పాయె.. ఆంధ్రా భవనూ పాయే.. అంతేనా?..అంతేనా?
posted on Apr 28, 2023 7:24AM
రాష్ట్ర విభజనతో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వ్యవస్థ కుదేలై పోయింది. గత నాలుగేళ్లుగా ఆ పరిస్థితి మరింత దిగజారి పోయింది. మరోవైపు రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు తెలంగాణ నుంచి రావాల్సిన వాటా తెచ్చుకోవడంలో.. ప్రస్తుత జగన్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైయిందనే విమర్శలు సైతం వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు.. గతంలో ఏపీఎస్ఆర్టీసీ బస్సుల రవాణా అంశంలో ఇరు రాష్ట్రాల్లో చోటుచేసుకొన్న పరిణామాలు. అలాగే హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ భవనాలలో ఆంధ్రప్రదేశ్‌కి వాటాను కేసీఆర్ ప్రభుత్వానికి వైయస్ జగన్ ముఖ్యమంత్రి పీఠం ఎక్కగానే.. గిఫ్ట్ డీడ్‌లాగా అప్పగించేయడం.. దాంతో హుస్సేన్‌సాగర్ సమీపంలోని సచివాలయ భవనాలను కూల్చేసి.. వాటి స్థానంలో కొత్త సచివాలయాన్ని కేసీఆర్ ప్రభుత్వం నిర్మించిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ భవనం ఏఫ్రిల్ 30న కేసీఆర్ చేతుల మీదగా ప్రారంభంకానుంది.
అయితే తాజాగా దేశ రాజధాని ఢిల్లీలోని ఆంధ్రాభవన్‌ను పూర్తిగా తమకు వదిలేయాలని ఆంధ్ర్రప్రదేశ్ అధికారులను తెలంగాణ అధికారులు కోరారు. ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌కు అనుకొని ఉన్న ఆ స్థలంతో తెలంగాణ ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయని ఈ సందర్భంగా ఆంధ్రా అధికారులకు తెలంగాణ అధికారులు తెలిపారు. అందుకు ప్రతీగా పటౌడీ హౌస్‌లో గల ఏడెకరాల పైచిలుకు స్థలాన్ని తీసుకొని.. అక్కడ కొత్త భవనం నిర్మించుకోవాలంటూ ఏపీ అధికారులకు వారు సూచించారు. అయితే ఈ అంశాన్ని తమ సీఎం జగన్‌తో చర్చించిన తర్వాతే తాము ఏ నిర్ణయం తెలియజేస్తామని తెలంగాణ అధికారులకు ఏపీ అధికారులు స్పష్టం చేయడం గమనార్హం. దీంతో ఇది కూడా.. త్వరలో ఏపీ నుంచి తెలంగాణ ప్రభుత్వ ఆస్తుల ఖాతాలోకి వెళ్లి పోయే పరిస్థితులు ఉన్నాయనే ఓ చర్చ సోషల్ మీడియాలో ఊపందుకొంది.
తాజాగా ఢిల్లీలో రెండు రాష్ట్రాలకు ఉమ్మడిగా ఉన్న ఏపీ- తెలంగాణ భవన్, ఇతర స్థిరాస్తుల విభజనపై కేంద్ర హోంశాఖ కార్యాలయంలో కేంద్ర హోంశాఖ సంయుక్త కార్యదర్శి సంజీవ్ కుమార్ జిందాల్ ఆధ్వర్యంలో రెండు రాష్ట్రాల అధికారుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో తెలుగు రాష్ట్రాల ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఢిల్లీలోని అశోకా రోడ్డులో ఈ భవనం ఉందన్న సంగతి అందరికీ తెలిసిందే.
ఇప్పటికే టీటీడీ పాలక మండలిలో కానీ.. ప్రభుత్వంలో సలహాదారుల రూపంలో ప్రాంతాలకు అతీతంగా.. ఇబ్బడి ముబ్బడిగా ముఖ్యమంత్రి వైయస్ జగన్ నియమిస్తూ వస్తున్నారు. ఓ వైపు రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న సంగతి తెలిసి కూడా ఆయన ఇలా వ్యవహరించడం పట్ల.. సర్వత్రా విమర్శులను ఎదుర్కొంటున్నారు. కానీ పక్క రాష్ట్రం తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరు.. పూర్తి విరుద్దంగా ఉంది. ఆయన ప్రభుత్వం నియమించిన ప్రభుత్వ సలహాదారుల్లో పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు ఎవరైనా ఉన్నారా? అనే ప్రశ్న ప్రపంచంలోని తెలుగు వారిలో ఉత్పన్నమవుతోంది.
మరోవైపు తమ పార్టీ అధికారంలోకి వస్తే.. కేంద్రం మెడలు వంచి... రాష్ట్రానికి ప్రత్యేక హోదాతో పాటు రాష్ట్రానికి రావాల్సిన అన్నింటిని తీసుకు వస్తామంటూ 2019కి ముందు నాటి ప్రతిపక్ష నేతగా వైయస్ జగన్ ..తన పాదయాత్రలో ఢంకాభజాయించి మరీ చెప్పారు. కానీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత.. వాటి సాధనలో విషయంలో ఆయన అడుగులు ముందుకు పడలేదన్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయనను, ఆయన మాటలను నమ్మి 22 మంది ఎంపీలు, 151 మంది ఎమ్మెల్యేలను గెలిపించినా.. ప్రతిపక్షనేతగా ఆయన ఇచ్చిన హామీలను.. ముఖ్యమంత్రి అయిన తరువాత నెరవేర్చడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారనే చర్చ సైతం సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. మరి వాటి సాధనాలో భాగంగా జగన్ చేస్తున్న ప్రయత్నాలు ఏమైనా ఉన్నాయా అంటే.. సందేహమే అనే సమాధానం వస్తోంది. దీంతో అన్ని ఉన్నా .. కానీ అదేదో తక్కువైందన్నట్లుగా జగన్ ప్రభుత్వ తీరు ఉందనే విమర్శలు సైతం సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్నాయి.