నేనలా అనలేదు బాబోయ్.. ఖర్గే మాట మార్చారా?
posted on Apr 28, 2023 @ 2:42PM
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కర్నాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని మోడీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఆనక తీరిగ్గా నాలుక్కరుచుకున్నారు. కలబురగిలో అసెంబ్లీ ఎన్నికల ప్రచారం వేళ మల్లికార్జున్ ఖర్గే ప్రధాని మోడీని విషసర్పంతో పోలుస్తూ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి.
మల్లికార్జున ఖర్గే కాంగ్రెస్ అధ్యక్షుడు, సీనియర్ నాయకుడు. అలాంటి వ్యక్తి మోడీని విష సర్పం అంటూ చేసిన వ్యాఖ్యలపై కర్ణాటక సీఎం బసవరాజ్ బొమ్మై మండిపడ్డారు. నరేంద్ర మోడీ.. దేశానికి ప్రధాని. ప్రపంచం మొత్తం ఆయనను గౌరవిస్తోంది. అలాంటి వ్యక్తిపై ఇలాంటి పదజాలం వాడడం సరికాదన్నారు. దీనికి బదులు కాంగ్రెస్ మునిగిపోయిందని చెప్పాల్సింది. మోడీపై చేసిన వ్యాఖ్యలకు ఖర్గే దేశానికి క్షమాపణ చెప్పాలని బీజేపీ నేత, కేంద్ర మంత్రి శోభా కరంద్లాజే డిమాండు చేశారు. తాను చేసిన వ్యాఖ్యలు ఈ స్థాయిలో రాజకీయ రచ్చకు కారణం కావడంపై.. ఖర్గే స్పందించారు.
తాను ప్రధాని మోడీని వ్యక్తిగతంగా ఏమీ అనలేదని.. తాను బీజేపీని అన్నానని వివరణ ఇచ్చారు. బీజేపీ భావజాలం గురించి చెబుతూ.. ఆ వ్యాఖ్యలు చేశానని స్పష్టం చేశారు. ఆ భావజాలం విషం లాంటిదని.. మద్దతిస్తే మెడకు చుట్టుకుంటుందని తాను అన్నానని వివరించారు. నేనలా అనలేదు బాబోయ్ అంటూ ఖర్గే మొత్తుకుంటున్నారు. ఖర్గే విష సర్ప వ్యాఖ్యలపై ముందు ముందు బీజేపీ ఇంకెంత తీవ్రంగా రియాక్ట్ అవుతుందో చూడాలి.