థాయ్ ల్యాండ్ లో చీకోటి అరెస్టు.. తెలుగు రాష్ట్రాలలో రాజకీయ ప్రకంపనలు

తెలుగు రాష్ట్రాలలో  చీకోటి ప్రవీణ్ కు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. గుడివాడ క్యాసినో వ్యవహారంతో ఒక్క సారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన చీకోటి ప్రవీణ్ కు తెలుగు రాష్ట్రాలలో పార్టీలకు అతీతంగా రాజకీయ నాయకులతో ఉన్న సంబంధాలు అప్పట్లో వెలుగులోకి వచ్చాయి. అటువంటి చీకోటి ప్రవీణ్  తాజాగా   థాయ్ లాండ్ లో అరెస్ట్ అయ్యాడు.   ప‌ట్టాయా లోని ఏషియన్ పట్టాయా అనే ల‌గ్జ‌రీ హోట‌ల్ లో  భారీ ఎత్తిన గ్యాంబ్లింగ్ జ‌రుగుతోందంటూ అందిన సమాచారం మేరకు థాయ్ ల్యాండ్ టాస్క్ ఫోర్స్ సిబ్బంది నిర్వహించిన దాడుల్లో  ఈ ఘ‌ట‌న‌లో  అరెస్టయిన వారిలో చీకోటి ప్రవీణ్ కూడా ఉన్నాడు. ఈ దాడిలో  మొత్తం 92 మందిని అరెస్టు చేయగా వారిలో 80 మందికిపైగా భారతీయులే కావడం విశేషం. ఆ అరెస్టయిన వారిలో చీకోటి ప్రవీణ్ కూడా ఉన్నాడు. నిందితుల నుంచి రూ. 20 కోట్ల న‌గ‌దు, కెమెరాలు, 92 ఫోన్స్ ,మూడు నోట్ బుక్స్ ను స్వాధీనం చేసుకున్న‌ట్లు చెబుతున్నారు. కాగా  ఈ హోటల్ ను ఏప్రిల్ 27 నుంచి మే 1(సోమవారం) వరకూ బుక్ చేసుకున్నారనీ, ప్రత్యేకించి కాసినో కోసమే దీనిని బక్ చేసుకున్నారని  థాయ్ ల్యాండ్ పోలీసులు చెబుతున్నారు.   అదలా ఉంటే థాయ్ లాండ్ లో క్యాసినో కింగ్ చీకోటి ప్ర‌వీణ్ అరెస్ట్ వార్త ఒక్క సారిగా తెలుగు రాష్ట్రాలలో ప్రకంపనలు సృష్టించింది. గత ఏడాది సంక్రాంతి సందర్భంగా గుడివాడలో నిర్వహించిన క్యాసినోతో చీకోటి ప్రవీన్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంబంధాలపై విమర్శలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా, ప్రవీణ్ కు కృష్ణా జిల్లాకు చెందిన వైసీపీ నాయకులకు సంబంధాలున్నాయంటూ పెద్ద ఎత్తున ఆరోపణలు వెల్లువెత్తాయి. అంతే కాకుండా  రాజకీయాలకు అతీతంగా  తెలుగు రాష్ట్రాలకు చెందిన పలువురు నాయకులతో చీకోటికి సన్నిహిత సంబంధాలు ఉన్నాయనీ కూడా అప్పట్లో వార్తలు వచ్చాయి. అప్పట్లో తెలుగుదేశం నేతల   గుడివాడ  కేసినో వ్యవహారంపై ఈడీ అధికారులకు ఫిర్యాదు కూడా చేశారు.  ఆ తరువాత ఈ వ్యవహారంలో కొంత కాలం స్తబ్దత నెలకొంది. తెలుగుదేశం నాయకుల ఫిర్యాదును ఈడీ పట్టించుకోలేదన్న విమర్శలు కూడా అప్పట్లో వెల్లువెత్తాయి. అయితే హఠాత్తుగా గత ఏడాది జులైలో ఈడీ చీకోటి ప్రవీణ్ కు చెందిన  కార్యాలయాలు, నివాసాలలో  దాడులు నిర్వహించింది.  ప్రవీణ్ ల్యాప్ టాప్, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుంది. ప్రవీణ్ ను విచారించింది. ఈ వ్యవహారం అంతా అప్పట్లో రెండు తెలుగు రాష్ట్రాలలోనూ రాజకీయ ప్రకంపనలు సృష్టించాయి,  చీకోటి వెనుక రెండు తెలుగు రాష్ట్రాలకు చెందిన బడా నేతలు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి  చీకోటి ప్రవీణ్ ఫోన్ లో, ల్యాప్ టాప్ లో  తెలుగు రాష్ట్రాలకు చెందిన మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్లు అప్పట్లో ఆరోపణలు వెల్లువెత్తాయి. ప్రవీణ్ నిర్వహించిన క్యాసినోలకు వెళ్లిన కస్టమర్ల జాబితాలో రెండు తెలుగు రాష్ట్రాలకూ చెందిన పలువురు ఎమ్మెల్యేల పేర్లు ఉన్నట్లు కూడా అప్పట్లో బాగా ప్రచారమైంది.   ఆ తరువాత ఇన్నాళ్లకు చీకోటి ప్రవీణ్ థాయ్ ల్యాండ్ లో క్యాసినో నిర్వహిస్తూ అరెస్టయ్యాడన్న వార్త మళ్లీ రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. అప్పట్లో చీకోటి నిర్వహించిన క్యాసినోకి వెళ్లారంటూ ఆరోపణలు ఎదుర్కొన్న వారిలో ఆందోళన వ్యక్తమౌతోంది. మళ్లీ చీకోటి ప్రవీణ్, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని సంబంధాలపై తెలుగు రాష్ట్రాలలో పెద్ద ఎత్తున చర్చ మొదలైంది. అలాగే  అప్పట్లో చీకోటి నివాసాలపై   దాడుల సందర్భంగా సేకరించిన సమాచారం ఆధారంగా  గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని ఈడీ విచారించిన సంగతి విదితమే. అలాగే తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు కుటుంబానికి సన్నిహితుడైన ఒకరిని కూడా అప్పట్లో ఈడీ విచారించినట్లు వార్తలు వచ్చాయి.  ఈ నేపథ్యంలోనే థాయ్ ల్యాండ్ లో  చీకోటి అరెస్టు వార్తతో మరోసారి తెలుగు రాష్ట్రాలలో రాజకీయ నాయకులతో  చీకోటి ప్రవీణ్ చీకటి సంబంధాలపై పెద్ద ఎత్తున చర్చ ఆరంభమైంది. 

మళ్లీ కామన్ సివిల్ కోడ్

కర్ణాటక ఎన్నికల నేపథ్యంలో బీజేపీ ఎన్నికల ప్రణాళికను విడుదల చేసింది.ఈ ప్రణాళికలో వివాదాస్పద అంశం కామన్ సివిల్ కోడ్ చేరింది. తాము అధికారంలో వస్తే కామన్ సివిల్ కోడ్ అమలు చేస్తామని బీజేపీ అధ్యక్షుడు జెపీ నడ్డా ప్రకటించారు. కర్ణాటకలో మే 10వ తేదీన పోలింగ్ జరగనుంది.  కర్ణాటకలో కామన్ సివిల్ కోడ్ అమలు చేసి తీరుతామని నడ్డా హామీ ఇచ్చారు. కామన్ సివిల్ కోడ్ అమలుకు భారత రాజ్యాంగం కూడా చెబుతుందని ఆయన చెబుతున్నారు. భారత దేశంలో కామన్ సివిల్ కోడ్ కేవలం గోవాలో మాత్రమే అమలవుతుంది. యూనిఫాం సివిల్ కోడ్ దేశానికి అత్యవసరమని మోడీ ప్రభుత్వం తొలినుంచి చెబుతూనే ఉంది. భారతీయ జనతా పార్టీ విధానాల్లో కామన్ సివిల్ కోడ్ అతిముఖ్యమైనది. యూనిఫాం సివిల్ కోడ్ అనేది భారత రాజ్యాంగం ఆర్టికల్ 44లో స్పష్టంగా  పొందుపరిచింది. భారత స్వాతంత్యం వచ్చాక వివిధ మతాలు కామన్ సివిల్ కోడ్ ను వ్యతిరేకిస్తున్నాయి. ఇస్లాం మాత్రం ముస్లిం పర్సనల్ లా అమలు చేయాలని చెబుతోంది. భారత దేశంలో గత కొన్ని దశాబ్దాల నుంచి కామన్ సివిల్ కోడ్ వివాదాస్పదమౌతూనే ఉంది.  వివాహాలు, విడాకుల విషయాల్లో కామన్ సివిల్ కోడ్ , ముస్లిం పర్సనల్ లా వేర్వేరుగా ఉన్నాయి. కామన్ సివిల్ కోడ్ అమలు చేయడానికి ఇది సరైన సమయం కాదని చాలామంది వాదిస్తున్నారు. కొత్త సమస్యలు లేవనెత్తుతాయన్నారు. భారత దేశం వంటి వైవిధ్యమైన దేశంలో కామన్ సివిల్ కోడ్ అమలు కావడం కష్టమేనని సామాజిక విశ్లేకులు అంటున్నారు. 

కొత్త సచివాలయానికి బీటలు!?

కొత్త సచివాలయం.. తెలంగాణ ఠీకీకి నిలువెత్తు నిదర్శనమంటూ బీఆర్ఎస్ గొప్పగా చెప్పుకుంటున్న నూతన సెక్రటేరియెట్ బండారం ఒక వర్షంతో బట్టబయలైపోయింది. కొత్త సచివాలయానికి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎంతో ఘనంగా ఆదివారం (ఏప్రిల్ 30) ప్రారంభోత్సవం చేశారు. ప్రారంభోత్సవం జరిగిన గంటల వ్యవధిలోనే సచివాలయానికి బీటలు వచ్చాయి. ఆదివారం రాత్రి కురిసిన భారీ వర్షం సచివాయలం పరిస్థితి పైన పటారం లోన లొటారం అని బట్టబయలు చేసింది. ఆదివారం (ఏప్రిల్ 30) రాత్రి కురిసిన వర్షానికి సచివాలయం మీడియా సెంటర్ లో వాటర్ లీకేజీ కనిపించింది. శ్లాబ్ మీద నుంచి నీరంతా మీడియా హాల్ లోకి వచ్చేసింది. అంతేనా ఫిల్లర్ పగుళ్లు వారంది. సచివాలయం మీడియా హాల్ లో ప్రస్తుతం మీడియా ప్రతినిథులు అడుగు పెట్టేందుకు కూడా వీళ్లేనంత చెమ్మగా మారిపోయింది.   అంచనా వ్యయాన్ని నాలుగు రెట్లు పెంచి మరీ అద్భుత నిర్మాణం అంటూ నిర్మించిన ప్రతిష్ఠాత్మక కట్టడం ఒక్క వానకే నీరు కారడం, చెమ్మగిల్లడం, ఫిల్లర్ బీటలు వారడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్నికలు వచ్చేస్తున్నాయన్న తొందరలో హడావుడిగా పనులు ముగించేశారా? నాణ్యత గురించి పట్టించుకోలేదా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అకాలంలో కురిసిన ఒక్క వర్షానికే కొత్త సెక్రటేరియెట్ పరిస్థితి ఇలా తయారైతే.. ఇక వర్షాకాలంలో కురిసే భారీ నుంచి అతి భారీ వర్షాలు, తుపానులు సంభవిస్తేనూ సచివాలయం పరిస్థితి ఇంకెంత దయనీయంగా ఉంటుందన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఇప్పటికే అంటా వర్షానికి సచివాలయ డొల్ల తనం బయటపడటానికి ముందే సచివాలయ ఉద్యోగులు పెదవి విరిచేశారు. సచివాలయంలో వర్క్ స్పేస్ చాలా తక్కువగా ఉందని, తమతమ శాఖలకు కేటాయించిన  ప్రదేశంలో ఉద్యోగులు ఇరుకిరుకుగా కూర్చుని పని చేయాల్సిందేనని వారు ప్రారంభోత్సవానికి ముందే మీడియా ముందు ఆవేదన వ్యక్తం చేశారు.  

దూరపు కొండలు నునుపు

తెలుగువాడి ఆత్మాభిమానం దెబ్బతింటుందని ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించారు. అదే తెలుగు దేశం పార్టీలో డిప్యూటి స్పీకర్  స్థాయికి ఎదిగిన కేసీఆర్  ప్రత్యేక తెలంగాణా కార్డుతో ప్రత్యేక రాష్ట్ర సాధన ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నారు. కేసీఆర్ తెలుగు దేశం పార్టీలో ఉన్నప్పుడు ఎన్టీఆర్ పాదాల వద్ద తనకొడుకును పడుకోబెట్టి సర్ మీ పేరు నా కొడుక్కు పెట్టుకుంటానని తన అభిమానం చాటుకున్నారు.  ఎన్టీఆర్ పేరు వచ్చేలా తారకరామారావు అనిపెట్టుకుని తెలుగుదేశానికి దగ్గరయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో    తెలంగాణాకు అన్యాయం జరుగుతుందని ప్రత్యేక తెలంగాణా ఉద్యమాన్ని చేపట్టి అధికారంలో వచ్చిన కేసీఆర్ ఇపుడు నేషనల్ కార్డుతో భారత రాజకీయాల్లో రావాలనుకుంటున్నారు. తప్పేంలేదు.  ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ పార్టీగా ఎదగడానికి ఎత్తుగడలు వేసి జాతీయ స్థాయిలో రాజకీయాలు నడిపితే ఎవరైనా హర్షించాల్సిందే. కానీ ప్రాంతీయ పార్టీగా ఉన్నప్పుడు ఉద్యమాన్ని తారా స్థాయికి తీసుకెళ్లిన ఈ లోకల్ మీడియాపై చిర్రుబిర్రులాడటం కేసీఆర్ అవకాశ వాదానికి పరాకాష్టగా చెప్పుకోవచ్చు. తెలంగాణ సచివాలయ ప్రారంభోత్సవంలో లోకల్ మీడియాకే ఎంట్రీ లేకపోవడం అందరినీ  ఆశ్యర్యపరిచింది. ఆవేదన పరిచింది. అంతర్జాతీయ మీడియా సంస్థ అయిన బీబీసీకి అన్యాయం జరిగిందని, మోడీ ప్రభుత్వం కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడుతుందని  సచివాలయ ప్రారంభోత్సవంలో ఆరోపించారు. మరి తాను చేస్తున్న పని ఏమిటి? బీబీసీతో సహా ఉత్తర భారత దేశానికి చెందిన మీడియాను సాదరంగా ఆహ్వానించి మనవాళ్లను గేట్ బయటికి గెంటేసారు. నేషనల్ మీడియా  వాళ్లకు ప్రత్యేక ఇంటర్వ్యూలు ఇచ్చారు. ఎలక్ట్రానిక్ మీడియాకు చెందిన చిన్నా చితకా చానెల్స్ కు ప్రత్యేక బైట్స్ కూడా ఇచ్చారు. కేసీఆర్ వారిని ఇంతలా ప్రోత్సహించడానికి ఒకే ఒక ఎలిమెంట్  నాన్ లోకల్ మీడియా. కొత్తగా ఏర్పాటు అయిన బీఆర్ఎస్ పార్టీ తెలంగాణా, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో పోటీ చేయొద్దు అనుకుంటుందా? ఎన్నికల ముందు తాను మేనేజ్ చేయగలనని కేసీఆర్ భావిస్తున్నారా? ఏమిటో ఈ ఓవర్ కాన్ఫిడెన్స్. కేసీఆర్ కు ముందు నుంచి  మీడియా అంటే లెక్కలేదు. జర్నలిస్ట్ లు  అంటే గౌరవం లేదు.  హిందూ పత్రికలో పని చేస్తున్న సీనియర్ జర్నలిస్ట్ రాహుల్ తో ఉన్న చనువుతో ప్రెస్ కాన్షరెన్స్ లోనే అవమానించి వార్తల్లో కెక్కారు కేసీఆర్.  ప్రశ్నలు వేసిన రాహూల్ నే అవమానపరిచే విధంగా మాట్లాడిన తీరు  తెలుగునాట ఇప్పటికీ యూట్యూబ్ చానల్స్ లో చెక్కర్లు కొడుతూనే ఉంది. కేటీఆర్ కూడా అంతే. ఇటీవలె ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో ప్రశ్నించిన తెలంగాణ జర్నలిస్ట్ ను నాలుగు కోట్ల మంది టీఆర్ఎస్ ను గెలిపించారు. నిన్ను గెలిపించారా. ఏ మీడియా  నువ్వు అంటూ ప్రెస్ కాన్ఫరెన్స్ లోనే అవమానపరిచారు. చాలా కాలం నుంచి కేసీఆర్, కేటీఆర్ ను లోకల్ మీడియా ప్రశ్నించడం మానేసింది. ఇంగ్లీష్, హిందీ లో ప్రశ్నలు వేసిన జర్నలిస్టులకు తండ్రీ కొడుకులు ఎంతో ఓపిక, సహనంతో జవాబులు చెబుతారు.  ఉమ్మడి రాష్ట్రంలో వైఎస్ ఆర్ ప్రభుత్వం జవహార్లాల్ నెహ్రూ హౌజింగ్ సొసైటీకి కేటాయించిన 70 ఎకరాల భూమి లబ్దిదారులకు నేటి వరకు అందలేదు. సుప్రీంకోర్టు తుదితీర్పు ఇచ్చినప్పటికీ ఆ భూముల అప్పగింతలో తెలంగాణ ప్రభుత్వం మీనమీషాలులెక్కపెడుతుంది.‘‘మాది రాజకీయ పార్టీ. సుప్రీం తీర్పును అమలు పరచలేమని బయట ఉన్న జర్నలిస్టులు ఊరుకోరు’’ అని అసెంబ్లీ లాబీలో కేసీఆర్ తనయ కేటీఆర్  బాహాటంగా సెలవిచ్చారు.  సుప్రీం తీర్పు వచ్చిన తర్వాత థాంక్స్ చెబుదామని అనుకున్న జర్నలిస్ట్ నాయకులకు కేసీఆర్ అపాయింట్ ఇవ్వడం లేదు. అదే నేషనల్ మీడియా, పొరుగు రాష్ట్రాలైన మహరాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన మీడియా సంస్థలకు  గంటల తరబడి కేసీఆర్ ఇంటర్వ్యూలు ఇస్తున్నారు. ఆ ప్రాంతాలకు చెందిన యూ ట్యూబ్ చానల్స్ లో కేసీఆర్ ఇంటర్యూలు ప్రసారమవుతున్నాయి. తెలుగు మీడియాను అనధికారికంగా బీఆర్ఎస్ బహిష్కరించింది. ఎందుకో ఈ డిస్క్రిమినేన్. దూరపు కొండలు నునుపు అంటే ఇదేనేమో.   

రజనీకాంత్ పై విమర్శలతో వైసీపీ ప్రతిష్ట పాతాళానికి

రజనీ కాంత్ పై వైసీపీ విమర్శలపై సహజంగానే దేశ వ్యాప్తంగా తీవ్ర  ఆగ్రహం వ్యక్తం అవుతోంది. రజనీకాంత్ కు ఏపీ సీఎం జగన్ క్షమాపణ చెప్పాలన్న డిమాండ్ జోరందుకుంటోంది. ఈ డిమాండ్ ఏదో తమిళుల నుంచో, తెలుగుదేశం పార్టీ నుంచో కాదు.. దేశం నలుమూలల నుంచీ వినవస్తోంది. సమాజాక మాధ్యమం అయితే.. వైసీపీ ఓటమి భయంతో ఇష్టారాజ్యంగా మాట్లాడుతోందనీ, ఆ మాటల్లో విమర్శల్లో వైసీపీ నేతల్లో ఫ్రస్ట్రేషన్ ప్రస్ఫుటంగా బయటపడుతోందనీ సామాజిక మాధ్యమంలో విస్తృత చర్చ జరుగుతోంది. తెలుగుదేశం వ్యవస్థాపకుడు నందమూరి తారకరామారావు శత జయంతి ఉత్సవంలో పాల్గొనేందుకు బెజవాడ వచ్చిన రజనీ కాంత్ తన ప్రసంగం మొత్తంలో ఎక్కడా వైసీపీ పేరు కానీ, జగన్ మాట కానీ ఎత్తలేదనీ, కేవలం చంద్రబాబు విజన్ ను, ఎన్టీఆర్ ఔన్నత్యాన్నీ మాత్రమే ప్రశంసించారనీ నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. అయితే చంద్రబాబు విజన్ గురించి రజనీకాంత్ ప్రస్తావించడంతోనే వైసీపీ కాళ్ల కింద భూమి కదిలిపోయినట్లుగా వైసీపీ నేతలు గాభరా పడటం వారిలోని భయాన్ని ఎత్తి చూపిందని అంటున్నారు. 2024 ఎన్నికలలో చంద్రబాబు విజయం సాధించి సీఎం అయితే ఏపీ నంబర్ వన్ అవుతుందన్నది ఒక్క రజనీకాంత్ అభిప్రాయం మాత్రమే కాదనీ.. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న ఆంధ్రులంతా అదే అభిప్రాయంతో ఉన్నారనీ అంటున్నారు. అంతెందుకు ప్రభుత్వ విజయాలను బాకా ఊదుకోవడానికి గడప గడపకూ అంటూ వెళుతున్న ఎమ్మెల్యేలు, మంత్రులకు ఎదురౌతున్న ప్రజా వ్యతిరేకత, నరసనల సెగలే.. జగన్ పాలన ఎంత సుందరముదనష్టంగా సాగుతోందో అర్దమైపోతోందని నెటిజన్లు వ్యంగ్య బాణాలు సంధిస్తున్నారు. అంతెందుకు జగన్ ప్రసంగాలకు, పథకాలకు, సొమ్ముల పందేరాననికీ జనం చప్పట్లు కొట్టడం లేదంటూ సీనియర్ వైసీపీ నేత.. మంత్రి ధర్మాన జనంపైనే చిర్రుబుర్రులాడటంతోనే వైసీపీ పాలన పట్ల, జగన్ తీరు పట్ల సొంత పార్టీలోనే.. ఎంత అసహనం వ్యతిరేకత ఉందో అర్థమౌతోందని అంటున్నారు. అధికారం చేజారిపోతోందన్న ఆందోళన వైసీపీ నేతలలో అసహనానికీ, ఫ్రస్ట్రేషన్ కు కారణమౌతోందని, దాంతోనే  విచక్షణ మరచి ఎవరిని పడితే వారిని, ఎలా పడితే అలా విమర్శస్తూ తమ వాచాలతను ప్రదర్శిస్తున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైసీపీ నేతల ఈ తీరు వారి ప్రతిష్టను, పార్టీ పరువును మరింత దిగజారు స్తున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

మేడేకు నిజమైన సార్ధకత ఎప్పుడంటే?

కార్మికుల పోరాటాల్లో నుంచి  ఉద్భవించినదే మేడే .ఏటా కార్మిక దినోత్సవాలు జరుపుకుంటున్నా.. స్వేదం చిందిస్తున్న కార్మికులను ఇంకా బానిసలుగా చూస్తున్న ఘటనలు కోకొల్లలుగా ఉన్నాయి. మిద్దెలు, మేడలూ కడుతున్న కార్మికులకు నేటికీ గూడు లేని దుస్థితి. వ్యవసాయం నుంచి  మొదలు పెడితే కార్మికుల స్వేదం చిందని రంగం ఏదీ లేదంటే అతివయోక్తి కాదు. సర్వసంపదలు సృష్టించే శ్రామిక వర్గం దుర్బర దారిద్ర్యంతో కునారిల్లుతోంది.  మేడే అనగానే గుర్తుకు వచ్చేది కార్మిక వర్గమే. వారు లేనిదే పరిశ్రమలు లేవు..జీవనం లేదు.. ఏటా మేడేలు జరుపుకుంటున్నా వారిని ఆదరించే తీరులో మాత్రం దశాబ్దాులుగా, శతాబ్దాలుగా ఎటువంటి మార్పూ కానరావడం లేదు. నేటికీ కార్మికులు బానిసలు బతుకిడుస్తున్నారు. కార్మిక వర్గాన్ని అక్కున చేర్చుకోవాల్సిన ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహిస్తున్నాయి. చట్టాలు పరిశ్రమల యాజమాన్యాలకు చుట్టాలుగా మారుతున్నాయి. కనీస వేతనాలు, అమలు కావడం లేదు. పనిదినాలు, పనిగంటలు పోరాడి సాధించుకున్న హక్కులు కాలగర్భంలో కలిసిపోతున్నాయి. దేశంలో కార్మికులను అణచివేసే  యాజమాన్యాలకే ప్రభుత్వాలు అండగా ఉంటున్నాయి. యాజమాన్యాలకే  ప్రభుత్వాలు వత్తాసు పలుకుతున్న కారణంగా కార్మికసంక్షేమం   మేడిపండు చందంగా మారిపోయింది. కార్మికులు తమ స్వేదాన్ని రక్తంగా చిందించి లాభాలు తెచ్చి పెడుతున్నా వారికి జీవనంలో కానీ, పని పరిస్ధితుల్లో కానీ, పని ప్రదేశాల్లో   నేటికీ కనీస వసతులు లేని పరిస్థితి, కనీస వేతనాలు అమలు కాని దుస్థితే ఉంది. ఎన్నో పోరాటాల ద్వారా కార్మిక హక్కులు సాధించుకున్నా.. వాటి అమలు మాత్రం గాలిలో దీపంగానే ఉంది.  8 గంటల పని హక్కు కోసం ప్రాణాలు ధారపోసి,  నాటి ప్రభుత్వాల మెడలు వంచి సాధించుకున్నా పరిస్థితి ఎక్కడ వేసిన గొంగళి అక్కడనే ఉంది. తమ డిమాండ్లపై నినదించిన వారిని తక్షణం ఉద్యోగాల నుంచి తొలగస్తున్నారు. ఉద్యోగా లు తొలగించినా... నోటీసులు ఇవ్వకున్నా కార్మిక సంక్షేమ శాఖ చూసీచూడనట్లుగా  వ్యవహరిస్తోంది.  కార్మికుల పిల్లలకు విద్యా,ఉద్యోగ సౌకర్యాల కల్పన లేదు. వారికి ఆరోగ్య సమస్యలపై పట్టింపు లేదు. అలాగే అర్థాంతరంగా కంపెనీలను, సంస్థలను మూసేసి కార్మికలు నోట్లో మట్టి కొడుతున్నా చట్టాలు పని  కార్మికులను అణచివేసేందుకు యాజమాన్యాలు కొత్తకొత్త పద్దతులను అనుసరిస్తున్నాయి. యాజమాన్యా లకు వత్తాసు పలికే  విధానానలను ప్రభుత్వాలు విడనాడాలి. అప్పుడే మేడేకు సార్థకత.  పారిశ్రామికీకరణ తరవాత కూడా మార్పులు రావడం లేదు. కార్మాకులకు హక్కులు లేకుండా చేస్తున్న యాజామన్యాలకు అనుగుణంగా ప్రభుత్వాలు చట్టాలు తీసుకు వస్తున్నాయి.  పక్కాగా శ్రామిక చట్టాలు అమలు చేసి వారికి అండగా నిలవాలి. కార్మిక హక్కులు, పోరాటాలు, త్యాగంతోనే సాధ్యం అయ్యాయి. కానీ ప్రభుత్వాలు కార్నొరేట్‌ కంపెనీలకు వత్తాసు పలుకుతూ..కార్మికులకు ద్రోహం చేస్తున్నాయి. కనీస పని గంటలు, కనీస వేతనాలు అమలు కావడం లేదు. కార్మిక చట్టాలను పకడ్బందీగా అమలు చేసినప్పుడే మేడే కు సార్థకత.

కర్నాటకలో కాంగ్రెస్ కు తోడుగా కమల్ హసన్!

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సుడిగాలి పర్యటనతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం మరింత ఉపందుకుంది. కాంగ్రెస్  అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ప్రధాని నరేంద్ర మోదీ ‘విషసర్పం’ అంటూ దూషించిన నేపధ్యంలో శనివారం(ఏప్రిల్29)  కర్ణాటకలో సుడిగాలి పర్యటన చేసిన మోదీ, కాంగ్రెస్ నేతల  తనను దూషించిన ప్రతిసారీ ప్రజలు వారికి తగిన గుణపాఠం చెపుతూనే ఉన్నారని గతాన్ని గుర్తుచేశారు. ఇంతవరకు కాంగ్రెస్‌ పార్టీ కీలక నేతలు తనను 91 సార్లు దూషించారని ప్రధాని మోదీ అన్నారు.   కాంగ్రెస్‌ నేతలు నన్ను విష సర్పం.. చౌకీదార్‌ చోర్‌ అని ప్రచారం చేస్తున్నారు. లింగాయత్‌ సోదరులను అవినీతి పరులన్నారు. అయితే, నన్ను దూషించిన ప్రతిసారీ ప్రజలు వారికి తగిన గుణపాఠం నేర్పారు  అని మోదీ వ్యాఖ్యానించారు. రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్‌ను, దేశం కోసం పోరాడిన సావర్కర్‌ను విమర్శించిన వారు తనను వదిలిపెడతారా? అంటూ కాంగ్రెస్‌ నేతలపై విరుచుకుపడ్డారు.  అలాగే గతంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకేర్ణ ప్రభుత్వంపైన మోదీ బాణాలు ఎక్కుపెట్టారు. ‘ప్రధాని కిసాన్‌ సమ్మాన్‌’  పథకంలో లబ్ధిదారుల జాబితాను కేంద్రానికి పంపలేదని విమర్శించారు. ఆ పథకంలో లూటీ చేసేందుకు వారికి అవకాశం లేకపోవడంతో వెనకడుగు వేశారని దుయ్యబట్టారు. కాంగ్రెస్‌ నేతలకు పేదల కష్టాలు అర్థం కావని అన్నారు.   డబుల్‌ ఇంజన్‌ పాలనలో పేదల సంక్షేమం వేగవంతంగా సాగుతోంది. డబుల్‌ ఇంజిన్‌ అంటే డబుల్‌ బెనిఫిట్‌, డబుల్‌ స్పీడ్‌. ఇటు రాష్ట్రం, అటు కేంద్రంలోను బీజేపీ ప్రభుత్వాలు ఉంటే డబుల్‌ శక్తి వస్తుంది. తద్వారా దేశంలోనే కర్ణాటక నంబర్‌ వన్‌గా మారుతుంది. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ ఇచ్చి, సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రజలు ఆశీస్సులు అందించాలి  అని ప్రధాని కోరారు. తనకు ఇవే చివరి ఎన్నికలు అన్న కాంగ్రెస్‌ నేత సిద్దరామయ్య ప్రకటనపై మోదీ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.  అలసిపోయి, ఓడిపోయిన కాంంగ్రెస్ సను ప్రజలు ఎన్నుకోరు. ఉత్సాహంతో నిండిన బీజేపీని గెలిపిస్తారు అని అన్నారు. ఈసారి సంపూర్ణ మెజారిటీతో బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందనే మాట కర్ణాటకలోని మారుమూల ప్రాంతాల్లోనూ ప్రతిధ్వనిస్తోందని చెప్పారు. అయితే మోదీ విమర్శలను కాంగ్రెస్ పార్టీ దీటుగా తిప్పికొట్టింది.  ప్రధాని మోదీకి ప్రజల బాధలు తెలియవని, వారి కష్టాలు వినే ఓపిక ఆయనకు లేదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా ఎదురుదాడి చేశారు. అంతే కాదు  ప్రజల ముందు సొంత బాధలు చెప్పుకొంటున్న తొలి ప్రధాని మోదీ అని ప్రియాంక అన్నారు.  కర్ణాటక ఎన్నికల ప్రచారంలో భాగంగా నవలగందలో నిర్వహించిన రోడ్‌షోలో ఆమె పాల్గొన్నారు. దేశంలో ఎంతోమంది ప్రధానులను చూశా. వారెవరూ మోదీలా సొంత బాధలు చెప్పుకోలేదు అన్నారు. కర్ణాటకలో అవినీతిపరులకు బీజేపీ టికెట్లు ఇచ్చిందని విమర్శించారు. 40 శాతం కమీషన్‌ వ్యవహారాన్ని భరించలేక పోతున్నామని కాంట్రాక్టర్ల సంఘం ప్రతినిధులు ప్రధానికి స్వయంగా లేఖ పంపినా స్పందన లేదన్నారు. 2024 లోక్‌సభ ఎన్నికలకు కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు దిక్సూచి కానున్నాయని, కాంగ్రెస్‌ విజయాలకు ఈ ఎన్నికలు నాంది పలకడం ఖాయమని కేపీసీసీ అధ్యక్షుడు శివకుమార్‌ అన్నారు. ఇదలా ఉంటే, ప్రముఖ సినిమా హీరో, “మక్కల్‌ నీదిమయ్యం’అధ్యక్షుడు, కమల్‌హాసన్‌  కాంగ్రెస్‏కు మద్దతుగా శాసనసభ ఎన్నికల ప్రచారానికి సిద్ధమవుతున్నారు. ఏఐసీసీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ కోరిక మేరకు ఆయన మే మొదటివారంలో కాంగ్రెస్‌ కూటమికి మద్దతుగా ప్రచారం చేయనున్నారని ఎంఎన్‌ఎం నేతలు తెలిపారు. కమల్‌ ప్రచార పర్యాటన వివరాలు త్వరలో వెల్లడవుతాయని చెప్పారు. రాహుల్‌ జోడోయాత్ర నిర్వహించినప్పుడు కమల్‌ ఢిల్లీలో ఆయనతో కలిసి పాదయాత్ర చేశారు. ప్రస్తుతం కర్ణాటకలో కాంగ్రెస్‌ అభ్యర్థుల గెలుపుకోసం ప్రచారం చేయనున్నారు. ఈ అంశాలను పరిశీలిస్తే వచ్చే యేడాది జరుగనున్న లోక్‌సభ ఎన్నికల్లో మక్కల్‌ నీదిమయ్యం కాంగ్రె్‌సతో పొత్తు కుదుర్చుకోవటం ఖాయమని తెలుస్తోంది. ఇప్పటికే లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహరచనలపై గత రెండు రోజులుగా కమల్‌ కోయంబత్తూరు, సేలం జిల్లాలకు చెందిన పార్టీ నిర్వాహకులతో సమావేశమై చర్చించారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‏తో పొత్తు ఖరారైతే పార్టీ నాయకుడు కమల్‌హాసన్‌ కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేయాలని పార్టీ నిర్వాహకులు కోరారు.2021 శాసనసభ ఎన్నికల్లో కమల్‌హాసన్‌ కోయంబత్తూరు సౌత్‌ నియోజకవర్గంలో పోటీ చేసి స్వల్ప ఓట్ల తేడాతో ఓటమి పాలైన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‏తో పొత్తు పెట్టుకుని కోయంబత్తూరు లోక్‌సభ నియోజకవర్గంలో పోటీ చేస్తే విజయం తథ్యమని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. అయితే, స్వరాష్ట్రంలో ఒక సీటు గెలుచుకోలేని, కమల్ సహన్ ప్రచారంతో కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీకి ఏ మేరకు ప్రయోజనం చేకూరుతుంది అనే విషయంలో కాంగ్రెస్ నేట్ల్లోనే అనుమాన్నలున్నాయి. అయినా, కర్ణాటక ఎన్నికలలో చావూ రేవో తెలుచుకునేందుకు సిదమైన కాంగ్రెస్ పార్టీ, ఏ చిన్న అవకాశాన్ని జారవిదుచుకునేందుకు సిద్డంగా లేదని అందుకే  రాహుల్ గాంధీ కమల్ హెల్ప్ కోరారని అంటున్నారు.

మహారాష్ట్రలో తొలి ఓటమి

టీఆర్ఎస్ పేరును బీఆర్ఎస్ గా మార్చుకుని, జాతీయ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు అడుగులు వేస్తున్న గులాబీ పార్టీకి ...  మహా రాష్ట్రలో తొలి అడుగులోనే ఓటమి ఎదురైంది.  బీఆర్ఎస్ విస్తరణ ప్రయత్నాలలో భాగంగా మహారాష్ట్ర పై ప్రత్యేక  దృష్టిని కేంద్రీకరించిన పార్టీ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్ కు ఎదురుదెబ్బ తగిలింది. అబ్ కీ బార్ కిసాన్ సర్కార్ నినాదంతో బీఆర్ఎస్ విస్తరణ ప్రస్థానంలో తొలి ప్రయత్నంగా తెలంగాణకు ఆనుకొని ఉన్న నాందేడ్‌ జిల్లాలోని భోకర్‌ తాలూకాలో ఉన్న భోకర్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ 18 డైరెక్టర్‌ పదవులకు రెండు రోజుల క్రితం ( శుక్రవారం ) జరిగిన ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ మద్దతుదారులు గంపగుత్తగా  ఓటమి పాలయ్యారు. కాంగ్రెస్‌ మద్దతుదారులు 13, ఎన్సీపీకి 2,బీజేపీ బలపరిచిన ముగ్గురు అభ్యర్థులు డైరెక్టర్‌ పదవులను కైవసం చేసుకున్నారు. బీఆర్‌ఎస్‌ ఒక్కరిని కూడా గెలిపించుకోలేకపోయింది.  ఈ మార్కెట్‌పై పట్టున్న నాగ్‌నాథ్‌ సింగ్‌ ఇటీవలే కాంగ్రెస్ ను వీడి, బీఆర్‌ఎస్‌ గూటికి చేరారు.  ఆ వెంటనే వచ్చిన మార్కెట్‌ కమిటీ ఎన్నికల్లో సత్తా చాటాలని బీఆర్‌ఎస్‌ వ్యూహ రచన చేసింది. అయితే.. ముందు నుంచి ఈ కమిటీలో కాంగ్రెస్,ఎన్సీపీ కూటమి, శివసేన(ఉద్ధవ్‌ వర్గం), బీజేపీకి మధ్య త్రిముఖ పోటీ ఉంటుందని విశ్లేషకులు అంచనా వేశారు. ఇందుకు కారణం.. ఈ మార్కెట్‌ మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ నియోజకవర్గ (భోకర్‌) పరిధిలో ఉండడంతో, ఆయన ఈ ఎన్నికలను సీరియ్‌సగా తీసుకున్నారు.  అటు స్థానిక బీజేపీ ఎంపీ ప్రతాప్‌ పాటిల్‌ చికిల్కర్‌ కూడా వారం రోజులుగా భోకర్‌లోనే ఉంటూ..  అవిశ్రాంతంగా ప్రచారం చేశారు. కొంతకాలంగా మహారాష్ట్రలో రాజకీయ కార్యకలాపాలను విస్తరిస్తూ.. బీఆర్‌ఎస్‌ ముందుకు సాగుతోంది. ఇటీవల బీఆర్‌ఎస్‌ అధినేత  కేసీఆర్‌.. మహారాష్ట్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తామని ప్రకటించారు. ఈ తరుణంలో వచ్చిన భోకర్‌ మార్కెట్‌ కమిటీ ఎన్నికల్లో అదృష్టాన్ని పరీక్షించుకోవాలనుకున్నారు.  కానీ, నాగ్‌నాథ్‌ సింగ్‌ నేతృత్వంలో బరిలోకి దిగిన 18 మంది అభ్యర్థులు ఉచిత హామీలను ప్రకటించినా.. ఎన్నికల్లో విజయం సాధించలేకపోయారు. బీఆర్‌ఎస్‌ ఇక్కడ తమ మద్దతుదారులను గెలిపిస్తే.. తెలంగాణలో మాదిరిగా ఉచిత కరెంటు, రైతుబంధు, రైతుబీమా పథకాలను మహారాష్ట్రలో అమలు చేస్తామని హామీలు ఇచ్చింది. కాగా.. బీఆర్‌ఎస్‌ ఆగమనంతో ఫలితాలు తారుమారవుతాయని భావించినా ఆ పార్టీ పెద్దగా ప్రభావం చూపకపోవడం ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమైంది. మరోవైపు మహారాష్ట్రలో అధికారాన్ని కోల్పోయిన శివసేన(ఉద్ధవ్‌ఠాక్రే) వర్గం కూడా ఈ ఎన్నికల్లో బొక్కబోర్లా పడిందని విశ్లేషకులు అంటున్నారు. మహారాష్ట్ర వ్యాప్తంగా జరిగిన మార్కెట్‌ కమిటీల ఎన్నికల్లో ఫలితాలు విడుదలవ్వగా.. ఎప్పటిలానే కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి అధిక స్థానాలను గెలుచుకుంది.

తమిళ రాజకీయాల్లో డిఎంకే ఫైల్స్ సంచలనం

తమిళనాడు రాజకీయాల్లో సంచలనాలు చోటు చేసుకుంటున్నాయి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై డిఎంకే ఫైల్స్ పేరిట విడుదల చేస్తున్న డిఎంకే ప్రభుత్వం, స్టాలిన్ ఫ్యామిలీ అవినీతి కథలు నమ్మశక్యం కాని నిజాలను బయట పెడుతున్నాయి. స్టాలిన్, ఆయన కుటుంబ సభ్యులు అఫిడవిట్లలో పేర్కొన్న వివరాలను, అఫిడవిట్‌లో వెల్లడించని ఆస్తుల వివరాలను పోల్చుతూ అన్నామలై వీడియో విడుదల చేసి ప్రకంపనలు సృష్టించారు. లెక్కల్లో చూపని ఆస్తుల చిట్టాను అన్నామలై బట్టబయలు చేశారు. ఒక్క స్టాలిన్ ఆస్తులే కాదు.. డీఎంకే మంత్రుల ఆస్తులను కూడా వీడియోలో పూసగుచ్చినట్టు వివరించారు. తమిళనాడు నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న డీఎంకే నేతల చిట్టాను అన్నామలై విడుదల చేశారు. డీఎంకే ఫైల్స్ పేరుతో తమిళనాడు బీజేపీ విడుదల చేసిన ఈ జాబితాలో సీఎం స్టాలిన్ తో పాటు  డీఎంకే నేతలు 1.34 లక్షల కోట్ల అవినీతికి పాల్పడినట్లు వెల్లడించారు అన్నామలై.  డీఎంకే నేతల ఆస్తుల చిట్టాను పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌  ద్వారా ఆ వీడియోలో ఇచ్చారు. అంతే కాదుముఖ్యమంత్రి కుమారుడు ఉదయనిథి  స్టాలిన్, అల్లుడు సబరీసన్.. ఒకే ఒక్క సంవత్సరంలో రూ.30 వేల కోట్లు సంపాదించారని, అన్నామలై ఆరోపించారు. అంతే కాదు, ముందు ముందు మరిన్నిఎపిసోడ్స్ విడుదల చేస్తామని అన్నమలై ప్రకతించారు. అన్నట్లుగానే సెకండ్ ఎపిసోడ్ కూడా విడుదలైంది. మరోవైపు.. ట్విటర్‌లోనూ తమిళనాడు బీజేపీ యాక్టివ్‌గా ప్రచారం చేస్తోంది. ట్విటర్‌లో డీఎంకే ఫైల్స్, అన్నామలై ట్రెండింగ్‌లో ఉండటం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయితే బీజేపీ డీఎంకే ఫైల్స్‌పై తమిళనాడు అధికార పార్టీ కూడా స్ట్రాంగ్‌ కౌంటర్‌ ఇచ్చింది. డీఎంకే ఎంపీ ఆర్‌ఎస్ భారతి ‘డీఎంకే ఫైల్స్ ఒక జోక్’ అని కొట్టిపారేశారు. అయితే, మరో వారం  పది రోజుల్లో మే 7 ద్వితీయ వార్షికోత్సవం జరుపుకుంటున్న స్టాలిన్ ప్రభుత్వానికి హనీమూన్ పీరియడ్ అయోపోయిందని,ఇక ముందు స్టాలిన్ ఇంటా బయటా సమస్యలను ఎదుర్కోక తప్పదని  పరిశీలకులు అంటున్నారు.  మరో వంక ముఖ్యమంత్రి స్టాలిన్’ మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణ కసరత్తు మొదలెట్టినట్లు తెలుస్తోంది. పదేళ్ళ తర్వాత పవర్ లోకి వచ్చి డిఎంకే ప్రభుత్వం రెండేళ్ళు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో మంత్రుల పనితీరును, సామర్థ్యాన్ని పరిశీలించిన సీఎం..  మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ చేపట్టాలని యోచిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. అంతే గాక వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. ప్రభుత్వ పథకాల అమలు పరుగెత్తాలన్నా, శాఖల వారీగా పలు కార్యక్రమాలు ప్రజల వద్దకు చేరాలన్నా ఔత్సాహికులైన సమర్థవంతమైన మంత్రులు ఉండాలని సీఎం యోచిస్తున్నారు. ఆ ఎన్నికలను ఏ మాత్రం అలక్ష్యం చేసినా, ప్రతిపక్ష అన్నాడీఎంకేకు తగినన్ని సీట్లు వచ్చేందుకు అవకాశం కల్పించినా, మునుముందు తమ పార్టీ కష్టపడాల్సి ఉంటుందని సీఎం భావిస్తున్నారు. అందుకే ప్రతిపక్షం కోలుకునేందుకు ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా ప్రభుత్వ పథకాలు అమలు చేయడంతో పాటు అధికార యంత్రాంగాన్ని సమర్థవంతంగా వినియోగించి కింది స్థాయిలోనూ పార్టీని, ప్రభుత్వాన్ని బలోపేతం చేయగలిగే వ్యక్తులు మంత్రివర్గంలో ఉండాలని స్టాలిన్‌  యోచిస్తున్నారు. ఇందులో భాగంగా కొందరు సీనియర్‌ మంత్రులను తన టీం నుంచి తొలగించాలని సీఎం నిర్ణయించినట్లు సమాచారం. శాఖల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించడం, సమర్థనీయంగా నిర్వహించలేకపోవడం, అధిష్ఠానాన్ని పట్టించుకోకపోవడం తదితరాలను దృష్టిలో పెట్టుకుని ఈ మార్పులు చేర్పులు వుండవచ్చని డీఎంకే వర్గాలు చెబుతున్నాయి. అయితే సీనియర్ మంత్రులను తొలిగించడం అంత ఈజీ వ్యవహారం కాదని  ముఖ్యంగా అనేక సంక్షోభాలు చుట్టుముడుతున్న ప్రస్తుత పరిస్థితులలో సీనియర్లను తొలిగిస్తే అది కొరివితో తలగోక్కోవడమే అవుతుందని పరిశీలకులు అంటున్నారు.  

ప్రధాని మన్ కీ బాత్ @ 100 ఎపిసోడ్

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతి నెల చివరి ఆదివారం, దేశ ప్రజలను పలకరించే కార్యక్రమం.’మన్‌ కీ బాత్‌’ కార్యక్రమం. మన్‌కీబాద్‌ కార్యక్రమాన్ని 2014 అక్టోబర్‌ 3న ’మన్‌ కీ బాత్‌’ ప్రారంభమైన కార్యక్రమం ఏప్రిల్ 30న ప్రసారమైన కార్యక్రమంతో వందో ఎపిసోడ్ కు చేరింది.  ప్రతి నెలా చివరి ఆదివారం మధ్యాహ్నం 11 గంటలకు ఆల్‌ ఇండియా రేడియా, డీడీ నెట్‌వర్క్‌లో ’మన్‌ కీ బాత్‌’ ప్రసారం అవుతోంది.  ఏప్రిల్ 30) న ప్రసారమైన ‘మన్ కీ బాత్’ కార్యక్రమానికి ఒక ప్రత్యేకత వుంది. ఇది ‘మన్ కీ బాత్’  100వ ఎపిసోడ్. నిజానికి, 2014లో తోలి సారి అధికారంలోకి వచ్చింది మొదలు ప్రతి నెల ప్రసారమవుతున్న ‘మన్ కీ బాత్’ కార్యక్రమంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్కూల్ విద్యార్ధులు మొదలు మహిళలు,వృద్ధులు, విభిన్న వృత్తుల్లో ఉన్న  వ్యక్తులు,గ్రామ పంచాయతీ సర్పంచులు, ఇతర ప్రజా ప్రతినిధులు, ఉపాద్యాయులు ..ఒకరని కాదు అందరితో ప్రత్యక్షంగా, పరోక్షంగా మాట్లాడి వారు ప్రస్తావించిన అంశాల మంచి చెడులను తమ ప్రసంగం ద్వారా దేశ ప్రజలకు వివరించే, విధంగా కార్యక్రమాన్ని రూపొందించారు. సహజంగానే, ప్రతిపక్షపార్టీలు, ముఖ్యంగా కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ ఎంపీ రాహుల్ గాంధీ, అనేక సందర్భాలలో ’మన్‌ కీ బాత్‌’ కార్యక్రమాన్నిఎగతాళి చేశారు. అయినా, ఇప్పటి వరకూ 99 ఎపిసోడ్లు పూర్తి చేసుకుంకున్న ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందని, కేంద్ర సమాచార ప్రసార శాఖ అధికారులు తెలిపారు.   స్వచ్ఛ భారత్, బేటీ బచావో బేటీ పడావో, వాటర్‌ కన్జర్వేషన్, ఆయుష్, ఖాదీ తదితర అంశాలు ఆయా ఎపిసోడ్‌లో ప్రస్తావించడం, అంతగా గుర్తింపునకు నోచుకోని వ్యక్తులను వెలుగులోకి తేవడం సహా అనేక అంశాలతో ఈ రేడియో ప్రోగ్రాం జనబాహుళ్యానికి దగ్గరైంది.ఒక విధంగా ప్రజలకు ప్రభుత్వానికి, ఇంకా స్పష్టంగా చెప్పాలంటే  ప్రధానితో సామాన్య ప్రజలకు ప్రత్యక్ష సంబంధం ఏర్పరచడంలో ’మన్‌ కీ బాత్‌’ ఒక వారధిగా పని చేసింది.  కాగా, మన్‌కీ బాత్‌ వందో ఎపిసోడ్‌’ పురస్కరించుకుని ప్రసార భారతి విభిన్న తరహాలో ఈ కార్యక్రమాన్ని ప్రత్యేక వేడుకగా నిర్వహించింది. ఈ  సందర్భంగా ప్రత్యేకంగా వంద నాణెన్ని కూడా విడుదలచేసింది. ఏప్రిల్‌ 30 జరిగేగిన మన్‌కీ బాత్‌ సందర్భంగా ప్రధాని మోడీ రూ.100 కాయిన్‌ను విడుదల చేశారు. మన్‌కీ బాత్‌ కార్యక్రమంలో కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు, ఆటక్ నుంచి కటక్ వరకు అన్ని ప్రాంతాల ప్రజలు పాల్గొన్నారు. ప్రధాని మోడీతో తమ అభిప్రాయాలను, ఆలోచనలు, కష్ట సుఖాలు  పంచుకున్నారు. అలాగే, ఉభయ తెలుగు రాష్ట్రాలు చెందిన ఎందరో తెలుగువారిని గుర్తించిన ప్రధాని మోదీ తన ప్రసంగంలో వారిని, వారి విలువైన సలహాలను,విజయాలను దేశానికి పరిచయం చేశారు.  స్వచ్ఛ భారత్‌ పై రామోజీరావు చేస్తున్న సేవలను కొనియాడారు. తెలంగాణాలోని తిమ్మాయిపల్లి గ్రామ ప్రజలు వర్షాకాలంలో ప్రతీ నీటిబొట్టును వృథా కానివ్వకుండా వాటిని కాలువలుగా మళ్లించి నీటికుంటలను నిర్మించారు. ప్రధాని తిమ్మాయిపల్లి గ్రామ ప్రజలతో మాట్లాడారు, వారి దృఢ సంకల్పాన్ని మెచ్చుకున్నారు. బోయినపల్లి కూరగాయల మార్కెట్‌ లో 10 టన్నుల వ్యర్థాలతో విద్యుత్తును ఉత్పత్తి చేసే ప్రయత్నాన్ని నరేంద్రమోదీ ప్రశంసించారు.‘ల్యాబ్‌ టు ల్యాండ్‌’ మంత్రంతో వ్యవసాయ రంగంలో వినూత్న ప్రయోగాలు చేసిన తెలంగాణకు చెందిన చింతల వెంకటరెడ్డితో మాట్లాడి వారి కృషినీ ప్రశంసించారు. మేడారం జాతరనూ ప్రస్తావించారు. ఆంధ్రప్రదేశ్‌లో విజయనగరం జిల్లాలో వయోజన విద్యను ప్రోత్సహించేందుకు మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు చేసిన కృషికిగాను మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రధాని ఆయనపై ప్రశంసలు కురిపించారు. విజయవాడకు చెందిన శ్రీనివాసా పడకండ్ల అనే వ్యక్తి ఆటో మొబైల్‌ సంబంధిత వ్యర్థ పదార్థాలతో కళాఖండాలను తీర్చిదిద్దుతున్నాడు. ప్రధాని మన్‌ కీ బాత్‌లో శ్రీనివాసా పేరును ప్రస్తావింఛి మెచ్చుకున్నారు.నంద్యాలలో మిల్లెట్‌ ప్రాసెసింగ్‌ యూనిట్‌ను ప్రారంభించిన కేవీ సుబ్బారెడ్డిని కూడా ప్రధాని మన్‌ కీ బాత్‌ సందర్భంగా గుర్తు చేశారు. కృష్ణ, చిత్తూరు జిల్లాల్లో పండించే బంగినపల్లి మామిడి పండ్లను దక్షిణ కొరియాకు ఎగుమతి చేస్తారనే విషయాన్ని ప్రధాని మన్‌ కీ బాత్‌ ఎపిసోడ్‌లో ప్రస్తావించారు. భూగర్భ జలాలను పెంచే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్‌లో చేపట్టిన నీరు ప్రగతి కార్యక్రమాన్ని మన్‌ కీ బాత్‌ కార్యక్రమంలో ప్రస్తావించిన ప్రధాని కార్యక్రమంపై ప్రశంసల వర్షం కురిపించారు. మోడీ వందో మన్‌కీ బాత్‌ ఎపిసోడ్‌ను ప్రపంచ వ్యాప్తంగా 80 దేశాల్లో ప్రత్యక్ష ప్రసారం చేశారు. వీటిలో అగ్రరాజ్యం అమెరికాలోని వైట్‌హౌస్‌ కూడా ఉంది. అక్కడ కూడా.. ప్రత్యేక అనుమతులు తీసుకుని ప్రసారం చేశారు. అదే విధంగా ఐక్యరాజ్యసమితి.. జీ20 సదస్సుల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ఇక, నగరాలు.. పట్టణాలు.. నియోజకవర్గాలు(మొత్తం 547 పార్లమెంటుస్థానాల్లో), గ్రామాల్లోనూ పెద్ద పెద్ద స్క్రీన్లు వేసి.. ప్రసారం చేశారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రతి నెలా ప్రజలతో మన్‌ కీ బాత్‌ పేరుతో రేడియోలో జరిపే సంభాషణల్లో మనకు ఆత్మస్థైర్యాన్ని, స్ఫూర్తిని అందిస్తున్నారని ప్రజలు చెబుతున్నారు. దేశ ప్రజల్లో అనేకమంది మౌనంగా అద్భుతమైన విజయాలు సాధిస్తున్నారని, అంతర్జాతీయ స్థాయిలో దేశం తలెత్తుకుని గర్వంగా జీవించేలా చేస్తున్నారని ప్రధానమంత్రి మొత్తం ప్రపంచం దృష్టికి తన ప్రసంగాల ద్వారా తీసుకువస్తున్నారని అంటున్నారు.

కొత్త సచివాలయం సరే.. రెగ్యులర్ గా వస్తారా..?

కోరుకున్న విధంగా తాను నిర్మించుకున్నందున కొత్త సచివాలయం నుంచి  తెలంగాణ సీఎం ఇకపైన పాలన మొత్తం ఈ భవనం నుంచి అందిస్తారా? లేక మూణ్ణాళ్ళ ముచ్చటకే పరిమితం చేస్తారా? అనే చర్చ మొదలైంది. అధికారులు, సిబ్బంది మధ్య భిన్నమైన రీతిలో అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి కార్యాలయం మొత్తం సచివాలయానికి తరలిరావడంతో సీఎం కూడా కచ్చితంగా వస్తారని అధికారులు బలంగా నమ్ముతున్నారు. సీఎం వెంట నిత్యం ఉండే సెక్రటరీలంతా సెక్రటేరియట్ కు వస్తే ముఖ్యమంత్రి ఒక్కరూ మాత్రమే ప్రగతి భవన్ నుంచి వ్యవహారాన్ని నడిపించడం ఆచరణ సాధ్యం కాదనే వాదనను తెరపైకి తెచ్చారు. కోరుకున్న రీతిలో సచివాలయ భవనం నిర్మాణమైనందున పూర్తి సంతృప్తితో ఉన్నారని, రెగ్యులర్ గా రావడానికే అవకాశాలున్నాయని వ్యాఖ్యానాలు వినవస్తున్నాయి.  వెల్ఫేర్ స్కీమ్లు, సీఎం కోరుకున్న పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు రివ్యూను సచివాలయంలోనే సోమవారం నిర్వహిస్తున్నారని, ఇకపైన ఇలాంటివి కంటిన్యూగా జరుగుతూనే ఉంటాయని సచివాలయ సిబ్బంది అంటున్నారు.  జిల్లా స్థాయిలో  పథకాలు  అమలవుతున్నాయో లేదో తరచూ కలెక్టర్లతోనే డైరెక్టుగా మాట్లాడి రిపోర్టులు తెప్పించుకుంటారని, సచివాలయానికి వచ్చిన తర్వాత పాలనలో ప్రత్యేక తేడా కనిపిస్తుందనే అభిప్రాయాన్ని ఐఏఎస్, ఐపీఎస్ స్థాయిలో కలిగించేందుకు సీఎం తరచూ సెక్రటేరియట్ కు రావడానికే మొగ్గు చూపుతున్నారని మరో అధికారి వ్యాఖ్యానించారు. కానీ, ఎన్జీవో ర్యాంక్ సిబ్బందిలో మాత్రం మరో రకమైన అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేసీఆర్ కొత్త సచివాలయం మోజు మూణ్ణాళ్ళ ముచ్చటగానే మిగిలిపోతుందని, వారానికి రెండు మూడు రోజులకు పరిమితం చేసి ఎన్నికల వేడి మొదలుకాగానే ప్రగతి భవన్ కే పరిమితమవుతారని అంటున్నారు. సచివాలయానికి వచ్చే అలవాటే లేని కేసీఆర్ కొత్త సచివాలయానికి వచ్చే అవకాశాలు తక్కువేనని విపక్షాలు అంటున్నాయి. ముఖ్యమంత్రి ఎక్కడుంటే అక్కడే సచివాలయం అని గతంలో అధికార పార్టీ నేతలు చెప్పిన అంశాన్ని పలువురు గుర్తుచేశారు. రెగ్యులర్ గా సెక్రటేరియట్ కు సీఎం వస్తే సిబ్బందిలో స్పష్టమైన తేడా కనిపిస్తుందని, ఆఫీసర్ల స్థాయిలో తీసుకునే నిర్ణయాల్లో వేగం పెరుగుతుందనీ, పెండింగ్ ఫైళ్ళను ఎప్పటికప్పుడు క్లియర్ చేయడం, అన్ని వివరాలను సమగ్రంగా రూపొందించడంలో.. అన్ని దశల్లోనూ ఒక భయం, క్రమశిక్షణ అలవడుతుందంటున్నారు. ముఖ్యమంత్రి హాజరుకాకపోతే అధికారుల్లోనూ అలసత్వం, నిర్లక్ష్యం ఉంటుందని, ఆ ప్రభావం రొటీన్ కార్యకలాపాలపై కనిపిస్తుందని గుర్తుచేశారు. ఎవరికెన్ని సందేహాలున్నా సీఎం ఇకపైన రెగ్యులర్ గా సచివాలయానికి హాజరౌతారా లేదా అన్న విషయంపై రానున్న రోజులలో క్లారిటీ వస్తుందన్నారు. 

రజనీకాంత్ పై వైసీపీ ఈ విమర్శలేంటి?

ఎన్టీఆర్ ను దించినప్పుడు కూడా చంద్రబాబు పక్కనే రజనీకాంత్ కుర్చున్నారని, ఇప్పుడు ఎన్టీఆర్ శతజయంతి సభకు పిలిచినప్పుడు కూడా.. ఆయన చంద్రబాబు పక్కనే కూర్చున్నారని, పైగా చంద్రబాబును రజనీకాంత్ పొగిడారని పర్యాటక శాఖ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ఎన్టీఆర్ జయంతి సభలో రజనీ కాంత్ చేసిన వ్యాఖ్యలు హాస్యాస్పదమన్నారు. చంద్ర బాబు 2004 వరకే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా ఉన్నా రన్నారు. గత 20 ఏళ్లలో బాబు లేకుండానే హైదరాబాద్ అభివృద్ధి చెందిందని పేర్కొన్నారు. బాబుపై  రోజా వ్యాఖ్యలు ఇలా ఉంటే.. మంత్రి అంబటి తాను తక్కువ తినలేదనేలా.. రజినీకాంత్ పై తీవ్రంగా విమర్శలు గుప్పించారు. రాజకీయాల్లోకి వస్తానని చెప్పి, పారిపోయిన పిరికి పంద సినీ నటుడు రజనీకాంత్ అని అంబటి రాంబాబు విమర్శించారు. రాజకీయాల గురించి మాట్లాడే అర్హత రజనీకి లేదన్నారు.  ప్రతిపక్షాలపై  ఎప్పుడూ అత్యంత దారుణంగా నోరు పారేసుకునే కొడాలి నాని విమర్శలు మరోలా ఉన్నాయి. రజనీకాంత్ తమిళనాడులో హీరో కావచ్చు, ఇక్కడ మాత్రం జీరో. అతను చెబితే మేం చంద్రబాబు గురించి తెలుసుకోవాలా?' అని ఎమ్మెల్యే కొడాలి నాని సూపర్ స్టార్ రజనీకాంత్ పై తీవ్ర విమర్శలు చేశారు. విజయవాడలో జరిగిన శతజయంతి ఉత్సవాల్లో ఎన్టీఆర్ గురించి గొప్పలు చెప్పిన రజనీకాంత్, ఆనాడు ఆయనపై వైస్రాయ్ హోటల్ వద్ద దాడి జరిగి నప్పుడు ఎందుకు రాలేదన్నారు. చంద్రబాబు విజన్ గురించి మాట్లాడితే ఇక్కడ పట్టించుకునే వారెవరూ లేరన్నారు. మూడు రోజులు షూటింగ్ చేస్తే ఆరు రోజులు ఆసుపత్రిలో ఉండే ఆయన పక్క రాష్ట్రం నుంచి వచ్చి నీతులు చెబితే వినే స్థితిలో తాము లేమన్నారు. సీనియర్ నటుడు, మృదు స్వభావి, వివాదాలకు అతీతంగా ఉండే సూపర్ స్టార్ రజినీకాంత్ పై వైకాప నేతలు, మంత్రులు అత్యంత ఘోరంగా నోరు పారేసుకోవడం ఏంటని ప్రజలు విస్మయం చెందుతున్నారు.

బాబు, పవన్ భేటీ.. పొత్తులపై పాత చర్చే మళ్లీ కొత్తగా తెరపైకి!

తెలుగుదేశం అధినేత చంద్ర బాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హైదరాబాద్  లో భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో వారి భేటీ సాగింది.  తాజా రాజకీయ పరిణామాలపై వారిద్దరూ సుమారు గంటన్నరపాటు చర్చలు జరిపారు. ఆంధ్రప్రదేశ్ లో   ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలనివ్వబోనని పదే పదే చెబుతున్న పవన్ కల్యాణ్... ఇటీవలే ఢిల్లీ వెళ్లి భాజపా అగ్రనాయకత్వంతో నూ చర్చలు జరిపారు. ప్రపంచ దేశాల్లో భారత్ ను బలమైన శక్తిగా నిలిపేందుకు, దేశాభివృద్ధికి ప్రధాని నరేంద్ర మోదీ అనుసరిస్తున్న విధానాలతో పూర్తిగా ఏకీభవిస్తున్నానని, ఆయన ప్రతిపాదించిన విజన్ 2047కి సంపూర్ణ మద్దతిస్తున్నానని చంద్రబాబు అన్నారు.  ఎన్డీఏలో చేరబోతు న్నారా? అని ఓ మీడియా సంస్థకు చెందిన పాత్రికేయుడు అడిగిన ప్రశ్నకు... చంద్రబాబు  సూటిగా సమాధానం చెప్పకపోయినా, మోడీ పట్ల సానుకూలతను మాత్రం సందేహాలకు అతీతంగా వెల్లడించారు. దీంతో ఈ నేపథ్యంలో జరిగిన చంద్రబాబు, పవన్ సమావేశం రాజకీయంగా అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ భేటీలో చర్చించిన అంశాలపై వారిద్దరూ విలేకరుల సమావేశం నిర్వహించలేదు.  రెండు పార్టీల నుంచి ఎలాంటి  ప్రకటనలూ వెలువడలేదు. ఏపీలో ప్రభుత్వ వ్యతిరేక ఓట్లను చీలకుండా చూడటంతో పాటు, రాజకీయంగా పొత్తులను మరింత ముందుకు తీసుకెళ్లే దిశగా వారిద్దరి మధ్య చర్చలు జరిగినట్టు పరిశీలకులు అయితే విశ్లేషిస్తున్నారు.   తెలంగాణతో పాటే... ఆంధ్రప్రదేశ్ శాసనసభకూ ఎన్నికలు జరుగుతాయని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో... చంద్రబాబు, పవన్ ల భేటీ అసక్తిగా మారింది. వారిద్దరూ ఏ అంశాలు మాట్లాడుకుని ఉంటారన్న చర్చ  విస్తృతంగా జరుగుతోంది. ఆంధ్రప్రదేశ్లో పొత్తులపై తమ విధానం ఏంటన్నది దిల్లీలోని భాజపా అగ్రనాయకత్వం ఇప్పటివరకు బయట పెట్టలేదు. మోడీ విధానాల్ని చంద్ర బాబు బహిరంగంగా సమర్ధించడం, ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీల నివ్వబోనని పవన్ పదే పదే చెబుతుండటంతో.. రాష్ట్రంలో రాబోయే రోజుల్లో రాజకీయ పరిణామాలు ఎలా ఉండబోతున్నాయన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. వైకాపా ప్రభుత్వ అరాచకాలపై కలసి పోరాడాలని, భవిష్యత్తులో ఇలాంటి సమావేశాలు మరిన్ని నిర్వహించాలని  ఈ భేటీలో నిర్ణయించినట్లు చెబుతున్నారు.  రెండు పార్టీల మధ్య రాజ కీయ పొత్తును బలోపేతం చేసే దిశగా, ఇద్దరు నాయకుల మధ్య రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు జరగనున్నట్టు రెండు పార్టీల శ్రేణులూ అభిప్రాయపడుతున్నాయి.  మోడీని చంద్రబాబు ప్రశంసించడం చూస్తే.. ఆయన ఎన్డీఏలో చేరవచ్చనే ఊహాగానాలకు బలం చేకూర్చుతోంది. అదే నిజమైతే మోడీ ఈ విషయంలో చంద్రబాబు.. మైనార్టీలను ఏ విధంగా సమాధాన పరుస్తారన్నది చూడాల్సి ఉంటుంది. మొత్తం మీద చంద్రబాబు, పవన్ బేటీ  రాష్ట్రంలో రాజకీయ పొత్తులపై పాత చర్చనే మరోసారి కొత్తగా తెరమీదకు తెచ్చింది. 

అవినాష్, సీబీఐ దాగుడు మూతలాట.. యింకెంత కాలం?

తెలంగాణ హైకోర్టులో అవినాష్‌రెడ్డి బెయిల్ పిటిషన్ కేసు విచారణ జరుగుతోంది. హైకోర్టు ఎలాంటి తీర్పు ఇస్తుందో తెలియదు. మరుసటి రోజు నుంచి కోర్టుకు సెలవలు. ఆ ఒక్కరోజు గడిస్తే చాలు. అవినాషన్నకు నెలరోజుల ఊరట. మరి హైకోర్టు అవినాష్‌రెడ్డికి ఊరటనిస్తుందా? లేదా? పులివెందుల మర్డర్ ఆటను బీజేపీ ఇంకెన్నాళ్లు ఆడుతుంది? అలాగైతే మరి బీజేపీ బద్నామ్ కాదా?   అవినాష్ అరెస్టుకు దారులున్నీ మూసుకుపోయేలా తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిలుపై విచారణను వాయిదా వేస్తూ పేర్కొన్న మాటలకు ముందు వరకూ ఉన్న పరిస్థితి. అవినాష్ అరెస్టుకు ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోయి రోజులు గడుస్తున్నా... సీబీఐ బృందాలు కపడ జిల్లాలోనే మకాం వేసి కూడా అవినాష్ దరిదాపులకు కూడా వెళ్ల కుండా  దాగుడుమూతలు ఆడటం దేనికి సంకేతం.  అవినాష్ అరెస్టు విషయంలో  సీబీఐ తీరును రాష్ట్రంలోని అన్ని వర్గాలూ తప్పుపడుతున్నాయి. అమరావతి పరిరక్షణ సమితి కన్వీనర్ డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు, వైసీపీ రెంబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజు మాత్రమే కాదు.. సామాన్య జనం కూడా సీబీఐ అవినాష్ విషయంలో వ్యవహరిస్తున్న తీరును, ఆయన అరెస్టు విషయంలో వ్యవహరిస్తున్న తాత్సార వైఖరినీ తప్పుపడుతున్నాయి. వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ తీరుపై రఘురామరాజు, కొలికిపూడి చేస్తున్న విమర్శలు, వేస్తున్న సెటైర్లు  అందరినీ ఆలోచింప చేస్తున్నాయి.  కడప ఎంపి, సీఎం జగన్ సోదరుడైన అవినాష్‌రెడ్డి అరెస్టు వ్యవహారంలో సీబీఐ అనుసరిస్తున్న తీరు తెలుగు టీవీ సీరియల్స్ ను మించి లాగ్ అవుతోంది. అసలు జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే సీబీఐ అవినాష్ ను విచారిస్తోందా? లేక మీడియా సమావేశాలు, సెల్ఫీ వీడియోలతో విచారణ ఎలా చేయాలో అవినాష్ రెడ్డి సీబీఐకి చెబుతున్నారా? అన్న సందేహం ఎవరికైనా సహజంగా వస్తుంది.  కోర్టులు విస్పష్టంగా సీబీఐ నుంచి అవినాష్ కు ఎటువంటి రక్షణా లేదని తేటతెల్లం చేసేశాయి. కోర్టులో అవినాష్ ను అరెస్టు చేస్తామని సీబీఐ కూడా చెప్పేసింది. అయినా ఆ అరెస్టు కార్యరూపం దాల్చక పోవడంతో సీబీఐయే అవినాష్ రెడ్డిని అరెస్టు నుంచి రక్షిస్తోందా అన్న అనుమానం సామాన్యులలో కూడా వ్యక్తమయ్యే పరిస్థితి వచ్చింది.   నిజానికి.. యిప్పుడు అవినాష్ ను అరెస్టు చేయడానికి  సీబీఐకి ఎలాంటి అడ్డంకులూ లేవు.  అయినా సీబీఐ అడుగు ముందుకు పడటం లేదు.  అసలు వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ మొదటి నుంచీ ఒక విచిత్ర వైఖరినే అనుసరిస్తూ వచ్చింది. వస్తోంది.  ఈ కేసు దర్యాప్తు విషయంలో తనకు చిత్తం వచ్చినట్లే ముందుకు సాగిందన్న ఆరోపణలు సీబీఐ పై ఉన్నాయి.  ఎప్పుడు కావాలంటే అప్పడు దర్యాప్తు అంటూ హడావుడి చేయడం.. ఆ తరువాత నిమ్మకు నీరెత్తినట్లు కిమ్మనకుండా ఉండటం ఈ నాలుగేళ్లలో సీబీఐ దర్యాప్తు సాగిన తీరిది.  అనినాష్ అరెస్టు విషయంలో తెలంగాణ హైకోర్టు  ఆయనకు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ యిచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు కొట్టివేసిన తరువాత కూడా ముందస్తు బెయిలుపై తీర్పు కోసం సీబీఐ అరెస్టును ఆపినప్పుడే సర్వత్రా అనుమానాలు వ్యక్త మయ్యాయి. ఏదో అదృశ్య శక్తి సీబీఐ కళ్లేలను తన చేతుల్లో ఉంచుకుందా అన్న సందేహాలూ వ్యక్త మయ్యాయి. చివరాఖరికి తెలంగాణ హై కోర్టు కూడా స్వయంగా సీబీఐ అనినాష్ ను అరెస్టు చేయాలనుకుంటే చేయవచ్చని విస్పష్టంగా చెప్పేసిన తరువాత కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ మీనమేషాలు లెక్కిస్తుండటం పలు అనుమానాలకు తావిస్తోంది.   సీబీఐ కాంగ్రెస్ పంజరంలోని చిలక అని దేశ సర్వోన్నత న్యాయస్థానమే అంది.  ఇప్పుడు  కాంగ్రెస్ బదులు బీజేపీ అనుకుంటే సరిపోతుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

ధర్మానలో ఫ్రస్ట్రేషన్ పీక్స్!.. ఆయన కథ క్లైమాక్స్ కు చేరినట్లేనా?

ఆడలేక మద్దెలు ఓడన్నట్లు..  ప్రజల సమస్యలు పరిష్కరించడం చాతకాక వైసీపీ నేతలు ప్రశ్నిస్తున్న ప్రజలను తప్పుపడుతున్నారు. ప్రజాగ్రహం ప్రస్ఫుటంగా కనిపిస్తుండటంతో వైసీపీ నేతలలో  ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకుంది.  ఈ విషయంలో  ముఖ్యమంత్రి, మంత్రులు, సీనియర్లు, జూనియర్లు అన్న తేడా కనిపించడం లేదు. కట్టు తెంచుకుని వరద నీరు పోటెత్తినట్లు.. వైసీపీ నేతల్లో అసహనం బట్టబయలౌతోంది. తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు ఏకంగా వైసీపీ పాలన నచ్చితేనే ఓటేయండి లేకపోతే అక్కర్లేదు అంటే జనంపైనే తన అసహనం వ్యక్తం చేశారు. జనానికి మేలు చేసిన ప్రభుత్వం మాది..  మేం మేలు చేయడం వల్లే రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో పడిందని మీరనుకుంటే మీ యిష్టం అనేశారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీ సర్కార్ కు తీవ్ర నష్టం చేయడం ఖాయమన్న విశ్లేషణలు వెల్లువెత్తుతున్నాయి.  ముఖ్యమంత్రి జగన్ పేదల కోసం ఎన్నో పథకాలు అమలు చేస్తున్నారని, ఆయనను సైకో అంటూ విమర్శించడమేంటంటూ విపక్షాల మీద విరుచుకుపడిన మంత్రి ధర్మాన.. అదే జోరులో ప్రజలనూ చెడామడా చెరిగేశారు. విపక్షం సభలకు జనం పోటెత్తడాన్ని, జగన్ సహా వైసీపీ సభలు జనం లేక వెలవెలబోవడాన్నీ తట్టుకోలేక తన అసహనాన్నంతా వెల్లగక్కేశారు. జనం మేలు కోసం మంచి పనులెన్నో చేస్తున్నారనీ జగన్ నిజంగా సైకో అయితే ప్రజల పథకాలు ఎందుకు అమలు చేస్తారనీ జనాన్ని నిలదీస్తున్నారు.  ప్రజల కోసం అహర్నిశలూ కాపాడుతున్న జగన్ మీద అభిమానం ఉంటే ఓట్లు వేయండి లేకపోతే మానేయండి అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు యిప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. అన్ని వర్గాలలోనూ ధర్మాన వాచాలత పట్ల విస్మయం వ్యక్తం అవుతోంది. ధర్మాన లాంటి సీనియర్ నాయకుడు, మంత్రి అలా మాట్లాడటమేంటని వైసీపీ వర్గాలే గింజుకుంటున్నాయి. అంతే కాదు.. ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు, నాయకుల సభలకు, సమావేశాలకు జనం మొహంచాటేయడాన్ని కూడా ధర్మాన ప్రస్తావించారు. ప్రజల మంచి కోసం పాటుపడుతున్న ప్రభుత్వం పట్ల ప్రజలు స్పందించే తీరిదేనా? అని విమర్శలు గుప్పిస్తున్నారు. సొమ్ములు మీ ఖాతాల్లో వేస్తున్నా.. సంతృప్తి లేకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.  మీ ఖాతాల్లో డబ్బులు వేయడం వల్లే రాష్ట్రం ఆర్థికంగా క్షిష్ట పరిస్థితిని ఎదుర్కొంటోందనీ, ఫ్లై ఓవర్లు కట్టడానికి, అభివృద్ధి పనులు చేయడానికీ కూడా సొమ్ములు లేని పరిస్థితి వచ్చిందనీ ధర్మాన చెబుతున్నారు. ఈ రోజు రాష్ట్ర ప్రజలు సంతోషంగా ఉన్నారంటే.. అందుకు జగన్ ప్రభుత్వమే కారణమనీ, అలాంటి జగన్ ప్రసంగిస్తున్నప్పుడు చప్పట్లు కొట్టాలన్న మంచి హృదయం కూడా జనానికి నేకుండా పోయిందని అసహనం వ్యక్తం చేశారు.   టీవీలలో ఏం చెబితే అది నమ్మేయడమేనా అని  ఆగ్రహం వ్యక్తం చేశారు.  పేదలను సంతోషంగా ఉంచేందుకు  పథకాలను అమలు చేయడమే జగన్ సర్కార్ చేసిన నేరమా, అలా చేయడమంటే రాష్ట్రాన్ని తగలెట్టేయడమేనా అని ధర్మాన ప్రజలను నిలదీశారు. అంతే కాదు.. తమ సమస్యలను విన్నవించుకున్న వారిపై సైతం ధర్మాన ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కరోనా క్వారంటైన్ బాధితుల కోసం ఉపయోగించిన టాయిలెట్లను కనీసం క్లీన్ చేయకుండా అప్పగిస్తున్నారంటూ ఓ లబ్ధి దారులు ధర్మాన దృష్టికి తీసుుక వస్తే.. లక్షల గృహాలిచ్చాం.. ఆ మాత్రం టాయిలెట్లను క్లీన్ చేసుకోలేరా అని ఎదురు ప్రశ్నించి నోరుమూయించేందుకు ప్రయత్నించారు.  మొత్తం మీద ధర్మాన తీరు.. ఆయనలో పేరుకు పోయిన ఓటమి భయాన్ని ప్రస్ఫుటంగా ఎత్తి చూపుతోందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. 

ప్రభుత్వ స్థలాలన్నీ మావే

ప్రభుత్వ స్థలాలు మేరా బాప్ కా జాగీర్ హై అన్నట్టు వ్యవహరిస్తుంది తెలంగాణా ప్రభుత్వం. ప్రభుత్వ స్థలాన్ని ఒక సంస్థకు అమ్మాలన్నా, లీజుకు ఇవ్వాలన నియమ నిబంధనలు అడ్డొస్తాయి. కానీ జాతీయ రాజకీయాల్లో అడుగిడుతున్న బీఆర్ఎస్ కు ప్రభుత్వ స్థలాలంటే తమ స్వంత స్థలాలుగా వ్యవహరిస్తుంది. ఈ స్థలాలను  తమ ఇష్టానుసారం దుర్వినియోగం చేస్తుందన్న ఆరోపణలు ఇటీవలి కాలంలో మరింత తీవ్రమయ్యాయి. హైదరాబాద్ కు మణిహారంగా ఉన్న ఔటర్ రింగ్ రోడ్ ను ప్రయివేటు వ్యక్తుల చేతుల్లో పెట్టేసిందని తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. శనివారం ఆయన ఈ  సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశంలో అతిపెద్ద స్కామ్ ఇదేనని వార్తలు వస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డును ప్రయివేటు వ్యక్తులకు లీజుకు ఇవ్వాల్సిన అవసరం ఏమిటి అన్న ప్రశ్నకు పాలకుల వద్ద సమాధానం ఉండకపోవచ్చు.  30 వేల కోట్ల ఆదాయం తీసుకువస్తున్న ఔటర్ రింగ్ రోడ్డును కేవలం 7,380 కోట్ల రూపాయలకే ముంబాయికి చెందిన కంపెనీకి కట్ట బెట్టడం ఏమిటి?వేల కోట్ల చేతులు మారితేనే  ఔటర్ రింగ్ రోడ్డు చేతులు మారిందని   ఎవరికైనా ఇట్టే అర్థమౌతుంది.2018 నుంచి టోల్ బాధ్యతలు అప్పగించిందో తెలుసుకుంటే విషయం బోధపడుతుంది.  ఔటర్ రింగ్ రోడ్డుకు అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం 6,696 కోట్లు పెట్టుబడులు పెట్టింది. కాంగ్రేస్ పార్టీ నుంచి అధికారం మారడంతో  ఔటర్ రింగ్ రోడ్ ను అమ్మకానికి పెట్టేసే విధంగా వ్యవహరించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. రేపు ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ కూడా అమ్మకానికి పెట్టొచ్చు అని ప్రతి పక్షాలు అనుమానిస్తున్నాయి. 

బైజూస్ దెబ్బకు కొండెక్కిన చదువులు

గత కొన్నేళ్లుగా భారతదేశంలో అవినీతి, అక్రమాల గురించి వార్తలే  ఎక్కువగా కనిపిస్తున్నాయని చెబుతున్నాయి. రాజకీయ, ఆర్థిక రంగాలలో అవినీతి సర్వసాధారణమైపోయినా విద్యారంగంలో ఆ స్థాయి వార్తలు వెలువడ లేదు.  కార్నొరేట్ కాలేజీలపై తరచూ అక్రమాలంటూ వార్తలు వింటున్నా.. ప్రస్తుతం బైజూస్ పై వచ్చిన ఆరోపణల ముందు అవన్నీ దిగదుడుపే.   మీరు చదివింది నిజమే భారత్ ఆన్ లైన్ ఎడ్యుకేషన్ సంస్థ బైజూస్ పీకల్లోతు ఆక్రమాలలో మునిగి పోయింది. ఐదు కాదు పది కాదు ఏకంగా 28వేల కోట్ల  అవినీతికి బైజూస్ పాల్పడిందని సీబీఐ, ఈడీలు ఆరోపిస్తున్నాయి.  28 వేల కోట్ల రూపాయల మేర విదేశీ పెట్టుబడులు రాబట్టి వాటిని లెక్కల్లో చూపలేదని సీబీఐ, ఈడీలు వాదిస్తున్నాయి. గత కొన్ని రోజులుగా మూడు చోట్ల జరుగుతున్న సోదాతో అనేక కొత్త విషయాలు సీబీఐ, ఈడీల దృష్టికి వచ్చాయి. బైజూస్ వ్యవస్థాపకుడు రవిచందరన్ గణితం బోధించే ట్యూటర్ గా జీవితాన్ని ప్రారంభించాడు. తన వద్ద శిష్యరికం చేసిన దివ్య గోకుల్ నాథ్ ను రవీంద్రన్ 2009లో వివాహమాడాడు. 2011 స్థాపించిన థింక్ అండ్ లెర్న్ ప్రయివేట్ లిమిటెడ్ కంపెనీ 2015లో లాభాల బాట పట్టింది. 2015లో కంపెనీ బైజూస్ ది లెర్నిం్ ఆప్ ను ప్రారంభించి సంచలనాలకు తెరతీసింది.  2019 నుంచి కంపెనీ లెక్కలు సరిగా లేవని, తీసుకు వచ్చిన అప్పులు తిరిగి చెల్లించడం లేదనీ, లే ఆఫ్ లు ప్రకటిస్తున్నారని, వేల కోట్ల పెట్టుబడులపై ఫెరా నింబంధనలు అతిక్రమించారని బైజూస్ పై ఆరోపణలున్నాయి.  ఇదిలా ఉంటే.. అక్రమాలకు నెలవైన బైజూస్ లో పిల్లలకు చదువులు చెప్పించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెగ ముచ్చట పడుతోంది. వెనుకా ముందూ చేడకుండా వేల కోట్ల రూపాయలు ఖచ్చు పెట్టి  పిల్లలకు ట్యాబ్ లు కూడా అందజేసింది.  ట్యాబ్ లలో చదువు చెప్పేదుకు బైజూస్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది.   అయినా వారి చదువులు పిల్లలకు అర్ధం కావడం లేదు. ప్రతి సంవత్సరం 8వ తరగతికి వచ్చేసుమారుఐదు లక్షల మందికి ట్యాబ్ లుఇచ్చి వారికి బైజూస్  సిలబస్ ను అందించడమే ప్రభుత్వ లక్ష్యం. బైజూస్ ను నమ్ముకుని పిల్లలకు ట్యాబ్ లను అందించిన ప్రభుత్వం ప్రస్తుత బైజూస్ పరిస్థితి చూసి తలలు పట్టుకుంటోంది. 

వైసీపీలో రగులుతున్న అసమ్మతి అగ్గి

చాలా రోజులుగా వైసీపీలో అసమ్మతి చాపకింద నీరులా విస్తరిస్తోందని  పార్టీ శ్రేణులే అంటున్నాయి. ఆ అసమ్మతి భగ్గుమని పార్టీ హైకమాండ్ కు ఆ సెగ తగలడానికి ఇంకెంతో కాలం పట్టదని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. ఏడాది కిందట ఏపీ ముఖ్యమంత్రి జగన్ మంత్రి వర్గాన్ని పునర్వ్యవస్థీకరించినప్పుడు రగిలిన అసమ్మతి జ్వాల ఇప్పుడు భగ్గుమంటోంది.   జగన్ బంధువు, మాజీ మంత్రి బాలినేని రూపంలో వైసీపీ పార్టీకీ, జగన్ సర్కార్ కీ గట్టి షాక్ తగిలింది. మంత్రి వర్గ పునర్వ్యవస్థీకరణలో జిల్లాకు చెందిన మరో మంత్రి ఆదిమూలం సురేష్ ను మంత్రి వర్గంలో రెండవసారి అవకాశం ఇచ్చిన  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి బంధువైన తనను పక్కన పెట్టడంతో అప్పుడే అసంతృప్తి వ్యక్తం చేసిన మాజీ మంత్రి, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాస్ ఆ తరువాత తమాయించుకుని సర్దుకుపోయినట్లు కనిపించినా కీలెరిగి వాతపెట్టన చందంగా సమయం చూసి గట్టి షాక్ ఇచ్చారు. ఓ వంక బాబాయి మర్డర్ కేసులో బ్రదర్ అవినాష్ రెడ్డి అరెస్టు, తదనంతరం చోటు చేసుకునే పరిణామాలు భయపెడుతుంటే, అదే సమయంలో మరో బంధువు బాలినేని శ్రీనివాస రెడ్డి  వైసీపీ రీజినల్ కో- ఆర్డినేటర్ పదవికి   రాజీనామా చేసి జగన్ కు గట్టి షాకే ఇచ్చారు. బాలినేని తన రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపించారని అంటున్నారు. మంత్రి పదవి నుంచి బాలినేనిని తప్పించిన జగన్ ఆయనను ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల వైసీపీ సమన్వయ కర్తగా నియమించారు. అయితే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌‌కు జగన్ కేబినెట్‌లో రెండో సారి చోటు దక్కింది. దీనిపై బాలినేని ఆగ్రహంతో ఉన్నారు. అలాగే తనకు వ్యతిరేకంగా పార్టీలో కొంతమంది పనిచేస్తున్నారని ఇటీవలే బహిరంగంగా వ్యాఖ్యానించారు. అలాగే ఇటీవల మార్కాపురంలో సీఎం జగన్ మోహన్‌రెడ్డి సభ వద్ద పోలీసులు తనను అడ్డుకోవడంపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్‌ చేస్తే తప్ప బాలినేని వేదికపైకి రాలేదు. ఆ సంఘటన జరిగిన నాటి నుంచి పార్టీ అధిష్టానంపై బాలినేని గుర్రుగా ఉన్నారని పార్టీ శ్రేణులే అంటున్నాయి.  ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, వైఎస్ జగన్‌కు  బంధువైన బాలినేని..  వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు నుంచి జగన్‌తో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సమయంలో మంత్రి పదవిని కూడా త్యాగం చేసి జగన్ పార్టీలో చేరారు. ఒంగోలులో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి జగన్ వెంటే ఉంటూ వచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలినేని మంత్రి పదవి చేపట్టారు. కానీ మూడేళ్లు తిరిగే సరికి ఆయనను జగన్ పక్కనపెట్టేశారు. అదే సమయంలో జిల్లాలో మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిమూలపు సురేష్‌ను మరోసారి మంత్రిగా కొనసాగించారు. అయితే జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఒకరిని తొలగించి మరొకరిని కొనసాగించడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని అప్పట్లోనే జగన్‌కు బాలినేని వివరించారు. అయినప్పటికీ బాలినేని మాటలను పట్టించుకోని జగన్.. మంత్రిపదవి నుంచి బాలినేని తొలగించి.. ఆదిమూలపు సురేష్‌ను పురపాలక శాఖ మంత్రిగా కొనసాగించారు. దీంతో అప్పటి నుంచి అసంతృప్తితో రగిలిపోతున్న బాలినేని మార్కాపురం ఘటనతో ఇక సర్దుకు పోవలసిన అవసరం లేదన్న నిర్ణయానికి వచ్చేశారు.  జిల్లాలో ముఖ్యమైన లీడర్‌గా ఉన్న బాలినేని... వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడం.. జిల్లా రాజకీయాలతో పాటు మొత్తం వైసీపీ పార్టీలోనే ప్రకంపనలు సృష్టిస్తోంది.  ముందు ముందు బాలినేని రూట్లోనే మరిందరు ఎమ్మెల్యేలు అడుగులు వేసే పరిస్థితి ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. తాడిపత్రి వైసీపీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి సైతం జగన్ తీరు పట్ల తన అసహనాన్నీ, అసంతృప్తినీ బాలినేని కోర్డినేటర్ పదవికి రాజీనామా చేసిన రోజునే వ్యక్తం చేయడం ఎంత మాత్రం కాకతాళీయం కాదని పార్టీ శ్రేణులే అంటున్నాయి. రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర ఇలా ప్రాంతాలతో సంబంధం లేకుండా జగన్ పార్టీలో అసమ్మతి జ్వాలలు భగ్గుమంటూనే ఉన్నాయననీ, బాలినేని, పెద్దారెడ్డి లాగే రానున్న రోజులలో మరింత మంది తమ అసమ్మతి, అసంతృప్తిని బహిర్గతం చేసే అవకాశాలున్నాయనీ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  ఇప్పటికే వివేకా హత్య కేసులో అవినాష్ ను కాపాడడానికి జగన్ తన పరిధి దాటి వ్యవహరించారన్న భావన పార్టీ శ్రేణుల్లో బలంగా వ్యక్తమౌతోంది. ఎంత ప్రయత్నించినా అవినాష్ ను సీబీఐ అరెస్టు నుంచి తప్పించలేకపోయిన జగన్ ఇక ఆ కేసు అక్కడ నుంచి ముందుకు సాగకుండా.. విపక్షాలు ఆరోపణలు, విమర్శలు సంధిస్తున్నట్లుగా తాడేపల్లి ప్యాలెస్ వైపు అడుగులు పడకుండా ఉంటే చాలన్న భావనకు వచ్చారనీ, అందుకే ఇప్పుడు  పార్టీలో అసమ్మతి లుకలుకలు, నేతల మధ్య విభేదాల పరిష్కారంపై దృష్టి పెట్టే అవకాశం ఇసుమంతైనా లేదనీ అంటున్నారు. అందుకే ముందు ముందు వైసీపీలో అసమ్మతి ఆగ్రహ జ్వాలలు మరింతగా ప్రజ్వరిల్లే అవకాశాలున్నాయని అంటున్నారు.