ఖాకీవనం.. పోలీసుల దైన్యం
posted on Apr 27, 2023 @ 5:29PM
తలపై మూడు సింహాల టోపి.. చేతిలో లాఠీ.. నడుముకి బెల్ట్ పెట్టుకొని.. కాళ్లకు బూట్లు వేసుకొని.. టాప్ టూ బోటమ్.. ఖాకీ దుస్తుల్లో కనిపించే పోలీసుల ఆహార్యంలో కానీ, వారి వ్యవహార శైలిలో కానీ కర్కశంగా... కఠిన్యంతో నిండిపోయి ఉంటుందని దాదాపుగా అంతా భావిస్తారు. కానీ వారూ మనుషులే.. వారికీ మనసు ఉంటుందని.. వారికీ కుటుంబం ఉంటుందనీ.. సెంటిమెంట్లు ఉంటాయని.. ఎవరు అనుకోరు, భావించరు.
అంతే కాదు డ్యూటీలో భాగంగా వారు తీవ్ర ఆందోళనలకు లోనవుతారని.. వారి మానసిక సంఘర్షణ కారణంగా ఎంతో కొంత క్షోభకు గురవుతారని.. ఆ ఆవేదనను వారు.. మనసు పొరల్లో నిగూఢంగానే దాచేసకుంటారనీ, ఈ పరిస్థితిని ప్రతి పోలీసూ.. ఎప్పుడొ ఒకప్పుడు.. ఎక్కడో అక్కడ.. ఎదుర్కొనే ఉంటారు. ఇంకా క్లియర్ కట్‌గా చెప్పాలంటే.. రాష్ట్రంలోని పోలీస్ బాస్ డీజీపీ స్థాయి నుంచి సాధారణ కానిస్టేబుల్ వరకు ఈ పరిస్థితికి ఎవరూ అతీతులు కారు. ఇందులో ఎలాంటి ఎటువంటి సందేహం అవసరం లేదు.
తాజాగా హైదరాబాద్‌లో వైఎస్సార్టీపీ అధ్యక్షురాలు షర్మిల.. ఆమె తల్లి విజయమ్మ.. పోలీసుల పట్ల వ్యవహరించిన తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. షర్మిల, విజయమ్మ పోలీసుల పట్ల వ్యవహరించిన తీరును హైదరాబాద్ నగర పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు నల్లా శంకర్ రెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇటువంటి సంఘటనల వల్ల పోలీసుల ఆత్మాభిమానం దెబ్బ తింటుందని.. పోలీసుల సహానాన్ని పరీక్షించడం తగదంటూ హెచ్చరించారు. ప్రజల భద్రత కోసం.. నిరంతరం పాటు పడే పోలీసులపై ఇటువంటి దాడులు జరగడం ఇదే తొలిసారా? అంటే కచ్చితంగా కాదు.
బీఆర్ఎస్ నాయకులు, ప్రస్తుత మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు గతంలో అంటే తెలంగాణ ఉద్యమ సమయంలో పోలీసులపై దాడి చేశారు. అందుకు సంబంధించిన వీడియోలు .. మీడియాలో, సోషల్ మీడియలో అప్పట్లో విపరీతంగా వైరల్ అయినాయి. అదే విధంగా గతంలో ఏపీ మంత్రి, వైసీసీ నాయకుడు గుమ్మనూరి జయరాం స్వగ్రామమైన కర్నూలు జిల్లాలోని గుమ్మనూరు పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నారన్న సమాచారం మేరకు.. ఆ గ్రామానికి చేరుకొని.. పేకాటరాయుళ్ల నుంచి భారీగా నగదు, సెల్ ఫోన్లు, వాహనాలను స్వాధీనం చేసుకొన్న పోలీసులపై సదరు మంత్రి గారి సోదరుడు ఆయన అనుచరులు కారం పోడితో దాడి చేసిన సంగతి తెలిసిందే.
ఇక గత ఏడాది హైదరాబాద్‌లోని రాజ్‌భవన్ వద్ద కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి రేణుకా చౌదరి అయితే.. సాక్షాతూ ఎస్ఐ కాలర్ పట్టుకొని ప్రశ్నిస్తూ.. గుంజడం జాతీయ మీడియాలో సైతం ప్రసారమైంది. ఇలా చెప్పుకొంటూ పోతే పోలీసులపై రాజకీయ నేతలు చేసిన దాడులు జాబితా కొండవీటి చాంతాడంత ఉంటుంది. మరోవైపు ఇటువంటి సంఘటనలు తెలుగు రాష్ట్రాలకే పరిమితమా? అంటే దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో దాదాపుగా పోలీసులపై నాయకుల వ్యవహారశైలి ఇలాగే ఉంటోందని చెప్పడానికి లెక్కలేనన్ని దాఖలాలున్నాయి.
అయితే పోలీసులపై వివిధ రాజకీయ నేతలు దాడి చేస్తున్న వీడియోలు... అందుకు సంబంధించిన వార్తా కథనాలు..ఇటు మీడియాలో... అటు సోషల్ మీడియాలో తెగ హల్‌చల్ చేస్తోంటే.. దాడికి గురైన పోలీసుల కుటుంబాల్లో కలవరం రేగడం సహజం. ఇటువంటి పరిస్థితుల్లో బాధితులుగా మారుతున్న పోలీసులు.. ఆ ఆవేదనను పంటిబిగువునే భరిస్తూ.. మళ్లీ విధినిర్వహాణలో భాగస్వాములవుతోన్నారు.