మళ్లీ తెరపైకి రాయల తెలంగాణ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాకారం అయిన దశాబ్ద కాలం తర్వాత  రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు వాదనలు రాజకీయాల్లో మరో మారు చర్చనీయాంశమయ్యాయి.  రాయలసీమను తెలంగాణలో కలపాలని టీడీపీ మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీనిపై తెలంగాణ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందిస్తూ... రాయల తెలంగాణ అనేది ఇప్పుడు సాధ్యం కాదని తేల్చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల వైఫల్యం వల్లే రాయల తెలంగాణ అనే అంశం తెరపైకి వచ్చిందని ఆయన అన్నారు. రాయల తెలంగాణ కానీ, ప్రత్యేక రాయలసీమ రాష్ట్రం కానీ ఇప్పుడు సాధ్యం కాదని చెప్పారు. తమ ప్రాంతాన్ని తెలంగాణలో కలపాలని పక్క రాష్ట్రాల వారు కోరడం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధికి నిదర్శనమని అన్నారు. ఏపీ అభివృద్ధి కూడా కేసీఆర్ తోనే సాధ్యమని... రాయల తెలంగాణ అనే అంశాన్ని వదిలేసి కేసీఆర్ నాయకత్వం దిశగా ఏపీ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలని సూచించారు. తెలంగాణను బంగారు తెలంగాణగా మార్చినట్టు... ఆంధ్రను సువర్ణాంధ్ర చేయడం కూడా సాధ్యమేనని కేసీఆర్ గతంలోనే చెప్పారని అన్నారు. పాలకులను మార్చి రాష్ట్రాన్ని సువర్ణాంధ్రగా మార్చుకోవాలని చెప్పారు. రాష్ట్ర వెనుకబాటుకు కారణమైన పాలకులపై ఏపీ ప్రజలు తిరుగుబాటు చేయాలని జగదీశ్ రెడ్డి సూచించారు. రాయల తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి యూపీఏ చైర్  పర్సన్ సోనియాగాంధీని ఒప్పించే ప్రయత్నం చేశారు. హైదరాబాద్ ఎంపీ, మజ్లిస్ పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్ ఈ డిమాండ్ ను బలపరిచిన వారిలో ఉన్నారు. రాయలసీమలో ముస్లిం జనాభా ఎక్కువ. రాయల తెలంగాణ ఏర్పాటు అయితే ఆ పార్టీ అధికారం  చేజిక్కించుకునే అవకాశం ఉండేది. అయితే రాయల తెలంగాణ ప్రతి పాదనను ప్రారంభం నుంచే బీజేపీ వ్యతిరేకించింది. రాయలసీమలో ఉన్న వెనకబాటుతనానికి పాలక పక్ష పార్టీలే కారణమని బీజేపీ నిందించింది.  రాయల తెలంగాణ డిమాండ్ ను టీడీపీ ఎప్పుడూ సమర్ధించలేదు. అప్పట్లో టీఆర్ఎస్ ఈ ప్రతి పాదనను వ్యతిరేకించింది. రాజకీయ అస్థిత్వం కోసం రాయల తెలంగాణా నినాదం అప్పుడు, ఇప్పుడు, ఎప్పుడైనా ఉపయోగపడుతుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. 

బెదిరింపు కాల్స్ అతనికి కొత్తేం కాదు

ఉత్తర ప్రదేశ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపు కాల్ రావడం మంగళవారం దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది.అత్యవసరాల కోసమని ఇటీవల ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీద ప్రారంభమైన టోల్ ఫ్రీ నెంబర్ నుంచే తనకే బెదిరింపు కాల్ రావడం హిందుత్వ శక్తులు జీర్ణించుకోలేకపోతున్నాయి.  మాఫీయా శక్తుల మీద ఉక్కుపాదం మోపిన కారణంగా బెదిరింపు కాల్ వచ్చినట్లు సమాచారం. యోగి ఆదిత్యనాథ్ వివాదా స్పద సీఎం అని చెప్పుకోవచ్చు. ఒక వర్గాన్ని టార్గెట్ చేసుకుని పోలీసుల చేత దాడులు చేయించినట్లు అతని మీద ఆరోపణలు ఉన్నాయి. ప్రజాస్వామ్య వ్యవస్థలో  ఇటువంటి చర్యలకు తావులేదు. అయినా యోగి ఆదిత్యనాథ్ హిందూ మతోన్మాదిగా చేసే ప్రసంగాలు అనేక సార్లు వివాదాస్పదమయ్యాయి.  యోగి ఆదిత్యనాథ్ పై 2005లో క్రిస్టియన్లను బలవంతంగా హిందువులుగా మార్చిన ఆరోపణలున్నాయి.మదర్ థెరిస్సాను కూడా  యోగి ఆదిత్యనాథ్ వదల్లేదు.  దేశంలో క్రిస్టియానిటీ పెంచి పోషించింది ఆమేనని వివాదాస్పద ప్రకటన చేశారు. యోగాసనాలు చేయని పక్షంలో శివుడు దేశం విడిచి వెళ్లిపోతాడని యోగి ఆదిత్యనాథ్ అప్పట్లో  చేసిన ప్రకటన వివాదాస్పదమైంది.  ఉత్తర ప్రదేశ్ లో బీజేపీని గెలిపించకపోతే మరో కశ్మీర్ అవుతుందని యోగి ఆదిత్యనాథ్ రెచ్చగొట్టే ప్రసంగాలు  చేసి వివాదాస్పద వ్యక్తిగా నిలిచి పోయాడు. ఈ క్రమంలో తాజాగా ఆదిత్యనాథ్‌ ను చంపేస్తామంటూ ప్రభుత్వ టోల్‌ ఫ్రీ నంబర్‌ 112 కు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఫోన్‌ చేశాడు. అత్యవసర సర్వీసుల కోసం యోగీ సర్కార్ 112 సర్వీస్‌ను ప్రారంభించింది. బెదిరింపు కాల్ రావడంతో వెంటనే అప్రమత్తమైన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. దీని పై 112 ఆపరేషన్‌ కమాండర్‌ సుశాంత్‌ గోల్ఫ్‌ సిటీ పోలీస్‌ స్టేషన్‌ లో కేసు నమోదు చేశారు. ఐపీసీ సెక్షన్ 506, 507, ఐటీ చట్టం 66 కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. “నేను త్వరలో సీఎం యోగిని చంపుతానని ఆ వ్యక్తి 112 సర్వీస్ కు సందేశం వచ్చిందని” కమాండర్‌ పేర్కొన్నారు. యోగి ఆదిత్యనాథ్ కు బెదిరింపు కాల్ రావడం ఇవ్వళ కొత్తేమి కాదు.  నిరుడు లక్నో నుంచి ఇలాంటి తరహా కాల్ వచ్చిన సంగతి తెలిసిందే. 

పవార్ చూపు కమలం వైపు

మహారాష్ట్రలో పవర్ కోసం పవార్ పాలిటిక్స్ కు పదును పెడుతున్నారు. రాజకీయ భీష్ముడిగాపేరు పొందిన శరద్ పవార్ఈసారి మహారాష్ట్ర రాజకీయాలలో చక్రం తిప్ప బోతున్నారు. ఇందుకోసం శరద్ పవార్ తన వ్యతిరేక వర్గమైన బీజేపీతో చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు.  దీంతో మహారాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. ఎన్సీపీ, కాంగ్రెస్, ఉద్ధవ్ శివసేన పార్టీలతో ఏర్పడ్డ మహావికాస్ అగాఢీ నుంచి బయటకువచ్చిన ఏక్ నాథ్ షిండే బీజేపీ సాయంతో మహా పీఠాన్ని అదిష్టించారు.  ఎక్నాథ్ షిండేను సమర్ధిస్తున్న ఎమ్మెల్యేలఅనర్హతపై సుప్రీం కోర్టులో కేసు నడుస్తోంది.  తీర్పు షిండేకు వ్యతిరేకంగా రావచ్చన్న ఊహాగానాలు ఊపందుకున్న నేపథ్యంలో ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి శరద్ పవార్ రంగంలోకి దిగారు.   ఈసారి పవార్ తన మేనల్లుడు అజిత్పవార్ను ముఖ్యమంత్రిని చేయాలన్న తలంపుతో బీజేపీతో జతకట్టేందుకు సిద్ధమయ్యారు. మహావికాస్ అగాఢీ కూటమిలో మరో చీలిక అనివార్యమైన నేపథ్యంలో  మహారాష్ట్ర రాజకీయ ముఖచిత్రం మారే సూచనలు కనిపిస్తున్నాయి.  ఇదిలా ఉండగా పవార్ కుటుంబంపై ఉన్న కేసులు, ఆరోపణలు ఈ దెబ్బకు రద్దవుతాయనీ, 2024 తరువాత బీజేపీ తిరిగి అధికారంలోకి వస్తే శరద్ పవార్ కు సముచిత గౌరవం కల్పించేందుకు బీజేపీ అధిష్ఠానం సూత్రపాయంగా అంగీకరించిందనిముంబయ్  మీడియా లో ప్రచారం జరుగుతోంది. 

రఘునందన్ కోర్టు మెట్లు ఎక్కనున్నారా?

బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావుది ప్రత్యేక శైలి. న్యాయవాద వృత్తినుంచి రాజకీయాల్లో వచ్చి తన వాగ్దాటితో అందరినీ ఆకట్టుకుంటున్న ఈయన ప్రస్తుతం దుబ్బాక  బీజేపీ ఎమ్మెల్యేగా ప్రాతినిద్యం వహిస్తున్నారు. అయితే రఘునందన్ రావును వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అసెంబ్లీ నుంచి వాష్ ఔట్ చేయాలని బీఆర్ ఎస్ అధినేత ఎత్తుగడ వేసినట్టు వినికిడి. వచ్చే ఎన్నికల్లో దుబ్బాక నుంచి బీఆర్ ఎస్ తరపున బలమైన అభ్యర్థిని ఎంపిక చేయాలని పార్టీ అధ్యక్షుడు కే. చంద్ర శేఖరరావు యోచిస్తున్నారు. సిట్టింగ్ బీఆర్ఎస్ ఎంపీ అయిన కొత్త కోట ప్రకాశ్ రెడ్డిని దుబ్బాక నుంచి పోటీ చేయించాలని కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రకాశ్ రెడ్డి వరుసగా 2014, 2019  ఎన్నికల్లో మెదక్ లోకసభ  నుంచి పోటీ చేసి గెలుపొందారు. మూడోసారి కూడా మెదక్ నుంచి ప్రకాశ్ రెడ్డి గెలుపొందుతారు అని అందరూ ఊహించారు. కానీ మారుతున్న రాజకీయ సమీకరణాల నేపథ్యంలో అతన్ని మెదక్ లోకసభ నుంచి తప్పించి  దుబ్బాక అసెంబ్లీకి పరిమితం చేశారు. గత కొంత కాలంగా కొత్త కోట ప్రకాశ్ రెడ్డి మెదక్ లోకసభ  నియోజకవర్గం కంటే దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గం మీదే ఎక్కువ కాన్సన్ ట్రేషన్ చేస్తున్నారు. దుబ్బాక ప్రజలతో మమేకమవుతున్నారు. దుబ్బాకలో తిరుగులేని నాయకుడిగా పేరు తెచ్చుకున్న రఘునందన్ రావు ను ఈ అసెంబ్లీ ఎన్నికల్లో ఓడించాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. భాగ్యలక్ష్మి అమ్మవారిపై విద్వేష  పూరిత ప్రసంగం చేసిన కేసులో అప్పటి ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి ఓవైసీ సోదరులను అరెస్ట్ చేయించిన సంగతి తెలిసిందే. ఓవైసీ సోదరులకు బెయిల్ ఇప్పించడంలో  రఘునందన్ రావు కీలక పాత్ర పోషించారు.  అడ్వకేట్ గా మంచి పేరు గడించిన రఘునందన్ రావ్  భారతీయ జనతా పార్టీ నుంచి దుబ్బాక నియోజక వర్గంలో 1,074 ఓట్ల  మెజారిటీతో గెలుపొందారు. నాటి నుంచి నేటి వరకు దుబ్బాక ప్రజల ఆదరాభిమానాలు చూరగొంటున్న రఘునందన్ రావును ఈ ఎన్నికల్లో ఎలాగైనా ఓడించాలని బీఆర్ ఎస్ నిర్ణయం తీసుకున్నట్టు కనబడుతోంది. మంత్రి నిరంజన్ రెడ్డి ఇటీవలె  రఘునందన్ రావు పై ఘాటు విమర్శలు చేశారు.  రాజకీయాల నుంచి రఘునందన్ రావును తరిమి కొట్టాలని బీఆర్ఎస్ చూస్తోంది.  రఘునందన్ రావ్ మళ్లీ అడ్వకేట్ ప్రాక్టీసు మొదలు పెట్టాల్సిందేనని బీఆర్ఎస్ శ్రేణులు వాఖ్యానిస్తున్నాయి.  రఘునందన్ రావు పూర్వాశ్రమంలో టీఆర్ ఎస్ లో చురుకైన పాత్ర పోషించారు. అతను టీఆర్ఎస్ పొలిట్ బ్యూరో సభ్యుడిగా కూడా ఉన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుతో రహస్యంగా సమావేశమైన ఆరోపణలతో టీఆర్ఎస్ నుంచి వైదొలిగాడు. తర్వాతి కాలంలో బీజేపీలో చేరి   దుబ్బాక నుంచి పోటీ చేసి గెలుపొందారు.

విచారణలో ఉన్న కేసుపై న్యాయమూర్తి ఇంటర్వ్యూ.. సుప్రీం అసహనం

కొందరు న్యాయమూర్తులు వ్యవహరిస్తున్న తీరుపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది. విచారణలో ఉన్న కేసులపై న్యాయమూర్తులు వార్తా సంస్థలకు ఇంటర్వ్యూ ఇవ్వడం ఏ విధంగా చూసినా సమర్థనీయం కాదని పేర్కొంది. పశ్చిమ బెంగాల్ లో పాఠశాల ఉద్యోగాలను ముడుపులు తీసుకుని అమ్మేశారన్న ఆరోపణలపై నమోదైన కేసుకు సంబంధించి కోల్ కతా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ అభిజిత్ గంగోపాధ్యాయ ఓ వార్తా చానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో మాట్టాడారంటూ పిటిషనర్, తృణమూల్ కాంగ్రెస్ నాయకుడు అయిన అభిషేక్ బెనర్జీ సుప్రీం దృష్టి కి తీసుకువెళ్లారు.  ఆ ఇంటర్వ్యూకు సంబంధించిన కాపీని కూడా అందజేశారు. ఈ వ్యవహారాన్ని భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) జస్టిస్ డి.వై. చంద్రచూడ్, జస్టిస్ పి. ఎస్. నరసింహలతో కూడిన ధర్మాసనం తీవ్రంగా పరిగణించింది. జస్టిస్ గంగోపాధ్యాయ్ ఇంటర్వ్యూ ఇచ్చారో లేదో గురువారంలోగా తమకు తెలియజేయాలని కలకత్తా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ ను ఆదేశించింది. తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేసింది.  తాజా ఆదేశాల వల్ల ఈ కేసులో సీబీఐ, ఎన్ ఫోర్స్ మెంట్  డైరెక్టరేట్ (ఈడీ)ల దర్యాప్తునకు అడ్డంకులు తలెత్తుతాయంటూ అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్. వి. రాజు లేవనెత్తిన అనుమానాలను ధర్మాసనం తోసిపుచ్చింది. అవి దర్యాప్తును యధావిధిగా కొనసాగించొచ్చని స్పష్టం చేసింది. ఏక సభ్య ధర్మాసనం ఎదుట పెండింగ్ లో ఉన్న కేసుపై న్యాయమూర్తి ఇంటర్వ్యూ ఇవ్వడం ఎంతమాత్రమూ ఆమోదయోగ్యం కాదని జస్టిస్ చంద్రచూడ్ పేర్కొ న్నారు. పిటిషనర్ గురించి ముఖాముఖిలో జడ్జి మాట్లాడిన సంగతి నిజమే అయితే.. కేసు విచారణ నుంచి ఆయన స్వయంగా తప్పుకొని ఉండాల్సిందని అన్నారు. వార్తా ఛానెల్ ఇంటర్వ్యూలో జస్టిస్ గంగోపాధ్యాయ్ తనకు వ్యతిరేకంగా పలు వ్యాఖ్యలు చేసినట్లు పిటిషనర్ ఆరోపించారు. కాగా హైకోర్టులలో కొందరు న్యాయమూర్తుల ఉత్తర్వులు, వ్యాఖ్యలపై సుప్రం కోర్టు ఇటీవల పలు సందర్భాలలో అభ్యంతరం వ్యక్తం చేసిన సంగతి విదితమే. అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలుపై తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై కూడా సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేస్తూ అన్ వారెంటెడ్ అని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే. 

ఏళ్ల తరబడి దూరమే.. సయోధ్య ఎండమావే..!

తెలంగాణ గవర్నర్ తమిళి సై సౌందర రాజన్.. రాష్ట్ర ప్రభుత్వం మధ్య సయోధ్య ఎండమావిగానే మారింది. రెండున్నరేళ్లుగా ఎడ ముఖం, పెడ ముఖంగా ఉన్న గవర్నర్  తమిళి సై, ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర  హై కోర్టు ప్రమేయంతోనే అయినా, శాసన సభ బడ్జెట్ సమావేశాల ప్రారంభంలో రాజ్యాంగ విధులను రాజ్యాంగబద్దంగా నిర్వర్తించారు. దీంతో అంతా  ఇక రాజ్ భవన్, ప్రగతి భవన్ ల మధ్య దూరం చెరిగిపోయినట్లేనని అంతా భావించారు.   గత సంవత్సరం తరహాలోనే ఈ సంవత్సరం కూడా గవర్నర్ ప్రసంగం లేకుండానే బడ్జెట్ సమావేశాలు కానిచ్చేయాలని కేసీఆర్ సర్కార్ భావించినా, బడ్జెట్ ఆమోదం కోసం కోర్టు మెట్లు ఎక్కినా ప్రయోజనం లేక పోయింది.  కోర్టు సూచనతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం ఒకడుగు వెనక్కివేసి గవర్నర్  తో సయోధ్యకు సుముఖత వ్యక్తం చేసింది. ఆ విధంగా శాసన  సభ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్, సంప్రదాయాన్ని పాటిస్తూ, ఉభయ సభల సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ప్రభుత్వం రాసిచ్చిన ప్రసంగాన్ని అక్షరం పొల్లుపోకుండా చవివినిపించారు.  గవర్నర్ తమ రాజ్యాంగ కర్తవ్యాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి కేసేఆర్ కూడా, అనివార్యంగానే అయినా తమ రాజ్యాంగ విధులను నిర్వర్తించారు. గవర్నర్ కు ఇవ్వవలసిన గౌరవం ఇచ్చారు. దీంతో  అనుమానాలున్నా, రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య  సయోధ్య కుదిరిందనే అభిప్రాయం ఏర్పడింది. అయితే ఇది జరిగిన వారం వ్యవధిలోనే సయోధ్య ఒట్టిమాటేనని తేలిపోయింది.   గవర్నర్ పసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానం పై సభలో జరిగినలో ముఖ్యమంత్రి పాల్గొనలేదు. ముఖం చాటేశారు.గవర్నర్ పేరు ప్రస్తావించడం గవర్నర్ కు కృతఙ్ఞతలు చెప్పడం ఇష్టం లేకనే ముఖ్యమంత్రి ముఖం చాటేశారని అప్పట్లో పరిశీలకులు విశ్లేషించారు.  మరో వంక ముఖ్యమంత్రి బదులుగా ఆయన కుమారుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సమాధానం ఇచ్చారు. ఆయన, అదే విధంగా చర్చలో పాల్గొన్న    బీఆర్ఎస్ సభ్యులు గవర్నర్ ప్రసంగంలో లేని అంశాలను ప్రస్తావిస్తూ, కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. మంత్రి కేసీఆర్ అయితే తమ సహజ ధోరణిలో కేంద్ర ప్రభుత్వాననే కాదు, ప్రధానిమోడీని, బీజేపీ పాలిత రాష్ట్రాల ప్రభుత్వ విధానాలను, అనర్గళంగా  ఇంగ్లీష్, హిందీ, తెలుగు, ఉర్దూ భాషలలో తిట్టి పోశారు.  సో.. సర్కార్ సైడు  నుంచి చూస్తే,  గవర్నర్’తో సయోధ్యకు ప్రభుత్వం సిద్ధంగా లేదనే విషయం అప్పుడే స్పష్టమైంది.  మరోవంక గవర్నర్ తమిళి సై, గత శాసన సభ సమావేశాల్లో ఆమోదించిన ఆరు బిల్లులకు  ఆమోదం తెలపలేదు. నిజానికి, కోర్టు వెలుపల కుదిరిన ఒప్పందం ప్రకారం పెండింగ్ బిల్లులకు ఆమోదం తెలిపేందుకు గవర్నర్ అంగీకరించారనే ప్రచారం జరిగింది. కానీ,   రాజ్ భవన్’నుంచి సానుకూల సంకేతాలు రాలేదు. ఈ పరిస్థితుల్లోనే సర్కార్ పెండింగ్ బిల్లుల ఆమోదంపై సుప్రీం ను ఆశ్రయించారు.  గవర్నర్ వద్ద పెండింగ్ పడుతున్న బిల్లుల అంశంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్ పై సుప్రీం కోర్టు సోమవారం (ఏప్రిల్ 24) విచారణ జరిపింది. గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ తరఫున వాదనలు వినిపించిన ఎస్జీ.. ప్రస్తుతం గవర్నర్ వద్ద ఏ బిల్లులు పెండింగ్ లో లేవని న్యాయస్థానం దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని బిల్లులను మాత్రం తిప్పి పంపారని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన దుష్యంత్ దవే.. ప్రజా ప్రాతినిధ్య ప్రభుత్వం గవర్నర్ దయ కోసం చూడాల్సిన పరిస్థితి వస్తోందని అన్నారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీం కోర్టు.. బిల్లులను సాధ్యమైనంత త్వరగా క్లియర్ చేయాలని రాజ్ భవన్ కు సూచిస్తూ ప్రస్తుతం బిల్లులు పెండింగ్ లో లేవు కాబట్టి ఈ పిటిషన్ ను ముగిస్తున్నామని తెలిపింది.   గవర్నర్‌, తెలంగాణ ప్రభుత్వం మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. అసెంబ్లీలోని ఉభయ సభలు ఆమోదించిన  పది బిల్లులను ఆమోదించకుండా జాప్యం చేస్తున్నారని ప్రభుత్వ పెద్దలు ఆరోపిస్తున్నారు. దీని వల్ల పాలనకు ఇబ్బందిగా మారుతుందని సుప్రీంకోర్టులో  పిటిషన్ వేశారు. ఇది ఇప్పటికే ఓసారి విచారణకు వచ్చింది. గతంలో విచారణకు రాగా.. తన వద్ద ఉన్న పెండింగ్ బిల్స్‌ను క్లియర్ చేశారు గవర్నర్. అసెంబ్లీ ఆమోదించిన పది బిల్లుల్లో మూడింటిని ఆమోదించినట్టు రెండింటిని రాష్ట్రపతి పరిశీలనకు పంపారు. మరో రెండు బిల్లులను రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనకు పంపించినట్టు మొన్నటి విచారణకు సుప్రీంకోర్టుకు తెలిపారు. మూడే బిల్లులు గవర్నర్ పరిశీలనలో ఉన్నట్టు రాజ్‌భవన్ తరఫున న్యాయవాది సుప్రీంకోర్టుకు వివరించారు. గతంలో సుప్రీంకోర్టులో విచారణ జరగనున్న వేళ ఆ మూడింటినీ క్లియర్ చేశారు. ఇంత చేసినా ప్రగతి భవన్.. రాజ్ భవన్ ల మధ్య దూరం  మరింత పెరిగిందే తప్ప ఇసుమంతైనా తగ్గలేదనే భావించాలి. 

అభివృద్ధి వికేంద్రీకరణ తెలుగుదేశం లక్ష్యం.. లోకేష్

పాలన కాదు.. అభివృద్ధి వికేంద్రీకరణ కావాలని తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. యువగళం పేర నారాలోకేష్ చేపట్టిన పాదయాత్ర సోమవారం (ఏప్రిల్ 24) 1020 కిలోమీటర్లు పూర్తయ్యింది.  గణెళికల్లు శివారులో వద్ద రైతులతో మాటామంతి నిర్వహించారు. గణెళికల్లులో లోకేశ్‌కు గ్రామస్థులు గజమాలతో  సన్మానం చేశారు. జాలిమంచి క్రాస్‌ వద్ద మహిళలు, చిన్నారులు హారతులతో లోకేశ్‌కు ఆహ్వానం పలికారు. పాండవగల్లు చెరువును ఆక్రమదారుల నుంచి రక్షించాలని గ్రామస్థులు లోకేశ్‌కు వినతి చేశారు. కుప్పగల్‌లో గ్రామస్థులు మేళతాళాలతో లోకేశ్‌కు ఘనస్వాగతం పలికారు. కుప్పగల్‌ శివారులో విడిది కేంద్రానికి చేరుకున్న లోకేశ్‌ బీసీలతో ముఖాముఖి మాట్లాడారు. పెద్దతుంబళంకు చేరుకున్న లోకేశ్‌ మేళతాళలతో, పులవర్షం కురిపించారు. పెద్దతుంబళం శివారులో రాత్రి బస చేసే విడిది కేంద్రానికి చేరుకున్న లోకేశ్‌, 78వ రోజు 15.2 కి.విూ.నడిచారు. ఇప్పటి వరకు 1020 కి.విూ. యాత్రను పూర్తి చేశారు. ఈ సందర్భంగా ఆయన సర్పంచ్ లకు తెలుగుదేశం ప్రభుత్వం పూర్వ వైభవం తీసుకు వస్తుందని అన్నారు. ఒక్క ఏడాది ఓపికపట్టండి చాలు.. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు, సర్పంచ్ ల హక్కులను తమ ప్రభుత్వం కాపాడుతుందని లోకేష్ చెప్పారు. జగన్ సర్కార్ సర్పంచ్ ల హక్కులను పూర్తిగా కాలరాసిందని, వారికి అందాల్సిన నిధులను పక్కదారి పట్టించదని ఆరోపించారు. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి రాగానే గతంలో మాదిరిగా   సర్పంచ్‌ అకౌంట్లలోనే  నేరుగా నిధులు వేస్తామని హావిూ ఇచ్చారు. సర్పంచ్‌ల గౌరవాన్ని కాపాడుతామన్నారు. తాను హైదరాబాద్‌లో పుట్టి పెరిగానని, సీమ ప్లలెల్లో పాదయాత్ర చేస్తుంటే చాలా బాధేస్తోందని  లోకేష్‌ఆవేదన వ్యక్తం చేశారు. ప ల్లెల్లో రోడ్లు, తాగునీరు, డైనేజీ అస్తవ్యస్తంగా ఉందన్నారు. అలాగే గ్రామాల్లో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందన్నారు. ఇలా ఉండగా లోకేష్ పాదయాత్ర దిగ్విజయంగా సాగుతోంది. అడుగడుగునా జనం అభిమానంతో ఆయనకు ఘన స్వాగతం పలుకుతున్నారు.  రైతులు, వ్యవసాయ కూలీలు పొలాలలో పనులను వదలి  వచ్చి మరీ యువ నేతతో  అడుగు కలుపుతున్నారు. తమ కష్టాలు, బాధలను వినిపిస్తూ ముందుకు సాగుతున్నారు.  కర్నూలులో హైకోర్టు బెంచ్‌ ఏర్పాటు చేస్తామని, రాయలసీమలో కరువు నివారణకు పెండింగ్‌ ప్రాజెక్టులను పూర్తి చేసి సాగు నీరు ఇచ్చే బాధ్యతను టీడీపీ తీసుకుంటుందని హావిూ ఇచ్చారు. దామాషా ప్రకారం బీసీ కులాలకు నిధులు, సంక్షేమ పథకాలు అమలు చేస్తామని వివరించారు. దూదేకుల, ముస్లింలను ఆదుకుంటామని చెప్పారు.  

లక్ష్యం లేని బాణం.. షర్మిల

వైఈసార్ టీపీ అధ్యక్షురాలు, వైఎస్ షర్మిల తెలంగాణలో రాజకీయ అరంగేట్రానికి శ్రీకారం చుట్టిన సమయంలో చాలా మంది చాలా చాలా అనుమానాలు వ్యక్త పరిచారు. పక్క రాష్ట్రం ఏపీలో, సొంత అన్న జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా,ఆమె రాష్ట్రం వదిలి తెలంగాణ రాజకీయాల్లో ఎందుకు వేలు పెటినట్లు? అనే చర్చ విస్తృతంగా జరిగింది. అప్పట్లోనే  ‘షర్మిల ఎవరు వదిలిన బాణం?’. అనే ప్రశ్న ప్రముఖంగా వినిపించింది. అయితే, ఇప్పడు అదొక రకంగా ముగిసన అధ్యాయం. అక్కడి నుంచి ఆమె చాలా దూరం ‘నడిచి’ వచ్చారు. వైఎస్సార్ టీపీ పేరిటి పార్టీని ఏర్పాటు చేశారు. ఆమె బాటలో ఆమె రాజకీయ అడుగులు వేస్తున్నారు. అయితే, ఇప్పుడు మళ్ళీ మరోమారు అదే ప్రశ్న, షర్మిల ఎవరు విసిరిన బాణం అనే ప్రశ్న మళ్ళీ తెరమీదకు వచ్చింది.   ఆమె రాజకీయ లక్ష్యం ఏమిటి? ఆమె రియల్  టార్గెట్ ఎవరు? అసలు లక్ష్యం ఉందా?  అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి.   నిజానికి ఆమె వెంట ఎవరన్నారు, ఎవరు లేరు అనే విషయాన్ని పక్కన పెడితే, వైఎస్ షర్మిల వైఎస్సార్ టీపీ అధ్యక్షురాలిగా బాధ్యతలు వీకరించినప్పటి నుంచి ధైర్యంగా అడుగులు వేస్తున్నారు. రాష్ట్రంలో మహా ప్రస్థానం పేరిట పాదయాత్ర చేశారు.  తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అయన కుమారుడు కేటీఆర్,కుమార్తె కవిత, మేనల్లుడు హరీష్ రావు, మరో ఇంటి చుట్టం సంతోష కుమార్  ఇలా రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా ఉన్న కేసీఆర్ కుటుంబం మొత్తాన్నిటార్గెట్ చేసి విమర్శలు గుప్పిస్తున్నారు. నిజానికి, ప్రధాన స్రవంతిలోని ప్రతిపక్ష పార్టీలు, కాంగ్రెస్, బీజేపీ నాయకుల కంటే, షర్మిలే తెరాస ప్రభుత్వాన్ని దుమ్ము దులిపేస్తున్నారు.   అయితే ఆ విమర్శలు, ఆ దూకుడు.. ఏ లక్ష్యం లేకుండా ఉంటున్నాయన్నది పరిశీలకుల విశ్లేషణ. నేను నా ఇష్టం వచ్చినట్లు మాట్లాడతాను.. ఎవరూ ఖండించొద్దు, ప్రతి విమర్శలు చేయవద్దు అన్నట్లుగా ఆమె తీరు ఉందని చెబుతున్నారు. దూకుడుగా వ్యవహరించడం, పోలీసులపై దాడి చేయడం వంటి తీరుతో జనానికి దగ్గర అవ్వచ్చని షర్మిల భావిస్తున్నట్లుగా కనిపిస్తోంది. తాజాగా సోమవారం (ఏప్రిల్ 24) నిరుద్యోగ సమస్యలపై ధర్నాకు సిద్ధమైన షర్మిలను పోలీసులు అడ్డుకున్నారు. లోటస్ పాండ్ లోని ఆమె నివాసం నుంచి బయటకు వస్తుంటే.. ధర్నాకు అనుమతి లేదంటూ ఆపారు. దీంతో ఆమె పోలీసులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, వారితో దురుసుగా ప్రవర్తించారు. చేయి కూడా చేసుకున్నారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్టు చేశారు. జూబ్లీహిల్స్ పీఎస్ కు తరలించారు. అక్కడ నుంచి నాంపల్లి కోర్టులో ప్రవేశపెట్టగా కోర్టు ఆమెకు 14 రోజుల రిమాండ్ విధించింది. ప్రజా ఉద్యమాలలో అరెస్టులు కొత్త కాదు కానీ షర్మిల సోమవారం అరెస్టు కావడానికి దారి తీసిన పరిస్థితులకు ఆమె చేస్తున్న పోరాటానికీ సంబంధం లేదన్న అభిప్రాయాన్ని పరిశీలకులు వ్యక్తం చేస్తున్నారు. ఆమెను పోలీసులు ధర్నాకు అనుమతి లేదంటూ అడ్డుకుంటే.. కోర్టును ఆశ్రయించాల్సి ఉంటుంది. అంతే కానీ విధినిర్వహణలో ఉన్న పోలీసులపై చేయి చేసుకోవడం వల్ల నేరం చేయడమే అవుతుంది కానీ మరొకటి కాదు. ఈ లాజిక్ ను ఆమె ఎలా మిస్ అయ్యారో అర్ధం కాదు.  

నితీష్ ఐక్యతా యత్నాలు ఫలించేనా?.. కేసీఆర్ కలుస్తారా?

విపక్షాల ఐక్యత కోసం బీహార్ సీఎం నితీష్ కుమార్ తన ప్రయత్నాలను పట్టువదలని విక్రమార్కుడిలా కొనసాగిస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన ఆర్జేడీనేత, బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వియాదవ్ తో కలిసి.. పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమత బెనర్జీ, ఉత్తర ప్రదేశ్ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ తో భేటీ అయ్యారు. విపక్షాల ఐక్యత విషయంలో ఇంకెంత మాత్రం జాప్యం తగదని ఆయన అంటున్నారు. కోల్ కతాలో మమత బెనర్జీతో భేటీ అయిన నితీష్ దీదీతో చర్చలు సానుకూల వాతావరణంలో సాగాయని చెప్పారు. విపక్ష నేతలంతా కలిసి వ్యూహరచన చేస్తే మంచిదని మమత చెప్పారనీ, బీజేపీని జీరో చేయడమే లక్ష్యంగా విపక్షాల ఐక్యత ఉండాలన్నదే లక్ష్యం కావాలని అన్నారు. లోక్ నాయక్ డాక్టర్ జయప్రకాశ్ నారాయణ ఉద్యమం కూడా బీహార్ నుంచే ప్రారంభమైందన్న నితీష్ కుమార్, ఇప్పుడు కూడా విపక్షాల ఐక్యతా యత్నాలకు బీహార్ నుంచే నాది పలకాలని ఆకాంక్షించారు. విపక్షాల ఐక్యతకు సంబంధించి అఖిల పక్షం బీహార్ లో నిర్వహించాలని మమతా బెనర్జీ కూడా సూచించారని నితీష్ కుమార్ తెలిపారు. ఐతే.. కాంగ్రెస్, బీజేపీలకు సమదూరం అంటే ఇటీవలే అఖిలేష్, మమతలు సంయుక్త ప్రకటన చేసిన నేపథ్యంలో బీహార్ లో కాంగ్రెస్, ఆర్జేడీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వానికి నాయకత్వం వహిస్తున్న జేడీయే అధినేత నితీష్ కుమార్   కాంగ్రెస్‌ సారథ్యంలో విపక్షాల ఐక్యత కోసం చేస్తున్న ప్రయత్నాలకు మమత సుముఖంగా స్పందించారని చెప్పడం విశేషం. అయితే నితీష్ ఇప్పటి వరకూ చేసిన ఐక్యతా యత్నాలన్నీ ఒక అడుగు ముందుకు, రెండడుగులు వెనక్కు అన్న చందంగానే సాగాయి. ఈ నెల 12న జయప్రకాశ్ నారాయణ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ తో భేటీ అయ్యారు. ఆ భేటీలో కాంగ్రెస్ సహా బీజేపీయేతర పార్టీల ఐక్యతకు సంఘీభావం ప్రకటించిన కేజ్రీవాల్ ఆ తరువాత వారం వ్యవధిలోనే ఆప్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో ఒంటరిగానే పోటీ చేస్తుందని ప్రకటించారు. ఇప్పుడు నితీష్ తో భేటీకి చాలా రోజుల ముందే బీజేపీ, కాంగ్రెస్ లకు సమదూరం అని ప్రకటించిన మమత ఇప్పుడు నితీష్ సమక్షంలో కాంగ్రెస్ సహా విపక్షాల ఐక్యతకు మద్దతు ఇస్తామని ప్రకటించారు.   కోల్ కతా నుంచి నేరుగా  లక్నోవెళ్లి  సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్‌ యాదవ్‌తో భేటీ అయిన నితీష్, తేజస్వి ప్రసాద్ లు ఆయనతోనూ ఐక్యతపై చర్చించారు.  కాగా కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే కాంగ్రెస్ నేతృత్వంలోని యూపిఏలో కొనసాగుతున్నారు. ఎన్సీపీ, ఉద్దవ్‌ శివసేన ఇప్పటికే కాంగ్రెస్‌ కూటమిలోనే ఉన్నాయి. స్టాలిన్‌ కూడా యూపిఏ భాగస్వామిగానే ఉన్నారు. బిజూ జనతాదళ్‌ అధినేత నవీన్‌ పట్నాయక దాదాపు అన్ని కూటములకూ దూరంగా ఉన్నారు.  అసలు బీజేపీకి వ్యతిరేకంగా ఐక్య కూటమి అంటూ తొలుత అడుగులు వేసిన కేసీఆర్ ఇప్పుడు ఆ విషయంలో నోరు మెదపడం లేదు. మొత్తం మీద వచ్చే సార్వత్రిక ఎన్నికలలో బీజేపీ ఓటమి అన్నది ఆ పార్టీని వ్యతిరేకించే రాజకీయ శక్తులను అనివార్యమైన అవసరంగా మారిందనడంలో సందేహం లేదు.  

వివేకా హత్య కేసు.. అవినాష్ అరెస్టు సరే.. తరువాతెవరు?

వివేకా హత్య కేసులో అవినాష్ అరెస్టు అనివార్యమని తేలిపోయింది. అయితే సుప్రీం కోర్టు ఈ కేసు విషయంలో మరో కీలక నిర్ణయం కూడా వెలువరించింది. వివేకా హత్య కేసు దర్యాప్తునకు తాను విధించిన గడువును తానే సడలించి మరో రెండు నెలల గడువు ఇచ్చింది. ఇక్కడ ప్రస్తావించి తీరాల్సిన విషయం ఏమిటంటే.. సీబీఐ గడువు పెంచాలని సుప్రీం కోర్టును కోరలేదు. కానీ సుప్రీం కోర్టు గడువును పొడిగించింది. అంటే ఇప్పటి వరకూ అవినాష్ రెడ్డి అరెస్టుతో సీబీఐ దర్యాప్తు ఒక కొలిక్కి వచ్చినట్లేనని ఇక వరుస చార్జిషీట్లు ఉంటాయనీ అంతా భావించారు. అందుకు భిన్నంగా సుప్రీం కోర్టు అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కొట్టి వేస్తూ విస్పష్ట తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులను తప్పుపట్టింది. ముందస్తు బెయిలు మంజూరు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులలో ప్రతి అంశాన్నీ సీజేఐ నేతృత్వంలోని సుప్రీం కోర్టు ధర్మాసనం తప్పుపట్టింది.  ఒక దశలో ఆ పిటిషన్ ను విత్ డ్రా చేసుకుంటామని అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదులు సుప్రీంను అభ్యర్థించినా, అందుకు సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించలేదు. చివరకు హైకోర్టులో వాదనలు పూర్తయ్యే వరకైనా అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలన్న అవినాష్ రెడ్డి తరఫు న్యాయవాదుల అభ్యర్థనను సైతం సుప్రీం తోసి పుచ్చింది.   ఈ కేసుకు సంబంధించి సుప్రీం కోర్టు చేసిన వ్యాఖ్యలు, సీబీఐ దర్యాప్తు గడువును పెంచడం చూస్తుంటూ.. ఈ కేసుకు సంబంధించి మరింత లోతైన దర్యాప్తు చేయాలని సీబీఐని సుప్రీం కోర్టు ఆదేశించిందని భావించాల్సి వస్తోంది. ఇప్పటికే ఈ కేసులో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, అలాగే సీఎం సతీమణి భారతి పీఏ నవీన్ ను సీబీఐ ఇప్పటికే విచారించింది. మరో సారి వారిరువురికీ నోటీసులు జారీ చేసి విచారణకు రమ్మని పిలిచే అవకాశాలు మెండుగా ఉన్నాయని న్యాయనిపుణులు భావిస్తున్నారు. మొత్తంగా చూస్తే అవినాష్ రెడ్డి అరెస్టుతో సీబీఐ దర్యాప్తు కొలిక్కి వచ్చిందని భావించడానికి లేదనీ, ఈ కేసు మూలాల అన్వేషణలో భాగంగా సీబీఐ తాడేపల్లి ప్యాలెస్ తలుపులు తట్టే అవకాశాలున్నాయనీ అంటున్నారు. కాగా వైఎస్ వివేకానందరెడ్డి కేసులో తాడేపల్లి ప్యాలెస్ పూర్తిగా ఇరుక్కుందన్న అభిప్రాయం వైసీపీ శ్రేణుల్లోనే వ్యక్తమౌతున్నది. ఈ కేసులో సూత్రధారులు, పాత్రధారులు ఎవర్న విషయంలో ఇంత కాలంగా వ్యక్తమౌతున్న అనుమానాలు ఇప్పుడు దాదాపుగా నివృత్తి అయిపోయాయని అంటున్నారు. ఎందుకంటే తొలి సారి అవినాష్ రెడ్డిని సీబీఐ విచారణకు పిలిచినప్పటి నుంచీ వైసీపీ అగ్రనేతల్లో గాభరా కొట్టొచ్చినట్లు కనిపిస్తోంది. ఆ తరువాత ముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, సీఎం సతీమణి భారతి పీఏ నవీన్ లను సీబీఐ విచారించడంతో ఈ కేసులో వెనుక తాడేపల్లి మూలాలున్నాయన్న భావన పార్టీ శ్రేణుల్లోనే బలపడిందని చెబుతున్నారు. అన్నిటికీ మించి  సీబీఐ విచారణ పూర్తియన తరువాత కృష్ణ మోహన్ రెడ్డి, నవీన్ అలను స్వయంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జవహర్ రెడ్డి తన కారులో కడప విమానాశ్రాయానికి,  అక్కడ నుంచి తాడేపల్లి ప్యాలస్ కు చేర్చడంతో ఆ అనుమానాలు మరింత బలపడ్డాయని అంటున్నారు. అందుకే సుప్రీం కోర్టు వివేకా హత్య కేసు దర్యాప్తును మరో రెండు నెలలు పొడిగించడంతో సీబీఐ దర్యాప్తు మరింత లోతుకు సాగేందుకు మార్గం సుగమమైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అలాగే 2019 మార్చి 15న వివేకా హత్యకు గురైన సమయంలో అప్పటి కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మను సీబీఐ తాజాగా విచారించడం సంచలనం సృష్టించింది. ఎందుకంటే వివేకా హత్య కేసులో అప్పటి కడప ఎస్పీ రాహుల్ దేవ్ శర్మ హత్యా స్థలంలో వేలి ముద్రల గురించి, వివేకా శరీరంపై ఉన్న గాయాల గురించి మీడియాకు చెప్పారు. వివేకా నివాసానికి వెళ్లి మరీ విచారణ జరిపారు.  ఆయననుంచి తాజాగా సీబీఐ కీలక సమాచారాన్ని రాబట్టిందని అంటున్నారు. 

అమృత్ పాల్ సింగ్.. లొంగిపోయాడా.. అరెస్ట్ చేశారా..?

ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ ను మోగా జిల్లాలో పంజాబ్ పోలీసులు  అరెస్ట్ చేశారు. మార్చి 18 నుంచి అమృత్ పాల్ సింగ్ సుమారు 37 రోజులుగా తప్పించుకు తిరుగుతన్న సంగతి తెలిసిందే. అతని కోసం పంజాబ్ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు  మోగా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు.  పోలీసులు అతన్ని  అస్సాంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు. ప్రస్తుతం అదే జైల్లో అతడి అనుచరులు కూడా ఉన్నారు.   అయితే అమృత్ పాల్ అరెస్టుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమృత్ పాల్ స్వయంగా పోలీసులకు లొంగిపోయినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఈ కథనాలను పంజాబ్ పోలీసులు ఖండించారు. మార్చి 18న పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తున్నారని పంజాబ్ ఐజీ చెప్పారు. పంజాబ్ పోలీసుశాఖలోని అన్ని విభాగాలు సమన్వయంతో అతడి కోసం గాలించాయని, ప్రతి కదలికను ట్రాక్ చేశాయని చెప్పారు.  దీంతో రోడ్ గ్రామంలో అమత్ పాల్ ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం అందింది. పోలీసులు, పంజాబ్ ఇంటెలిజెన్స్ విభాగాల సంయుక్త బృందం గ్రామాన్ని చుట్టిముట్టింది. భారీగా భద్రతా బలగాలను మోహరించారు.  అతను గురుద్వారా లోపల ఉన్నందున మోహరించారించాల్సి వచ్చింది. అతను గురుద్వారా లోపల ఉన్నందున.. స్థలం పవిత్రత దష్ట్యా పోలీసులు లోపలికి ప్రవేశించలేదు. దీంతో తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడంతో అమత్పాల్ సింగ్ గురుద్వారా నుండి బయటికి వచ్చిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. రోడెవాల్ గురుద్వారాలోని జ్ఞానీ జస్బీర్ సింగ్ మాత్రం భిన్నంగా చెబుతున్నారు. శనివారం రాత్రి అమృత్పాల్ గురుద్వారాకు వచ్చాడని, తాను ఎక్కడ ఉన్నదీ పోలీసులుకు అతడే స్వయంగా ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడని అన్నారు. ఆదివారం గురుద్వారాలో ప్రార్థనల అనంతరం ఉదయం లొంగిపోనున్నట్టు వెల్లడించారన్నారు. ఉదయం  సమయంలో ఇంటెలిజెన్స్ ఐజీ నేతత్వంలోని పోలీసులు అక్కడకు చేరుకొని అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు తెలిపారు.ఇంతకి అమృత్ పాల్ సింగ్ ను అరెస్టు చేశారా..అతనే పోలీసులకు లొంగిపోయాడా..? అనే దానిపై మాత్రం.. క్లారిటీ లేదు.

రగులుతున్న రాయలసీమ

పాతికేళ్ల క్రితం వరకూ ఫ్యాక్షన్ కే పరిమితమైన రాయలసీమ ఇప్పుడు రాజకీయ సంచలనాలకు వేదికగా మారింది. బాషాప్రయోక్త రష్ట్రాల ఏర్పాటు తరువాత రాయలసీమ నుంచి వచ్చిన ముఖ్యమంత్రులు సుమారు 30 సంవత్సరాలు పాలించారు. ఏడుగురు ముఖ్యమంత్రులను రాయలసీమ అందించింది. ప్రస్తుతం రాయలసీమ కొత్త సమస్యను ఎదుర్కొంటోంది. రాయలసీమ ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం ఉద్యమిస్తున్న సీమ నేతలను తమ వాదనలకు పదును పెంచారు. తాజాగా జేసీ దివాకరరెడ్డి చేసిన ప్రకటన కొత్త ఆలోచనలను రేకెత్తిస్తోంది.  అనంతపురం, కర్నూలు జిల్లాలను తెలంగాణలో విలీనం చేయాలన్న జేపీ వాదన కొత్త ఆలోచనలకు బీజం వేస్తోంది. ఈ విషయంలో తెలంగాణ సీఎం కేసీఆర్ తో చర్చిస్తానని జేసీ అంటున్నారు. రాష్ట్ర విభజన జరిగినప్పుడు సీనియర్ నేత ఎంవి  మైసూరారెడ్డి గ్రేటర్ రాయలసీమ ప్రతిపాదన చేశారు. అనంతపురం, కడప, కర్నూలు, చిత్తూరు జిల్లాలతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలలోని రెండు రెవెన్యూ డివిజన్లతో గ్రేటర్ రాయలసీమ ఏర్పాటు అప్పట్లో తెరమీదకు వచ్చింది. ఇదే కాక రాయలసీమ, తెలంగాణలు కలిపి రాయల్ తెలంగాణ ఏర్పాటుపై కొన్నిఅభిప్రాయాలు  అప్పట్లో వ్యక్తమయ్యాయి. కావలసిన ఆర్థిక వనరులు, సహజ వనరులు, జల వనరులు తమకు ఉన్నాయంటున్నసీమ నేతలు ఇతర ప్రాంతాల వారు తమ హక్కులను, వనరులను దోపిడీ  చేస్తున్నారని సీమ నేతలు ఇరోపిస్తూనే ఉన్నారు. 

అవినాష్ ముందస్తు బెయిలు రద్దు.. వివేకా హత్య కేసు దర్యాప్తు గడువు పొడగింపు

అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ముందస్తు బెయిల్ మంజూరు చేస్తూ ఇచ్చిన తీర్పు పట్ల సుప్రీం కోర్టు సీజేఐ ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఇలాంటి తీర్పులు కూడా ఉంటాయా అంటూ విస్మయం వ్యక్తం చేసింది. రాతపూర్వకంగానే ప్రశ్నలు అంటూ ముందస్తు బెయిలు సందర్బంగా తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ఉటంకిస్తూ.. అలా అయితే ఇక సీబీఐ అవసరమేమిటి అని సుప్రీం సీజేఐ ధర్మాసనం వ్యక్తం చేసింది. ఇన్ని వ్యాఖ్యలు చేసిన అనంతరం సుప్రీం కోర్టు తెలంగాణ హైకోర్టు చేసిన మధ్యంతర ముందస్తు బెయిలును కొట్టివేస్తూ తీర్పు ఇచ్చింది. అంతే కాదు.. ఈ నెల 30లోగా వివేకా హత్య కేసు దర్యాప్తును ముగించేయాలని గతంలో ఇచ్చిన ఉత్తర్వులను పొడిగిస్తూ.. జూన్ 30 వరకూ గడువు పొడిగించింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుతో ఇక అవినాష్ ను సీబీఐ ఏ క్షణంలోనైనా అరెస్టు చేసే అవకాశం ఉంది. అసలు తెలంగాణ హైకోర్టు వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు మంజూరు చేస్తే తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులపై న్యాయనిపుణులే కాదు.. వివేకా హత్య కేసు విషయంలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తున్న సామాన్యులనే ఆశ్చర్య పరిచింది.  టీవీ టాక్ షోలలో  తెలంగాణ హైకోర్టు ఉత్తర్వులు న్యాయ సూత్రాలకు భిన్నంగా ఉన్నాయని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.  ఈ సందర్భంగానే అవినాష్ రెడ్డి ముందస్తు బెయిలు పిటిషన్ చివరి నిముషంలో మరో బెంచ్ కు మారడంపైనా సందేహాలు వ్యక్తం చేశారు.   మొత్తం మీద హైకోర్టులో అవినాష్ రెడ్డికి సీబీఐ అరెస్టు నుంచి తాత్కాలికంగానే అయినా ఊరట లభించడం వెనుక ఏదో మతలబు ఉందన్న అనుమానాలే అందరిలో వ్యక్తమయ్యాయి. ఏపీ ముఖ్యమంత్రి వివేకా హత్య కేసు హైకోర్టులో విచారణ జరుగుతున్న సమయంలోనే అసెంబ్లీ సాక్షిగా అవినాష్ రెడ్డికి క్లీన్ చిట్ ఇవ్వడం, హతుడు వివేకానందరెడ్డి స్వయంగా ఏపీ సీఎం జగన్ కు బాబాయ్ కావడంతో ఈ హత్య కేసు తెలుగు రాష్ట్రాలలో తీవ్ర ఆసక్తిని రేకెత్తించింది.  అసలు అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిలును సీబీఐ సుప్రీంలో సవాల్ చేస్తుందని అంతా భావించారు. అయితే అనూహ్యంగా వివేకా కుమార్తె సుప్రీంను ఆశ్రయించి తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులను సవాల్ చేశారు. తెలంగాణ హైకోర్టు అవినాష్ కు బెయిలిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చినప్పటికీ.. ఆ ఊరట అవినాష్ కు లభించలేదు. ముందస్తు బెయిలు ఉత్తర్వులతో పాటే.. ఆయన ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. దీంతో ముందస్తు బెయిలు పొందిన నాటి నుంచీ అవినాష్ ప్రతి రోజూ సీబీఐ కార్యాలయానికి వెళ్లి వస్తూ ఉన్నారు. ఇప్పుడు సుప్రీం ఆ ముందస్తు బెయిలు పిటిషన్ ను కొట్టి వేయడంతో సీబీఐ ఆయనను అరెస్టు చేయడం ఖాయమని తేలిపోయింది. అరెస్టు చేసి ఆ తరువాత అవినాష్ ను సీబీఐ కస్టడీకి కొరే అవకాశాలు ఉన్నాయి.  

అవినాష్ అరెస్టే ఇక తరువాయి!

అందరూ అనుకున్నట్లుగానే అయ్యింది. వివేకా హత్య కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిలు ఇస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను సుప్రీం కోర్టు ధర్మాసనం కొట్టివేసింది. దీంతో ఈ కేసులో అవినాష్ అరెస్టుకు రంగం సిద్ధమైనట్లే. అయితే.. వివేకా హత్య కేసు దర్యాప్తును ఈ నెల 30లోగా ముగించాలన్న ఆదేశాలను సడలిస్తూ గడువును జూన్ 30 వరకూ పొడిగించింది. ఇక వివేకా హత్య పూర్వాపరాల లోకి వెళితే.. ఈ కేసు  అనేక మలుపులు తిరుగుతోంది. సిట్ దర్యాప్తు నుంచి సీబీఐ దర్యాప్తు దర్యాప్తు వరకూ వివేకా హత్య కేసులో  వేలు పెట్టని దర్యాప్తు సంస్థ లేదు.  జిల్లా కోర్టు నుంచి, రెండు తెలుగు రాష్ట్రాల హైకోర్టులు, దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీం కోర్టులో కూడా వివేకా హత్య కేసు వాదనలు జరిగాయి, జరుగుతున్నాయి. వైఎస్ కుటుంబంలో జరిగిన హత్య కావడంతో ఇది ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో పెను దుమారాన్ని సృష్టిస్తోంది.   మందస్తు బెయిల్ కోసం అవినాష్ రెడ్డి హైకోర్టు తలుపు తట్టడంతో ఆయనను ఏప్రియల్ 22 వరకూ అరెస్టు చేయవద్దంటూ ఆదేశాలు వచ్చాయి.  వివేకా కుమార్తె సునీత ముందస్తు బెయిల్ ఆదేశాలపై సుప్రీం కోర్టును ఆశ్రయించారు.  21వ తేదీన విచారణకు స్వీకరించిన సుప్రీం కోర్టు తదుపరి విచారణను సోమవారం (ఏప్రిల్ 24)కు వాయిదా వేసింది. ప్రాథమికంగా తెలుస్తున్న సమాచారాన్ని బట్టి అవినాష్ ముందస్తు బెయిలుపై హైకోర్టు ఆదేశంపై సుప్రీం కోర్టు అసహనం వ్యక్తం చేసింది.  తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ముందస్తు బెయిలు ఉత్తర్వులను సుప్రీం కొట్టివేసింది.  దీంతీ అవినాష్ రెడ్డి అరెస్టు ఇక లాంఛనమే అంటూ తెలుగువన్ గతంలోనే ప్రచురించిన వార్త నిజమైంది. 

టీఎస్ పిఎస్ సి కేసు ఈ నెల 28 కి వాయిదా

టీఎస్ పిఎస్ సి పరీక్షల రద్దు  వాయిదాను  హైకోర్టు సమర్దించింది. సిట్ దర్యాప్తుపై  రాజకీయ  ఒత్తిడి ఉందంటూ  కాంగ్రెస్ నేత  బల్మూరి వెంకట్ వేసిన పిటిషన్ పై ఈ రోజు విచారణ చేపట్టిన  కోర్టు కీలక వాఖ్యలు చేసింది. సిట్ దర్యాప్తులో ఐటి నిపుణులు ఉన్నారా అని ప్రభుత్వాన్ని  ప్రశ్నించింది. ఐటి అంశాల దర్యాప్తుకు  మళ్లీ ఔట్ సోర్సింగ్ కు వెళ్లారా? అని వ్యాఖ్యానించింది.  బిజేపీ కాంగ్రెస్ నేతలను ఎందుకు విచారణకు పిలిచారు.  నేతల నుంచి  ఏదైనా  సమాచారం సేకరించారా? అని కోర్టు  ప్రశ్నించింది. ఈ వ్యవహారంపై  ఈ నెల 28న  మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తామని  ధర్మాసనం తెలిపింది.  అంతకుముందు ఇరు పక్షాలు హైకోర్టులో  వాదనలు వినిపించాయి. ప్రభుత్వం తరపున ఏజీ తన వాదనను  వినిపిస్తూ విచారణలో భాగంగా ఇప్పటి వరకు సిట్ 40 మంది సాక్షులను  ప్రశ్నించిందని హైకోర్టుకు తెలిపింది. 12 కంప్యూటర్లను సీజ్ చేసినట్లు  కోర్టు వరకు తీసుకెళ్లారు ఏజీ.   టీఎస్ పిఎస్ సి వ్యవహారం గత రెండు నెలలుగా రాష్ట్రాన్ని కుదిపేస్తుంది. ఒక వైపు నిరుద్యోగులు, మరోవైపు ప్రజా సంఘాలు , రాజకీయ పార్టీలు  టీఎస్ పీఎస్సీ లీకేజీలపై ధర్నాలు, నిరసనలతో హోరెత్తిస్తున్నారు.  ఈ అంశంపై  ప్రభుత్వం సిట్ విచారణ  వేసినప్పటికీ  ప్రతి పక్షాలు శాంతించలేదు. సీబీఐ జడ్జి  విచారణ కోసం  డిమాండ్ చేస్తున్నాయి. అయితే ఈ కేసు విచారణ 28న వాయిదా వేయడంతో టీఎస్ పీఎస్ సీ లీకేజీ వ్యవహారం కొలిక్కి వచ్చే అవకాశం ఉంది.   

అధికారం కోసం రెచ్చగొట్టే వ్యాఖ్యలా?

కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బిజెపి..మరోమారు అధికారం కోసం ప్రయత్నించడంలో తప్పులేదు. అధికారంలో ఉన్న రాష్టాంల్లో మళ్లీ అధికారంలోకి రావాలనుకోవడంలోనూ తప్పులేదు. అలాగే కొత్తగా తెలంగాణ,ఎపీల్లోనూ కూడా కమలం వికసించాలని కోరుకోవడాన్ని ఎవరూ తప్పు పట్టరు. ఏ రాజకీయ పార్టీ అయినా.. అధికారం కోసం ప్రయత్నిస్తుందనడంలో సందేహం లేదు. అధికారం కావాలని ప్రయత్నించడంలోనూ తప్పులేదు. దేశం అంతా తమ ఏలుబడిలో ఉండాలని కోరుకోవడాన్నీ తప్పుపట్టలేం.  అయితే  ఆఅధికారం ఎందుకోసం..ఎవరికోసం.. అన్న ప్రశ్నలు వేసుకోవాలి. కేవలం వెూడీని వెూయడానికేనా.. లేక ప్రజలకు మేలు చేయడానికా అన్న జనం, రాజకీయ ప్రత్యర్థులు, పరిశీలకులు సంధిస్తున్న ప్రశ్నలకు బీజేపీ అగ్రనాయకత్వం సమాధానం చెప్పి తీరాలి.  పార్లమెంటులో సమస్యలపై చర్చకు సిద్ధం కాని వారు,  విపక్షాలు ప్రశ్నించడాన్ని కూడా సహించలేని వారు అధికారం కోసం అర్రుచాడం ఏమిటన్నదే పరిశీలకులు సంధిస్తున్న ప్రశ్న.   అలాగే ప్రజలకు అధికారంలో ఉండగా చేసిన మంచేమిటో చెప్పుకొని మరోసారి అధికారం కోసం జనాలను ఓట్టు అడగాలి. ప్రజలకు మంచి చేసేందుకు ఎవరు ముందుకు వచ్చినా మంచిదే... ఆ పని బిజెపి చేస్తుందనుకుంటే ప్రజలు తప్పకుండా బిజెపినే ఆదరిస్తారు. కానీ  బీజేపీ తీరు అందుకు భిన్నంగా ఉంది. అధికారం కోసం ప్రజల మధ్య విభేదాలు, విద్యేషాలు సృష్టించే వ్యాఖ్యలు చేయడానికి కూడా ఆ పార్టీ నేతలు వెనుకాడటం లేదు. తెలంగాణ పర్యటనలో భాగంగా చేవెళ్లలో నిర్వహించిన సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలు కచ్చితంగా అభ్యంతరకరమైనవేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తామంటూ ప్రకటించడం అందులో భాగమేనని అంటున్నారు.   అలాగే మోడీ మరో సారి ప్రధాని కావాలనుకోవడం లో తప్పులేదని, అయితే ఆ పదవి కోసం మరో పార్టీ నాయకుడు ప్రయత్నించడం ఎంత మాత్రం సరికాదన్న అర్ధం వచ్చేలా అమిత్ షా ప్రసంగం సాగింది.  దేశంలో పీఎం సీటు ఖాళీగా లేదని  అమిత్‌ షా వ్యాఖ్యానించారు. ప్రధాని పదవికి రెండు పర్యాయాలు మోడీని ప్రజలు ఎన్నుకున్నారు. వారికి మోడీ పాలన నచ్చితే మరో సారి ఆ అవకాశం ఇస్తారు. లేకుంటే.. మరో వ్యక్తికి అవకాశం ఇస్తారు. అంతే కానీ.. ప్రజలు అలా అవకాశం ఇవ్వడానికే వీల్లేదన్న ధోరణిలో అమిత్ షా చేసిన ప్రసంగం ప్రజల విచక్షణను అవమానించడమేనని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.  

మరో చీతా మృతి

దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో ఒక మగ చీతా మధ్యప్రదేశ్లోని కునో జాతీయ పార్కులో  అనారోగ్యంతో మరణించింది. దీంతో విదేశాల నుంచి రప్పించిన చీతల్లో మరణించిన వాటి సంఖ్య రెండుకు చేరుకుంది. ఇదే విషయాన్ని మధ్యప్రదేశ్ ఫారెస్ట్ చీఫ్ కన్సెర్వేటర్ జేఎస్ చౌహన్ నిర్ధారించా రు.  దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన చీతాల్లో ఒకటైన ఉదయ్ అనే చీతా కునో జాతీయ పార్కులో అనారోగ్యం పాలై,  చికిత్స పొందుతూ మరణించింది. మరణం వెనుక కారణాన్ని కనుగొనాల్సి ఉంది. చీతా అనారోగ్యంపాలైన సంగతిని  అటవీ సిబ్బంది ఆదివారం (ఏప్రిల్ 23) గుర్తించారు. వెంటనే దానికి మత్తు మందు ఇచ్చి,  వైద్య కేంద్రానికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ   చీతా మరణించింది. వెటర్నరీ వైద్యుల బృందం చీతా దేహానికి పోస్ట్ మార్టమ్ నిర్వహించారు. పోస్ట్ మార్టంను వీడియో తో పాటుగా ఫొటోలు కూడా తీస్తారని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. ఈ ఏడాది ఫిబ్రవరి 18న దక్షిణాఫ్రికా నుంచి కునో జాతీయ పార్కుకు ఉదయ్ తో పాటుగా మరో 11 చీతాలను తీసుకొనివచ్చారు. మొత్తంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి 20 చిత్రాలను తీసుకొనివచ్చారు. గతేడాది నమీబియా నుంచి పార్కునకు తీసుకువచ్చిన ఎనిమిది చీతాల్లో శషా అనే చీతా ఈ ఏడాది మార్చిలో మరణించింది. ఇప్పుడు రెండవ చీతా రెండు చితాలు మరణించినట్లైంది. అంటే దక్షిణాఫ్రికా నుంచి తీసుకువచ్చిన 20 చీతాల్లో రెండు మరణించగా వాటి సంఖ్య ఇప్పుడు 18కి పడిపోయింది. ప్రధాని మోడి చేతుల మీదుగా ఎంతో ప్రతిష్టాత్మకంగా నమీబియా, దక్షిణాఫ్రికా నుంచి చీతాలను తెచ్చి, పార్కుల్లో వదిలితే.. ఇలా ఒక్కోక్క చీతా  మృత్యవాత పడటంపై వన్యప్రాణి ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వాటి ఆరోగ్య రక్షణ కోసం మరింత మెరుగైన ఏర్పాట్లు చేయాల్సిన అవసరం ఉందని డిమాండ్ చేస్తున్నారు.  

సుప్రీంలో కరోనా కలకలం.. తక్షణమే ప్రొటోకాల్ అమలు.. కేసుల విచారణలో జాప్యం?

దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది. రోజూవారీ పాజిటివ్‌ కేసుల్లో గణనీయంగా పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా దేశ అత్యున్నత న్యాయస్థానంలో కరోనా కలకలం రేగింది. కొందరు న్యాయవాదులు అస్వస్థతకు గురి కావడంతో అందరికీ వైద్య పరీక్షలు నిర్వహించగా.. పలువురు లాయర్లు, న్యాయవాదులకు కరోనా సోకినట్లు నిర్దారణ అయింది.   దీంతో సుప్రీంకోర్టు, పరిసరాల్లో కరోనా ఆంక్షలు వెంటనే అమల్లోకి వచ్చాయి. అందరూ మాస్క్‌లు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరం పాటించాలంటూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు.మరోవైపు గత 24 గంటల వ్యవధిలో దేశవ్యాప్తంగా 7,178 కొత్త కేసులు బయటపడ్డాయి. ఇక మహమ్మారి కారణంగా 24గంటల్లో 16 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 65,683 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. కొవిడ్‌ కేసుల పెరుగుదలకు ఎక్సబీబీ.1.16 వేరియంట్‌ కారణమని వైద్య నిపుణులు తెలిపారు. అయితే, కేసుల సంఖ్య గణనీయంగా పెరిగినప్పటికీ.. ఈ వేరియంట్‌ మరీ అంత శక్తిమంతమైనది ఏవిూ కాదని పేర్కొన్నారు. అయినప్పటికీ ప్రజలు రద్దీ ప్రదేశాల్లోకి వెళ్లినపðడు మాస్క్‌లు ధరించడం, చేతులను శుభ్రం చేసుకోవడం వంటి జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ఇలా ఉండగా.. సుప్రీం లో కరోనా కలకలం కారణంగా ఈ రోజు ఉదయం   కేసుల విచారణలో జాప్యం చోటు చేసుకుంది.   ఇలా ఉండగా దేశంలో కరోనా థర్డ్‌వేవ్‌ ముగిసి సాధారణ పరిస్థితులు నెలకొంటున్న వేళ మరో వేరియంట్‌ వణికిస్తోంది. ఫోర్త్‌వేవ్‌ అంటూ సర్వత్రా భయాందోళనలు వ్యక్తమౌతున్నాయి. ఇటీవల ఢిల్లీ తదితర ప్రాంతాల్లో కరోనా పాజిటివ్ కేసులు   పెరగగడం ఆందోళన కలిగిస్తోంది. అత్యంత ప్రమాదకరమైన వేరియంట్‌గా భావిస్తున్న  కొత్త వేరియంట్‌ ఇప్పుడు దేశాన్ని చుట్టేస్తోంది. ఈ వేరియంట్‌ కేసులు   కరోనా కొత్త వేరియంట్‌ ఒమైక్రాన్‌ ప్రమాదకరమైనదే అయినా పెద్దగా మరణాలు సంభవించలేదు. పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే థర్డ్‌వేవ్‌ ముగిసింది. అయితే ఇప్పుడు కేసుల పెరుగుదల ఉధృతి సెకండ్ వేవ్ నాటి పరిస్థితులను స్ఫురింప చేస్తోంది. కేసులు వేగంగా పెరుగుతున్నాయి.  మళ్లీ కరోనా సీజన్‌ మొదలైందా అన్న ఆందోళన కలిగిస్తోంది. అయితే ఇది ఎండమిక్ కు ముందు దశ అనీ,  అతిగా భయపడటం అనవసరమనీ వైద్య నిపుణులు చెబుతున్నారు.  మాస్కులు ధరించి, భౌతిక దూరం పాటించడం ద్వారా ఎలాంటి ముప్పు లేకుండా ఈ దశ నుంచి బయటపడొచ్చనీ అంటున్నారు.అయితే కరోనా ప్రస్తత వ్యాప్తి తీవ్రతపై ఇంకా ఇంకా శాస్త్రీయమైన స్పష్టత రాలేదు.. ప్రస్తుతం సోకుతున్న కరోనా  లక్షణాలను అనలైజ్ చేసి నిర్ధారించాల్సిన అవసరం ఉంది.  శాస్త్రవేత్తలు ఆ పనిలోనే ఉన్నారు.

పోలీసులపై చేయి చేసుకున్న షర్మిల, విజయమ్మ

వైఎస్సార్టీపీ  ధ్యక్షురాలు షర్మిలపై  పోలీసులు మళ్లీ కేసు నమోదు చేశారు. ఐపీసీ 353, 330 సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు అయింది. నిరుద్యోగ సమస్యలపై హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద సోమవారం ధర్నాకు  షర్మిల సిద్ధమయ్యారు. ఆ క్రమంలో లోటస్‌పాండ్‌లోని ఆమె నివాసం నుంచి ధర్నాకు బయలుదేరే క్రమంలో ఆమెను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె.. వాహనం దిగి.. తనను అడ్డుకొన్న పోలీసులతో వాగ్వాదానికి దిగడంతోపాటు వారి పట్ల దురుసుగా ప్రవర్తించారు. పోలీసులపై చేయి కూడా చేసుకున్నారు. అంతే కాకుండా.. పోలీసులు అడ్డుకోవడంతో రోడ్డుపైనే ఆమె బైఠాయించి తన నిరసనను వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో  షర్మిలను పోలీసులు అరెస్ట్ చేసి.. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌కు తరలించారు.   గత ఏడాది నవంబర్‌లో  షర్మిల వరంగల్ జిల్లాలోని నరసన్నపేటలో తన పాదయాత్ర సమయంలో చోటు చేసుకొన్న పరిణామాల నేపథ్యంలో.. బేగంపేటలోని గ్రీన్‌ల్యాండ్స్‌లోని సీఎం క్యాంప్ కార్యాలయం ఎదుట ధర్నాకు బయలుదేరడం.. ఆ క్రమంలో పోలీసులు ఆమెను అడ్డుకోని... పంజాగుట్టు పీఎస్‌కు తరలించి.. వైయస్ షర్మిలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. అలాగే గతేడాది అక్టోబర్‌లో అందోల్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ నాయకుడు క్రాంతికిరణ్‌ని వైయస్ షర్మిల అవమానించే విధంగా మాట్లాడారంటూ.. దళిత సంఘాలు, టీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ జోగిపేటలో పోలీసులను ఆశ్రయించారు. దీంతో వైయస్ షర్మిలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పోలీసులు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఇలా ఉండగా షర్మిలను కలుసుకోవడానికి పీఎస్ కు వెళ్లిన విజయమ్మకు పోలీసులు అందుకు అనుమతివ్వకపోవడంతో  ఆమె కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ పోలీసులపై చేయి చేసుకున్నారు. దీంతో ఆమెపై కూడా కేసు నమోదు చేసి అరెస్టు చేసే అవకాశాలున్నాయని అంటున్నారు.