50 లక్షలమందితో ఒకేసారి.. నిజమేనా ?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్నకొద్దీ రాష్ట్రంలో రాజకీయ వేడి  రోహిణి కార్తెను మించి పోతోంది. నిజానికి, మే 10న జరిగేది అసెంబ్లీ ఎన్నికలే అయినా ఈసంవత్సరం చివరి వరకు క్యూలో ఉన్నమరో ఆరేడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు, అలాగే, 2024 లోక్ సభ ఎన్నికలకు కర్ణాటక ఫలితం లిట్మస్ టెస్ట్  కావడంతో కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలను అన్ని పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అధికారాన్ని నిలుపుకునేందుకు బీజేపీ, చేజారిన అధికారాన్ని తిరిగి చేజిక్కించుకునేందుకు కాంగ్రెస్, అధికారం కోసం హంగ్ కలలు కంటున్న జేడీఎస్ ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. ఇందులో భాగంగా ప్రతి ఎన్నికను ప్రత్యేకంగా, ప్రతిష్టాత్మకంగా తీసుకునే మోడీ, షా జోడీ బీజేపీ భవిష్యత్ ను నిర్ణయించే కర్ణాటక అసెంబ్లీ ఎన్నికలపై సహజంగానే ప్రత్యెక దృష్టిని కేద్రీకరించింది.  2014లో చాయి పే చర్చ  తో మొదలు పెట్టి ప్రతి ఎన్నికల్లో ఒక ప్రత్యేక ప్రచార వ్యూహన్ని అమలు చేస్తున్న మోడీ,షా జోడీ ఈసారి ... అవునా.. నిజామా అనిపించేలా  కొత్త వ్యూహాన్ని అమలు చేసింది.  ప్రధాని నరేంద్రమోదీ ఒకేసారి 50 లక్షల మంది బీజేపీ కార్యకర్తలతో వర్చువల్‌గా మాట్లాడారు. నిజానికి కర్ణాటకలో బీజేపీ ఎదురీతుతోంది, అవినీతి ఆరోపణల నేపధ్యంలో కాంగ్రెస్ పార్టీ 40 శాతం కమిషన్ స్లోగన్ ప్రజలను ఆలోచింప చేస్తోంది. మరో వంక కాంగ్రెస్ ప్రభుత్వాలపై వచ్చిన అవినీతి ఆరోపణలను ఆసరా చేసుకుని అధికారంలోకి వచ్చిన బీజేపీ కర్ణాటకలో మాత్రం అవినీతి ప్రస్తావన లేకుండా, రాకుండా జాగ్రత్త పడుతోంది.   చివరకు ప్రధాని మోడీ, కార్యకర్తల మెగా మీట్ లోనూ అవినీతి అంశాన్ని ముట్టుకోలేదు. కానీ  బీజేపీ గెలుపుపై ధీమా వ్యక్తం చేశారు. అలాగే కాంగ్రెస్‌కు వారంటీ ముగిసిందని వ్యాఖ్యానించారు. వారంటీ ముగిసిన కాంగ్రెస్ మీకేం గ్యారెంటీ ఇస్తుందని వ్యంగ బాణాలు సందించారు.  అంతేకాదు, ఈ రోజు వర్చువల్’గా ఒకే సారి 50 లక్షల మంది కార్యకర్తలతో మాట్లాదిన మోడీ మరో రెండు రోజుల్లో మీ మధ్యకు వస్తాను. కన్నడ ప్రజల ఆశీస్సులు తీసుకుంటాను, అంటూ తనదైన స్టైల్లో ఇటు కార్యకర్తలను అటు ప్రజలను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. అలాగే  డబుల్ ఇంజిన్ సర్కార గురించీ మోడీ ప్రస్తావించారు. అభివృద్ధి కోసం డబుల్ ఇంజిన్ ప్రభుత్వం మాత్రమే వస్తే సరిపోదు. అది పూర్తి మెజార్టీతో ఉండాలి. దేశంలో మొదటి ఎయిమ్స్ 1956లో ప్రారంభమైంది. కానీ  ఆ తర్వాతది ఎప్పుడు వచ్చింది..?  దాని గురించి కాంగ్రెస్ ఏమీ మాట్లాడదు. మేం అధికారంలోకి వచ్చాం. ఎయిమ్స్‌ సంఖ్యను మూడు రెట్లు పెంచాం. ఇప్పుడు చెప్పండి డబుల్ ఇంజిన్‌ వల్ల లాభమా..? నష్టమా..? కాంగ్రెస్ అంటేనే ఒక అబద్ధపు గ్యారంటీ. కాంగ్రెస్ ఉంటే అవినీతికి గ్యారంటీ. ఎలాంటి గ్యారంటీ ఇవ్వలేని స్థితిలో కాంగ్రెస్ ఉంది. ఆ పార్టీ వారంటీ ముగిసింది అంటూ మోదీ విమర్శలు గుప్పించారు.  5 నిజానికి ప్రధాని నరేంద్ర మోదీ ఒకేసారి 50 లక్షల మంది కార్యకర్తలతో మాట్లాడడం ఎంతవరకు నిజమన్న దానిపై   కర్ణాటకలో విస్తృత చర్చ జరుగుతోంది. ఇక ప్రధాన ప్రతిపక్షం అయిన కాంగ్రెస్ పార్టీ కూడా ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నది. అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి సమయం తక్కువ ఉండటంతో బీజేపీ నాయకులు వీలైనంత త్వరంగా ఓటర్లను ఆకట్టుకోవడానికి, మరోసారి అధికారంలోకి రావడానికి అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే స్వరాష్ట్రం కావడంతో పాటుగా, కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ కు సవాలుగా నిలిచిన ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలిచేందుకు కాంగ్రెస్ పార్టీ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. బీజేపీ రాష్ట్రంలో అధికారంలో ఉండి కూడా ప్రధాని మోడీచరిష్మా, హోం మంత్రి అమిత్  షా వ్యూహరచన , సంఘ్ పరివార్ అడదందలపైనా ఆధార పడితే,  కాంగ్రెస్ పార్టీ స్థానికంగానే బీజేపీ  ఎదుర్కునేందుకు సిద్దమవుతోంది. అయినా రాహుల్ గాంధీ, ప్రియాంకా వాద్రా సహా కాంగ్రెస్ సీనియర్ నాయకులు కర్ణాటక పైన ప్రత్యేక దృష్టి  సారించారు. మరో వంక కర్ణాటకలో ఎలాంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కాకుండా చెయ్యాలని బీజేపీ నాయకులు అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే కన్నడిగులు ఎవరిని ఆదరిస్తారు ? అనే విషయం తేలాలంటే వచ్చే నెల 13 వరకూ ఆగాల్సిందే.

బీజేపీని దొంగ దెబ్బ కొట్టబోతున్న బీఆర్ఎస్

నిన్నటి వరకు తమకు ప్రధాన ప్రత్యర్థి బీజేపీ అన్న బీఆర్ఎస్ సడెన్ గా ప్లేటు మార్చింది. బీజేపీతో యుద్దం చేసి అలసిపోయినట్టుంది  బీఆర్ఎస్ నాయకత్వం. ఏకంగా ఎన్నికల స్ట్రాటజీ ని మార్చేసింది.  బీజేపీ మీద తీవ్ర ఆరోపణలు చేసిన బీఆర్ఎస్ ఈ కొత్త పల్లవి బీఆర్ఎస్ ప్లీనరీలో పురుడుపోసుకుంది. తెలంగాణలోనే కాదు దేశంలోని  అన్ని రాష్ట్రాల్లో బీజేపీ నామా రూపాలు లేకుండా చేయాలని బీజేపీ కలలు  కన్నది. బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా మూడో కూటమి ఏర్పాటు చేయడానికి బీఆర్ఎస్ అధ్యక్షుడు కే. చంద్రశేఖరరావు దేశమంతా అలుపుసొలుపు లేకుండా బొంగరంలా తిరిగారు.  మొన్న ఔరంగాబాద్ లో కూడా బీజేపీని టార్గెట్ చేశారు.  మోడీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. చేవెళ్ల సభలో అమిత్ షా చేసిన ప్రసంగాన్ని సీరియస్ గా  మరాఠాప్రజల ముందు పెట్టారు. రెండ్రోజుల్లో ఏమయ్యిందో తెలియదు కానీ  బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారకరామారావ్ మాట మార్చి కాంగ్రెస్ మీద విరుచుకుపడ్డారు. బీఆర్ ఎస్ ఆవిర్బావం  రోజు కూడా కేసీఆర్ బీజేపీ యేతర పార్టీలను ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీని కూడ దూరం పెట్టినప్పటికీ బీజేపీని మరీ దూరంగా పెట్టింది బీఆర్ ఎస్. మద్యం కుంభకోణంలో ఉన్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూతురు కవితను ముద్దు పెట్టుకుంటారా అని బీజేపీ చీఫ్ బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు అప్పట్లో వివాదాస్పదమయ్యాయి.  పదో తరగతి ప్రశ్నా పత్రం  లీకేజీ కేసులో బీజేపీని బీఆర్ఎస్ టార్గెట్ చేసింది.తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రశ్నా పత్రం లీకేజీ వ్యవహారంలో కేటీఆర్ హస్తముందని బీజేపీ ఆరోపించింది. యుపిలో గ్యాంగ్ స్టర్ అతీక్ కంటే కేసీఆర్ యమ డేంజర్ అంటూ బుధవారం  బండి సంజయ్  ట్వీట్ చేశారు. పచ్చ గడ్డి వేస్తే కూడా భగ్గుమనే స్థాయికి బీజేపీ, బీఆర్ ఎస్ రాజకీయాలు మారాయి.  ఔరంగా బాద్ తర్వాత బీఆర్ఎస్ తన ప్రత్యర్థి స్థాయి తగ్గిద్దామన్న నిర్ణయించుకున్నట్టు కనబడుతోంది. బీజేపీ స్థానే కాంగ్రెస్ తన ప్రధాన ప్రత్యర్థి అని స్టేట్ మెంట్ ఇచ్చింది.. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో 100 స్థానాల్లో బీజేపీకి డిపాజిట్లు గల్లంతు అవుతాయని గురువారం బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో కేటీఆర్ అన్నారు. దేశంలో  ఉన్న పొలిటికల్ వాక్యూమ్ ను 2024 లోకసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పూడుస్తుందన్నారు.  ప్రతీరోజు బీజేపీని విమర్శిస్తే దాని స్థాయి పెరుగుతోందని బీఆర్ఎస్ భావన. సైలెంట్ అయితే ప్రత్యర్థిని దొంగ దెబ్బ కొట్టవచ్చని కేసీఆర్ వ్యూహంగా కనిపిస్తోంది. మహరాష్ట్ర, కర్ణాటక, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాల్లో బీఆర్ఎస్ ని బలోపేతం చేయాలని  ఆయన ఆలోచనగా కనబడుతోంది. కాబట్టి ఇక్కడ కాంగ్రెస్ మీద ఫోకస్ పెడితే లాభపడవచ్చని కేసీఆర్ యోచిస్తున్నారు. 

అంతా నిజమే చెబుతున్నా.. నమ్మండి ప్లీజ్!

 కడప ఎంపీ అవినాష్ రెడ్డి వైఎస్ వివేకా హత్య కేసులో తనను, తన నాన్నను ఉద్దేశపూర్వకంగా ఇరికిస్తున్నారని మరో మారు ఆరోపించారు. మీడియా సమావేశంలో గతంలో పలుమార్లు చెప్పిన విషయాలనే ఆయన ఇంకో సారి ఆ సెల్ఫీ వీడియోలో చెప్పారు. మరోసారి మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఇవే విషయాలను చెబితే ప్రశ్నలను ఎదుర్కొన వలసి వస్తుందన్న భయంతోనే  సెల్ఫీ విడియో విడుదల చేశారని పరిశీలకులు అంటున్నారు. ఇంతా చేసి.. తన ముందస్తు బెయలుపై మరి కొద్ది సేపటిలో  తెలంగాణ హైకోర్టులో విచారణ జరగనుండగా, ఆ విచారణ అనంతరం అవినాష్ రెడ్డి అరెస్టు అనివార్యమన్న భావన సర్వత్రా వ్యక్తం అవుతున్న తరుణంలో వివేకా హత్య కేసుతో తనకు సంబంధం లేదని చెప్పుకోవడానికి చేసిన చివరి ప్రయత్నంగా అవినాష్ రడ్డి సెల్ఫీ వీడియోను విడుదల చేశారు. ఆ సెల్ఫీ వీడియోలో కొత్త విషయం ఏమీ లేదు. ఈ నాలుగేళ్లుగా  అవినాష్ ఏదైతే చెబుతున్నారో.. అదే చెప్పారు. ఎంత సేపూ వివేకా కుమార్తె సునీత, ఆమె భర్త తెలుగుదేశంతో కుమ్మక్కై ఈ కేసులో తనను ఇరికించారని చెప్పుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. అదే సమయంలో గతంలో చేసిన విధంగానే సీబీఐ దర్యాప్తు మొత్తం తననూ, తన తండ్రినీ టార్గెట్ చేసుకునే సాగిందని చెప్పుకొచ్చారు.  వివేకా హత్యకు గురయ్యారన్న సంగతిని తనకు చెప్పకుండా ఆయన మరణించారని సమాచారం ఇచ్చి తనను సంఘటనా స్థలానికి రప్పించారని ఆరోపించారు.  తాను ఘటనా స్థలానికి చేరుకునే లోగానే వివేకా రాసిన లేఖ, ఆయన ఫోన్ ను దాచేశారని చెప్పారు.  తాను చెబుతున్న కోణంలో సీబీఐ ఎందుకు విచారణ చేయడం లేదని ప్రశ్నించారు. అంతే కాకుండా ఈ విషయాల్నీ తాను గతంలో సీబీఐ డైరెక్టర్ కు కూడా తెలియజేశానని అన్నారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసీపీని దెబ్బకొట్టాలనే సునీతను అడ్డుపెట్టుకుని తెలుగుదేవం అధినేత ఇదంతా చేయిస్తున్నారంటూ ఆరోపించారు. అయితే ఈ సెల్ఫీ వీడియో తరువాత పరిశీలకులు పలు ప్రశ్నలు సంధిస్తున్నారు. గొడ్డలి పోటును గుండెపోటుగా చెప్పిందెవరో అవినాష్ సెల్ఫీ వీడియోలో ఎందుకు చెప్పలేదు? శరీరంపై గాయాలు కడిగి కుట్టు వేసి బ్యాండేజీ కట్టించిందెవరన్నదీ అవినాష్ ఎందుకు చెప్పలేదని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. అరెస్టును తప్పించుకునే దారులన్నీ మూసుకుపోయిన అనంతరం ఫ్రస్ట్రేషన్ లో లాజిక్ కు అందని ఆరోపణలు చేసి ప్రజల దృష్టిని మళ్లించడానికి అవినాష్ రెడ్డి చేసిన ప్రయత్నంగా సెల్ఫీ వీడియోను విశ్లేషిస్తున్నారు. 

జగన్ ప్రభుత్వానికి జాలిలేదు.. ఏపీ హైకోర్టు

హక్కుల రక్షణకు నడుం బిగించిన ఆంధ్రప్రదేశ్ మానవహక్కుల కమిషన్ ను ఆ రాష్ట్రప్రభుత్వమే తప్పుపడుతోంది. హై కోర్టు జడ్జి సారథ్యం వహించే హెచ్ఆర్సీ తీర్పులను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హైకోర్టులో సవాల్ చేస్తోంది. ఇటీవల ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున ఓ బాలిక మరణింపై వాదించిన ప్రభుత్వ న్యాయవాదులకు హైకోర్టు చీవాట్లు పెట్టింది. కుప్పం మునిసిపాలిటీపరిధిలో అంగన్ వాడీ ఆయా ఇచ్చిన ఆహారం తిని ప్రాణాలు కోల్పోయిన దీక్షిత అనే పాప కేసులో ప్రభుత్వం ప్రదర్శించిన అమానవీయతపై హైకోర్టు ఘాటుగా స్పందించింది.  2022 ఫిబ్రవరిలోలో కుప్పం మునిసిపాలిటీ పరిధిలోని ఓ పాఠశాలలో దీక్షిత అనే పాప ప్రాణాలు వదిలింది. అంగన్ వాడీ ఆయా పెట్టిన కోడుగుడ్డు తినడంతో దీక్షిత చనిపోయిందని ప్రాథమికంగా తేలింది. అప్పుడు మిగిలిన కోడిగుడ్లను పరిశీలించగా, అవి కుళ్లిపోయినవిగా నిర్ధారణ అయ్యింది. దీనితో దీక్షిత తల్లిదండ్రులు, బంధువులు ఆందోళనకు దిగారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో వారు నిరాశతో వెనుదిరిగారు. ఈ సంఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ హ్యూమన్ రైట్స్ కమిషన్ సుమోటోగా కేసు విచారణ చేపట్టింది.  దాదాపు పది నెలల పాటు సాగిన విచారణలో ప్రభుత్వం, సాంఘిక సంక్షేమ శాఖ ను దోషులుగా  తేలుస్తూ హెచ్ఆర్సీ తీర్పు ఇచ్చింది. దీక్షిత కుటుంబానికి ఎనిమిది లక్షల రూపాయలు నష్టపరిహారం ఇవ్వడమే కాక, బాధ్యులను గుర్తించి శాఖాపరమైన చర్యలు తీసుకోవాలని హెచ్చార్సీ ఆదేశించింది. అయితే హెచ్ఆర్సీ నిర్ణయంపై అప్పీలుకు వెళ్లాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ప్రభుత్వ న్యాయ సలహాదారుల సలహా మేరకు ప్రభుత్వం హెచ్చార్సీ తీర్పును సువాల్ చేస్తూ హైకోర్టు తలుపు తట్టింది. కేసు పూర్వాపరాలు పరిశీలించిన హైకోర్టు హెచ్చార్సీ తీర్పుపై ప్రభుత్వం ఎందుకు అప్పీలు చేయాల్సి వచ్చిందంటూ నిలదీసింది. అసలు ఇలాంటి కేసుపై అప్పీలు చేయడానికి మీకు మనసెలా ఒప్పిందిఅంటూ ప్రభుత్వ అడ్వొకేట్లను హైకోర్టు ప్రశ్నించింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ జయసూర్యలతో కూడిన బెంచ్ కుప్పం సంఘటన ప్రభుత్వ తప్పిదంగానే పరిగణించింది. పసి పాప ప్రాణాలు పోతే, ఆ వావుకు ప్రభుత్వం చే నియమించిన వారే కారణమైతే కేవలం ఎనిమిది లక్షల రూపాయల  నష్టపరిహారం చెల్లించేందుకు ప్రభుత్వం వెనక్కు తగ్గడాన్ని హై కోర్టు తీవ్రంగా తప్పు పట్టింది. పరిహారం చెల్లించాలని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పును మానవ హక్కుల వాదులు స్వాగతిస్తున్నారు.   

దేశం గూటికి శైలజానాథ్?

కాంగ్రెస్ పార్టీకి చెందిన పవర్ ఫుల్ నాయకులలో మాజీ మంత్రి సాకే శైలజానాథ్ ఒకరు.  ప్రభుత్వ విప్ గా పని చేసిన ఆయన సమైక్యాంధ్ర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఈ మధ్య ఆయన క్రీయాశీలక రాజకీయాలకు దూరంగా ఉంటున్నారు. అయితే రానున్న ఎన్నికల నేపథ్యంలో శైలజానాథ్ కాంగ్రెస్ పార్టీలో చురుకైన పాత్ర పోషించే అవకాశం ఉంది.        కాంగ్రెస్ పార్టీ కీలక నేత సాకే శైలజానాథ్ తో మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డితో సమావేశమయ్యారు. సాకే శైలజానాథ్ ను టీడీపీలోకి సాదరంగా ఆహ్వానించినట్లుగా చెబుతున్నారు. శింగనమల నంచి గతంలో రెండు సార్లు గెలిచిన శైలజానాథ్ మంత్రిగా కూడా పని చేశారు. ప్రస్తుతం శింగనమలలో టీడీపీ గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ కారణంగా ఇంకా ఇంచార్జిని కూడా నియమించలేదు. బలమైన అభ్యర్థి ఉండాలని.. తాము సూచించిన వారికే టిక్కెట్ ఇవ్వాలని జేసీ బ్రదర్స్ పట్టుబడుతున్నారు. దీంతో టీడీపీ హైకమాండ్ అక్కడ అభ్యర్థిత్వం ఎవరికి అన్నది ఖరారు చేయలేదు. ఈ క్రమంలో జేసీ .. శైలజానాథ్ తో చర్చలు జరపడం హాట్ టాపిక్ గా మారింది.కొంత కాలంగా శైలజానాథ్ టీడీపీలో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. పీసీసీ చీఫ్ పదవి కాలం పూర్తయిన తర్వాత శైలజానాథ్ కాంగ్రెస్ రాజకీయాల్లో యాక్టివ్ గా లేరు. వచ్చే ఎన్నికల్లో తాను శింగనమల నుంచే పోటీ చేయాలనుకుంటున్నానని శైలజానాధ్  ఇంతకుమునుపే ప్రకటించారు. అయితే, ఏ పార్టీ నుంచి అనేది మాత్రం త్వరలో చెబుతానంటూ వెల్లడించారు. ఇప్పటికే శైలజానాద్ టీడీపీ ముఖ్య నాయకత్వం తో టచ్ లోకి వెళ్లినట్లు సమాచారం. శైలజానాద్ 2004, 2009 ఎన్నికల్లో అప్పటి టీడీపీ సీనియర్ నేత శమంతమణి పైన విజయం సాధించారు. 2014లో టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత శమంతకమణికి ఎమ్మెల్సీగా అవకాశం ఇచ్చారు. 2014 ఎన్నికల్లో శంమతకమణి కుమార్తె యామినీ బాల టీడీపీ నుంచి ప్రస్తుత వైసీపీ ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి పైన విజయం సాధించారు.2019 ఎన్నికల్లో ప్రస్తుత టీడీపీ నియోజకవర్గ ఇంఛార్జ్ బండారు శ్రావణి పైన జొన్నలగడ్డ పద్మావతి గెలుపొందారు. వచ్చే ఎన్నికల్లో బండారు శ్రావణి టీడీపీ నుంచి తిరిగి సీటు ఆశిస్తున్నారు. శింగనమల నియోజకవర్గంలో కొంత కాలంగా టీడీపీలో విభేదాలు నెలకొన్నాయి. ఇప్పుడు శైలజానాద్ కు సీటు పైన హామీ దక్కుతుందా లేదా అనేది కీలకంగా మారింది.వచ్చే ఎన్నికల్లో గెలుపు గుర్రాలకే టిక్కెట్లు ఇస్తామని టీడీపీ నేతలు అంటున్నారు. అందుకే బలమైన నేతల్ని చేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. అనంతపురం పార్లమెంట్ నుంచి జేసీ దివాకర్ రెడ్డి కుమారుడు పోటీ చేసే అవకాశం ఉంది. బలమైన అభ్యర్థులు అసెంబ్లీ పరిధిలో ఉండాలని ఆయన కోరుతున్నారు. శైలజానాథ్ బలమైన అభ్యర్థి అవుతారని ఆయన అనుకుంటున్నారు.అనంతపురం జిల్లా ప్రజలు మద్దతిస్తే మొత్తం ఏకపక్షంగా ఒకే పార్టీకి మద్దతుగా నిలుస్తారు. 2014 ఎన్నికల్లో వైసీపీకి కేవలం రెండు సీట్లు మాత్రమే దక్కాయి. అదే 2019 ఎన్నికల్లో టీడీపీ రెండు సీట్లకే పరిమితం అయింది. వచ్చే ఎన్నికల్లో తిరిగి పార్టీ బలోపేతం దిశగా నియోజకవర్గాల వారీగా చంద్రబాబు కొన్నాళ్లుగా కసరత్తు చేస్తున్నారు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో లోకేష్ పాదయాత్ర విజయవంతం కావడంతో ఆ పార్టీ నేతలు సంతృప్తిగా ఉన్నారు.శైలజానాథ్ తెలుగు దేశంలో  చేరితే విజయావకాశాలు పార్టీలో  మెరుగుపడతాయని  రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.   

ప్రధాని రేసులో ప్రియాంక వాద్రా?

పీఎం ప్రియాంక వాద్రా .. ఇదీ కాంగ్రెస్ పార్టీలోని ఒక వర్గం తెరపైకి తెచ్చిన కొత్త అలోచన. కొత్త నినాదం. నిజానికి ఇది కొత్త ఆలోచన కూడా కాదు, చాలా కాలంగా రాజకీయ వర్గాల్లో ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీలో ప్రియాంకా వాద్రాకు కీలక బాధ్యతలు అప్పగించాలనే డిమాండ్ వినిపిస్తూనే వుంది. ఆ డిమాండ్ ఇప్పటి వరకూ అలా వచ్చి ఇలా...పోతూవచ్చింది.  నిజానికి, ప్రియాంక కూడా కాంగ్రెస్ పార్టీలో మరింత ‘కీ రోల్’ ప్లే చేసేందుకు... ఆసక్తి చూపించారు. 2019 ఎన్నికల్లో వారణాసి నియోజక  వర్గంలో ప్రధాని నరేంద్ర మోడీ మీద పోటీ చేసేందుకు కూడా ప్రియాంక రెడీ అయ్యారు. అయితే ఎందుకో  కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ అందుకు అంగీకరించ లేదు. అలాగే, 2019 ఓటమి తర్వాత రాహుల్ గాంధీ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేసి  కాడి వదిలేసిన సందర్భంలోనూ, పార్టీ పగ్గాలు ప్రియాంకకు అప్పగించాలనే ప్రతిపాదన వచ్చింది. అందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ కుడా ఇచ్చారు. అయితే రాహుల్ గాంధీ, ఫస్ట్ ఫ్యామిలీ బయటి వ్యక్తికే పార్టీ అధ్యక్ష బాధ్యతలు అప్పగించాలనే షరతు విధించడంతో ప్రియాంక ఆశకు రాహుల్  రెండవ సారి బ్రేకులు వేశారు   అయితే ఇప్పుడు రాహుల్ గాంధీ రాజకీయ భవిష్యత్ డోలాయమానంలో పడిన నేపధ్యంలో మరో మారు ప్రియాంక పేరు ప్రముఖంగా తెర మీదకు వచ్చింది. నిజానికి  భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీని ప్రతిపక్ష్లాల ప్రధాని అభ్యర్ధిగా నిలిపేందుకు, కాంగ్రెస్ పెద్దలు చాలా గట్టి ప్రయత్నమే చేశారు.  అయితే అనుకోకుండా మోడీ ఇంటి పేరు కేసు విచారణకు రావడంతో కథ అడ్డం తిరిగింది. సీన్ మారిపోయింది. రాహుల్ గాంధీకి సూరత్‌లోని ట్రయల్‌ కోర్టు రెండేళ్ళు జైలు శిక్ష విధించడం, ఆయనపై అనర్హత వేటు పడడం,లోక్ సభ సభ్యతం రద్దవడం చకచకా జరిగి పోయాయి.  ఈ నేపథ్యంలో ట్రయల్‌ కోర్టు తీర్పును రాహుల్‌ గాంధీ సూరత్ సెషన్స్ కోర్టులో సవాల్‌ చేశారు. రెండేళ్ల జైలు శిక్షను నిలుపుదల చేయాలని.. అలాగే తనను దోషిగా తేలుస్తూ ఇచ్చిన తీర్పును సైతం నిలిపివేయాలంటూ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై విచారణ చేపట్టిన కోర్టు.. ఆయనకు బెయిల్‌ మంజూరు చేసింది. కానీ శిక్ష నిలుపుదల చేయాలన్న అభ్యర్ధనను తిరస్కరించింది. దీంతో ఆరేళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు రాహుల్‌కు ఛాన్స్ లేదు. దీనిపై రాహుల్ హైకోర్టులో సవాల్ చేసినా.. ఆకేసు ఇప్పట్లో తేలే ఛాన్స్   కనిపించడం లేదు.  నిజానికి ఆదిలోనే హంసపాదు అన్నట్లుగా, కేసు విచారణకు రాక ముందే హై కోర్టులో  చుక్కెదురైంది. ఈ కేసు విచారణను జస్టిస్‌ గీతా గోపి ధర్మాసనానికి గుజరాత్ హైకోర్టు కేటాయించింది. అయితే, కేసు విచారణ బాధ్యతల నుంచి జస్టిస్‌ గీతా గోపి అనూహ్యంగా వైదొలిగారు. ఈ కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని హైకోర్టు రిజిస్ట్రీకి  ఆమె సూచించారు.  బుధవారం(ఏప్రిల్ 26) రాహుల్‌ గాంధీ దాఖలు చేసిన పిటిషన్‌ను ముందుగా విచారణ జరపాలని ఆయన తరఫు న్యాయవాది పీఎస్‌ చాపనెరి, జస్టిస్‌ గీతా గోపి ధర్మాసనానికి విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే కేసును మరో ధర్మాసనానికి బదిలీ చేయాలని ఆమె సూచించినట్లు తెలిపారు. మరో రెండు రోజుల్లో పిటిషన్‌పై ఏ ధర్మాసనం విచారణ చేపడుతుందన్న స్పష్టత వస్తుందని పీఎస్‌ చాపనెరి తెలిపారు. ఈ పరిణామాలను గమనిస్తే, రాహుల్ గాంధీ 2024 ఎన్నికల్లో పోటీ చేస్తారా? అన్నది సందిగ్ధంలో పడింది. ఈ నేపధ్యంలోనే రాహుల్ గాంధీ స్థానంలో ప్రియాంక వాద్రాను ప్రతిపక్షాల ప్రధాని అభ్యర్థిగా ప్రకటించాలనే ఆలోచన తెరపైకొచ్చింది. గాంధీ కుటుంబమ వీర విధేయుడిగా ఇంటా బయట గట్టిగా వాదించే  ప్రమోద్ కృష్ణ  పీఎం ..ప్రియాంక  ఆలోచనను, ప్రదిపాదనను తెర మీదకు తెచ్చారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో కొత్త చర్చ మొదలైంది. ఇటు రాయ్‌బరేలీ నుంచి సోనియా గాంధీ స్థానంలో అయినా.. లేకపోతే.. వయనాడ్ లోక్‌సభ స్థానం నుంచి అయినా ప్రియాంక గాంధీ పోటీ చేస్తారనే టాక్ వినిపిస్తోంది. ప్రియాంక గాంధీ 2019లో కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా క్రియాశీల రాజకీయాల్లోకి వచ్చారు.రాహుల్ గాంధీ చిక్కుల్లో పడటంతో  ప్రియాంక గాంధీకి పెద్దపీట వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అయితే.. ప్రస్తుతం ప్రియాంక గాంధీకి సంబంధించిన చర్చ అనవసరమని కాంగ్రెస్ నేత ఉదిత్ రాజ్ వ్యాఖ్యానించారు. ప్రియాంక గాంధీకి పార్టీలో ముఖ్యమైన పాత్ర ఉందని. రాహుల్ గాంధీ అత్యున్నత నాయకుడని.. మల్లికార్జున్ ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడని స్పష్టం చేశారు. అయితే, ప్రమోద్ కృష్ణ  తెరపైకి తెచ్చిన  పీఎం ..ప్రియాంక చర్చ ముందు ముందు ఇంకెన్ని మలుపులు తిరుగుతుందో..చూడవలసిందే అంటున్నారు.

వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్ల బిగింపునకే జగన్ సర్కార్ మొగ్గు

రాష్ట్రంలో వ్యవసాయ పంపు సెట్లకు స్మార్ట్‌ విూటర్లను బిగించేందుకు వైసీపీ ప్రభుత్వం సిద్ధమైంది. స్మార్ట్‌ విూటర్ల బిగింపునకు అవకాశంలేని చోట ఇన్ ఫా రెడ్‌ సమాచార ప్రామాణికం కలిగిన విూటర్లను ఏర్పాటు చేయనున్నారు. ఈ విూటర్ల బిగింపుతో పాటు బిల్లుల చెల్లింపును తొలుత రైతులే భరించాలని, ఆ తర్వాత వ్యవసాయ విద్యుత్‌ బిల్లుల మొత్తాన్ని నగదు బదిలీ పథకం కింద రైతుల బ్యాంకు ఖాతాలో జమ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏపీలో ఉచిత విద్యుత్‌ ఇస్తూనే విూటర్లను పెట్టే కార్యక్రమం చురుకుగా సాగుతోంది. విజయనగరంలో ఈ పథకం విజయవంతం అయ్యిందని ప్రభుత్వం చెబుతోంది. విూటర్ల బిగింపు వల్ల మంచి ఫలితాలు సాధించామని సిఎం జగన్‌ పలు సందర్భాల్లో ప్రకటించారు. అంతే గాకుండా విద్యుత్‌ ఆదా అయ్యిందని గుర్తించామని అన్నారు. ఈ క్రమంలో మిగతా జిల్లాల్లో కూడా దీనిని విస్తరించే పని జరుగుతోంది. విద్యుత్‌ ఉచితం అంటూనే రైతులపై అదనపు భారాన్ని వెూపబోతోందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నా  ప్రభుత్వం వెనక్కి తగ్గడంలేదు. ఇకపై వ్యవసాయ విద్యుత్‌ బిల్లులను రైతులు తమ జేబుల నుంచే చెల్లించాల్సిన పరిస్థితి రాబోతోందన్నభావన సర్వత్రా వ్యక్తమౌతోంది.   వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ సరఫరాలో కొత్తగా తెచ్చిన సంస్కరణలపై ఇంధన శాఖ కార్యదర్శి మార్గదర్శకాలను విడుదల చేశారు. ప్రత్యేకంగా ఏపీ హరిత ఇంధన కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశామని, ఈ విూటర్ల ద్వారా ప్రతి నెలా వచ్చే బిల్లును తామే చెల్లిస్తామని జీఓలో వెల్లడించారు. ఇలా వెల్లడిస్తూనే, మరోప్రక్క వ్యవసాయ పంపుసెట్లు ఏ నెలలో ఎంతెంత కరెంటు కాల్చుకొనే అవకాశం వుందో ప్రభుత్వం లెక్కగట్టింది. ఆ అంచనా ప్రకారం ఇప్పుడున్న  పంపు సెట్లు ఏడాదికి 12 వేల మిలియన్‌ యూనిట్ల విద్యుత్తు వాడే అవకాశం వుందని, ఆ విధంగా ఏటా రూ.8,400 కోట్ల సబ్సిడీని ప్రభుత్వం భరిస్తోందని, ఆ మొత్తాన్ని నెలవారీగా ప్రభుత్వం రైతుల ఖాతాల్లో వేస్తుందని జీఓలో వెల్లడించారు. కానీ అంతకుమించి వాడకం పెరిగితే ఆ భారం ఎవరు భరించాలన్నది మాత్రం చెప్పడంలేదు. అసలు విద్యుత్తు పంపిణీ సంస్థలకే సబ్సిడీ డబ్బులు సకాలంలో చెల్లించలేని ప్రభుత్వం భవిష్యత్ లో రైతుల ఖాతాల్లో నేరుగా డబ్బులు వేస్తుందనే గ్యారంటీ ఏమిటన్న ప్రశ్న రైతుల నుంచి వస్తోంది. దాదాపు 20 ఏళ్లుగా సాఫీగా అమలవుతున్న ఉచిత విద్యుత్తు పథకానికి కొర్రీలు వెయ్యాల్సిన అవసరం ఏమొచ్చిందని టిడిపి నిలదీస్తోంది. పైవేటు కంపెనీల ప్రయోజనం కోసమే వ్యవసాయ పంపుసెట్లకు విూటర్లు బిగిస్తున్నారని ఆరోపిస్తోంది. డిస్కమ్‌లను ప్రయివేటీకరణ చేసే ప్రణాళికలో భాగంగా ఈ విధానం తెస్తున్నారని చెబుతోంది.  దీనిని బట్టి కేంద్ర ప్రభుత్వం పెట్టిన షరతులను జగన్‌ సర్కార్‌ ఏమాత్రం వ్యతిరేకించకుండా వేగంగా అమలు చేస్తోందని , నగదు బదిలీ పథకాన్ని డిసెంబరులోగా అమలు చేయాలని సూచించగా రాష్ట్ర ప్రభుత్వం మాత్రం సెప్టెంబర్‌ నుంచే అమలు చేయాలని నిర్ణయించి, అందుకు శ్రీ కాకుళం జిల్లాను ఎంపిక చేసింది. విూటర్ల బిగింపునకు జగన్ సర్కార్ పరుగుతు ఎందుకని తెలుగుదేశం నిలదీస్తోంది.  పొరుగున ఉన్న తెలంగాణ ప్రభుత్వం ఈ నగదు బదిలీ పథకాన్ని తిరస్కరిస్తే ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం మాత్రం భుజానికెత్తుకుందని మండిపడ్డారు. అదనపు అప్పుకోసం కేంద్రం ఆడమన్నట్లల్లా ఆడుతూ రైతుల నోట్లో మట్టికొట్టేందుకు సిద్ధం కావడం అన్యాయమని విమర్శిస్తోంది. ఒక పక్క తండ్రి ఆశయాన్ని నెరవేరుస్తానంటూ, వైఎస్‌ పేరుతో రైతు దినోత్సవాలు జరుపుతూ, మరో పక్క ఆయన అమలుచేసిన ఉచిత విద్యుత్తు పథకానికి తనయుడు జగన్మోహన్‌ తూట్లు పొడవడం రైతులను వెూసం చెయ్యడం కాదా అని నిలదీస్తోంది. ఉచిత విద్యుత్తుకు స్వస్తి చెప్పే చర్యల్ని పరోక్షంగా అమలు చేస్తూ విూటర్లు బిగించడం పేరిట ఎన్ని వందల కోట్లు ఖర్చు చేస్తారని ప్రశ్నిస్తోంది. ఉద్యోగుల జీతాలు, పింఛన్లు ఇవ్వడానికే ఆపసోపాలు పడుతున్న ప్రభుత్వం మున్ముందు ఉచిత విద్యుత్తు బిల్లులు మాత్రం చెల్లిస్తుందన్న నమ్మకం ఏ మాత్రం లేదని,  ఒకసారి విూటరు బిగించి యూనిట్లు ప్రకారం బిల్లులు చెల్లించడం మొదలు పెడితే అది తమ మెడకు గుది బండ అవుతుందని రైతులు  ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

భావోద్వేగాల భవన్ మరి

ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ విడిపోయింది. కానీ ఆస్తి విభజన మాత్రం ఇంకా జరగడంలేదు.ఢిల్లీలోనిఆంధ్రాభవన్ మీద మళ్లీ కొత్త పేచీ మొదలైంది. ఆ భవన్ తో తమకు భావోద్వేగాలు ఉన్నాయని, కాబట్టి తమకే వదిలేయాలని తెలంగాణ అధికారులు ఆంధ్రప్రదేశ్ అధికారులకు అర్జీ పెట్టుకున్నారు.  ఢిల్లీలోని హైదరాబాద్ హౌస్‌కు ఆనుకుని ఉన్న ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌తో తెలంగాణ ప్రజలకు భావోద్వేగ సంబంధాలున్నాయని, కాబట్టి దానిని తమకు వదిలేయాలని ఏపీ అధికారులను తెలంగాణ అధికారులు కోరారు. దానిని తమకు ఇచ్చేస్తే పటౌడీ హౌస్‌లో తమకున్న ఏడెకరాలకు పైగా స్థలాన్ని తీసుకుని అక్కడ కొత్త భవనాన్ని నిర్మించుకోవాలని సూచించారు. తెలంగాణ ఏర్పాటు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో రెండు రాష్ట్రాల ఉమ్మడి స్థిరాస్తులను కేంద్రం పంచిపెట్టింది. ఈ నేపథ్యంలో ఏపీ-తెలంగాణ భవన్ విజభనకు సంబంధించి నిన్న రెండు రాష్ట్రాల అధికారులు సమావేశమయ్యారు. ఏపీ నుంచి ఎస్ఎస్ రావత్, ఆదిత్యనాథ్ దాస్, ప్రేమ చంద్రారెడ్డి, ఏపీ భవన్‌ అసిస్టెంట్ రెసిడెంట్ కమిషనర్ హిమాన్షు కౌషిక్ తదితరులు ప్రతినిధులుగా హాజరు కాగా, తెలంగాణ నుంచి రాష్ట్ర ఆర్థికశాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి రామకృష్ణారావు, తెలంగాణ భవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ హాజరయ్యారు. అశోకా రోడ్డులో ఉన్న ఆంధ్రప్రదేశ్-తెలంగాణ భవన్‌ను పూర్తిగా తమకు వదిలేయాలని తెలంగాణ అధికారులు కోరారు. దానితో తెలంగాణ ప్రజలకు విడదీయలేని భావోద్వేగ సంబంధాలు ముడిపడి ఉన్నాయని అన్నారు.కాగా, రాష్ట్ర విభజన సమయంలో ఉమ్మడి ఆస్తులను ఏపీ, తెలంగాణకు 52:48 నిష్పత్తిలో పంచారు. ఢిల్లీలోని అశోకా రోడ్డుతోపాటు శ్రీమంత్ మాధవరావు సింధియా మార్గ్‌లో కలిపి ఉభయ రాష్ట్రాలకు ఉమ్మడిగా 19.733 ఎకరాల భూమి ఉంది. ఈ మొత్తం భూమిలో అశోకా రోడ్డులోని ఏపీ-తెలంగాణ భవన్ 8.726 ఎకరాల్లో ఉండగా, దానిలో ఏపీ వాటా 4.3885 ఎకరాలు. దీని విలువ రూ. 1,703.6 కోట్లు. తెలంగాణ వాటా 4.3375 ఎకరాలు కాగా, దాని విలువ రూ. 1,694.4 కోట్లు. ఇక, 0.511 ఎకరాల రోడ్డులో రెండు రాష్ట్రాలకు 0.2555 ఎకరాల చొప్పున ఉంది. దీని విలువ రూ. 160 కోట్లు. తెలంగాణ కింద గోదావరి బ్లాక్‌లో 4.082 ఎకరాలు, ఏపీ కింద శబరి బ్లాక్‌ లో 4.133 ఎకరాలు ఉంది. ఈ నేపథ్యంలో రెండు రాష్ట్రాల భవనాలు ఒకే చోట ఉండకుండా పటౌడీ హౌస్‌లోని భూమిని ఏపీ తీసుకుని ఏపీ-తెలంగాణ భవన్‌ను తమకు వదిలేయాలని ఏపీ అధికారులను తెలంగాణ అధికారులు కోరారు. అందులో భాగంగా 58:42 నిష్పత్తిలో ఏపీకి దక్కాల్సిన భూమికి మార్కెట్ రేటు ప్రకారం ధర చెల్లించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నట్టు చెప్పారు. తెలంగాణ అధికారుల ప్రతిపాదనకు సానుకూలంగా స్పందించిన ఏపీ అధికారులు ఈ విషయంపై తమ సీఎం జగన్ మోహన్‌రెడ్డితో చర్చించాక నిర్ణయం చెబుతామని చెప్పినట్టు తెలుస్తోంది. దీంతో వచ్చేవారం మరోమారు సమావేశం కావాలని ఇరు రాష్ట్రాల ప్రతినిధులు నిర్ణయించారు.దీనిపై ఏపీ పెద్ద మనసుతో స్పందిస్తుందని ఆశిద్దాం..

కర్నాటకలో హంగా? కాంగ్రెస్సా? సీఓటర్ సర్వే

కర్ణాటక శాసనసభ ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గెలుపు ఎవరిది? రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేది ఎవరు అన్న ఆసక్తి ఒక్క కర్నాకటకే పరిమితం కాలేదు. సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ జరుగుతున్న ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై దేశ వ్యాప్తంగా ఆసక్తి కనిపిస్తోంది. అటువంటి తరుణంలో సీఓటర్  ప్రీపోల్ సర్వే  రాష్ట్రంలో  అత్యధిక స్థానాలలో విజయం సాధించి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ప్రస్ఫుటంగా ఉన్నాయని పేర్కొంది. అయితే అంతకు ముందు పీపుల్స్ పల్స్ ప్రీపోల్ సర్వే రాష్ట్రంలో హంగ్ అనివార్యం అని పేర్కొన్ననేపథ్యంలో తాజాగా సీ ఓటర్ సర్వే ప్రభుత్వ ఏర్పాటుకు  అవసరమైన స్థానాలను కాంగ్రెస్ గెలుచుకునే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని పేర్కొంది.  వచ్చె నెల 10వ తేదీన కర్నాటక అసెంబ్లీ ఎన్నికలు జరుగుతాయి. అదే నెల 13న ఓట్ల లెక్కింపు.. ఫలితాల విడుదల ఉంటుంది. ఈ నేపథ్యంలో కర్నాటకలో ఏ పార్టీ అధికారం చేపడుతుంది? ఏపార్టీ ప్రతిపక్షానికే పరిమితమౌతుంది అంటే.. ఇప్పటికిప్పుడు జనం నాడిని బట్టి హంగ్ వినా మరో అవకాశం లేదన్న ప్రచారానికి సీ ఓటర్  సర్వే  ఫుల్ స్టాప్ పెట్టేసింది.  రాష్ట్రంలో అధికార   బీజేపీ, ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ మధ్య పోటీ నువ్వా నేనా అనే విధంగా ఉంటుందని సర్వే పేర్కొంది. ఈ పోరులో కాంగ్రెస్ పార్టీ  భారీ ఆధిక్యత సాధించకపోయినా.. అధికార పగ్గాలు చేపట్టడానికి అవసరమైన స్థానాలలో విజయం సాధిస్తుందని పేర్కొంది.   వాస్తవానికి కర్ణాటకలో హంగ్ అసెంబ్లీ, సంకీర్ణ ప్రభుత్వాలు కొత్త కాదు. అలాగే, అలాంటి పరిస్థితి వచ్చిన ప్రతిసారీ జేడీఎస్  కీలకంగా మారుతోంది.  2018 ఎన్నికల తర్వాత కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. 224 మంది సభ్యులున్న సభలో బీజేపీ 106 స్థానాల్లో విజయం సాధించి, సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించింది. కానీ మేజిక్ ఫిగర్ (113) చేరుకోలేక పోయింది. దీంతో  78 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ మద్దతుతో కేవలం 37 సీట్లు మాత్రమే గెలిచిన జేడీఎస్ ముఖ్యమంత్రి కుర్చీ పట్టుకు పోయింది.   కుమార స్వామి ముఖ్యమంత్రిగా, జేడీఎస్, కాంగ్రెస్ సంకీర్ణ ప్రభుత్వం కొలువు తీరింది. ఆ తరువాత సంకీర్ణంలో చిచ్చు కారణంగా కుమార స్వామి సర్కార్ కూలిపోయింది.  15 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రాజీనామా చేసి బీజేపీలో చేరి, ఆ తరువాత ఉప ఎన్నికల్లో గెలిచారు. ఆ విధంగా సంవత్సరం తిరక్కముందే బీజేపీ పూర్తి మెజారిటీతో యడ్యూరప్ప ముఖ్యమంత్రిగా ప్రభుత్వం ఏర్పాటు చేసింది,  ఆతర్వాత యడ్యూద్యూరప్ప స్థానంలో బ‌స‌వ‌రాజు బొమ్మై ముఖ్యమంత్రిగా వచ్చారు. సరే, ఆ చరిత్రను అలా ఉంచితే, వచ్చే నెల జరగనున్న అసెంబ్లీ ఎన్నికలలో కూడా అదే పునరావృతం అయ్యే పరిస్థితి కనిపిస్తోందన్నది సీఓటర్ తాజా సర్వే  అంచనా వేస్తోంది. అయితే ఎడ్జి మాత్రం కాంగ్రెస్ కే ఉంటుందని ఆ సర్వే తేల్చింది. సీఓటర్ సర్వే ప్రకారం  కాంగ్రెస్ పార్టీ  రాష్ట్రంలో 106 నుంచి 116 స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే బీజేపీ  79  నుంచి 89 స్థానాలలోనూ, జేడీఎస్ 24 నుంచి 34 స్థనాలలోనూ విజయం సాధించే అవకాశం ఉంది.   ఇతరులు ఐదు స్థానాలలో విజయం సాధించే అవకాశం ఉంది. సీ ఓటర్ సర్వే కర్నాటక ఎన్నికలలో కాంగ్రెస్ కు ఎడ్జి ఇచ్చినప్పటికీ  గత ఎన్నికలతో పోలిస్తే ఓటింగ్ శాతాన్ని రానున్న ఎన్నికలలో గణనీయంగా పెంచుకోగలుగుతుందని పేర్కొన్నప్పటికీ  ఆ పార్టీ 106 నుంచి 116 స్థానాల్లో విజయావకాశాలున్నాయని పేర్కొనడం ద్వారా  హంగ్ అవకాశాలను తోసిపుచ్చలేమని కూడా  తేల్చినట్లైంది. 

కర్నాటకంలో పీసీసీ చీఫ్ ఓటమికి ఉమ్మడివ్యూహం ?

కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఒక్కటి  మినహా మిగిలిన 223 నియోజక వర్గాల్లో పోటీ చేస్తోంది. బీజేపీ మొత్తం 224 స్థానాల్లోనూ అభ్యర్ధులను బరిలో నిలిపింది. జేడీఎస్  కూడా ఈసారి మూడొంతులకు పైగా  పైగా స్థానాల్లో ఒంటిరిగా పోటీచేస్తోంది. అయితే, 10న జరిగే ఎన్నికల్లో ఎవరు ఎన్ని సీట్లు గెలుచుకుంటారు?  ఎవరు అధికారంలోకి  వస్తారు?  కింగ్ ఎవరు? కింగ్ మేకర్ ఎవరు? అనే చర్చ రాష్ట్రంలోనే కాదు, దేశం మొత్తంలో జోరుగా సాగుతోంది. సర్వేలు చెప్పే జోస్యాలు సర్వేలు చెపుతున్నాయి.  ఒక సర్వే బీజేపీకి ఎడ్జి ఉందంటే మరో సర్వే కాంగ్రెస్ దే పై చేయి అంటోంది. అయితే  ఎక్కువ సర్వేలు  హంగ్ అనివార్యమని అంటున్నాయి. చివరకు ఏమి జరుగుతుంది? కర్ణాటక ఓటరు తీర్పు ఏ విధంగా ఉంటుంది? అనేది మే 13 న తేలిపోతుంది.  అదలా ఉంటే... ఇటు బీజేపీ, అటు కాంగ్రెస్ ప్రత్యర్ధి పార్టీలను ఓడించడంతో పాటుగా, కొందరు కీలక నేతలు సొంత పార్టీలోని ప్రత్యర్ధులను ఓడిచడం పైనా కన్నేశారు. అలాగే  ప్రత్యర్ధి పార్టీలలో బలమైన నాయకులను ఓడించేందుకు అదే పార్టీలోని కీలక నేతలు ఉమ్మడి శత్రువును ఓడించేందుకు ఉమ్మడి వ్యూహాలతో పావులు కదుపుతున్నారు. ముఖ్యంగా, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను ఓడించేందుకు కాంగ్రెస్ పార్టీలోని కొందరు నేతలు బీజేపీతో చేతులు కలిపినట్లు ప్రచారం జరుగుతోంది. ఆ వ్యూహంలో భాగంగానే   బీజేపీ అధికారాన్ని నిలుపుకోవడంతో పాటుగా, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్ ను ఓడించడంపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించిందని ఆపార్టీ నాయకులు బహిరంగంగానే చెపుతున్నారు. డీకేకు సవాలు విసురుతున్నారు.  అమేథిలో రాహుల్ గాంధీని వదలని మేము నిన్ను వదిలేస్తామని అనుకుంటున్నావా అంటూ కేపీసీసీ అధ్యక్షుడిని ఓ బీజేపీ సీనియర్ నేత హెచ్చరించడం కర్ణాటక పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది. నిజానికి, డీకే శివకుమార్ పోటీలో లేకుండా చేసేందుకు కూడా బీజేపీ కొన్ని చట్టబద్ధ  ప్రయత్నాలు చేసిందనే ప్రచారం జరిగింది.  ఆయనపై ఉన్న అవినీతి కేసులను సాకుగా చూపించి, కనకపుర రిటర్నింగ్ ఆఫీసర్ ఆయన నామినేషన్ తిరస్కరించే అవకాశం ఉందని ప్రచారం జరిగింది. అందుకే ముందు జాగ్రత్తగా డీకే సోదరుడు  బెంగళూరు రూరల్‌ ఎంపీ డీకే సురేష్‌ కూడా ఆఖరి క్షణంలో  నామినేషన్‌ దాఖలు చేశారు. అయితే  డీకే నామినేషన్ ఆమోదం పొందడంతో ఆయన బరిలో నిలిచారు.అయితే బీజేపీ మాత్రం కనకపురా నియోజకవర్గంలో డీకేను ఎలాగైనా ఓడించాలనే పట్టుదలతో ఉందని, అందుకే డీకే మీద పోటీకి  ఆయనకు అన్ని విధాల సమ ఉజ్జీగా నిలిచే  మంత్రి ఆర్.అశోక్ ను బరిలో దించిందని అంటున్నారు.   నిజానికి, బెంగళూరు నగర శివార్లలో ఉన్న కనకపుర అసెంబ్లీ నియోజక వర్గం డీకే కంచుకోట. ఇప్పటికే వరసగా  మూడు సార్లు గెలిచిన ఈ నియోజక వర్గలో నాలుగో సారి గెలవడం డీకేకు నల్లెరుమీద నడక అనే విషయంలో ఎవరికీ అనుమానం లేదు. అయితే, ముఖ్యమంత్రి రేసులో ఉన్నశివకుమార్ ను ఓడించేందుకు కాంగ్రెస్ లోనే ఒక వర్గం గట్టిగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా మాజీ ముఖ్యమంత్రి సిద్దరామయ్య వర్గం డీకే ను ఓడిస్తే, ఇక తమ నేతకు తిరుగుండదని  ఆ దిశగా పావులు కదుపుతోందని డీకే అనుచర వర్గంలో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. నిజానికి సిద్దరామయ్యకు బీజేపీ ముఖ్యనేతలతో సన్నిహిత సంబంధాలున్నాయి. గతంలో కాంగ్రెస్, జేడీఎస్ సంకీర్ణ ప్రభుత్వం కూలి, బీజేపీ అధికారంలోకి రావడం వెనక ‘సిద్ద’ హస్తం ఉందని అంటారు.  సరే అదలా ఉంటే కారణాలు ఏవైనా కనకపురాలో డీకే ఓడించేందుకు బీజేపీ గట్టి ప్రయత్నాలు చేస్తోంది. మంత్రి ఆర్. అశోక్ ను గెలిపించాలని బీజేపీ నాయకులు ఇప్పటికే కనకపురలో   ప్రచారం ముమ్మరం చేశారు. కర్ణాటక మాజీ మంత్రి సీటీ. రవి కనకపురలో ఆర్. అశోక్ ను గెలిపించాలని ఎన్నికల ప్రచారం చేశారు. సీటీ. రవితో పాటు స్థానిక బీజేపీ నాయకులు పెద్ద సంఖ్యలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.  ఈ సందర్బంగా బీజేపీ నేత సీటీ. రవి మాట్లాడుతూ అమేథిలో వరుసగా ఎంపీగా విజయం సాధిస్తున్న రాహుల్ గాంధీకి 2019లో జరిగిన లోక్ సభ ఎన్నికల్లో మేము సినిమా చూపించామని అన్నారు. అమేథి నియోజక వర్గంలో మీ నాయకుడు రాహుల్ గాంధీనే మేము వదల్లేదు. కనకపురలో నిన్ను వదిలేస్తామా అంటూ. రవి కేపీసీసీ అధ్యక్షుడు డీకే. శివకుమార్ కు నేరుగానే సవాల్ విసిరారు. అయితే ఇది ఒక విధంగా శివకుమార్ పై మానసిక వత్తిడి పెంచి ఆయన్ని నియోజక వర్గంనికి పరిమిత చేసేందుకు బీజేపీ రవి ప్లే చేసిన  ట్రిక్ అయినా కావచ్చని, అయినా, ఇప్పటికే మొత్తం ఏడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి, మూడు సార్లు మంత్రిగా పనిచేసిన పీసీసీ చీఫ్ ను ఓడించడం అంత ఈజీ వ్యవహారం కాదని, అలాగే,ఆయన నియోజకవర్గానికి పరిమితం చేయాలనుకోడం కూడా అయ్యేపనికాదని పరిశీలకులు అంటున్నారు. అయితే, కాంగ్రెస్ లోని డీకే వ్యతిరేక వర్గం బీజేపీతో నేరుగా చేతులు కలిపితే మాత్రం డీకే గెలుపు నల్లేరుమీద బండి నడక కాకపోవచ్చనీ పరిశీలకులు అంటున్నారు.

పేపర్‌ లీక్ లో కెటిఆర్‌ను బర్తరఫ్‌ చేయాల్సిందే.. రేవంత్

బీఆర్ఎస్, బీజేపీలవి కుమ్మక్కు రాజకీయాలని రేంవంత్ విమర్శించారు. బీఆర్ఎస్ సర్కార్ పై తన విమర్శల తీవ్రతను టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పెంచారు.  పేపర్‌ లీక్ ఘటనలో కేటీఆర్‌ ను బర్తరఫ్‌ చేయడంతో పాటు సిట్టింగ్‌ జడ్జితో విచారణ జరిపించాలన్న డిమాండ్ ను పునరుద్ఘాటించారు. రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగులకు ఒక్కొక్కరికి లక్షా 60 వేల నిరుద్యోగ భృతి ఇవ్వాలన్నారు. ఆదిలాబాద్‌లో నిరుద్యోగ నిరసన ర్యాలీలో  ఆయన బీఆర్ఎస్ హయాంలో టీఎస్పీఎస్సీ ప్రశ్నా పత్రాలు   బజార్లో అమ్ముకునే పరిస్థితి వచ్చిందన్నారు. ప్రజలలో టీఎస్పీఎస్సీపై విశ్వాసం లేకుండా పోయిందన్నారు.   తెలంగాణకు పట్టిన కొరివి దయ్యం కేసీఆర్‌  అన్న రేవంత్ ఆయనను  రాష్ట్ర పొలిమెరల వరకు తరిమి కొట్టాలని పిలుపునిచ్చారు.  రాష్ట్రం వచ్చినప్పుడు లక్షా 7 వేల ఉద్యోగ ఖాళీలు ఉంటే.. ఆ సంఖ్య ఇప్పుడు 2 లక్షలకు పైగా ఉందన్నారు.  కేసీఆర్‌ కుటుంబంలో అందరికీ ఉద్యోగాలు వచ్చాయి కానీ.. కష్టపడి చదివిన పేద విద్యార్థులకు ఉద్యోగాలు రాలేదన్నారు. రాష్ట్రంలో కేసీఆర్‌ కుటుంబం  తప్ప ప్రజలు బాగుపడలేదన్నారు. ఆదిలాబాద్‌ కు జోగు రామన్న చేసిందేమి లేదన్న రేవంత్ ఆయనను కూడా  రాజయ్య తరహాలోనే   బర్తరఫ్‌ చేయాలన్నారు. కొత్త సంవత్సరంలో రాష్ట్రంలో  కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడుతుందని.. అప్పుడు కాంగ్రెస్  ఆదిలాబాద్‌ను దత్తత తీసుకుంటుందని హావిూ ఇచ్చారు.   ప్రశ్నాపత్రాలు అమ్ముకున్న బండి సంజయ్ ఒక్క రోజులోనే జైలు నుంచి బయటకు ఎలా వచ్చారని రేవంత్‌ ప్రశ్నించారు. రాష్ట్రంలో బీజేపీ, బీఆర్‌ఎస్‌ కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నాయని విమర్శించారు. ముస్లిం రిజర్వేషన్లను రద్దు చేస్తానన్న అమిత్‌ షా వ్యాఖ్యలపై ఓవైసీ అసదుద్దీన్‌ ఓవైసీ ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. ఆదిలాబాద్‌ లో 10 స్థానాలు గెలిపిస్తే..రాష్ట్రంలో 90 సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.  

వైఎస్ కుటుంబం మద్దతు సునీతకే

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో జగన్ కుటుంబం నిట్టనిలువునా చీలిపోయింది. నిందితుల్ని కాపాడటానికి అధికారాన్ని పూర్తి స్థాయిలో దుర్వినియోగం చేస్తున్న జగన్ కు కుటుంబం దాదాపుగా దూరమైపోయింది. దీంతో ఆయన, ఆయన కాపాడటానికి ప్రయత్నిస్తున్న వారు..సొంత కుటుంబ సభ్యులపైనే నిందారోపణలు చేస్తున్నారు. ఆ నిందారోపణలతో కుటుంబం పరువు గంగలో కలుస్తున్నా పట్టించుకోవడం లేదు. వివేకా హత్య జరిగిన నాలుగేళ్ల తరువాత ఒక సారి విషయావలోకన చేస్తే.. జగన్ సొంత కుటుంబ సభ్యులెవరూ జగన్ కు మద్దతుగా నిలబడటం లేదని విస్ఫష్టంగా తేలిపోతోంది. అంతే కాకుండా వారు సునీతకు అండగా నిలిచారనీ,  వివేకా హత్య కేసు విషయంలో సునీతకు మద్దతుగా నిలవడమే కాదు.. జగన్ కాపాడటానికి ప్రయత్నిస్తున్నవారు చేస్తున్న నిందారోపణలలోని డొల్లతనాన్ని బయటపెడుతూ.. అసలు వాస్తవాలు బహిరంగంగా, మీడియా ముఖంగా చెబుతూ బయటకు వస్తున్నారు.   వైఎస్ వివేకాపై కడప ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన తండ్రి భాస్కరరెడ్డి చేస్తున్నవన్నీ అసత్య ఆరోపణలేనని కుండ బద్దలు కొడుతున్నారు. ఈ విషయంలో జగన్ కు తోడబుట్టిన సోదరి  షర్మిల అవినాష్ ప్రభృతులు చేస్తున్నవన్నీ తప్పుడు ఆరోపణలేనని కుండ బద్దలు కొట్టారు. ఆ  ఆరోపణలను నిర్ద్వంద్వంగా ఖండించారు.   దీంతో వైఎస్ కుటుంబం మొత్తం సునీతకు అండగా ఉంటే.. జగన్ ఒక్కడూ కుటుంబానికి దూరమై.. ఆరోపణలు ఎదుర్కొంటున్న నిందితులవైపు నిలిచారన్నది విస్పష్టంగా తేలిపోతున్నది.  ఇక తాజాగా బుధవారం (ఏప్రిల్ 26) మీడియాతో మాట్లాడిన వైఎస్ షర్మిల తన బాబాయ్ వివేకానందరెడ్డి హత్య ఆస్తి కోసం చేసిందనడంలో ఏ మాత్రం వాస్తవం లేదని కుండబద్దలు కొట్టారు.   ఆస్తికోసమే అయితే.. సునీతను హత్య చేస్తారు కానీ బాబాయ్ వివేకానందను కాదని చెప్పారు.   అలాగే..  వివేకా గొప్ప వ్యక్తి అని, మంచి ప్రజా నాయకుడని అన్నారు. ప్రజలందరికీ  సదా అందుబాటులో ఉంటూ ప్రజాసేవ చేశారని చెప్పారు.  అలాంటి వ్యక్తి గురించి కొందరు వ్యక్తులు, కొన్ని విూడియా సంస్థలు, వైసీపీ సోషల్ మీడియా విషప్రచారం చేయడం దారుణమన్నారు. మన మధ్య లేని వ్యక్తి గురించి తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు.  హత్యకు ఆస్తులు కారణం కాదని.. కడప ఎంపీ సీటు కోసమే హత్య జరిగిందనీ షర్మిల అన్నారు. ఒకవేళ ఆస్తులే హత్యకు కారణమైతే వివేకాను కాకుండా సునీతను చంపేవాళ్లని చెప్పారు.  

జగన్ రోడ్డు ప్రయాణాలెందుకు చేయరో అర్ధమైపోయింది!

వైఎస్ జగన్.. ఎప్పుడో నాలుగేళ్ల కిందట విపక్ష నేతగా జనంలో తిరిగారు. నెత్తిన చేతులు వేశారు. ప్రజలకు ముద్దులు పెట్టారు. వాగ్దానాలతో అరచేతిలో వైకుంఠం చూపించారు. అంతే అధికారం చేపట్టిన ఈ నాలుగేళ్లలో ఆయన మళ్లీ జనం ముందుకు వచ్చింది లేదు. బటన్ నొక్కేందుకు సభలు పెట్టి ప్రసంగాలు చేసినా ఆయన పర్యటనలన్నీ వాయు మార్గంలోనే.. ఆఖరికి తాడేపల్లి ప్యాలెస్ నుంచి మంగళగిరి వెళ్లాలన్నా హెలికాప్టర్ ఎక్కాల్సిందే. అయితే ఇంత కాలం ఆయన విమానయానాలు, వాయు మార్గ పర్యటనలకు కారణం అధికార దర్పం అని అంతా అనుకున్నారు. విమర్శలు గుప్పించారు. అయితే ఆయన తన పర్యటనలకు రోడ్డు మార్గాన్ని ఎంచుకోకపోవడానికి కారణమేమిటో ఇప్పుడు అందరికీ తెలిసిపోయింది. తన హయాంలో జనం అష్టకష్టాలూ పడుతున్నారనీ, వారిలో తన పాలనపై ఆగ్రహం పతాక స్థాయికి చేరిందనీ రోడ్డు మార్గాన వెళితే ఎక్కడికక్కడ తనను నిలువరించి, నిలదీస్తారనీ భయంతోనే ఆయన రోడ్డు మార్గాన్ని పూర్తిగా వదిలేశారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు అడుగుపెడితే హెలికాప్టర్ ఎక్కాల్సిందే . కానీ తాజాగా ఆయన అనంతపురం జిల్లాలోని నార్పలలో జగనన్న వసతి దీవెన కార్యక్రమంలో పాల్గొని పుట్టపర్తికి బయల్దేరే సమయంలో  హెలికాఫ్టర్‌లో సాంకేతిక లోపం ఏర్పడింది. దీంతో ఆయన అనివార్యంగా, తప్పని పరిస్థితుల్లో  రోడ్డు మార్గంలో పుట్టపర్తికి బయలు దేరారు. ఆయన పర్యటనలో జరిగిన ఈ మార్పు చివరిక్షణం వరకూ ఎవరికీ తెలియదు. కానీ ఆయన రోడ్డు మార్గంలో వెడుతుంటే.. పొలాల్లో పని చేసుకుంటున్న రైతులు పరుగుపరుగుల రోడ్ల మీదకు వచ్చేశారు. ఆయనపై అభిమానంతో జయజయధ్వానాలు చేయడానికి కాదు. తమ సమస్యలపై నిలదీయడానికి.  తమ నిరసనను తెలియజేయడానికి.  ఇళ్ల స్థలాల కోసం పొలాలకు పరిహరం డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేయడానికి. అవును జగన్ కు ప్రజా నిరసన అనుభవం లోకి వచ్చింది. ఆయన రోడ్డు మార్గాల వెళుతుంటే జనం ఆయన కాన్వాయ్ కి అడ్డుపడ్డారు. ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. తమ కష్టాలను ఏకరవు పెట్టారు. సరే యథాప్రకారంగా పోలీసులు వారిని ఈడ్చి అవతల పారేశారనుకోండి అది వేరే సంగతి. ఇంతకూ జగన్ కాన్వాయ్ కు అడ్డం పడి మరీ నిరసన వ్యక్తం చేసిన వాళ్లెవరో తెలుసా.. వారంతా  వైసీపీ సానుభూతిపరులు. ఔను నిజం జగన్ కాన్వాయ్ కు ధర్మవరంలో వైసీపీ సానుభూతి పరులే అడ్డం పడ్డారు. మిమ్మల్ని నమ్మి నట్టేట మునిగామంటూ శాపనార్ధాలు పెట్టారు.   పేదల ఇళ్ల కు టిడ్కో ఇళ్లు నిర్మించడానికి గత ప్రభుత్వం భూములు సేకరించింది. అప్పుడు ఎకరానికి ఐదు లక్షల పరిహరం ఇచ్చింది. అయితే  అప్పట్లో వైసీపీ నేతల మాటలు  నమ్మి..  ఆ  పార్టీ సానుభూతిపరులు మరింత పరిహారం కోసం కోర్టులను ఆశ్రయించారు. సామాన్య రైతులు మాత్రం అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన పరిహారం తీసుకున్నారు.  పరిహారం చాలదంటూ కోర్టుకు వెళ్లిన వారి పరిమారాన్ని అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం కోర్టులో జమ చేసింది. అప్పట్లో తాము అధికారంలోకి వచ్చాకా  పరిహారం పెంచి ఇస్తామని వైసీపీ అప్పట్లో వాగ్దానం చేసింది.   అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చాక పైసా పరిహారం పెంచకపోగా… అసలు పట్టించుకోవడం మానేశారు .   ధర్మవరం ఎమ్మెల్యే కేతిరెడ్డి ప్రభుత్వం నుచి పైసా కూడా మంజూరు చేయించలేక మొహం  చాటేస్తున్నారు.   ఇప్పడు ఆ పరిహారం కోసమే రైతులు ముఖ్యమంత్రి కాన్వాయ్ కు అడ్డం పడ్డారు.  ఇలాంటి నిరసనలను ఎదుర్కొన వలసి వస్తుందని తెలుసు కనుకనే జగన్ రోడ్డు మార్గంలో ప్రయాణాలు చేయడం లేదని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఒక్క ధర్మ వరం నియోజకవర్గం అని కాదు.. రాష్ట్రంలోని 175 నియోజకవర్గాలలో ఏ నియోజకవర్గానికి వెళ్లినా ప్రజల నుంచి ముఖ్యమంత్రికి ఇటువంటి మర్యాదే వస్తుందని, ఇందుకు ఆయన సొంత నియోజకవర్గం పులివెందుల కూడా మినహాయింపు కాదనీ అంటున్నారు. అందుకే జగన్ అనివార్యంగా రోడ్డు మార్గంలో వెళ్ల వలసి వస్తే పరదాలు కట్టి జనాలకు ఆయన కనబడకుండా అన్ని జాగ్రత్తలూ తీసుకుంటున్నారని చెబుతున్నారు. 

కేసీఆర్‌కు రోజులు దగ్గరపడ్డాయంటున్న గద్దర్‌

తెలంగాణలో బీఆర్ఎస్ హవాకు, కేసీఆర్ పాలనకు రోజులు దగ్గరపడ్డాయని ప్రజా యుద్ధ నౌక గద్దర్ అన్నారు. ఇందిరాపార్క్‌ వద్ద టీ సేవ్‌ ఆధ్వర్యంలో నిరుద్యోగ నిరాహార దీక్షలో షర్మిలతో పాటు పాల్గొన్న గద్దర్ ప్రసంగించారు.   విూకు దమ్ముంటే సీబీఐ విచారణ చేయించండని అన్నారు. వైఎస్‌ షర్మిల తెలుగు తల్లి, తెలంగాణ బిడ్డ అని కవి గద్దర్‌ పేర్కొన్నారు.  నిరుద్యోగులకు ఉద్యోగాల కోసమే  షర్మిల ప్రభుత్వంపై  పోరాడుతోందని అన్నారు. అప్పులు చేసి కోచింగ్‌లు తీసుకుంటున్న విద్యార్థులు ప్రభుత్వ తీరు వల్ల ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. షర్మిల ఆత్మరక్షణ కోసం పోలీసులతో  ఒకింత దురుసుగా ప్రవర్తించారనీ అందులో తప్పుపట్టాల్సిందేమీ లేదన్నారు. తాను వైఎస్సార్టీపీలోనే కాదు ఏ పార్టీలోనూ లేనని స్పష్టం చేశారు.  ప్రభుత్వ వైఫల్యాలపై పోరాడుతున్నందునే షర్మలకు మద్దతుగా నిలిచానన్నారు.   యువత రాజకీయ శక్తిగా మారితేనే మార్పు సాధ్యమవుతుందని గద్దర్‌ అన్నారు. షర్మిల అలా మారినందుకే ఆమె పోరాటాలను అణిచివేయాలని  తెలంగాణ సర్కార్ చూస్తోందని గద్దర్ విమర్శించారు.  కేసీఆర్‌కి ఇవే చివరి ఎన్నికలని గద్దర్‌ వ్యాఖ్యానించారు.  'సర్కార్‌ కళ్ళు తెరిపించేందుకే నిరుద్యోగుల కోసం కొట్లాట' అనే నినాదంతో  చేపట్టిన ఈ దీక్షలో  షర్మిల   టీసేవ్‌ నిరుద్యోగ నిరాహార దీక్ష ఆపాలని ప్రయత్నంలో భాగంగానే తనను అరెస్ట్‌ చేశారని ఆరోపించారు. ఒక్క మహిళను అడ్డుకోవడానికి మొత్తం పోలీస్‌ ఫోర్స్‌ దిగిందని మండిపడ్డారు.  సిట్‌ ఆఫీస్‌కు వెళ్తుంటే అనవసర రాద్ధాంతం చేశారని విమర్శించారు.  నేను పోరాటం చేస్తున్నది నిరుద్యోగుల కోసం. తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాల కోసం అన్నారు.   కేసీఆర్‌ కుటుంబం మొత్తం స్కాంలలో కూరుకుపోయిందని విమర్శించారు. కేసీఆర్‌ వాటర్‌ స్కాం, బిడ్డ లిక్కర్‌ స్కాం, కొడుకు టీఎస్‌పీఎస్సీ పేపర్‌ స్కాంకు పాల్పడ్డారని ఆరోపించారు. సి టీఎస్‌పీఎస్సీ పేపర్‌ లీకేజ్‌లో ఐటీ లోపాలు ఉన్నాయన్నారు. పేపర్‌ హ్యాక అయ్యిందని స్వయంగా చైర్మన్‌ చెప్పారన్నారు. ఇదేనా ఐటీ శాఖ భద్రత అని ప్రశ్నించారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ టీఎస్‌పీఎస్సీకి పారదర్శకత ఉందంటారని.. పేపర్‌ లీక్ అయ్యేసరికి తనకేం సంబంధం లేదని అంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.  

ఏడుకొండల పైన కొత్తా దేముడు.. ఎవరో తెలుసా?

ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, హిందూ ధర్మ వ్యతిరేకి అయినా కాకున్నా, హిందువు అయితే కాదు.  ఇది జగమెరిగిన సత్యం. ఆయన కుటుంబ చరిత్రే అందుకు సాక్ష్యం. అయితే ఆయన దేవుని పాలనలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తే, ఆయన హిందూ ధర్మ వ్యతిరేకి అనేందుకు సందేహించవలసిన అవసరం లేదు  అని హిందూ ధార్మిక సంస్థలు, స్వాములు, స్వామీజీలు ఎప్పటినుంచో చెపుతున్న మాట చేస్తున్న ఆరోపణ. ఒక విధంగా హిందూ సమాజం వ్యక్తం చేస్తున్న   ధర్మాగ్రహం. ఇప్పుడు, ఆ ధర్మాగ్రహ వాణిలో  ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రియ స్వామీజీ  శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామీజీ  సైతం గొంతు కలిపారు.  సింహాచలం చందనోత్సవంలో చోటుచేసుకున్న అవకతవకల పై స్వామీజీ ఆగ్రహం వ్య్తక్తం చేశారు. నాజీవితంలో ఇలాంటి చందనోత్సవాన్ని చూడలేదన్నారు. సంప్రదాయాన్ని మంట గలిపేసారని స్వామిజీ ఆవేదన, ఆగ్రహం వ్యక్తం చేశారు.  నిజానికి స్వామీజీ ఇప్పుడే ఆగ్రహం వ్యక్తపరిచినా, జగన్మోహన్ రెడ్డి పాలనలో పనిగట్టుకుని హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన సంఘటన ఇదొకటే కాదు. జగన్మోహన రెడ్డి అధికారంలోకి వచ్చింది మొదలు, ఎన్నెన్ని దేవాలయాల మీద దాడులు జరిగాయో, ఎక్కడెక్కడ దేవుని ఆస్తులు అన్యాక్రాంత మయ్యాయో. చివరకు ఏడుకొండల వెంకన్నదేవుని సన్నిధిలో  అన్యమత ప్రచారం మొదలు, ఇంకెన్ని అకృత్యాలు జరుగుతున్నాయో చూస్తూనే ఉన్నాం.. వింటూనే ఉన్నాం. వైఖానస ఆగమ శాస్త్రాన్ని, ఆచార వ్యవహారాలను పక్కన పెట్టి టీటీడీ ఇష్టారాజ్యంగా తీసుకుంటున్న నిర్ణయాలు భక్తులను ఆవేదనకు గురిచేస్తున్నాయి. ఏడుకొందలపై  ఆగమ శాస్త్ర విరుద్ధంగా డ్రోన్లు సంచరించడం మొదలు, ఇటీవల టీటీడీ నియామకాలలో అన్యమతస్తులకు రిజర్వేషన్ కల్పిస్తూ టీటీడీ తీసుకుంటున్న  నిర్ణయాల వరకు టీటీడీ  అపచారాలకు లెక్కలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే హిందూ ధర్మ రక్షణ కోసం ఏర్పడిన టీటీడీ ధర్మ విరుద్ధ చర్యలకు నిలయంగా మారిందని భక్తులు, హిందూ ధర్మ సంస్థలు ఎన్నో మార్లు ఆరోపించాయి. ఆగ్రహం వ్యక్తం చేశాయి.  అంతే కాదు, తిరుమలను ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రభుత్వం, టీటీడీ ఒక వ్యాపార కేంద్రంగా మార్చి వేసిందనే ఆవేదన భక్తులు పదే పదే వ్యక్తపరుస్తూనే ఉన్నారు. ప్రసాదం ధర మొదలు వసతి గదుల అద్దెల వరకూ దొరికినంత దోచుకో  పద్దతిలో టీటీడీ దోపిడీకి పాల్పడుతోందని, భక్తులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆర్జిత సేవల విషయం అయితే చెప్పనే అక్కర లేదు. అదే సమయంలో భక్తులకు సమకూరుస్తున్న సదుపాయాలు నిర్వహణ గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచింది.  స్వామి దర్శనం కోసం క్యూ కాంప్లెక్స్ లో గంటలు తరబడి నిరీక్షించే భక్తుల ఆకలి  దప్పికలు తీర్చేందుకు  గతంలో సమయానుకూలంగా ప్రసాద వితరణ జరిగేది. ఇప్పడు అది లేదు. కనీసం జల ప్రసాదం కూడా  అందుబాటులో ఉండడం లేదని భక్తులు ఆరోపిస్తున్నారు. అలాగే క్యూ కాంప్లెక్స్ లో పారిశుధ్యం  లేకుండా పోయింది,  దుర్వాసనలు భరిస్తూ స్వామి స్వామి దర్శనానికి నిరీక్షించ వలసి వస్తోందని భక్తులు అంటున్నారు. నిజానికి, ఒక్క ఏడు కొండలవాడి విషయంలోనే కాదు అప్పన్న దేవుని విషయంలోనూ అపచారాలకు కొదవలేదని అంటున్నారు. సింహాచలం చందనోత్సవంలో భక్తులకు సరైన సదుపాయలు కల్పించక పోవడం, అందుకు సంబదించి శారదాపీఠాధిపతి శ్రీ స్వరూపానంద సరస్వతీ స్వామీ సైతం ఆగ్రహం వ్యక్తం చేయడం ఒకెత్తు అయితే, ఇక్కడా ఆగమ శాస్త్ర ఉల్లంఘన జరిగిందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. అప్పన దేవుని నిజరూప దర్శనం వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం తీవ్ర విమర్శలకు దారితీసింది. ఆగమ శాస్త్రానుసారం స్వయంభూ మూర్తుల వీడియో, ఫొటో తీయకూడదు. అయితే  గత సంవత్సరం ఆ తప్పు జరిగింది. అదే తప్పు ఈ సంవత్సరం మళ్ళీ జరిగింది. గత ఏడాది ఘటనపై దేవస్థానం అధికారులు సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ప్రకటించినా దర్యాప్తు జరిగిన దాఖలాలు లేవు. ఈ అలసత్వం వల్లే ఈ ఏడాది కూడా అదే అపచారం పునరావృతమైందని దేవస్థానంలో చర్చ జరుగుతోంది. ఇదంతా ఒకెత్తు అయితే, గోవింద నామ స్మరణ తప్ప మరో పేరు వినిపించడమే అపచారంగా భావించే తిరుమల కొండపైన ఏకంగా రాజకీయ జెండాలు, స్టిక్కర్లు దర్శనం ఇస్తున్నాయని భక్తులు ఆవేదన వ్యక పరుస్తున్నారు. వెంకన్న  స్వామి మీద భక్తి విశ్వాసాలతో కొండెక్కిన భక్తులకు కొత్తా దేవుడు (మా నమ్మకం నువ్వే జగనన్న) స్టిక్కర్లు దర్శనం  ఇవ్వడం ఏమిటని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇది దేవుని పట్ల అపరాధం మాత్రమే కాదు, చట్టరీత్యా నేరమని అంటున్నారు. రాజకీయ పార్టీల జెండాలు, నినాదాలు రాసున్న స్టిక్కర్లు, చివరకు రాజకీయ పార్టీల గుర్తులున్నచేతి సంచీలు, రాజకీయ ప్రచార సామాగ్రి ఏదీ కొండమీదకు తీసుకురరాదని, టీటీడీ నియమాలే ఘోషిస్తున్నాయి. అందుకే ఇంతవరకు ఎన్నికల సమయంలోనూ తిరుమల కొండలపై ఏ రాజకీయ పార్టీ కూడా పార్టీ గుర్తులతో ప్రచారం చేసిన సందర్భం లేదు. కానీ ఇప్పడు ఏకంగా  మా నమ్మకం నువ్వే జగనన్న  స్టిక్కర్లు అంటిస్తున్నారు. అయినా టీటీడీ అధికారులు, పోలీసులు, విజిలెన్స్అధికారుల ఎవరూ పట్టించుకోవడం లేదు.ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని భక్తులు ఆవేదనతో కూడిన ఆగ్రహం వ్యక్త పరుస్తున్నారు. మరో వంక ఇది ఇలాగే సాగితే రేపు మాడ వీధుల్లో, అన్న ప్రసాద కేంద్రం, కళ్యాణ కట్ట ఇలా ఎక్కడంటే అక్కడ రాజకీయ జెండాలు, నినాదాలు దర్శననమిస్తాయని హిందూ ధార్మిక సంస్థలు అంటున్నాయి. ఈ నేపధ్యంలోనే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అన్యమత వ్యాప్తికి ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకారం అందిస్తున్నారని హిందూ ధార్మిక సంస్థలు చేస్తున్న ఆరోపణలకు మరింత బలం చేకురుస్తోందని,ఇప్పటికైనా ప్రభుత్వం, టీటీడీ కళ్ళు తెరవక పోతే, వైసీపీని ఏ దేవుడు రక్షించలేరని ... భక్తులు, హిందూ ధార్మిక సంస్థలు హెచ్చరిస్తున్నాయి.

బెజవాడలో ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవం

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు నందమూరి తారక రామారావు శతజయంతి ఉత్సవాలు  శుక్రవారం (ఏప్రిల్ 28)  విజయవాడ నగరంలో జరగనున్నాయి. నగర శివారులోని పెనమలూరు నియోజకవర్గ పరిధిలో తాడిగడపలో 100 అడుగుల రోడ్డులోని అనుమోలు గార్డెన్స్‌ వేదికగా ఈ జయంతి వేడుకలు జరగనున్నాయి. అందుకు సంబంధించి భూమి పూజా కార్యక్రమం మంగళవారం (ఏప్రిల్ 25) ఎన్టీఆర్ శత జయంతి కమిటీ చైర్మన్ టీడీ జనార్దన్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది.  గత ఏడాది మే 28వ తేదీన ప్రారంభమైన ఎన్టీఆర్ శతజయంతి వేడుకలు.. ఈ ఏడాది మే 28వ తేదీతో ముగియనున్నాయి. అలాంటి వేళ.. బెజవాడలో జరగనున్న శత జయంతి వేడుక ఓ ప్రత్యేకతను సంతరించుకొంది. ప్రముఖ పాత్రికేయుడు వెంకట నారాయణ రచించిన ఎన్టీఆర్ చారిత్రక ప్రసంగాలు , అసెంబ్లీ ప్రసంగాలు పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. అలాగే ఎన్టీఆర్ శతజయంతి సంవత్సరం నేపథ్యంలో తరతరాలకు ఆయన గుర్తుండిపోయేలా 'జయహో ఎన్టీఆర్' అన్న వెబ్‌సైట్, 'శకపురుషుడు' అనే ప్రత్యేక సంచికను సైతం తీసుకువస్తున్నారు. కథానాయకుడు ప్లస్ మహానాయకుడు ఎన్టీఆర్ శతజయంతి వేడుకలకు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజినీ కాంత్, టీడీపీ ఎమ్మెల్యే, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ హాజరుకానున్నారు. ఎన్టీఆర్ యాప్‌ను టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ప్రారంభించనున్నారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు వస్తున్నారు. తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా.. ఇతర రాష్ట్రాల్లోని ఎన్టీఆర్ అభిమానులు, తెలుగుదేశం శ్రేణులు  ఈ వేడుకలకు పెద్ద ఎత్తున తరలి రానున్నారు.  మరోవైపు ఈ ఏడాది ఎన్టీఆర్ శత వసంతాలు పూర్తి చేసుకొంటున్న తరుణంలో దేశ విదేశాల్లో ఆయన అభిమానులు పెద్ద ఎత్తున వివిధ సేవా కార్యక్రమాలు సైతం చేపడుతున్న సంగతి తెలిసిందే. నందమూరి తారక రామారావు జన్మదినం మే 28. ఈ సందర్బంగా తెలుగుదేశం పార్టీ మహానాడు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఆ క్రమంలో ఈ ఏడాది రాజమహేంద్రవరం వేదికగా మహానాడు నిర్వహిస్తున్నారు. గతేడాది ప్రకాశం జిల్లా ఒంగోలు వేదికగా మహానాడు నిర్వహించిన సంగతి తెలిసిందే.

విజయమ్మ, షర్మిలకు పోలీసుల వార్నింగ్!

కనిపించే మూడు సింహాలు.. చట్టానికి, న్యాయానికి, ధర్మానికి ప్రతీకలు అయితే.. కనిపించని ఆ నాలుగో సింహమే రా  పోలీసు.. పోలీసు... అంటూ పోలీస్ స్టోరీలో డైలాగ్ కింగ్ సాయి కుమార్ చెప్పే డైలాగులో.. పోలీసుల్లోని అంకితభావం, వారిలో ప్రజల కోసం శ్రమించే తత్వం, నీతి నిజాయితీ, అలాగే అవసరమైతే ప్రజల రక్షణ కోసం ఆత్మార్పణకు సైతం  వెనకడుగు వేయని ధైర్య సాహసాలు..తదితర అర్థాలు ప్రతిధ్వనిస్తాయి. అయితే నిత్యం ప్రజల మధ్య ఉంటూ.. వారి బాగోగులతోపాటు... సమాజంలో శాంతి భద్రతలు పరిరక్షించే క్రమంలో సదరు పోలీసులపై విమర్శలు సైతం  వెల్లువెత్తుతుండడమే కాకుండా.. వారిపై దాడులకు సైతం తెగబడుతుండడం ఓ విపరీత పరిణామం అని చెప్పవచ్చు.  ఇక హైదరాబాద్ మహానగరంలో పోలీస్ ఉద్యోగం అంటే కత్తి మీద సాము కిందే లెక్క. విధి నిర్వహణలో వారు తీవ్ర మానసిక ఒత్తిడికి లోనవుతోన్న సందర్భాలు అనేకం ఉన్నాయి.. ఉంటున్నాయి. అయితే విధుల్లో ఉన్న పోలీసులపై  వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైయస్ షర్మిల, అలాగే ఆమె తల్లి వైసీపీ మాజీ గౌరవ అధ్యక్షురాలు  విజయమ్మ.. దాడి చేయడం.. అందుకు సంబంధించిన వీడియోలు.. అటు మీడియాలో.. ఇటు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.  అయితే ఈ ఘటనపై హైదరాబాద్ నగర పోలీసు  అధికారుల సంఘం అధ్యక్షుడు నల్లా శంకర్ రెడ్డి స్పందించారు. ఎంతో బాధ్యతాయుతంగా.. శాంతి భద్రతలల్లో భాగంగా విధులు నిర్వహిస్తున్న పోలీసులపై వైఎస్ షర్మిల, వైఎస్ విజయమ్మ దాడి చేయడాన్ని ఆయన ఖండించారు. ఇలాంటి చర్యలతో  పోలీసుల్లో ఆత్మాభిమానాన్ని దెబ్బ తీస్తూ పోలీసుల సహనాన్ని పరీక్షించకూడదని హెచ్చరించారు.   విజయమ్మ,   షర్మిల చర్యలపై ఆత్మ విమర్శ చేసుకోవాలన వారిద్దరికి ఈ సందర్భంగా నల్లా శంకర్ రెడ్డి సూచించారు. సమాజంలో శాంతిభద్రతల పర్యవేక్షణ, నేరాలను అదుపు చేయడంలో తెలంగాణ పోలీసులు దేశంలోనే అత్యున్నత గుర్తింపు ఉందని ఆయన ఈ సందర్భంగా  గుర్తు చేశారు. అలాగే ఈ మధ్య కాలంలో కొంత మంది రాజకీయ నాయకులు.. వ్యక్తిగత గుర్తింపు కోసం అందునా గతంలో ఎంతో బాధ్యతాయుత పదవులు నిర్వర్తించిన వారు కూడా వ్యక్తిగత ప్రాచుర్యం కోసం ఇలాంటి చౌకబారు చర్యలతో పోలీసుల మనోధైర్యాన్ని దెబ్బ తీయడానికి ప్రయత్నిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.    షర్మిల సోమవారం సిట్ కార్యాలయాన్ని ముట్టడించిన తర్వాత.. టీ సేవ్ నిరాహారధీక్షలో భాగంగా ప్రతిపక్ష పార్టీ నేతలను కలిసి మద్దతు కోరాలని   నిర్ణయించారు. అందులోభాగంగా ఇంటి నుంచి షర్మిల బయలుదేరుతుండగా.. పోలీసులు బారీ ఎత్తున మోహరించి.. ఆమెను అడ్డుకొనే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలో వారిపై వైయస్ షర్మిల చెయ్యి చేసుకున్నారు. అనంతరం ఆమెను జూబ్లీహిల్స్ పోలీస్‌స్టేషన్‌కు తరలించి.. పలు సెక్షన్ల కింద ఆమెపై కేసు నమోదు చేశారు. అయితే పోలీసు స్టేషన్‌లో ఉన్న తన కుమార్తెను కలిసేందుకు ఆమె తల్లి   విజయమ్మ వచ్చారు. పోలీస్ స్టేషన్‌లోకి వెళ్లకుండా ఆమెను పోలీసులు అడ్డుకోవడంతో వైయస్ విజయమ్మ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. మహిళా పోలీసులపై చెయ్యి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల పట్ల  షర్మిల, వైయస్ విజయమ్మ వ్యవహరించిన తీరుపై పోలీస్ అధికారులు సంఘం అధ్యక్షుడు నల్లా శంకర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

రంగులు మారుతున్న రాజకీయం

ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. కడప జిల్లాలో రాజకీయం మాత్రం రంగులు మార్చుకొంటోంది.  రాజకీయ ముఖ చిత్రాన్ని నిసిగ్గుగా రాత్రికి రాత్రే రంగులు మార్చుకొంటోన్న తీరును చూసి ఉసరవెల్లి సైతం సిగ్గుతో తలవంచుకోనేటట్లుగా ఉందనే అభిప్రాయం అయితే పోలిటికల్ సర్కిల్‌లో వాడి వేడిగా ఊపందుకొంది.  తాజాగా ఉమ్మడి కడప జిల్లాల్లోని ప్రోద్దుటూరు పట్టణంలో పలు కూడళ్లు, ముఖ్య ప్రాంతాల్లో రాజకీయ రంగ ప్రవేశం చేయనున్న వైఎస్ సునీతకు స్వాగతం.. సుస్వాగతం అంటూ పోస్టర్లు ముద్రించి.. అతికించారు. అంతేకాదు.. సదరు పోస్టర్లకు పసుపు రంగు పూసి.. వాటిపై జై తెలుగుదేశం అని ముద్రించడమే కాకుండా... సదరు పోస్టర్లల్లో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అచ్చెన్నాయుడు, బీటెక్ రవి, మరోవైపు ఆమె తండ్రి వైయస్ వివేకానందరెడ్డి, ఇంకోవైపు ఆమె భర్త ఎన్ రాజశేఖర్ రెడ్డి ఫొటోలను ముద్రించారు. అయితే రాత్రికి రాత్రి ఈ పోస్టర్లు.. పట్టణంలోని పలు ప్రాంతాల్లో దర్శన మివ్వడంపై పట్టణంలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వర్గాలలో   తీవ్ర చర్చనీయాంశంగా మారింది.  వైయస్ వివేకా హత్య కేసులో ఇప్పటికే కడప ఎంపీ  అవినాష్ రెడ్డి తండ్రి వైయస్ భాస్కరరెడ్డిని సీబీఐ అధికారులు అరెస్ట్ చేసి.. చంచల్‌గూడ జైలుకు తరలించారు. అలాగే ఈ కేసులో నేడో రేపు అవినాష్ రెడ్డిని సైతం సీబీఐ అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయనే ప్రచారం ఊపందుకొంది. అలాంటి వేళ   సునీత రాజకీయ రంగ ప్రవేశం అంటూ ఇలా ప్రోద్దుటూరు పట్టణం వేదికగా పోస్టర్లు దర్శనం కావడం పట్ల స్థానికంగా విస్మయం వ్యక్తమవుతోంది. అంతే కాదు ఇంత కాలం వైయస్ సునీత రాజకీయాల్లోకి వస్తారని.. టీడీపీ అభ్యర్థిగా కడప లోక్‌సభ స్థానం నుంచి  బరిలోకి దిగుతారంటూ ఓ ప్రచారం అయితే గతం నుంచి సాగుతోంది. కానీ ఈ అంశంపై  సునీత పెదవి విప్పిందీ లేదన్న సంగతి అందరికీ తెలిసిందే. అలాగే తన తండ్రి  వివేకా హత్య కేసులో పాత్రదారులే కాదు.. సూత్రధారులు సైతం బయటకు రావాలనే ఆమె బలంగా కోరుకోంటోంది. అంతే కానీ ఈ హత్య కేసులో సూత్రధారులు వీళ్లు అంటూ ఫలానా వారి పేర్లు ఆమె ఎక్కడా ప్రకటించలేదన్న విషయం విదితమే.  కానీ రాత్రికి రాత్రి ఇలా పోస్టర్లు అతికించడం.. అదీ   సునీత పేరుతో.. ఇలా.. ఎవరు .. ఎందుకు .. ఇదంతా చేస్తున్నారనేది మాత్రం అంతుబట్టని రహస్యంగా మారింది. అయితే తన తండ్రి హత్య కేసులో నిందితులకు   శిక్ష పడాలంటూ న్యాయ పోరాటానికి ఆమె దిగడాన్ని జీర్ణించుకోలేని కొన్ని బలమైన శక్తులు ఏకమై.. ఈ రకమైన ఎత్తుగడల ద్వారా..   సునీతను ప్రజలకు, బంధువులకు సాధ్యమైనంత దూరం ఉంచాలన్న లక్ష్యంతో ప్రణాళికా బద్దంగా ఆమె ప్రత్యర్థి వర్గం శ్రీకారం చుట్టిందని.. ఆ క్రమంలో ఇటువంటి ఘటనలు మరిన్ని చోటు చేసుకోన్నా.. ఆశ్చర్య పోనక్కర్లేదనే చర్చ   పోలిటికల్ సర్కిల్స్ లో జోరుగా సాగుతోంది.