కాంగ్రెస్ కు బీఆర్ఎస్ నిధులు
posted on Apr 28, 2023 @ 12:42PM
బీఆర్ఎస్ పై మరోసారి విరుచుకుపడ్డారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో కొత్త రాజకీయ సమీకరణాలకు తెరతీసే విధంగా బీఆర్ ఎస్ వ్యవహరిస్తున్నట్టు కనబడుతోంది. పైకి కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ లోపల అదే పార్టీని బీఆర్ ఎస్ ను ప్రోత్సహిస్తుందా అనే అనుమానాలు తెరలేచాయి. వచ్చే ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తమ పార్టీకి ప్రధాన శత్రువు అని బీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్టేట్ మెంట్ ఇచ్చిన 24 గంటల్లో పూర్తి విరుద్ద ప్రకటన చేశారు బండి సంజయ్. కర్ణాటక ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బండి ఈ కొత్త ఆరోపణ చేశారు. బీఆర్ఎస్ జాతీయ రాజకీయాల్లో అడుగిడిన తర్వాత పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ చాలా తెలివిగా వ్యవహరిస్తున్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ ప్రచారానికి బీఆర్ఎస్ నిధులు సమకూరుస్తుందని బండి ఆరోపించారు. ఒక్కో వోటుకు పది వేల రూపాయలను కాంగ్రెస్ పంచుతుందని ఆయన వాదన. 2019లో కాంగ్రెస్ యేతర , బీజేపీ యేతర కూటమి అయిన ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక పాత్ర పోషించిన కేసీఆర్ ప్రస్తుతం నేరుగా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయడం ఏమిటా అని రాజకీయ విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తూనే ఎవరికీ అనుమానం రాకుండా కేటీఆర్ బీఆర్ఎస్ ప్లీనరీలో కాంగ్రెస్ ను విమర్శించారని వాళ్లు అనుకుంటున్నారు. కాంగ్రెస్ కేంద్రంలో, రాష్ట్రంలో అధికారంలో లేదు కాబట్టి కాంగ్రెస్ కు వోటు వేస్తే ఎలాంటి ప్రయోజనం లేదని మురికి కాల్వలో వోటు పడేసినట్టేనని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి.కర్ణాటక బాగేపల్లి నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి మునిరాజ్ పోటీ చేస్తున్నారు.ఈ అభ్యర్థిని ఓడించడానికే బీఆర్ఎస్ నిధులు సమకూరుస్తుందనే ఆరోపణ ఉంది. మహరాష్ట్ర ఎన్నికలతో బాటు కర్ణాటక ఎన్నికలలో బీజేపీ ప్రచారాన్ని అడ్డుకోవడానికి బీఆర్ఎస్ ఎప్పటికప్పుడు తన స్ట్రాటజీని మారుస్తున్నట్లు కనబడుతుంది. బండి సంజయ్ ఆరోపిస్తున్నట్టుగా కర్ణాటక ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ నిధులు పుష్కలంగా నిధులు సమకూర్చడానికి కారణాలలో బీజేపీని ఓడించడమే అనేది సుస్పష్టమవుతుంది. కాంగ్రెస్ పార్టీకి తెరవెనుక బీఆర్ఎస్ సపోర్ట్ చేస్తుంది.
టీఆర్ఎస్ నుంచి బీఆర్ఎస్ గా రూపాంతరం చెందిన పార్టీకి నిధుల సమస్య కూడా లేనట్టు కనబడుతుంది. కేవలం వడ్డీలే రూ 767 కోట్ల రూపాయలు వస్తాయని ప్లీనరీ సమావేశంలో పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ అంగీకరించారు. రూ 1, 250 కోట్ల రూపాయల బ్యాంకు డిపాజిట్లు బీఆర్ఎస్ వద్ద ఉన్నాయి. ఈ నిధులతోనే పార్టీ కార్యకలాపాలకు తెలంగాణేతర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ వెచ్చిస్తుంది. పంజాబ్ రైతులకు ఆర్థిక సహకారం అందించడంతో పాటు ఇటీవలె మహరాష్ట్ర ఔరంగాబాద్ లో భారీ ఖర్చులు చేసింది ఈ నిధుల నుంచే. ఢిల్లీ, పంజాబ్ , మహరాష్ట్ర తదితర రాష్ట్రాలలో భారీగా యాడ్స్ రిలీజ్ చేసింది బీఆర్ఎస్. నిధుల కొరత లేదు కాబట్టి బీఆర్ఎస్ భారీగా నిధులు వెచ్చిస్తున్నట్టు కనబడుతోంది. 2021లో బీఆర్ఎస్ వద్ద కేవలం రూ 425 కోట్ల రూపాయల ఫిక్స్ డ్ డిపాజిట్లు ఉండేవి. రెండుకోట్ల రూపాయలు వడ్డీ వచ్చేది. అప్పట్లో ఈ వడ్డీతోనే బీఆర్ఎస్ ఒక దినపత్రిక , చానెల్ నడిపిందని పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి