అవినీతి జరిగితే పట్టదా?
posted on Apr 28, 2023 @ 3:48PM
మీ అవినీతి చిట్టా నా వద్ద ఉంది. ఒక్కో ఎమ్మెల్యే రూ 3 లక్షలు తీసుకున్న సమాచారం నా వద్ద ఉంది అని బీఆర్ఎస్ అధ్యక్షుడు కెసీఆర్ ప్లీనరీ సమావేశంలో చేసిన హెచ్చరికలు చర్చనీయాంశమయ్యాయి. కూత వేటు దూరంలో అసెంబ్లీ ఎన్నికలు ఉన్న సమయంలో దళిత బంధులో అవినీతి జరిగింది అని కేసీఆర్ చెప్పడం తన ప్రభుత్వాన్నేతానే ఇరకాటంలో పెట్టింది. మరి ఇంత అవినీతి నాలుగున్నరఏళ్లు జరిగినప్పుడు ఎంక్వైరీ గట్రా ఉండదా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి హోదాలో ఉన్న కేసీఆర్ వద్దే జాబితా ఉన్నప్పుడు చర్య ఎందుకు తీసుకోవడం లేదో ఎవరికీ అర్థం కాకుండా ఉంది. ఎమ్మెల్యే అనుచరులు కూడా పైసలు వసూలు చేస్తున్నారు వారి సమాచారం కూడా తన వద్ద ఉందని కేసీఆర్ చెబుతున్నారు. మరి ఎందుకు ఈ ఊదాసీనత? ఇలాంటివి రిపీట్ అయితే టికెట్ ఉండదు, సరిగా పని చేయనివారి తోక కత్తిరిస్తా, మీ అనుచరులు తీసుకున్నా మీరే బాధ్యత అని ప్లీనరీలో కెమెరాలను ఆపి కేసీఆర్ క్లాస్ తీసుకున్నారు.
ప్రజల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పథకాల్లో అవినీతి చాలాకాలంగా జరుగుతుంది. కేసీఆర్ ఈ విషయాన్ని ఓ వైపు ఒప్పుకుంటేనే మరో వైపు మీకు టికెట్లు రావు అని హెచ్చరించడం ఎటువంటి సంకేతాలు ఇస్తుందో అర్థం చేసుకోవచ్చు. ఏ సంక్షేమ పథకమైనా అమలు కావాలంటే ప్రజలు ఇచ్చే పన్నుల మీదే. కోట్లాది రూపాయలు సంక్షేమ పథకంలో అవినీతి జరిగితే వాళ్ల మీద యాక్షన్ తీసుకోవాల్సింది పోయి పార్టీ ప్లీనరీ సమావేశాల్లో హెచ్చరికలు చేయడంతో అవినీతి ఆగిపోతుందా అనేది కేసీఆర్ సమాధానం చెప్పాలి. ఎన్నికలలో డబ్బు, మద్యం పంచడం షరా మామూలే. ఎన్నికల కోడ్ ఉంటుంది కాబట్టి ఇటువంటి చర్యలకు కఠినంగా శిక్షలు ఉంటాయి. ఆసరా పింఛన్లు, షాదీ ముబారక్, రైతుబంధు వంటి పథకాలు చట్టబద్దంగా వోటర్లను ప్రలోభపెట్టడమే అనే ఆరోపణ కేసీఆర్ ప్రభుత్వంపై ఉంది. ఎన్నికలకు కొన్ని గంటల ముందు డబ్బు, మద్యం సరఫరా చేస్తే నేరం. కానీ సంక్షేమ పథకాల పేరిట కేసీఆర్ ప్రభుత్వం వోటర్లను ఆకర్షించే ప్రయత్నాలు చాలా కాలంగా చేస్తుంది. ఏళ్ల తరబడి కొనసాగిస్తున్న సంక్షేమ పథకాల అమలు తీరుపై కేసీఆర్ ప్రభుత్వం నిఘా పెట్టినట్లు లేదు. ఆసరా పించన్లు తీసుకునే వాళ్లకు భవనాలు, కార్లు ఉన్నట్లు అప్పట్లో వార్తలు వచ్చాయి. దారిద్యరేఖకు దిగువ ఉన్న వారికే వైట్ రేషన్ కార్డు ఉండాలి. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు వైట్ రేషన్ కార్డుల పంపిణీ జరిగినప్పటికీ ఎలాంటి నియమ నిబంధనలు పాటించలేదు. ఒక వేళ నిబంధనలు పాటిస్తే వోట్లు రావు అన్న భయం కావచ్చు. అప్పట్లో హైదరాబాద్లో వరదలు వస్తే ఒక్కో ఇంటికి పదివేల నష్ట పరిహారం ఇచ్చింది కేసీఆర్ ప్రభుత్వం. మంచిదే. బాధితులకు న్యాయం జరిగితే ఎవరైనా హర్షించాల్సిందే. కానీ హైదరాబాద్ శాలి బండ వంటి ఎగువ ప్రాంతాల్లో వరదలు ఎలా వచ్చాయో కేసీఆర్ ప్రభుత్వానికే తెలియాలి. 1972లో మూసీ వరదలు వచ్చినప్పటికీ శాలిబండ ప్రాంతంలో చుక్క నీరు రాలేదు మరి వరదలు ఎలా వచ్చాయో ప్రభుత్వానికే తెలియాలి. ఈ విషయం అధికారులకు తెలుసు. అయినా అధికార పార్టీ అడుగులకు మడుగులొత్తే అధికారగణాలు ఉన్నప్పుడు చెవులు ఉండి వినలేరు. కళ్లు ఉండి చూడలేని పరిస్థితి. మీ సేవా సెంటర్ కు వెళ్లి డిటైల్స్ ఇస్తే సాయంత్రం వరకు తమ అకౌంట్లో పది వేలు జమ అయ్యాయి. ప్రజల పన్నులతో సంక్షేమ పథకాలు అమలు చేసే పాలకులకు అవినీతి జరిగితే పట్టదా? ఇటువంటి నేరాలకు పాల్పడిన వారికి జైలు శిక్షలు ఉంటాయి అని చట్టంలో ఉంది. అయినా ప్రభు త్వం సీరియస్ గా ఉన్నట్లు కనబడట్లేదు. వోట్ బ్యాంక్ రాజకీయాల్లో అవినీతి భాగమైపోయింది. చట్టబద్దమైంది కూడా.