన్ వల్ల స్థానిక ఆర్థిక వ్యవస్థపై పెద్ద దెబ్బ పడుతుంది. ఇది దాని మనుగడ కోసం పూర్తిగా మతపరమైన పర్యాటకంపై ఆధారపడి ఉంటుంది. ఏది ఏమైనప్పటికీ, ఆలయ నిర్వాహకులు ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మతపరమైన పుణ్యక్షేత్రం కాబట్టి భద్రతా పర్వవేక్షణకు కేంద్ర బలగాలు అవసరం లేదని ఆలయ నిర్వాహకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.