కర్నాటకం.. కాంగ్రెస్ కు ఖర్గే షాక్!
రెండు వారాల్లో.. ఇంకా స్పష్టంగా చెప్పాలంటే.. మే 10 న జరగనున్న కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీకి గెలుపు అవకాశాలు రోజు రోజుకు దిగజారి పోతున్నాయా? అన్నీ ఉన్నా అల్లుడి నోట్లో శని అన్నట్లుగా, వచ్చిన చక్కని అవకాశాన్ని కాంగ్రెస్ పార్టీ చేజేతులా జార విడుచు కుంటోందా? అంటే అవుననే అనవలసి వస్తోంది. నిజానికి, కర్ణాటకలో అడ్డదారిన అధికారంలోకి వచ్చిన బీజేపీ మూడేళ్ళలోనే ఇద్దరు ముఖ్యమంత్రులను మార్చినా.. ప్రజల మన్ననలు పొందలేక పోయింది. ముఖ్యంగా అవినీతి విషయంలో మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప, ప్రస్తుత ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై ఒకరితో ఒకరు పోటీపడి మరీ అవినీతిని పెంచుకుంటూపోయారు. చివరకు,సొంత పార్టీ నాయకులే, 40 శాతం ముడుపులు చెల్లించనిదే సర్కార్ చెల్లింపులు జరగవని ఆరోపించారు.
అంతే కాదు, ఎన్నికల ప్రకటనకు ముందు నుంచి కూడా వివిధ సంస్థలు నిర్వహించిన సర్వేలలో ప్రభుత్వ వ్యతిరేకత పతాక స్థాయికి చేరిన సంకేతాలొచ్చాయి. ప్రధాన ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ పార్టీ గ్రాఫ్ పైపైకి పాకింది.. స్పష్టమైన ఆధిక్యతతో హస్తం పార్టీ అధికారంలోకి రావడం ఖాయమనే స్పష్టమైన సంకేతాలొచ్చాయి. కాంగ్రెస్ పార్టీ మూడింట రెండువంతుల మెజారిటీతో సుస్థిర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం ఖాయమని సర్వేలు మాత్రమే కాదు, రాజకీయ విశ్లేషకులు కూడా క్లియర్ కట్ గా చెప్పేశారు. నిజానికి బీజేపీ రాష్ట్ర నాయకత్వం చేతులెత్తేసింది. నీట ముంచినా పాల ముంచిన మీదే భారమని రాష్ట్ర నాయకత్వం ఎన్నికల భారాన్నిజాతీయ నాయకత్వం అనే మోడీ షా జోడీ భుజస్కందాలపై ఉంచింది. అయినా ఆ ఇద్దరూ గుజరాత్ ఫార్ముల అప్లై చేసినా 75 నియోజక వర్గాల్లో అభ్యర్ధులను మార్చినా పెద్దగా ఫలితం కనిపించ లేదు సరికదా, మాజీ ముఖ్యమంత్రి జగదీష్ షెట్టర్ సహా మరికొందరు ముఖ్య నేతలు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు కాషాయం వదిలి కాంగ్రెస్ గూటికి చేరారు.
అయితే,కాంగ్రెస్ అగ్ర నేతలు గత అనుభవాలను మరిచి అనవసర వివాదాలకు తలుపులు తీయడంతో ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో కాంగ్రెస్ గ్రాఫ్ నేల చూపులు చూస్తోందని అంటున్నారు. ఇప్పటికీ కాంగ్రెస్ కు కొంత ఎడ్జ్ ఉన్నప్పటికీ, కాంగ్రెస్, బీజేపీల మధ్య మార్జిన్ తగ్గుతూ వస్తోందని లేటెస్ట్ సర్వేలు స్పష్తం చేస్త్నున్నాయి.అంతేకాదు అల్టిమేట్ గా హంగ్ తప్పక పోవచ్చని తాజా సర్వే ఫలితాలు సూచిస్తున్నాయి. ముఖ్యంగా రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య ముఖ్యమంత్రి బొమ్మైఅవినీతిని ఆయన సామాజిక వర్గం లింగాయత్ లకు అంటగట్టారు. ఇది లింగాయత్ సామాజిక వర్గం ఓటర్లను కొంత మేర హర్ట్ చేయడంతో, స్వయంగా సిద్దరామయ్య ముఖ్యమంత్రి బొమ్మైని ఉద్దేశించి మాత్రమే తాను వ్యాఖ్యలు చేశానని వివరణ ఇచుకోవలసి వచ్చింది. అంతకు ముందే, పీసీసీ చీఫ్, డీకే శివకుమార్ మీడియా మీద చిర్రుబుర్రులాడారు, చులకన చేసి మాటలాడి జర్నలిస్టుల ఆగ్రహానికి గురయ్యారు.
ఇవన్నీ ఒకెత్తు అయితే, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఏకంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఉద్దేశించి చేసిన విష సర్పం వ్యాఖ్య పెను దుమారమే సృష్టించింది. కలబుర్గిలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆయన అక్కడి బహిరంగ సభలో ప్రసంగిస్తూ మోదీని విష సర్పంతో పోల్చారు. మోడీ ఒక విష సర్పం, విషం ఉందా లేదా అని నాకి చూస్తే చచ్చి ఊరుకుంటారని ఖర్గే అన్నారు. అయితే, మాట తూలిన వెంటనే ఖర్గే, తప్పు దిద్దుకునే ప్రయత్నం చేశారు, తన వ్యాఖ్యలు మోడీపై కాదని, బీజేపీపై అని ఖర్గే వివరణ ఇచ్చుకున్నారు. కానీ, అప్పటికే జరగవలసిన నష్టం జరిగిపోయింది. జాతీయ మీడియా గతాన్ని తవ్వి తీసి కాంగ్రెస్ నాయకుల దురుసు వ్యాఖ్యలు ఎప్పుడెప్పుడు పార్టీ విజయావకాశాలను ఎలా దేబ్బతీసిందో ప్రజల ముందుంచింది. ఖర్గే అనుచిత వ్యాఖ్యల రగడ ఎన్నికలు పూర్తయ్యే వరకూ కొనసాగేలా ఉందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.
కాంగ్రెస్ నాయకులు గతంలో కూడా మోడీని వ్యక్తిగతంగా విమర్శించి దెబ్బ తిన్నారు. 2007, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో అప్పటి కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ అప్పటి గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్న మోదీని మౌత్ కా సౌదాగర్ (మృత్యు వ్యాపారి) అని దూషించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ భారీ మెజారిటీతో గెలిచింది. అలాగే, 2014 లోక్ సభ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు, మోడీని ‘నీచుడు’ (నీచ్ ఆద్మీ) అని దూషించారు. మోదీ ఎప్పటికీ ప్రధాని కాలేరని ప్రగల్బాలు పలికారు. కాంగ్రెస్ పార్టీ కార్యాలయం దగ్గరకు వచ్చి చాయ్ అమ్ముకోమని ఎద్దేవా చేశారు. ఆ ఎన్నికల్లో ఏమి జరిగిందో అందరికీ తెలిసిందే.. మూడు దశాబ్దాల తర్వాత... బీజేపీ ఒంటరిగా సంపూర్ణ మెజారిటీ సాధించింది.చరిత్రను తిరగ రాసింది.
కాంగ్రెస్ పార్టీ, చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 50 సీట్లకు పరిమితం అయింది . ఇక రాహుల్ గాంధీ విషయం అయితే చెప్పనే అక్కరలేదు. 2019 ఎన్నికల్లో, ‘చౌకీ దార్ చోర్ హై’అంటూ మోదీని దొంగను చేసి , బీజేపీ బలాన్ని 283 నుంచి 303కు పెంచారు. కాగా ఖర్గే గత సంవత్సరం జరిగియన్ గుజరాత్ ఎన్నికల్లో మోదీని రాక్షస రాజు రావణుని పోల్చారు.ఏమి జరిగింది అనేది అందరికీ తెలిసిన విషయమే.,ఇక ఇప్పడు ఖర్గే స్వరాష్ట్రం కర్ణాటకలో, ప్రధాని మోడీని విష సర్పంతో పోల్చారు. ఫలితం ఎలా ఉంటుందో చూడాలి. నిజంగానే, కర్ణాటకలోనూ అదే జరిగితే, అందుకు ఖర్గేనే బాధ్యత వహించవలసి ఉంటుందని అంటున్నారు.