బీఆర్ఎస్ తో పొత్తుకు సై.. బట్ కండీషన్స్ అప్లై!
posted on Apr 28, 2023 @ 12:49PM
దేశంలో ఒకప్పుడు ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న, అవిభక్త భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) ఆ తర్వాత ఎన్ని చీలికలు పేలికలుగా విడిపోయినా 2004 వరకు సిపిఐ, సిపిఎం పార్టీలు, అలాగే ఫార్వార్డ్ బ్లాక్ వంటిమరో ఒకటి రెండు లెఫ్ట్ పార్టీలు చట్టసభల్లో తమ గళాన్ని గట్టిగానే వినిపించాయి. 2004లోక్ సభ ఎన్నికల్లో వామపక్ష కూటమి 62 సీట్లు గెలుచుకుంది. అయితే, హిందూ మతోన్మాద బీజేపీని అడ్డుకునేందుకు కాంగ్రెస్ సారథ్యంలోని యూపీఏ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇచ్చి, ఆ తర్వాత అమెరికాతో యూపీఏ ప్రభుత్వం అణు ఒప్పందం కుదుర్చుకోవడాన్ని వ్యతిరేకిస్తూ మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మద్దతు ఉప సంహరించుకుంది. ఇక అక్కడి నుంచి భారత కమ్యూనిస్ట్ పార్టీల కథ కంచి యాత్ర, అంటే ముగింపు ప్రస్థానం మొదలైంది. ప్రస్తుత లోక్ సభలో ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలకు కలిపి కేవలం ఐదుగురు సభ్యులు మాత్రమే ఉన్నారు.
పార్లమెంట్ లోనే కాదు రాష్ట్రాలలోనూ ఎర్ర జెండా వెలుగు తగ్గింది. చివరకు 30 ఏళ్లకు పైగా వామపక్ష కూటమి పాలించిన పశ్చిమ బెంగాల్లో ఇంచేమించుగా అంతే కాలం అధికారంలో ఉన్న త్రిపురలోనూ కమ్యూనిస్ట్ పార్టీలు వరస ఓటములతో ఉనికిని కోల్పోయాయి. మూడు దశాబ్దాలకు పైగా తిరుగులేని శక్తిగా నిలిచిన పశ్చిమ బెంగాల్ లో అయితే ఎర్రజెండాకు అసెంబ్లీలో ఎంట్రీయే లేకుండా పోయింది. కనీసం సింగిల్. కేరళలో అధికారంలో ఉన్నా, లోక్ సభ ఎన్నికల్లో కేరళ నుంచి ఒకరిద్దరు మాత్రమే గెలిచారు.
నిజానికి పశ్చిమ బెంగాల్, త్రిపుర, కేరళ రాష్ట్రాల తర్వాత కమ్యూనిస్ట్ పార్టీలకు మంచి పట్టున్న రాష్త్రం అవిభక్త ఆంధ్ర ప్రదేశ్.అందులోనూ తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీలు ప్రధాన రాజకీయ పార్టీలలో ఒకటిగా చెలామణి అవుతూ వచ్చాయి. రాష్ట్ర విభజన తర్వాత కూడా ఇప్పటికీ తెలంగాణలో కమ్యూనిస్ట్ పార్టీలకు కొంత ఓటు బ్యాంకు ఇంకా మిగిలేవుంది. ముఖ్యంగా ఖమ్మం, నల్గొండ ఉమ్మడి జిల్లాలో సిపిఐ,సిపిఎం పార్టీలకు కొంత పట్టుంది. అయితే ఎంత పట్టున్నా సొంతంగా పోటీ చేసి, కనీసం ఒకటి రెండు సీట్లు అయినా గెలుచుకునే పరిస్థితి మాత్రం లేదు. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టీడీపీ సారథ్యంలో ఏర్పడిన మహాకూటమిలో సిపిఐ భాగస్వామ్య పార్టీగా ఉన్నా ఒక్క సీటు కూడా గెలుచుకోలేక పోయింది. అలాగే ప్రజాసంఘాల ఐక్య వేదికను ఏర్పాటు చేసి సుదీర్ఘ పోరాటం చేసిన సిపిఎంకు చివరకు పోరాటమే మిగిలింది ఫలితం మాత్రం దక్కలేదు.
ఈ నేపధ్యంలోనే ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలూ మునుగోడు ఉప ఎన్నిక సమయంలో ముఖ్యమంత్రి కేసిఆర్ పిలుపునందుకుని బీఆర్ఎస్ తో చేతులు కలిపాయి. గులాబీ పార్టీ అభ్యర్ధికి మద్దతు నిచ్చాయి. బీఆర్ఎస్ అభ్యర్ధి కూసుకుంట్ల ప్రభాకర రెడ్డి కేవలం పది వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు. ఇక అక్కడి నుంచి ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ఎర్ర కాలర్ ఎగరేయడం మొదలు పెట్టాయి. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచించి బీఆర్ఎస్ అయినా కూసుకుంట్లను గెలిపించింది తామేనని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు ప్రచారం చేసుకుంటున్నాయి. అంతే కాదు, బీఆర్ఎస్ పార్టీకి ముఖ్యమంత్రి కేసేఆర్ కు మాతో పొత్తు కావాలంటే.. అంటూ షరతులు విధిస్తున్నాయి. రౌతు మెత్తనైతే గుర్రం మూడు కాళ్ళ మీద పరిగెత్తుతుందనే సామెతను గుర్తు చేస్తూ బీఆర్ఎస్ బలహీనతను ఆసరాగా చేసుకుని ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు రానున్న ఎన్నికల్లో సీపీఎం, సీపీఐ కలిసి పోటీ చేస్తాయి. బీఆర్ఎస్ తో కలిసి పనిచేసే యోచనలో ఉన్నాం. మా బలానికి తగినట్లు సీట్లు ఇవ్వాలని అడుగుతాం. ఇవ్వకపోతే విడిగా పోటీ చేస్తాంఅని ముఖ్యమంత్రి కేసీఆర్ కు సిపిఎం నేత తమ్మినేని అల్టిమేటం జారీ చేశారు. అలాగే కేంద్రంలో బీజేపీని ఓడించే శక్తి కాంగ్రెస్ కు ఉందని భావిస్తే, ఆ పార్టీతో కూడా సీట్ల సర్దుబాటు చేసుకుంటామని ఆయన చెప్పారు.
అయితే, బీఆర్ఎస్ నాయకులు మాత్రం ఉభయ కమ్యూనిస్ట్ పార్టీలు లేని బలాన్ని ఉహించుకుని ఎగిరెగిరి పడుతున్నాయని, అంటున్నారు. కుక్క తోక ను ఊపితే ఓకే, కానీ, తోక కుక్కను ఉపాలనుకుంటే అస్సలు బావోదు.. అనే అర్థం వచ్చేలా బీఆర్ఎస్ నాయకులు కమ్యూనిస్ట్ నాయకుల సమక్షంలోనే సరదాగా చురకలేస్తున్నారు. అదలా ఉంటే కమ్యూనిస్టులతో పొత్తు విషయంలో ముఖ్యమంత్రి సైలెంట్ గా ఉన్నారు. ఈ నేపథ్యంలో బీఆర్ఎస్, కమ్యూనిస్ట్ పార్టీల మధ్య పొత్తు ఉంటుందా ? ఉంటే ఎన్ని సీట్లకు పరిమితం చేస్తారు? కామ్రేడ్ల ఆలోచనేంటి? కామ్రేడ్ల ముందు కేసీఆర్ సరికొత్త ప్రతిపాదన పెట్టనున్నారా? వంటి పలు అంశాలు మళ్లీ తెరపైకి వస్తున్నాయి.