నేను చూడను.. నేను వినను దాకా.. జగన్ కొత్త పంధా
posted on Apr 28, 2023 @ 11:50AM
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి.. ప్రజలలోకి వెళ్లడం అటుంచి వారు ఆయనకు తమ సమస్యలను ఫోన్ ద్వారా నివేదించేందుకు కూడా అవకాశం ఇవ్వడం లేదు. ముఖ్యమంత్రిగా పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందు.. జగన్ నిత్యం ప్రజలతో మమేకమై తిరిగారు. పాదయాత్ర పేరుతో ఆయన జనానికి ముద్దులు పెట్టారు. అడుగుకో వాగ్దానం చేసేశారు.
అయితే అధికారం చేపట్టిన తరువాత మాత్రం ఆయన జనానికి ముఖం చాటేశారు. వారి వద్దకు వెడితే పాదయాత్రలో తాను ఇచ్చిన వాగ్దానాల గురించి అడుగుతారన్న జంకు అయి ఉంటుందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. బటన్ నొక్కుడు కార్యక్రమాల కోసం ఎంపిక చేసిన ప్రాంతాలలో వేదికపై నుంచి ప్రసంగాలు చేసినా.. ఆయా సందర్భాలలో కూడా ఆయన జనానికి దూరంగానే ఉంటున్నారు. అంతెందుకు ముఖ్యమంత్రి ప్రసంగాలు వినేందుకు జనంలో ఆసక్తి కనిపించడం లేదు. అందుకే బటన్ నొక్కి ఆయన ప్రసంగం ప్రారంభించగానే గట్లు తెంచుకుని వరద నీరు పారినట్లు.. సభా ప్రాంగణం నుంచి జనం గుంపులు గుంపులుగా బయటకు వెళ్లిపోతున్నారు.
దీంతో ఐప్యాక్ సలహాతో ఆయన ఒక కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టాలని నిర్ణయించారు. అదే జనం తనకు కనబడకుండా.. జనానికి తాను కనబడకుండా ‘జగనన్నకు చెప్పుకుందాం’ పేరు మీద ఓ కాల్ సెంటర్ ప్రారంభించేందుకు నిర్ణయించారు. అంటే జనం తమ సమస్యలను నేరుగా జగన్ కు చెప్పుకునేలా ఫోన్ చేసేందుకు అవకాశం ఇవ్వడమన్నమాట. ఈ నెల 13 నుంచి ‘జగనన్నకు చెప్పుకుందా’ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ప్రారంభం కాలేదు.
అసలు ఎప్పుడు ప్రారంభం అవుతుందన్న విషయంపై కూడా ప్రభుత్వం నుంచి ఎలాంటి సమాచారం లేదు. నువ్వే మా నమ్మకం జగన్ అంటూ ప్రారంభించిన స్టిక్కర్ల కార్యక్రమం ఘోరంగా విఫలం కావడంతో ఈ కాల్ సెంటర్ ప్రారంభించే ధైర్యం వైసీపీ అధినేత చేయలేకపోతున్నారని విపక్షాలు ఎద్దేవా చేస్తున్నాయి. స్టిక్కర్ల కార్యక్రమంలో వైసీపీ నేతలు ఇలా వచ్చి స్టిక్కర్ అంటించి వెళ్లగానే ఆ స్టిక్కర్ ను ఆ ఇంటి వాళ్లు అలా పీకేస్తున్న దృశ్యాలు సామాజిక మాధ్యమంలో వైరల్ కావడంతో కంగుతిన్న జగన్ సర్కార్ ఇప్పుడు ఫోన్ ద్వారా సమస్యలు నివేదించే అవకాశాన్ని ప్రజలకు ఇస్తే.. విపక్ష నేతగా ఉండగా జగన్ ఇచ్చిన హామీల గురించి నిలదీతలకే ఆ కార్యక్రమం పరిమితమౌతుందన్న భయం అధికార పార్టీలో నెలకొందని పరిశీలకులు అంటున్నారు. అందుకే ప్రభుత్వం వెనక్కు తగ్గిందంటున్నారు.