161 వ స్థానానికి పడిపోయిన భారత్‌

ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంగే మీడియా రాను రాను నైతిక విలువలను కోల్పోతుంది. ఒక వ్యక్తి లేదా సంస్థకో తాబేదారుగా వ్యవహరిస్తూ  ప్రజల ఆదరణ కోల్పోయే స్థితికి చేరుకుంటుంది. సెక్యులర్ దేశంగా ఖ్యాతిగడించి ప్రజాస్వామిక విలువలను కాపాడుతున్నట్లు అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన  భారత్ క్రమంగా తన గ్రాఫ్ పడిపోతుందని రుజువయ్యింది.  ప్రెస్ ఫ్రీడమ్ డే సందర్భంగా అంతర్జాతీయంగా జరిగిన అధ్యయనంలో ఇది రుజువయ్యింది.  మొత్తం 180 దేశాల్లోని పాకిస్తాన్‌ 150వ స్థానంలో తాలిబన్‌ల స్వాధీనంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ కూడా 152వ స్థానంలో ఉంది. 2014లో ప్రధాని మోడీ అధికారం చేపట్టిన అనంతరం నుండి జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయాయని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొంది.   మీడియా  స్వేచ్ఛలో భారత్‌ 161 స్థానానికి పడిపోయింది. గతేడాది 150 స్థానంలో నిలవగా.. 11 స్థానాలు దిగజారి 161 ర్యాంకుకు చేరింది. మొత్తం 180 దేశాల్లోని పరిస్థితులను అధ్యయనం చేసి పారిస్‌కు చెందిన స్వతంత్ర ఎన్‌జిఒ రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్‌ (ఆర్‌ఎస్‌ఎఫ్‌)  గ్లోబల్ ప్రెస్ ఫ్రీడమ్ ఆఫ్ ఇండెక్స్ ని విడుదల చేసింది. ఈ సూచిలో  బంగ్లాదేశ్‌ 163 స్థానంలో ఉండగా, పాకిస్తాన్‌ భారత్‌ కన్నా మెరుగ్గా 150వ స్థానంలో నిలవడం గమనార్హం. తాలిబన్‌ల స్వాధీనంలో ఉన్న ఆఫ్ఘనిస్తాన్‌ కూడా 152వ స్థానంలో నిలిచింది. భూటాన్‌ 90 వ ర్యాంకు సాధించగా, శ్రీలంక 135వ ర్యాంకు సాధించినట్లు ఆర్‌ఎస్‌ఎఫ్‌ తెలిపింది. భారత్‌ 161 స్థానానికి పడిపోవడంపై ఆర్‌ఎస్‌ఎఫ్‌ ఈ వివరణనిచ్చింది. 2014లో ప్రధాని మోడీ అధికారం చేపట్టిన అనంతరం నుండి జర్నలిస్టులపై దాడులు పెరిగిపోయాయని ఆర్‌ఎస్‌ఎఫ్‌ పేర్కొంది. మీడియాలో రాజకీయ పక్షపాత ధోరణి, మీడియా యాజమాన్యాలు ఏకీకృతం కావడం ఇవన్నీ భారత్‌లో మీడియా స్వేచ్ఛను అడ్డుకుంటున్నాయని తెలిపింది.దేశంలోని హిందీ భాషలో మూడొంతుల మంది పాఠకులకు కేవలం నాలుగు వార్తాపత్రికలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ప్రాంతీయ భాషల విషయానికొస్తే.. కోల్‌కతాలో ఆనంద్‌ బజార్‌ పత్రికా, ముంబయిలో లోక్‌మత్‌, దక్షిణాదిలో మలయాళ మనోరమ లు ప్రచురితమవుతున్నాయి. టివి రంగంలోనూ ఈ మీడియా యాజమాన్యాలు ఏకీకృతం కావడం కనిపిస్తుంది. అలాగే ఆల్‌ ఇండియా రేడియా (ఎఐఆర్‌) నెట్‌వర్క్‌ నుండి అన్ని రేడియో స్టేషన్‌ల్లోనూ వార్తలు ప్రసారమవుతాయి. ఈ కంపెనీలకు, మోడీ ప్రభుత్వానికి మధ్య బహిరంగంగా పరస్పర ప్రయోజనకరమైన సంబంధాలు ఉన్నట్లు తెలుస్తోంది. ఇది ఇంకా కొనసాగుతోంది. సుమారు 80 కోట్ల మంది అనుసరించే 70 మీడియా నెట్‌వర్క్‌లు అంబానీ నేతృత్వంలోని రిలయన్స్‌ ఇండిస్టీస్‌ గ్రూప్‌ అధీనంలో ఉన్నాయి. ఇటీవల ఎన్‌డిటివిని అదానీ స్వాధీనం చేసుకున్న సంగతి తెలిసిందే.మోడీ అధికారం చేపట్టిన అనంతరం పలువురు జర్నలిస్టులు వేధింపులను ఎదుర్కొంటున్నారు. దేశద్రోహం, పరువునష్టం, కోర్టు ధిక్కారం, జాతీయ భద్రత చట్టాలతో పాటు తిరుగుబాటుదారులన్న ముద్ర వేస్తోంది. అలాగే మీడియాలో ఉన్నత కులాలకు చెందిన పురుషులు జర్నలిజంలో సీనియర్‌ పదవులను కలిగి ఉండటం లేదా మీడియా ఎగ్జిక్యూటివ్‌లుగా ఉంటున్నారు. ఇది మీడియా కంటెంట్‌లో ప్రతిబింబిస్తుంది. సాయంత్రం వేళల్లో వచ్చే ప్రధాన చర్చా కార్యక్రమాల్లో పాల్గనేవారిలో 15 శాతం కంటే తక్కువ మంది మహిళలు ఉన్నారు. భారత్‌లో జర్నలిస్టుల భద్రతకు ఎలాంటి చర్యలు లేవు. ప్రతి ఏడాది సగటున నలుగు రు జర్నలిస్టులలో ముగ్గురు హత్యకు గురవుతున్నారు. మీడియా రంగానికి ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన దేశాల్లో భారత్‌ కూడా ఒకటని ఆర్‌ఎస్‌ఎప్‌ స్పష్టం చేసింది.వరల్డ్ ప్రెస్ డే ప్రతీ సంవత్సరం జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. సమాజంలో ప్రెస్ ఫ్రీడమ్ ఆవశ్యకతను నొక్కి చెబుతోంది. మానవ హక్కుల ఉల్లంఘన, వార్తలను ముద్రించడంలో పక్షపాతం, బంధుప్రీతి తదితర అంశాలపై ఆర్ఎస్ఎఫ్ అధ్యయనం చేసింది. 

మణిపూర్లో ప్రజ్వరిల్లిన హింసాకాండ!

మణిపూర్‌ రాజధాని నగరం ఇంఫాల్‌లో హింస ప్రజ్వరిల్లింది. అనేక వాహనాలను తగులబెట్టారు, ప్రార్థనా స్థలాలకు నిప్పు పెట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యాన్ని పిలిచారు. ముఖ్యంగా చురాచాంద్‌పూర్‌, ఇంఫాల్‌ నగరాల్లో హింసాకాండ పెచ్చువిూరింది. ఈ పరిస్థితి గురించి ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌తో కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా చర్చించారు. మెజారిటీగా ఉన్న మెయిటీలను షెడ్యూల్డు తెగల కేటగిరీలోకి తేవాలనే డిమాండ్‌ను ఎస్టీలు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిరసనలకు ది ఆల్‌ ట్రైబల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ మణిపూర్‌ నాయకత్వం వహిస్తోంది. అయితే  వారికి సంఘీభావం తెలుపుతున్న నిరసనకారులే ఈ హింసాకాండకు పాల్పడుతున్నారనే ఆరోపణలను ఈ సంఘం ఖండించింది. బుధవారం (మే 3)నిర్వహించిన సంఘీభావ ప్రదర్శనలో వేలాది మంది గిరిజనులు పాల్గొన్నారని, ఈ ప్రదర్శన ప్రశాంతంగా ముగిసిందని తెలిపింది. తమ ప్రదర్శన అనంతరం కొందరు వ్యక్తులు చురాచాంద్‌పూర్‌లోని ఆంగ్లో-కుకీ వార్‌ మెవెూరియల్‌ గేటుకు నిప్పు పెట్టడం వల్లనే హింస ప్రజ్వరిల్లిందని అంటున్నారు. ఇంఫాల్‌, తదితర ప్రాంతాల్లో గిరిజనుల ఇళ్లను, ప్రార్థనా స్థలాలను తగులబెట్టారనీ, ఇంత జరుగుతున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని, ప్రేక్షక పాత్ర పోషించారనీ విమ్శించారు.   ఈ హింసాకాండలో కొందరుర మరణించారు. చాలా మంది గాయపపడ్డారు. పరిస్థితి చాలా ఆందోళనకరంగా  ఉంది. కేంద్రం జోక్యం చేసుకోవలసిన అవసరం ఉంది.  మణిపూర్‌ ముఖ్యమంత్రి ఎన్‌ బిరేన్‌ సింగ్‌  ఈ హింసాకాండపై స్పందించారు.  సమాజంలోని రెండు వర్గాల మధ్య అపార్థాలే ఆ హింసాకాండ ప్రజ్వరల్లడానికి కారణమని అన్నారు.  ఇరు వర్గాలతోనూ సంప్రదింపులు జరిపి,  దీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్న వారి సమస్యలకు పరిష్కార మార్గం కనుగొంటాని హామీ యిచ్చారు.  మెయిటీలకు ఎస్‌టీ హోదాను ఇవ్వాలనే డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నవారు స్పందిస్తూ, మణిపూర్‌ జనాభాలో మెయిటీలు 53 శాతం మంది ఉన్నారని, వారిని ఎస్టీల్లో చేర్చడం వల్ల తమకు ఉద్యోగావకాశాలు, విద్యా సంస్థల్లో ప్రవేశాలు తగ్గిపోతాయని వాపోతున్నారు. మెయిటీలు ముఖ్యంగా ఇంఫాల్‌ లోయలో ఎక్కువగా ఉన్నారు. రాష్ట్ర జనాభాలో గిరిజనులు 40 శాతం మేరకు ఉంటారు. నాగాలు, కుకీలు కూడా గిరిజనులే. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా గురువారం మణిపూర్‌ ముఖ్యమంత్రి బిరేన్‌ సింగ్‌కు ఫోన్‌ చేశారు. రాష్ట్రంలో పరిస్థితి గురించి అడిగి తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా, పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు సైన్యం, పారామిలిటరీ దళాలను వెూహరించారు. భారత వాయుసేన ప్రత్యేక విమానంలో రాపిడ్‌ యాక్షన్‌ ఫోర్స్‌ సిబ్బందిని తరలించారు. ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. హింసాకాండ నేపథ్యంలో మణిపూర్‌ ప్రభుత్వం రాష్ట్రంలోని ఎనిమిది జిల్లాల్లో కర్ఫ్యూ విధించింది. రానున్న ఐదు రోజులపాటు రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేస్తున్నట్లు పేర్కొంది. వాట్సాప్‌, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌ వంటి సామాజిక మాధ్యమాల ద్వారా   పుకార్లు వ్యాపించకుండా నిరోధించేందుకే ఈ చర్యలు తీసుకున్నట్లు ప్రభుత్వం పేర్కొంది.   పరిస్థితిని అదుపుచేసేందుకు సైన్యం కవాతు నిర్వహిం చింది. అన్ని వర్గాలకు చెందిన దాదాపు 7,500 మంది పౌరులను సురక్షిత ప్రాంతాలకు తరలించేం దుకు ప్రయత్నిస్తున్నారు. ఈ సహాయ కార్యక్రమాల్లో భారత సైన్యం, అస్సాం రైఫిల్స్‌ సిబ్బంది పాల్గొంటున్నారు. మయన్మార్‌, బంగ్లాదేశ్‌ల నుంచి పెద్ద ఎత్తున చట్టవిరుద్ధంగా మణిపూర్‌ రాష్ట్రంలోకి వలస వస్తున్నారు. వీరివల్ల తమకు సమస్యలు ఎదురవుతున్నాయని మెయిటీలు వాదిస్తున్నారు. తమకు ఎస్టీ హోదా కల్పించాలని డిమాండ్‌ చేస్తున్నారు. వీరికి ఇంఫాల్‌ లోయలోని రాజకీయ నాయకులు బహిరంగంగానే మద్దతు ప్రకటిస్తున్నారు. ప్రముఖ క్రీడాకారిణి మేరీ కోమ్‌    నా రాష్ట్రం తగులబడుతోంది. దయచేసి సహాయపడండి అని ట్వీట్ చేశారు. ప్రధాన మంత్రి నరేంద్ర వెూదీ, పీఎంఓ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, వివిధ విూడియా సంస్థలకు ఈ ట్వీట్‌ను ట్యాగ్‌ చేశారు. ఆమె ఓ వార్తా సంస్థతో మాట్లాడుతూ మణిపూర్‌ దుస్థితిని వివరించారు. అందరికీ రక్షణ కల్పించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను తన హృదయాంతరాళాల్లోంచి కోరుతున్నానని చెప్పారు.  

తెలంగాణ ఆ త్మ గౌరవానికి ప్రతీక ‘నీరా’ అట 

ప్రకృతి సిద్ధంగా లభిస్తున్న నీరాను నగరవాసులకు అందించే నీరా కేఫ్ ను ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా.. నీరా అంటే ఆల్కహాల్ అని దుష్ప్రచారం ఉందని..ఇది దేవతలు తాగే వేదామృతమన్నారు మంత్రి శ్రీనివాస్ గౌడ్. తరతరాల నుంచి వస్తున్న గీత వృత్తి అని.. తెలంగాణ ఆత్మగౌరవానికి ప్రతీక నీరా కేఫ్ అని అన్నారు ఆయన.హుస్సేన్ సాగర్ తీరాన ప్రారంభమైన ‘నీరా’ కేఫ్ 2020 ఆగస్టులో శంఖుస్థాపన జరిగింది. అప్పట్లో ఈ కార్యక్రమానికి సీనియర్ అధికారులు, కేటీఆర్, దానం నాగేందర్, తలసాని తదితరులు హాజరయ్యారు. నీరా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలను అధికార పార్టీ ప్రభుత్వం పెద్ద ప్రచారమే చేసింది. నీరా తాగితే ఒంట్లో ఎనర్జీ వస్తుందని చెప్పి హుస్సేన్ సాగర్ తీరాన కేఫే ప్రారంభించి వ్యాపారం చేస్తుంది తెలంగాణ ప్రభుత్వం. ప్రతి పక్షాలు నీరా అమ్మకాలను కమర్షియల్ చేయడం సహేతుకం కాదని వాదిస్తున్నాయి. బెల్ట్ షాపులతో విసిగి వేసారిన ప్రజలకు నీరా కేఫేలు మరిన్ని ఇబ్బందులు పెట్టొచ్చని పలువురు అంటున్నారు.  నీరా ఆల్కాహాల్ కాదని బీఆర్ఎస్ శ్రేణులు ప్రచారం చేసుకుంటున్నాయి. ఖర్చూర చెట్ల కు సూర్యోదయం ముందు కట్టిన కుండలలో నీరా పడితే  కిరణ జన్య సంయోగ క్రియ జరిగి నీరా తయారవుతుందని, దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేదని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నాయి. నీరా తాజాగా ఉన్నప్పుడే ఔషధ విలువలు ఉంటాయని, ఫ్రిజ్లో స్టోర్ చేసుకుని తాగితే ఆరోగ్యానికి మంచిది కాదని ఆయుర్వేద నిపుణులు హెచ్చరిస్తున్నారు. నీరాతో బై ప్రొడక్టులు తయారవుతున్నాయని తెలంగాణ ప్రభుత్వం ప్రచారం చేసుకుంటుంది. మెగ్నీషియం, కాల్షియం, ఐరన్ , పాస్పరస్, పొటాషియం, విటమిన్ సి పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నీరా ను ప్రమోట్ చేయడం వల్ల కల్లు గీత కార్మికులకు ఉపాధి అవకాశాలు మరింత మెరుగవుతాయి. ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ దిశగా అడుగులు వేస్తున్నారు.  రానున్న ఎన్నికల్లో గౌడ కులస్థుల వోట్లను పొందడానికి నీరా దోహదపడుతుందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణ సమాజం యొక్క సెంటి మెంట్లు  నీరా, కల్లు వంటి పానీయాలతో ముడి పడి ఉందని కేసీఆర్ విశ్వాసం. ఉపాధి కోల్పోతున్న కల్లు గీత కార్మికులకు నీరా అమ్మకాలతో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందవచ్చని బీఆర్ఎస్ భావిస్తుంది. 

అకాల వర్షాలతో అన్నదాత అలో లక్ష్మణా!

అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకుంటామని తడిసిన ధాన్యాన్ని కూడా మద్దతు ధరలకే కొంటామని  తెలంగాణ ప్రభుత్వం చెబుతోంది. ఒక్క గింజ కూడా వదలకుండా కొనుగోలు చేయాలని సంబంధిత శాఖ అధికారులకు కేసీఆర్  అయినా రైతులకు భరోసా కలగడం లేదు. గత అనుభవాలు వారికి ప్రభుత్వ ప్రకటనలపై నమ్మకం లేకుండా చేసింది. అందుకు తగ్గట్టే యిప్పటికింకా  క్షేత్రస్థాయిలో అధికారులు పర్యటించి...పంట నష్టం అంచనా వేసే కార్యక్రమం యింకా ప్రారంభమే కాలేదు.   తడిసిన ధాన్యం కొనుగోళ్లకు ఇరు రాష్టాల్లో ముందుగా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. వరి, మక్క,జొన్న తదితర పంటలను తక్షణమే కొనుగోలు చేయాలి. ధాన్యం సేకరణలో తడిసిన ధాన్యం సేకరణకు ప్రాధాన్యం ఇవ్వాలి. ఈ విషయంలో అవసరమైతే నిబంధనలు సడలించైనా సేకరణ ప్రారంభించాలి. అకాల వర్షాలకు కల్లాలే కాదు  రైతుల కళ్లు కూడా నీటితో నిండిపోయాయి. అకాల వర్షాలు అన్నదాతలను ఆగంఆగం చేశాయి. చేతి కందిన పంటలను దారుణంగా దెబ్బతీశాయి. అటు నేలవాలిన పంటలు, ఇటు ధాన్యం కుప్పల్లో వస్తున్న మొలకలు చూసి రైతాంగం బెంగటిల్లుతోంది. అన్న దాతను ఆదుకునే దిశగా తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు యింత వరకూ ఒక్క అడుగు కూడా వేయలేదు. అటు కేంద్రమూ ముందుకు రాలేదు. రాష్ట్రప్రభుత్వాలైతే ఆదుకుంటామంటూ ప్రకటనలైనా చేశాయి. కేంద్రం నుంచి ఆ మాత్రం భరోసా కూడా రాలేదు.  ఇక రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలు రైతన్నకు భరోసా, ఆత్మస్థైర్యం యివ్వవు. వారికి సాయం అందితేనే భరోసా వస్తుంది. ఆత్మస్థైరం వస్తుంది. నష్టపరిహారం యిచ్చి తడిసిన ధాన్యం కొనుగోలు చేస్తే సరిపోదు.. మళ్లీ పంట వేయడానికీ రైతుకు సహాయం అందాలి.   ప్రభుత్వాధినేత ప్రకటనలు యింకా   కార్యరూపం దాల్చలేదు. రైతుకు సహాయం అందడం లేదు. కానీ రాజకీయ విమర్శల వేడి మాత్రం అకాల వర్షాల సాక్షిగా అగ్నిపర్వతం బద్దలై లావా ప్రవహించినట్లు ప్రవహిస్తోంది. కల్లాలలో ధాన్యం నీటిలో ఉండగానే రాజకీయ విమర్శల జోరు జడివానగా మారి రైతు ఆశను చంపేస్తోంది. రైతు కష్టంలో ఉన్నప్పుడైనా రాజకీయాలను పక్కన పెట్టి ఆదుకునే విషయానికే పరిమితం కావాలి. తెలంగాణలో అధికార బీఆర్ఎస్ నేతలూ, మంత్రులూ అకాల వర్షంతో అన్నదాత కుదేలైనా కేంద్రం స్పందించడం లేదంటూ బాధల్లో ఉన్న రైతుల ముందే విమర్శల పురాణం విప్పుతున్నారు. ఏపీలో అయితే ముఖ్యమంత్రి సమయం అంతా సమీక్షల్లోనే గడిపేస్తున్నారు. అన్నదాతను ఆదుకోవాలనీ, ఏ ఒక్క రైతూ కూడా  బాధపడకూడదనీ ప్రకటనలు గుప్పిస్తున్నారు. అధికారులకు ఆదేశాలు జారీ చేసేస్తున్నారు.  అయితే  రైతులను ఆదుకునే దిశగా ఒక్క అడుగూ పడిన దాఖలాలు లేవ.  

మరాఠీలకు ప్రాంతీయవాదం అంటే మమకారం 

జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టిన బీఆర్ఎస్ కు పొరుగురాష్ట్రమైన మహారాష్ట్రలో చేదు అనుభవం ఎదురైంది. ఇటీవల మహరాష్ట్ర ఔరంగా బాద్ లో బీఆర్ ఎస్ భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ సభకు ప్రచారం కూడా భారీగానే  కల్పించింది బీఆర్ఎస్. మరాఠా పత్రికలకు లక్షలాది రూపాయల యాడ్స్, జర్నలిస్ట్ లకు రాచమర్యాదలు చేసింది. ఈ వార్త సేకరించడానికి వచ్చే రిపోర్టర్లలో కొందరికి ఫ్లయిట్ ఖర్చులు కూడా బీఆర్ఎస్ భరించింది. వారికి రాచమర్యాదలు చేసింది. ఇటీవలె మహరాష్ట్రలో బోకర్ అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ ఎన్నికలు జరిగాయి. బీఆర్ఎస్ అభ్యర్థులు ఈ ఎన్నికలో భారీ ఓటమిని చవి చూశారు. డైరెక్టర్ పదవులను ఆశించిన బీఆర్ఎస్ అభ్యర్థులు ఆదిలోనే భంగపడ్డారు. ఒక్క సీటు కూడా బీఆర్ఎస్ గెలుచుకోలేకపోయింది.  మొత్తం 18 స్థానాలకు గాను కాంగ్రెస్ 13, బీజేపీ 3, ఎన్సీపీ 2 గెలుచుకుంది. ఈ ఓటమికి బలమైన కారణం ఒకటుంది. ఛత్రపతి శివాజీ ఝాన్సీ లక్ష్మీభాయ్    పుట్టిన గడ్డ  అది.  వందల సంవత్సరాల నుంచి మరాఠీల రక్తం దేశభక్తి, ప్రాంతీయ భక్తి ఉన్నట్లు రుజువయ్యింది. చారిత్రక ఆధారాలు కూడా ఉన్నాయి. హిందుత్వవాదంను సమర్ధించే పార్టీలు అక్కడ మనుగడ సాగిస్తాయని లోకోక్తి. శివసేన అయినా బీజేపీ అయినా అధికారాన్ని పంచుకున్నాయి. కానీ ప్రాంతీయేతర పార్టీలను మరాఠా గడ్డ మీద కాలు మోపనీయలేదు.  మరాఠీలు మాత్రమే ముఖ్యమంత్రి పదవులను అలంకరించారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రేస్ పార్టీలో పదవులు అనుభవించిన శరద్ పవార్ మరాఠీయుడు. అతను నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ  నేతగా ప్రస్తుతం చక్రం తిప్పుతున్నారు. కాంగ్రెస్ నేత అశోక్ చవాన్ మరాఠీయుడు. భోకర్ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి పాలవ్వడానికి అశోక్ చవాన్ ముఖ్య కారణం. మరాఠా గడ్డ మీద బీఆర్ఎస్ ఎంట్రీని అతను ఏ మాత్రం సహించలేకపోయారు. మార్కెట్ కమిటీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీ చేయడం ఏమిటి? మరాఠీలు పునరాలించుకోవాలని అశోక్ చవాన్ స్థానికులను అనేక మీటింగ్స్ లో ప్రశ్నించారు. ఒక సారి బీఆర్ఎస్ ప్రవేశిస్తే  మన ప్రాంతం ప్రమాదంలో పడినట్టేనని ప్రచారం చేశారు. ఈ మేరకు పావులు కూడా కదిపారు. ఒక్క వోటుకు 10 వేల రూపాయల పెట్టి కొనుగోలు చేసినట్టు బీఆర్ ఎస్ పై ఆరోపణ ఉంది.  భోకర్  మార్కెట్ కమిటీ  ఎన్నికల్లో ఓటమి చెందిన బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా  తీసుకుంది. భోకర్ లో ప్రాబల్యం ఉన్న నాగ్ నాథ్ ఓడిపోవడాన్ని బీఆర్ఎస్ జీర్ణించుకోలేకపోయింది. నాగ్ నాథ్ ను కేసీఆర్ ఓదార్చారు. వెంటనే మరాఠా బీఆర్ఎస్ శ్రేణులతో సమావేశమయ్యారు. మొదటి ఓటమి విజయానికి తొలి మెట్టు కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. బీఆర్ఎస్  నాయకులు జిల్లా పరిషత్ , మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్నారు.  బీఆర్ఎస్ నేతలు  పెద్ద పెద్ద కలలే కన్నారు. కాంగ్రెస్ , బీజేపీలకు ప్రత్యామ్నాయ పార్టీలను అధికారంలో తీసుకురావడానికి బీఆర్ఎస్ అధినేత కాళ్లకు చక్రాలు కట్టుకుని దేశమంతా పర్యటించాలని, తాను ప్రధాని కావాలని ఉవ్వీళ్లూరారు.  ఎవరూ ఊహించనీ విధంగా భోకర్ మార్కెట్ కమిటీ ఎన్నికలలో బీఆర్ఎస్ తొలి సారి  పోటీ చేసి ఒక్క స్థానం కూడా గెలుచుకోలేకపోయింది. మహరాష్ట్రలోని  బోకర్ మాజీ సీఎం, కాంగ్రెస్ పార్టీకి కంచుకోట. భోకర్ తాలూకాలోని నంద, రాతి, కిని, పలాజ్ దివిసి గ్రామాలు నిర్మల్ తదితర జిల్లా సరిహద్దులను పంచుకుంటున్నాయి. భోకర్ భైంసా పట్టణానికి  35 కిలో మీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామాల్లో తెలుగు ప్రజలు ఎక్కువ ఆవాసమున్నారు.  సాక్షాత్తు ఇక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ బహిరంగ సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నప్పటికీ ఎటువంటి ప్రయోజనం లేకపోయింది. భోకర్ ఎన్నికలలో బీఆర్ఎస్ ఓటమిని ఆ పార్టీ ఎమ్మెల్యేలకు తీవ్ర నిరాశను మిగిల్చింది. మంత్రి ఇంద్రకరణ్ రెడ్డికి ఈ ఓటమితో కలత చెందారు. తెలంగాణలో అమలవుతున్న అన్ని సంక్షేమ పథకాలను మహరాష్ట్రలో అమలు చేస్తామని కేసీఆర్ హామి ఇచ్చినప్పటికీ ఈ ఎన్నికలో వర్కవుట్ కాలేదు. 

మహా సీఎం అజిత్ పవార్?..ఎన్సీపీ అధినేత్రి సుప్రియాసూలె

మరాఠా యోధుడు, రాజకీయ వ్యూహాల దురంధరుడు ఉరుములేని పిడుగులా సొంత పార్టీ నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) అధ్యక్ష పదవికి రాజీనామా చేసేశారు. పార్టీ శ్రేణులు ఆయనే కొనసాగాలని చేసిన డిమాండ్ లను కూడా పట్టించుకోకుండా తన వారసుడి ఎంపిక కోసం ఒక కమిటీని కూడా వేసేశారు.  అయితే ఎన్సీపీ అధ్యక్ష రేసులో శరద్ పవార్ కుమార్తె సుప్రియా సూలె ముందు వరుసలో ఉన్నారు. ఈ వ్యవహారంపై గత రెండు రోజులుగా దేశ వ్యాప్తంగా విస్తృత చర్చ జరుగుతోంది. చెప్పా పెట్టకుండా శరద్ యాదవ్ ఎందుకింత హఠాత్తుగా పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారన్నదానిపై చర్చోపచర్చలు జరుగుతున్నాయి. అయితే మహారాష్ట్ర రాజకీయాలను దగ్గరగా పరిశీలిస్తున్న వారు మాత్రం ఒక మహా ఎత్తుగడతోనే శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారంటున్నారు. ఆయన రాజీనామా.. తదననంతర పరిణామాలపై పక్షం రోజుల కిందటే సుప్రియా సూలే హింటిచ్చారు. మహా, జాతీయ రాజకీయాలలో రానున్నరోజుల్లో రెండు భూకంపాలు సంభవిస్తాయని ఆమె చెప్పారు. అవేమిటన్నదానిపై విశ్లేషకులు యిప్పుడు క్లారిటీ యిస్తున్నారు.   కర్నాటక ఎన్నికల తరువాత మహారాష్ట్ర రాజకీయాలలో పెను మార్పులు సంభవించనున్నాయంటున్నారు. సార్వత్రిక ఎన్నికలలో  గెలిచి మోడీ ముచ్చటగా మూడో సారి కేంద్రంలో మోడీ  నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలన్న పట్టుదలతో పావులు కదుపుతున్న బీజేపీ.. మహాలో  షిండే ప్రభుత్వ తీరు పట్ల గత కొంత కాలంగా ఒకింత అసంతృప్తితో ఉంది. ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కు ముఖ్యమంత్రి పగ్గాలు అప్పగించాలన్న యోచనలో ఉంది. యిది పసిగట్టిన షిండే.. ప్రతి వ్యూహాలతో ఉద్ధవ్ థాక్రేకి దగ్గరయ్యేందుకు ప్రయత్నాలు చేశారు. శరద్ పవార్ ఎన్సీపీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయడానికి ఈ నేపథ్యమే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఆయన బీజేపీకి దగ్గరవుతున్నారని అంటున్నారు. అందుకు గత కొంత కాలంగా ఆయన ప్రకటనలనే సాక్ష్యంగా చూపుతున్నారు. అదానీ వ్యవహారంలోనూ, మోడీ విద్యార్హతలపై తలెత్తిన వివాదంలోనూ ఆయన విపక్ష గళానికి భిన్నంగా తన వాణిని వినిపించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఆయన కమలం గూటికి దగ్గరౌతున్నారన్న అనుమానాలు అందరిలోనూ వ్యక్తమయ్యాయి. యిదిలా ఉండగా.. తన సమీప బంధువు అజిత్  పవార్ సీఎంగా మహాలో బీజేపీ సర్కార్ ఏర్పాటుకు ఆయన రాజీనామా నాంది అని అంటున్నారు. సెక్యులర్ నేతగా జాతీయ స్థాయిలో గుర్తింపు ఉన్న శరద్ పవార్ తాను అధ్యక్షుడిగా ఉండగా తానే ఏర్పాటు చేసిన పార్టీ బీజేపీతో జట్టు కట్టిందన్న అపప్రదను మూటగట్టుకోవడం ఎందుకన్న భావనతోనే తాను రాజీనామా చేసి ఆ స్థానంలో తన కుమార్తెను కూర్చోపెట్టి క్రతువు కానిచ్చేద్దామని నిర్ణయించుకున్నారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. మొత్తం మీద వచ్చే సార్వత్రిక ఎన్నికలలో విపక్షాల ఐక్యతను ముందుండి నడిపిస్తారనుకున్న శరద్ పవార్ యూటర్న్ తీసుకుని బీజేపీ పంచన చేరడం రాజకీయంగా సంచలనం సృష్టిస్తుందనడంలో సందేహం లేదు.

కర్ణాటకంలో కాసుల గలగల

విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తున్న పిల్లలను పెద్దలు డబ్బులేమైనా చెట్లకు కాస్తున్నాయని అనుకుంటున్నావా..అని  హెచ్చరిస్తారు. అంటే డబ్బులు చెట్లకు కాయవు, కష్టపడి సంపాదించాలని చెప్పడం అన్న మాట. కానీ, అసెంబ్లీ ఎన్నికలు జరుగతున్న కర్ణాటకలో.. డబ్బులు , అది కూడా కాస్తా కూస్తా కాదు కోట్ల రూపాయలు చెట్లకు కాస్తున్నాయి!  అదేంటీ అని ఆశ్చర్యపోతున్నారా? అవును మరి.. మైసూరులో సోదాలకు వెళ్లిన ఐటీ అధికారులకు ఓ చెట్టుపై కోటి రూపాయలు కన్పించాయి. అధికారుల కళ్లు గప్పేందుకు ఓ కాంగ్రెస్‌ నేత కుటుంబసభ్యులు చేసిన ప్రయత్నం బెడిసికొట్టి ఈ సొమ్ము బండారం బయటపడింది.  అదలా ఉంటే ఈ ఎన్నికల్లో, ఎలాగైనా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్న ప్రధాన పార్టీలు, బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్  ధనబలం ఉన్నవారితో పాటుగా, నేర చరితులకు పెద్దపీట వేశాయని, అసోసియేషన్‌ ఆఫ్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ సంస్థ (ఏడీఆర్) తాజా నివేదిక వెల్లడించింది. ఈ వైఖరి గత ఎన్నికలతో పోలిస్తే మరింత పెరిగిందని ఏడీఆర్ ఆందోళన వ్యక్తంచేసింది. మే 10న జరగబోయే ఎన్నికలకు సంబంధించి ఆయా పార్టీ నేతలు సమర్పించిన ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా ఓ నివేదికను రూపొందించింది. మొత్తం 2,586 మంది అఫిడవిట్లను విశ్లేషించింది. ఈ తాజా నివేదిక ప్రకారం ఎన్నికలో పోటీ చేస్తున్నఅభ్యర్ధులలో 42 శాతం మంది కోట్లకు పడగలెత్తిన కోటీశ్వరులున్నారు. బరిలో నిలిచిన మొత్తం మొత్తం 2,586 మంది అభ్యర్థుల్లో 1087 మంది (42 శాతం) కోటీశ్వరులని ఏడీఆర్‌ నివేదిక తెలిపింది. 2018 ఎన్నికల్లో యిది 35 శాతంగా ఉందని ఏడీఆర్‌ తెలిపింది. ఒక్కో అభ్యర్థి సగటు ఆస్తి రూ.12.26 కోట్లుగా లెక్కగట్టింది. 2018 ఎన్నికల్లో ఈ సగటు రూ.7.5 కోట్లుగా ఉంది.  పార్టీల వారీగా చూస్తే, కాంగ్రెస్‌కు చెందిన వారు 97 శాతం మంది కోటీశ్వరులు కాగా.. బీజేపీ బరిలో నిలిపిన అభ్యర్థుల్లో 96 శాతం మంది కోటీశ్వరులు ఉన్నారు. జేడీఎస్‌ నుంచి పోటీ చేస్తున్న వారిలో 82 శాతం మంది కోటీశ్వరులున్నారు. ప్రధాన పార్టీల అభ్యర్ధులు మాత్రమే కాదు, స్వతంత్ర అభ్యర్ధులలోనూ కుబేరులకు కొదవ లేదని ఏడీఆర్ నివేదిక పేర్కొంది   ఏడీఆర్‌ విశ్లేషించిన జాబితాలో 901 మంది స్వతంత్రులున్నారు. వారిలో  215 మంది, అంటే 24 శాతం మంది  కోటీశ్వరులు. వ్యక్తిగత ఆస్తుల విషయానికొస్తే.. కాంగ్రెస్‌ అభ్యర్థి యూసఫ్‌ షరీఫ్‌ రూ.1633 కోట్లతో అగ్రస్థానంలో నిలవగా.. బీజేపీ అభ్యర్థి ఎన్‌ నాగరాజు రూ.1609 కోట్లతో రెండో స్థానంలో నిలిచారు.  కేపీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్‌ రూ.1413 కోట్లతో మూడో స్థానంలో నిలిచారు.  డబ్బు ఒక్కటే కాదు, బరిలో నిలిచిన అభ్యర్ధులలో నేర చరితులకూ కొదవలేదని, ఏడీఆర్ నివేదిక పేర్కొంది. నేర చరితులను బరిలో దించే విషయంలోనూ ప్రధాన పార్టీలు ఒకరితో ఒకరు పోటీ పడుతున్నాయని ఏడీఆర్ నివేదిక వెల్లడించింది. ప్రస్తుత ఎన్నికల్లో పోటీ చేస్తున్న వారిలో 22 శాతం మందిపై క్రిమినల్‌ కేసులు ఉన్నాయని ఏడీఆర్ వెల్లడించింది. 2018లో  క్రిమినల్ కేసులు ఉన్నవారి శాతం 15 అని తెలిపింది.  మొత్తం 2,586 మంది అభ్యర్థుల్లో 581 మంది క్రిమినల్‌ కేసులు ఉన్నాయని, ఇందులో 404 మందిపై తీవ్రమైన అభియోగాలు ఉన్నాయని పేర్కొంది. 49 మంది అభ్యర్థులు మహిళల విషయంలో నేరారోపణలు ఎదుర్కొంటుండగా..  అందులో ఒకరిపై అత్యాచారం, 8 మందిపై హత్య, 35 మందిపై హత్యాయత్నం అభియోగాలు ఉన్నాయని ఏడీఆర్‌ నివేదించింది. కాంగ్రెస్‌కు చెందిన అభ్యర్థుల్లో 55 శాతం మంది నేరారోపణలు ఎదుర్కొంటుండగా..  బీజేపీలో  43 శాతం మంది ఉన్నట్లు ఏడీఆర్‌ తెలిపింది. జనతా దళ్‌ సెక్యులర్‌కు చెందిన వారిలో 34 శాతం మందిపై నేరారోపణలు ఉన్నాయని ఏడీఆర్‌ పేర్కొంది. మరోవైపు ఈ ఎన్నికల్లో మహిళలపై వరాల జల్లు కురిపించిన పార్టీలు.. వారికి టికెట్లు కేటాయింపులో మాత్రం మొండిచేయి చూపించాయి. 2018 ఎన్నికల్లో 8 శాతం మంది మహిళలు పోటీ చేయగా.. ఈ సారి  వారి శాతం కేవలం 7 మాత్రమే. కేవలం 7 శాతం మందే బరిలో ఉన్నారు. నేషనలిస్ట్‌ కాంగ్రెస్‌ పార్టీ అత్యధికంగా 22 శాతం మందికి మహిళలకు టికెట్లు కేటాయించింది. బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీల్లో మొత్తం సీట్లలో కేవలం ఐదేసి శాతం మాత్రమే మహిళలకు కేటాయించాయి. జేడీఎస్‌ 6 శాతం మందికి టికెట్లు ఇచ్చింది. మొత్తానికి ఏడీఆర్ నివేదిక కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల్లో ..అతి పెద్ద ప్రజాసామ్య దేశంలో ప్రజాస్వామ్య విలువలు మరో ..పది మెట్లు దిగజారిన నిజాన్ని నివేదించింది.

వివేకా హత్య కేసు.. అవినాష్ డైరక్షన్ లో సీబీఐ దర్యాప్తు!?

వివేకా హత్య కేసు దర్యాప్తు, ఆ కేసులో సీబీఐ నిందితుడిగా పేర్కొన్న అవి కడప ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో సీబీఐ విశ్వసనీయత ప్రశ్నార్థకంగా మారిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. దర్యాప్తు ఓ కొలిక్కి వచ్చింది. అవినాష్ రెడ్డి అరెస్టుతో వివేకా హత్య కేసుకు ఒక తార్కిక ముగింపునకు వస్తుందని అంతా భావించారు.  అయితే అవినాష్ రెడ్డిని అరెస్టు చేసే విషయంలో సీబీఐకి ఉన్న అడ్డంకులన్నిటినీ కోర్టులు సందేహాలకు అతీతంగా తొలగించేసినా.. సీబీఐ మీనమేషాలు లెక్కించడంతో పలు అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. ఏ ఒత్తిడులు సీబీఐ కాళ్లూ చేతులూ కట్టేస్తున్నాయన్న చర్చ జోరుగా సాగుతోంది.  ఈ కేసులో అవినాష్ రెడ్డి మొదటి నుంచీ తాను అరెస్టవుతానన్న భావంతోనే దాని నుంచి తప్పించుకోవడానికి చేయాల్సినంతా చేశారు.  ప్రధానంగా ఆయన న్యాయస్థానాలను ఆశ్రయించి అరెస్టు నుంచి రక్షణ పొందడానికి ఉన్న అన్ని అవకాశాలనూ వినియోగించుకున్నారు. కేసు తెలంగాణకు మారిన తరువాతే  వివేకా హత్య కేసులో అవినాష్ ప్రమేయంపై సీబీఐ బలమైన వాదనలు వినిపించింది. దీంతో అవినాష్ హై కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకూ  వెళ్లి మరీ అరెస్టు కాకుండా ఉండేందుకు చేయగలిగినంతా చేశారు. తెలంగాణ హైకోర్టు ఆయనకు మధ్యంతర ఉత్తర్వుల ద్వారా ముందస్తు బెయిలు యిచ్చి ఒకింత ఊరట కలిగించినా.. వివేకా కుమార్తె డాక్టర్ సునీత.. హైకోర్టు మధ్యంతర ఉత్తర్వ్యులను సవాల్ చేస్తూ సుప్రీంను ఆశ్రయించారు. దీంతో ఆయనకు ఆ ఊరట కూడా లభించలేదు. అయినా హైకోర్టులో ముందస్తు బెయిలు పిటిషన్ పెండింగ్ లో ఉందన్న సాకుతో అరెస్టు నుంచి తప్పించుకోగలిగారు. చివరికి హైకోర్టు కూడా ముందస్తు బెయిలు పిటీషన్ పై తీర్పును వాయిదా వేస్తే.. అవినాష్ ను అరెస్టు చేసి విచారించడానికి సీబీఐకి ఎటువంటి అడ్డంకులూ లేవని తేల్చేసింది.   యిదంతా జరిగి రోజులు గడిచినా సీబీఐ మాత్రం ఆయన అరెస్టు విషయంలో ఒక్క అడుగు కూడా ముందుకు వేయలేదు.  అయితే తెలంగాణ హైకోర్టులో అవినాష్ ముందస్తు బెయిలు విషయంలో సీబీఐ దాఖలు చేసిన కౌంటర్ అఫిడవిట్ లో మాత్రం  వివేకా హత్య కేసులో  పలు కీలక అంశాలను ప్రస్తావించింది. సాక్ష్యాల మాయం నుంచి పలు అంశాలలో అవినాష్ కు ప్రమేయం ఉందనీ, ఆయనను అరెస్టు చేసి విచారించాల్సిన అవసరం ఉందనీ విస్పష్టంగా పేర్కొంది. అలాగే హత్య కొోసం నాలుగు కోట్ల సొమ్ముకు ఒప్పందానికి సంబంధించిన అంశంలో కూడా అనినాష్ రెడ్డిని విచారించాల్సి ఉందని సీబీఐ పేర్కొంది.   అలాగే నేరాన్ని తనపై వేసుకుంటే రూ.10 కోట్లు.. ఇస్తామన్నారని గంగాధర్రెడ్డి  వాంగ్మూలంలో వాస్తవం తేల్చాలనీ సీబీఐ పేర్కొంది.  అంతే కాకుండా అవినాశ్ రెడ్డికి నేర చరిత్ర ఉందనీ, ఆయనపై క్రిమినల్ కేసులు ఉన్నాయనీ కూడా పేర్కొంది.  యిన్ని చెప్పిన సీబీఐ  అడ్డంకులన్నీ తొలగిపోయినా అవినాష్ రెడ్డిని అరెస్టు చేయకపోవడం అటుంచి..  విచారణకు పిలిచినప్పటి నుంచీ ఆయన మీడియా ఎదుట..  సీబీఐ సవ్యదిశలో దర్యాప్తు చేయడం లేదంటూ .. సీబీఐ ఎలా దర్యాప్తు చేయాలో చెబుతూ వస్తున్నారు. యిప్పుడు అవినాష్ రెడ్డి అరెస్టు విషయంలో వెనకడుగు వేసిన సీబీఐ.. తన దర్యాప్తును అవినాష్ చెప్పిన విధంగా సాగిస్తోందా అన్న అనుమానాలు వ్యక్తమయ్యాయి. హైకోర్టుకు సమర్పించిన కౌంటర్ అఫిడవిట్ లో డాక్టర్ సునీత దంపతులకు వివేకా హత్య కేసుతో సంబంధం లేదని విస్పష్టంగా చెప్పిన సీబీఐ..  ఆ తరువాత వారిరువురినీ విచారించింది. అలాగే  వివేకా రాసినట్లు చెబుతున్న లేఖను ఉద్దేశపూర్వకంగా ఆయన కుమార్తె.. అల్లుడు దాచేసినా పట్టించుకోలేదన్న అవినాష్ ఆరోపణలకు అనుగుణంగా దర్యాప్తు సాగిస్తోంది.  తాజాగా వివేకా పీఏ క్రిష్ణారెడ్డిని అదుపులోకి తీసుకుని  హత్య జరిగిన చోట లభించిన  లేఖను  ఎందుకు దాచారంటూ ప్రశ్నలు గుప్పించిందని చెబుతున్నారు.   మొత్తంగా సీబీఐ ప్రస్తుతం అవినాష్ లేవనెత్తిన అంశాల దర్యాప్తుపై దృష్టి సారించినట్లు పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. అవినాష్ డైరెక్షన్ లో సీబీఐ దర్యాప్తు సాగుతోందా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. 

అన్నీ పంజరంలో చిలుకలేనా?.. ఖర్గే కుమారుడికి ఈసీ నోటీసులు

కర్ణాటక ఎన్నికల ప్రచారంలో ప్రధాని నరేంద్ర మోదీని ఉద్దేశిస్తూ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తనయుడు ప్రియాంక్ ఖర్గే చేసిన వ్యాఖ్యలపై కేంద్ర ఎన్నికల సంఘం నోటీసులు ఇచ్చింది. ప్రాథమిక ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘిస్తూ, మోదీపై నాలాయక్ (చేతకాని వ్యక్తి) అంటూ వ్యాఖ్యలు చేశారంటూ నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించినందుకు తగిన చర్యలు ఎందుకు తీసుకోకూడదో గురువారం (మే 4) సాయంత్రంలోగా సమాధానం ఇవ్వాలని కమిషన్ ఆ నోటీసులో ఆదేశించింది. ప్రధాని మోదీపై అనుచిత పదజాలం ఉపయోగించారంటూ బీజేపీ చేసిన ఫిర్యాదు మేరకు ప్రియాక్ ఖర్గేకు ఈసీ నోటీసులు యిచ్చింది.   చిత్తాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్న ప్రియాంక్ ఇటీవల ఓఎన్నికల ప్రచార సభలో మాట్లాడుతూ మోడీని నాలాయక్ గా అభివర్ణిస్తూ విమర్శలు చేశారు.  ప్రధానిపై ఎవరు ఏ చిన్న మాట మాట్లాడినా..ఈడీ, సీబీఐ కేసులు పెడుతుంటే..  ఈసీ నోటీసులు యిస్తోందంటూ విపక్షాలు చేస్తున్న విమర్శలకు తాజాగా ప్రియాంక్ ఖర్గేకు ఈసీ జారీ చేసిన నోటీసులు మరింత బలం చేకూర్చాయి.   ప్రతిపక్షాలపై  బీజేపీ నేతలు యిష్టారీతిన మాట్లాడినా, వారి అనుచిత వ్యాఖ్యలపై విపక్షాలకు చెందిన నేతలు ఫిర్యాదులు చేసినా ఈ సంస్థలు ఎందుకు స్పందించడం లేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎప్పుడో సుప్రం కోర్టు సీబీఐని పంజరంలో చిలుక అని వ్యాఖ్యనించిందనీ, యిప్పుడు ఈడీ, ఐటీ ఈసీల తీరుకూడా అలాగే మరినట్లుందన్న చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో ఓ రేంజ్ లో జరుగుతోంది.  ఇటీవల ఓ బీజేపీ ఎమ్మెల్యే.. సోనియా గాంధీని విషకన్య అంటూ చేసిన వ్యాఖ్యలపై ఈసీ ఎందుకు స్పందించలేదంటూ కాంగ్రెస్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది.   

పవార్ బిగ్ డెసిషన్ మతలబు ఏమిటి?

ఎన్సీపీ వ్యస్థాపక అధ్యక్షుడు, శరద్‌ పవార్‌ రాజీనామా చేయాలనే నిర్ణయానికి వచ్చారు. అయితే అదే ఆయన తుది నిర్ణయమా లేక మనసు మార్చుకునే అవకాశం వుందా అనే విషయంలో ఇంకా కొంత సందిగ్ధత కొనసాగుతోంది. అయినా, అధికారికంగా ఎలాంటి ప్రకటన లేక పోయినా, కొత్త అధ్యక్షుని ఎంపికకు సంబంధించి ఒక ప్రణాలికను సిద్ధం చేసేందుకు పార్టీ ముఖ్యనేతలతో స్వయంగా పవార్ ప్రకటించిన కమిటీ కసరత్తు ప్రారంభించింది. వారసుని ఎంపిక ప్రకియ మొదలైంది.  ఈ నేపధ్యంలో, శరద్ పవార్ ఎన్సీపీ అధ్యక్ష బాధ్యతల నుంచి తప్పుకోవడం ఖాయంగానే కనిపిస్తోంది. అందులో సందేహం, లేదు. అయితే  శరద్ పవార్ ఇంత సడన్ గా ఈనిర్ణయం ఎందుకు తీసుకున్నారు? శరద్ పవార్ సమీప బంధువు, మాజీ ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ చెప్పినట్లుగా కేవలం వయసు రీత్యానే పవార్ పక్కకు తప్పుకున్నారా? లేక.. శివసేన ఉద్ధవ్ థాకరే వర్గం నేత, రాజ్యసభ ఎంపీ, సంజయ్ రౌత్ అనుమానించిన విధంగా, శరద్ పవార్ బిగ్ డెసిషన్ వెనక ఇంకా ఏదైనా మతలబు ఉందా అనేది తెలియవలసి వుంది. అంతే కాదు, సంజయ్ రౌత్ శరద్ పవార్ నిర్ణయంతో మహరాష్ట్ర రాజకీయలలోనే కాదు, జాతీయ రాజకీయలోనూ ఏదో అలజడి జరగబోతోందని అన్నారు. అన్నిటి కన్నా ముఖ్యంగా  పవార్ ప్రకటనకు చాల ముందుగా, ఏప్రిల్ 19న  పవార్ కుమార్తె సుప్రియా సూలే, 15 రోజుల్లో రెండు రాజకీయ ప్రకంపనలు (భూకంపాలు) వస్తాయని చెప్పారు. ఆమె ఈ మాట చెప్పిన 13వ రోజే శరద్ పవార్ పార్టీ అధ్యక్ష పదవికి రాజీనామా చేశారు. 24 ఏళ్లపాటు ఆయన ఎన్సీపీ అధ్యక్షుడిగా కొనసాగారు. ఈ నేపథ్యంలో సుప్రియ చెప్పిన రెండో భూకంపం ఏంటనేది ఆసక్తికరంగా మారింది.  అదలా ఉంటే, శరద్ పవార్ వారసులు ఎవరు అనే ప్రశ్నకు సమాధానంగా పవార్‌ కుమార్తె సుప్రియా సూలే, సమీప బంధువు అజిత్‌ పవార్‌ పేర్లు తెరపైకి వచ్చాయి. వీరి పేర్లను పార్టీ సీనియర్‌ నేత ఛగన్‌ భుజ్‌బల్‌ సిఫార్సు చేశారు. వీరిలో పార్లమెంట్‌ సభ్యురాలైన సుప్రియాను పార్టీ జాతీయ అధ్యక్షురాలిగా నియమించాలని, అదే సమయంలో రాష్ట్ర బాధ్యతలను అజిత్‌కు అప్పగించాలని పేర్కొన్నారు.ఇదే అంతిమ నిర్ణయం అవునా  కాదా అనేది ఒకటి రెండు రోజుల్లోనే తేలిపోతుందని అంటున్నారు. అలాగే,  సుప్రియా సూలే, చెప్పిన రెండో భూకంపం ఏంటనేది కూడా ఒకటి రెండు రోజుల్లోనే తెలిపోతుందని, పార్టీ నేతలు పేర్కొంటున్నారు.   నిజానికి అజిత్ పవార్‌ బీజేపీతో చేతులు కలపాలని భావిస్తున్నట్లు ప్రచారం జరిగిన నేపధ్యంలో మొదలైన  పవార్ బిగ్ డెసిషన్  ఎపిసోడ్ ఎలా ముగుస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. పవార్, వ్యూహాత్మకంగా పావులు కదిపి అజిత్ పవార్ కు చెక్ పెట్టారా? లేక... అనే  అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. నిజానికి గత కొంత కాలంగా శరద్ పవార్ బీజేపీకి దగ్గరవుతున్న సంకేతాలు ఇస్తూనే ఉన్నారు.ఈ నేపధ్యంలో ఏమి జరిగినా  ఆశ్చర్య పోనవసరం లేదని అంటున్నారు.  ఏమవుతుంది అనేది కాలమే నిర్ణయించాల్సి ఉంటుంది. నిజానికి పవార్ మనసులో ఏముందో ఎవరికీ తెలియదని సో.. పవార్ నెక్స్ట్ మువ్’ పై బెట్ కట్టడం అంట క్షేమం కాదని అంటున్నారు.

నా దారి రహదారి.. రజనీ

తమిళసూపర్ స్టార్ రజనీకాంత్ ఏది మాట్లాడినా స్పష్టంగా సూటిగా సుత్తిలేకుండా చెబుతారు. ఇటీవల ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా బెజవాడ వేదికగా ఆయన తెలుగుదేశం అధినేత చంద్రబాబు గురించి చెప్పిన మాటలు దానిపై వైసీపీ వర్గాల నుంచి వచ్చిన స్పందన నేపథ్యంలో చంద్రబాబు ఫోన్ చేస్తే.. విమర్శలను పట్టించుకోననీ, తాను ఏమనుకున్నానో అదే చెప్పానని అన్నారు. నిజమే.. రజనీకాంత్ ఏం చెప్పినా, ఏం మాట్లాడినా హృదయపూర్వకంగానే చెబుతారు. హృదయపూర్వకంగానే మాట్లాడతారు. అందుకే ఆయన వివాదరహితుడిగా దశాబ్దాలుగా చలనచిత్ర పరిశ్రమలో  సూపర్ స్టార్ గా వెలుగొందుతున్నారు. ఇక ఆయన సినిమాలో ఓ డైలాగ్ ఉంది..  ఒక  సారి  చెపితే వంద సార్లు చెప్పినట్లే.. అని.. అది కేవలం సినిమాలకే పరిమితం కాదు.. నిజజీవితంలో కూడా రజనీకాంత్ చెప్పిన మాటకు కట్టుబడి ఉంటారు. తాను మనసా వాచా కర్మణా నమ్మితే తప్ప ఆయన మాట్లాడరు.  ఒకప్పడు  ఆయన రాజకీయ అరంగేట్రం గురించి, చాలా పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అభిమానుల అభిప్రాయ సేకరణ పేరిట  తమిళనాడులో అనేక సభలు, సమావేశాలు నిర్వహించారు. నిజానికి ఒక దశలో ఆయన   ప్రత్యక్ష రాజకీయాల్లోన ఒక కాలు పెట్టారు కూడా. సొంత పార్టీ పెడుతున్నానని ప్రకటించారు.  అయితే రాజకీయాలు తన ఒంటికి సరిపడవని తెలుసుకున్నాననీ, అందుకే తాను రాజకీయాలకు దూరం అని ప్రకటించేశారు.  రాజకీయ అరంగేట్రం చేయకుండానే, శుభం కార్డు వేశారు. ఆ తర్వాత ఆయన సైలెంటై పోయారు. గత కొన్ని సంవత్సరాలుగా రాజకీయాల గురుంచి ఆయన ఎక్కడా ఎలాంటి వ్యాఖ్య చేయలేదు. రాజకీయాలలో ఉన్న వారిలో ఆయనకు మిత్రులు ఉన్నారు. తనకు రాజకీయాలకు సంబంధం లేకపోయినా మిత్రుల గురించి ఒక మంచి మాట చెప్పడానికి రజనీకాంత్ ఎప్పుడూ వెనుకాడరు. ఎవరో ఏదో అనుకుంటారనీ, అంటారనీ ఆయన బెదరడు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా చంద్రబాబును ప్రశంసించినా.. అంతకు ముందు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడికి అన్యాయం జరిగిందని పేర్కొన్నా.. ఆయన తాను ఏది అనుకున్నారో, ఏది నమ్మారో అదే చెప్పారు. వెంకయ్యనాయుడిని ఉప రాష్ట్రపతి పదవికి ఎంపిక చేయడం తనకు నచ్చలేదనీ, అలా చేయడం ద్వారా ఆయనకు అన్యాయం జరిగిందని కుండబద్దలు కొట్టేశారు. అయితే రజనీ అభిప్రాయంతో వెంకయ్యనాయుడిని అభిమానించే వారే కాదు.. రాజకీయాల గురించి కొద్ది పాటి జ్ణానం, అవగాహన ఉన్న ఎవరైనా ఏకీభవిస్తారు.   వెంకయ్యకు అన్యాయం జరిగిందన్న తన వ్యాఖ్యలు బీజేపీ వారిని నొప్పిస్తాయని తెలిసినా రజనీ వెనుకాడలేదు. తన మనసులో మాట చెప్పేశారు. ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా విజయవాడలో జరిగిన కార్యక్రమంలో తెలుగుదేశం అధినేత చంద్రబాబుపై తన వ్యాఖ్యలు వైసీపీకి రుచించవని తెలిసినా తన మనసులో మాట బయటపెట్టడానికి రజనీకాంత్ వెనుకాడలేదు. తాను నమ్మిన విషయాన్ని చెప్పడానికి ఆయన ఇసుమంతైనా సందేహించలేదు.  అందుకే తన వ్యాఖ్యలపై వైసీపీ నుంచి వస్తున్న వ్యాఖ్యలు, విమర్శలు, దూషణలను ఆయన లెక్క చేయడం లేదు. ఏదో సామెత చెప్పినట్లు అటువంటి వ్యాఖ్యల వల్ల తన గౌరవానికి ఇసుమంత కూడా భంగం కలగదని ఆయనకు తెలుసు. 

మిత్రధర్మం పాటించని పెదరాయుడు!

టాలీవుడ్ హీరో, కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు.. ప్రస్తుతం ఎలా ఉన్నారు, ఆయన ఎక్కడ ఉన్నారు, ఏమైయ్యారనే  సందేహాలు   ఫిలింనగర్‌ వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఇటీవలే ఆయన రెండో కుమారుడు మంచు మనోజ్... వివాహం జరిగింది. ఆ సమయంలో ఆయన జస్ట్ అలా కనిపించారు అంతే.   అంతకు ముందు ఆ తర్వాత కూడా ఆయన అంతగా ఎక్కడా బయటకు వచ్చింది లేదు. కనిపించింది లేదు. మరోవైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్  ఎన్నికలు.. ఈ ఏడాది అక్టోబర్‌లో జరగనున్నాయి. అలాంటి వేళ.. మళ్లీ ఆయన ఈ ఎన్నికల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తారా?  గతంలో లా ఆయనకు మద్దతు లభిస్తుందా అన్న సందేహమూ ఫిల్మ్ నగర్ వర్గాల్లో వినిపిస్తోంది.  మరో వైపు విశ్వవిఖ్యాత నటసార్వభౌమ నందమూరి తారకరామారావు శతజయంతి సందర్బంగా.. ఏప్రిల్ 28వ తేదీన విజయవాడలో అన్నగారి జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ఆల్ ఇండియా సూపర్ స్టార్ రజినీకాంత్  ముఖ్య అతిథిగా పాల్గొని టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి విజనరీపై ప్రశంసల వర్షం కురిపించారు.  అలాగే వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు గెలవాలని   ఆశాభావం వ్యక్తం చేశారు. గెలిస్తే ఏపీ నంబర్ వన్ అవుతుందని అన్నారు. అయితే రజినీకాంత్ చేసిన వాఖ్యలపై జగన్ పార్టీకి చెందిన మంత్రులు   రోజా, జోగి రమేష్‌తోపాటు మాజీ మంత్రి కొడాలి నాని సైతం ఎప్పటిలాగానే.. తమదైన శైలిలో, తమదైన భాషలో విమర్శలు సంధించారు.  అయితే వీరి ఆరోపణలపై టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్పందించారు. రజినీకాంత్‌కి సీఎం జగన్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రజినీకాంత్‌పై ఇలా విమర్శలు వెల్లువెత్తిన వేళ.. టాలీవుడ్ నుంచి కూడా ఎవరైనా స్పందించి.. ఆ విమర్శలను ఖండించి ఉండాల్సిందనన ఓ అభిప్రాయం  ఫిలింనగర్ వర్గాల్లో వ్యక్తమవుతోంది.   టాలీవుడ్‌లో రజినీకాంత్‌కి అత్యంత ఆప్తులు ఎవరంటే.. తొలుత వినపడే పేరు.. హీరో  మోహన్ బాబు..  కనీనం ఆయన అయినా స్పందించి.. అధికార పార్టీ నేతలు విమర్శలను ఖండించి ఉంటే బావుడేందని ఆ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అదీకాక ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల వేళ.. తనకు చంద్రబాబును మోహన్ బాబే పరిచయం చేశారని రజినీ కాంత్ గుర్తు చేసుకున్నారని ఫిలింనగర్ వర్గాలు చెబుతున్నాయి.  వీరిద్దరు. .. కలిసి చాలా సినిమాలే చేశారని. వాటిలో పెద్దరాయుడు చిత్రం సూపర్ డూపర్ హిట్ సాధించింది. మోహన్ బాబు కెరీర్ బెస్ట్ హిట్ గా నిలిచింది.  అన్నిటికీ మించి మోహన్ బాబు తరచుగా రజనీకాంత్ తనకు ఆప్త మిత్రుడని చెబుతారు. అరేయ్, ఒరేయ్ అని పిలుచుకునేంత చనువు, ప్రేమ, అభిమానం తమ వద్ద ఉన్నాయంటారు. అటువంటప్పుడు మిత్ర ధర్మాన్ని పాటించైనా మోహన్ బాబు తమ పార్టీ నేతలు తన ఆప్తమిత్రుడిపై ఇష్టారీతిన నోరు పారేసుకుంటే కనీసం వారించడానికైనా నోరు విప్పకపోవడమేమిటని నిలదీస్తున్నారు.   ఇక తన వ్యాఖ్యలపై విమర్శలు వెల్లువెత్తిన వేళ.. సూపర్ స్టార్ రజినీ కాంత్ మరోసారి తనదైన శైలిలో స్పందించారు. నాలుగు రోజులు సైలెంట్‌గా ఉంటే.. వాగే నోళ్లే మూతపడతాయని తన ఫ్యాన్స్‌కి తలైవా సూచించి తన హుందా తనాన్ని చాటుకున్నారు. 

రజనీకాంత్ పై వైసీపీ దూషణలపై కిమ్మనని సినీ పరిశ్రమ

సినీ పరిశ్రమలో మంచి మనిషిగా, వివాదరహితుడిగా పేరొందిన రజనీకాంత్  ఎన్టీఆర్ శత జయంతి వేడుకల సందర్భంగా ఓ కార్యక్రమంలో మాజీ సీఎం, తెలుగుదేశం అధినేత చంద్రబాబునాయుడిని ప్రశంసించడంపై వైసీపీ నేతలు ఇష్టారీతిగా నోరు పారేసుకోవడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తం అవుతోంది. అన్ని వర్గాల నుంచీ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అయితే తెలుగు సినీ పరిశ్రమ మాత్రం ఆశ్చర్యకరంగా మౌనం దాల్చింది. ఏపీలో జగన్ పాలనలో  తన మనసులోని మాటను బయటకు  చెప్పుకుంటే కూడా సహించలేని వాతావరణం ఉందనడానికి చంద్రబాబు గురించి రెండు మంచి మాటలు చెప్పిన రజనీకాంత్ పై వైసీపీ నేతలు నోరుపారేసుకుంటున్న తీరే నిదర్శనమని పరిశీలకులు సైతం విశ్లేషిస్తున్నారు. వైసీపీ నేతల తిట్ల వర్షం రజనీకాంత్ చంద్రబాబును పొగిడినందుకు కాదనీ, తమ అధినేత దృష్టిలో పడటానికేనని కూడా కొందరు అంటున్నారు. అది పక్కన పెడితే.. రజనీకాంత్ పై వైసీపీ నేతలు విమర్శలతో సరిపుచ్చలేదు. ఆయన వ్యక్తిత్వ హననానికీ, ఆయనపై తిట్ల వర్షానికీ కూడా తెగబడుతున్నారు. తెలుగు చలన చిత్ర పరిశ్రమ నుంచి జగపతి బాబు మినహా ఒక్కడంటే ఒక్కడు.. ఆయనతో స్నేహం ఉన్నవారు, కలిసి నటించిన వారు ఎవరూ కూడా రజనీకాంత్ పై వైసీపీ నేతల తిట్ల పురాణాన్ని ఖండించిన పాపాన పోలేదు. మేమంతా  ఒకటే మాది కళాకారుల కుటుంబం.. మాలో మాకు లక్ష విభేదాలున్నా.. మాజోలికి ఎవరైనా వస్తే మేమందరం ఒక్కటే అంటూ డైలాగులు చెప్పే హీరోలు ఇప్పుడు రజనీకాంత్ పై బూతుల పంచాగం విప్పిన వైసీపీ నేతల వ్యాఖ్యలను, విమర్శలను ఖండిస్తూ ఒక్కటంటే ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం ఆశ్చర్యం. అన్నిటికీ మంచి రజనీకాంత్ తన ప్రాణ మిత్రుడంటూ వేదికలపై సైతం వాడు వీడు అంటూ తన చనువును ప్రదర్శించే మోహన్ బాబు సైతం.. తన ప్రాణ మిత్రుడిని సొంత పార్టీ నేతలే ఇష్టారీతిన నోరు పారేసుకుంటుంటే కిమ్మనకపోవడం ఆశ్చర్యకరం. ఆయన తరచూ చెప్పుకునేలా ఆయన ముక్కుసూటి తనం కేవలం మాటలకే పరిమితమా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.   అలీ, పోసాని, రోజా వంటి నటులు మాట్లాడలేదంటే అర్ధం చేసుకోవచ్చు. రోజాకు ముఖ్యమంత్రి జగన్ మంత్రివర్గపునర్వ్యవస్థీకరణ సందర్భంగా ఆమె జీవితాశయమైన మంత్రి పదవిని కట్టబెట్టారు. ఇక అలీ, పోసానిలకు అయితే మూడున్నరేళ్లు వెయిటింగ్ లో పెట్టినా ఏదో ఒక పదవి ఇచ్చారు. మరి అటువంటి వాళ్లు రజనీపై తమ పార్టీ నేతల దూషణలను ఎలా ఖండించగలరు? మంత్రి రోజా అయితే ఒక అడుగు ముందుకు వేసి తమ పార్టీ నేతలతో కలిసి రజనీకాంత్ పై విమర్శలు  గుప్పించారు. ఈ మొత్తం ఎపిసోడ్ లో పార్టీలతో సంబంధం లేని సినీ పరిశ్రమ ప్రముఖులు కూడా రజనీకాంత్ కు మద్దతుగా నిలవకపోవడాన్ని అందరూ ఎత్తి చూపుతున్నారు. రజనీకి మద్దతుగా నోరెత్తితే.. జగన్మాయ తమ కెరీర్ పై ప్రభావం చూపుతుందన్న భయమే కారణమా అంటున్నారు. ఇక అన్నిటికీ మించి రజనీకాంత్ ను సొంత పార్టీ నేతలు దుర్బాషలాడుతుంటే కనీసం వారించడానికి కూడా మోహన్ బాబుకు నోరు రాకపోవడంపై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.  

ఏపీ సర్కార్ సిట్ పై స్టే ఎత్తివేసిన సుప్రీం

గత ప్రభుత్వ హయాంలో జరిగిన అవినీతి అక్రమాలపై దర్యాప్తు కోసం జగన్ సర్కార్ ఏర్పాటు చేసిన సిట్ పై ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేను సర్వోన్నత న్యాయస్థానం ఎత్తివేసింది.  ఈ కేసును మెరిట్ ప్రాతిపదికన విచారించి తుది నిర్ణయాన్ని వెలువరించాలని హైకోర్టుకు జస్టిస్ ఎం.ఆర్.షా, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం (మే 3)న సూచించింది. గత ప్రభుత్వ విధాన నిర్ణయాలపై దర్యాప్తు కోసం ఏపీ ప్రభుత్వం ‘సిట్’ ఏర్పాటు చేయడాన్ని సవాల్ చేస్తూ తెలుగుదేశం నాయకులు నేతలు వర్ల రామయ్య, ఆలపాటి రాజా తదితరులు ఏపీ హైకోర్టును ఆశ్రయించారు.  వారి పిటిషన్ ను విచారణకు స్వీకరించిన ఏపీ హై కోర్టు సిట్ ఏర్పాటుపై స్టే ఇచ్చింది. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ జగన్ సర్కార్ సుప్రీంను ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్టు ఏపీ హైకోర్టు సిట్ దర్యాప్తుపై విధించిన స్టేను ఎత్తివేస్తూ తీర్పు వెలువరించింది.  అయితే ఈ సందర్భంగా సుప్రీం కోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. సీట్ దర్యాప్తున ప్రాథమిక దశలోనే అడ్డుకోవడం సమంజసం కాదనీ, అందుకే హైకోర్టు ఇచ్చిన స్టేను ఎత్తివేస్తున్నట్లు పేర్కొంది. అంతే కాకుండా  స్టే ఎత్తివేయడంలో తాము వ్యక్తం చేసిన అభిప్రాయాలతో సంబంధం లేకుండా స్వతంత్రంగా ఈ కేసు విచారించి తుది నిర్ణయం తీసుకోవాల్సిందిగా సుప్రీం ఈ సందర్బంగా ఏపీ హైకోర్టుకు సూచించింది.  సిట్ పై ఏపీ హైకోర్టు స్టే విధిస్తూ ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను కోట్టివేయడానికి ఈ కేసులో ప్రాథమిక దశలోనే  జోక్యం చేసుకోవడమే కారణమని పేర్కొంది.   

సచివాలయం దేవాలయం సచివులు దేవుళ్ళా ?

చదవేస్తే ఉన్నమతి పోయిందన్నది సామెత. తెలంగాణలో మంత్రుల మాట తీరు చూస్తే ఒకరి తర్వాత ఒకరు ఆ సామెతను నిజం చేస్తున్నారా అని అనిపించక మానదు.  ఇతరుల సంగతి ఎలా ఉన్నప్పటికీ. మంత్రి కల్వకుట్ల తారక రామా రావు ( సచివాలయానికి ఇచ్చిన తాజా నిర్వచనం వింటే, ఈయన అమెరికా వెళ్లి చదువుకున్నది ఇదేనా, అనే సందేహం కలుగుతోందంటున్నారు. తెలంగాణ ప్రభుత్వం కోట్ల రూపాయల ప్రజాధనాన్ని ఖర్చు పెట్టి దివ్యమైన సచివాలయాన్ని నిర్మించింది. అంతే కాదు, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ పేరున, డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయం అని నామకరణం చేసింది. అలాగే, సెక్రటేరియట్ నుంచి కన్నెత్తి చూస్తే కనిపించేలా అంబేడ్కర్ భారీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. అయితే, ఇంతచేసి సెక్రటేరియట్ గేటుకు ‘ప్రజలకు ప్రవేశం లేదు’ అనే బోర్డును పెట్టలేదు దాదాపుగా ప్రభుత్వం అదే చేస్తోంది. సమాన్య ప్రజలను కాదు, చివరకు అధికార ఆపార్టీ ఎమ్మెల్యేలు, ఎంపీలను కూడా సెక్రటేరియట్ లోకి అనుమతించడం లేదని విపక్షాలే కాదు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు కూడా ఆరోపిస్తున్నారు. ఎవరిదాకానో ఎందుకు పీసీసీ అధ్యక్షుడు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డిని కూడా గేటు దాటనీయ లేదని ఆయనే మీడియా సమావేశంలో ఆరోపించారు. దీంతో ప్రగతి భవన్ లా సెక్రటేరియట్  కూడా కొందరి కోసమేనా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో ప్రజాస్వామ్యం గురించి పెద్ద మాటలు మాట్లాడే ఢిల్లీ ముఖ్యమంత్రి అరవిందం కేజ్రివాల్ కూడా ఇలాగే  మీడియాకు ఎంట్రీ లేకుండా చేశారు.. ఇప్పడు మళ్ళీ ఇంతకాలానికి తెలంగాణ ముఖ్యమంత్రి కేసేఆర్  సచివాలయంలోకి మీడియా ఎంట్రీని రిస్ట్రిక్ట్ చేశారని అంటున్నారు.    ఈ నేపథ్యంలోనే, యూఎస్ రిటర్న్ మంత్రి కేటీఆర్  సచివాలయం అంటే సచివుల ఆలయం అనే కొత్త నిర్వచనం ఇచ్చారు.  సచివాలయం దేవాలయం, సచివులు దేవుళ్ళు అనే అర్థ వచ్చేలా, సచివాలయం అంటే సచివులు ఉండే ఆలయం మాత్రమే అని కేటీఅర సెలవిచ్చారు. అందుకే  సచివాలయంలోకి సామాన్యులను అనుమతించడం లేదని చెప్పారు. నాలుగు రోజుల కిందట ( ఏప్రిల్ 30న) ముఖ్యమంత్రి కేసీఆర్ స్వహస్తాలతో నూతన సెక్రటేరియట్ భవనాన్ని ప్రారంభించినప్పటి నుంచి  సచివాలయం వివాదాల నిలయంగా మారింది. సచివాలయ ప్రారంభోత్సవానికి రాష్ట్ర గవర్నర్ ను ఆహ్వానించక పోవడం మొదలు అస్మదీయ మీడియాను మాత్రమే ఆహ్వానించడం వరరూ  సచివలయాం చుట్టూ  అనేక వివాదాలు నడుస్తున్నాయి.  ఈ నేపథ్యంలో రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన సందర్భంగా విలేకరుల సమావేశంలో కొందరు విలేకరులు  సచివాలయంలోకి మీడియాను అనుమతించక పోవడానికి సంబంధించి అడిగిన ప్రశ్నకు కేటీఆర్ సచివాలయం దేవాలయం ..సచివులు దేవుళ్ళు   సచివాలయంలోకి వారికి మాత్రమే అనుమతి ఉంటుందని మీడియా మిత్రులకు జ్ఞానబోధ చేశారు.  అలాగే  మంత్రి కేటీఆర్  కర్ణాటకఎన్నికలకు సంబంధించి బీజేపీ విడుదల చేసిన మేనిఫెస్టోపై కూడా తమ అమూల్య అభిప్రాయం వ్యక్తం చేశారు. నిన్నమొన్నటి వరకు ఉచితాలు దేశానికి మంచిది కాదంటూ ప్రధాని మోదీ పదే పదే గొంతు చించుకున్నారని, కానీ.. కర్ణాటకలో మూడు సిలిండర్లు, పాలు ఫ్రీ అంటూ బీజేపీ మేనిఫెస్టోలో ప్రకటించారని విమర్శించారు. అంత వరకు ఓకే కానీ, మంత్రి కేటీఆర్  ‘మా ఇంటికొస్తే మాకేం తెస్తావ్, మీ ఇంటి కొస్తే మాకేంపెడతావ్’ అని  మైండ్సెట్’ ట్యూన్ చేసి పెట్టుకున్నారో ఏమో కానీ  కర్ణాటకు ఇచ్చినప్పుడు దేశంలోని ఇతర, రాష్ట్రాలకు ఫ్రీ సిలిండర్లు ఎందుకు ఇవ్వరని నిలదీశారు. నిజానికి, ప్రీ సిలెండర్లు ఇచ్చేది మోదీ కాదు, కేంద్ర ప్రభుత్వం కాదు, కర్ణాటక ప్రభుత్వం. అది కూడా బీజేపీ అధికారంలోకి వస్తే కర్ణాటక ప్రభుత్వం ఆ పథకాన్ని అమలు చేస్తుంది. ఇది సామాన్యులకు కూడా అర్థమయ్యే విషయమే. కానీ యూఎస్ రిటర్న్ మంత్రి గారికి ఎందుకు అర్థం కాలేదో ఏమో కానీ, కేటీఆర్ తీరు చూస్తే  చదవేస్తే ఉన్నమతి పోయిందనే సామెత గుర్తుకు వస్తోందని అంటున్నారు.

బీఆర్ఎస్ పోలవరం రాగం ఎందుకంటే..?

ఏపీలో ఎంట్రీ కోసం బీఆర్ఎస్ చేస్తున్న ప్రయత్నాలు ఫలించడం లేదు.  అక్కడ ప్రజాభిమానం సంపాదించడానికి బీఆర్ఎస్ అధినేత చేస్తున్న ప్రయత్నాలు ఒక అడుగు ముందుకు రెండడుగులు వెనక్కు అన్నచందంగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ కమిటీని ఏర్పాటు చేసి చాలా కాలమే అయినా ఇంత వరకూ అక్కడ కనీసం బహిరంగ సభ కూడా నిర్వహించలేని పరిస్థితి ఉంది.  నిన్నటి దాకా పోలవరం ప్రాజెక్టు వల్ల తెలంగాణకు నష్టం అంటూ విమర్శలు గుప్పించిన బీఆర్ఎస్ ఇప్పుడు ఏపీకి జీవనాడి వంటి పోలవరం ప్రాజెక్టు నిర్మాణం కేవలం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వల్లే అవుతుందంటూ ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏపీలో కాలు పెట్టేందుకు బీఆర్ఎస్ పోలవరంను అస్త్రంగా వాడుకోవాలని ప్రయత్నిస్తోంది. నిన్న మొన్నటి విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను అడ్డుకుంటామనీ, బిడ్ దాఖలు చేసి విశాఖ ఉక్కును కాపాడుతామనీ బీరాలు పలికి చివరకు చేతులెత్తేసిన బీఆర్ఎస్ ఇప్పుడు జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం పూర్తి చేస్తానంటూ ప్రకటనలు గుప్పిస్తోంది.   ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రాంత నాయకుల వల్ల తెలంగాణకు తీవ్ర నష్టం జరిగిందని ఉద్యమించి రాష్ట్రాన్నిసాధించిన బీఆర్ఎస్ (అప్పుడు తెరాస)   ఆ తరువాత పోలవరం ప్రాజెక్టుతో తెలంగాణను ముంచారని విమర్శలు గుప్పించారు. అయితే ఇప్పుడు ఏపీలో బీఆర్ఎస్ ప్రస్థానం మొదలు పెట్టేందుకు నాడు విమర్శించిన పోలవరం ప్రాజెక్టునే ఆయుధంగా మలచుకుంటున్నారు. బీఆర్ఎస్ నాయకుల ప్రకటనల చూస్తుంటే.. ఏపీ బాగు కోసం పోలవరం పూర్తి చేస్తామనీ, అందుకోసం తెలంగాణ మునిగిపోయినా ఫరవాలేదనీ చెబుతున్నారా అనిపించక మానదు.  

ఆహ్వానమే పంపకుండా రాలేదంటూ నిందలా?

మంత్రి జగదీశ్ రెడ్డి అత్యుత్సాహంతో గవర్నర్ తమిళిసై పై చేసిన విమర్శలు, వ్యాఖ్యలు కేసీఆర్ సర్కార్ ను యిరుకున పెట్టాయా అంటే ఔననే సమాధానం వస్తోంది. అసలు గత కొన్నేళ్లుగా రాజ్ భవన్, ప్రగతి భవన్ మధ్య సంబంధాలు ఉప్పు.. నిప్పులా ఉన్న సంగతి విదితమే. పెండింగ్ ఫైళ్ల విషయంలో ప్రభుత్వం, గవర్నర్ తగాదా సుప్రీం కోర్టు వరకూ కూడా వెళ్లింది. అంతకు ముందు తెలంగాణ బడ్జెట్ సమావేశాల వ్యవహారంలో కూడా గవర్నర్ వర్సెస్ ప్రభుత్వం పంచాయతీ కోర్టు కెక్కింది.  అప్పట్లోనే..  వ్యవస్థల మధ్య, వ్యక్తుల మధ్య విభేదాలు   ఈ స్థాయికి చేరుకోవడం ప్రజాస్వామ్య స్పూర్తికి విరుద్ధమనీ, అయితే తెలంగాణ ప్రభుత్వం,  ముఖ్యమంత్రి కే. చంద్రశేఖర రావు, గవర్నర్ తమిళి సై సౌందరరాజన్ మధ్య నెలకొన్న ఘర్షణాత్మక వాతావరణం మర్యాద గీతను దాటేసిందనీ విమర్శలు వెల్లువెత్తాయి. అటు గవర్నర్, ఇటు ప్రభుత్వం కూడా తగ్గేదేలా అన్నట్లుగా పరస్పర విమర్శలతో బహిరంగ రచ్చకు ఎంత మాత్రం వెనుకాడని పరిస్థితి ఎంత మాత్రం సరికాదన్న వాదనలూ వినిపించాయి. రిపబ్లిక్ డే వేడుకల నిర్వహణ విషయంలో కోర్టు తెలంగాణ సర్కార్ కు అక్షింతలు వేసింది. ఆ తరువాత అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా గవర్నర్, ప్రభుత్వం మధ్య అగాధం.. మరో సారి కోర్టు మెట్లు ఎక్కింది.  అలాగే గవర్నర్  తమిళిసై కూడా  ప్రొటోకాల్ ఇవ్వడం లేదని బహిరంగ విమర్శలకు దిగడమే కాకుండా.. ప్రభుత్వ విధానాలను కూడా తూర్పారపడుతున్నారు. అందుకు ఆమె మీడియా సమావేశాలనే ఉపయోగించుకుంటున్నారు.   గవర్నర్, ప్రభుత్వం మధ్య విభేదాలు కొత్త కాదు కానీ.. రాజ్యాంగ సంక్షోభం తలెత్తేంతగా ముదిరిపోవడం మాత్రం దేశంలో బహుశా ఇదే తొలిసారి.   గవర్నర్‌ విషయంలో ప్రోటోకాల్ పాటించకుండా తెలంగాణ సర్కార్ ఇబ్బంది పెడుతోందనే విమర్శలు చాలా రోజులుగా ఉన్నాయి. అసలు ప్రోటోకాల్ ఇవ్వకపోగా.. ఆమె తెలంగాణను అవమానిస్తోందంటూ విమర్శలు చేయడం మంత్రులకు పరిపాటిగా మారింది. తాజాగా మంత్రి జగదీష్ రెడ్డి మరోసారి అలాంటి విమర్శలే చేశారు. అయితే ఆయన తాజా విమర్శలు ప్రభుత్వాన్ని చిక్కుల్లో పడేసే అవకాశాలున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. కొత్త సచివాలయం ప్రారంభోత్సవానికి  గవర్నర్ రాలేదంటూ తమిళిసై సౌందరరాజన్ పై మంత్రి జగదీష్ రెడ్డి విమర్శలు చేశారు.  సచివాలయం ప్రారంభోత్సవానికి రావడం, రాకపోవడం అనేది ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నామంటూ.. ఆమె గైర్హాజర్ వల్ల ఆమె నిజస్వరూపమే బయటపడిందంటూ వ్యాఖ్యానించారు.  తెలంగాణ అభివృద్దిని చూసి  తట్టుకోలేకపోతున్నారని కూడా అన్నారు.  అయితే జగదీశ్వరరెడ్డి విమర్శలపై రాజ్ భవన్ ఘాటుగా స్పందించింది.  నూతన సచివాలయ ప్రారంభోత్సవానికి సంబంధించి ప్రభుత్వం నుంచి గవర్నర్‌కు ఆహ్వానం అందలేదని, పిలవని పేరంటానికి గవర్నర్ ఎలా వస్తారని నిలదీసింది.  ఒక వేళ ప్రభుత్వం నుంచి గవర్నర్ కు ఆహ్వానం అంది ఉంటే.. అందినా ఆమె రాకపోయి ఉంటే.. జగదీశ్ రెడ్డి విమర్శలలో ఒక అర్ధం ఉండేది. కానీ  గవర్నర్ కు ఆహ్వానం అందలేదని రాజ్ భవన్ స్పష్టం చేసిన తరువాత కూడా ప్రభుత్వం నుంచి, కానీ విమర్శలు చేసిన మంత్రి జగదీశ్ రెడ్డి నుంచి కానీ ఎటువంటి స్పందనా లేకపోవడంతో  గవర్నర్ విషయంలో ప్రభుత్వంమరోసారి ప్రొటోకాల్ పాటించలేదని బైటపడింది.  

సర్వోన్నత న్యాయస్థానం తీర్పులూ చట్టాలే.. సుప్రీంకోర్టు

దేశ సర్వోన్నత న్యాయస్థానం వెలువరించే తీర్పులు ఈ దేశ చట్టాల వంటివేనని, వాటిని ఎవరూ ధిక్కరించడానికి  వీల్లేదని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. గత ఏడాది జులైలో వెలువరించిన ఓ తీర్పు అమలుకు సంబంధించి దాఖలైన కేసులో న్యాయమూర్తులు జస్టిస్ ఎస్. కె. కౌల్, జస్టిస్ ఎ. అమానుల్లా తో కూడిన ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. కోర్టు తీర్పులు అమలుకావడం లేదనే కేసులు అత్యధికంగా ఉత్తరప్రదేశ్ నుంచి వస్తున్నాయని కోర్టు పేర్కొంది. తమ ఆదేశాలను అలహాబాద్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ముందు ఉంచడం సముచితమని భావిస్తున్నామని పేర్కొంది. సుప్రీంకోర్టు తీర్పును అమలు చేయడం లేదని దాఖలు చేసే కేసులను స్వీకరించబోమని పేర్కొంది. అలాంటి కేసులను తమ ముందుకు తీసుకురావద్దని కోర్టు రిజిస్ట్రీకి ధర్మాసనం స్పష్టం చేసింది. సర్వోన్నత న్యాయస్థాన తీర్పులు సక్రమంగా అమలుకాని పరిస్థితుల్లో హైకోర్టులు అందుకు తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని తెలిపింది. తమ పర్యవేక్షణలోని సబ్ ఆర్డినేట్ కోర్టులు... చట్ట నిబంధనల ప్రకారం పనిచేసేలా చూడాల్సిన బాధ్యత హైకోర్టులపైనే ఉంటుందని గత ఏడాది మార్చిలో ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు పేర్కొంది. మేజిస్ట్రేట్లు ఇచ్చే ఆదేశాలు ఉన్నత న్యాయస్థానాల తీర్పులను అతిక్రమించేలా ఉంటే వాటిని ఉపసంహరించుకునేలా చేయాలని, అటువంటి మేజిస్ట్రేట్లను మెరుగైన శిక్షణ కోసం జ్యుడీషియల్ అకాడమీకి పంపించాలని కూడా  దేశ సర్వోన్నత న్యాయస్థానం పేర్కొంది. నిందితులకు బెయిల్ మంజూరు నిబంధనలు క్రమబద్ధం చేయడం గురించి పలు మార్గదర్శకాలను అప్పుడు జారీ చేసింది. దీనికి సంబంధించి ప్రత్యేక చట్టం తీసుకురావడాన్ని పరిశీలించాలని కేంద్ర ప్రభుత్వానికి సూచించింది. సుప్రీం కోర్టు వెలువరించే  తీర్పులు..ఈ దేశ చట్టాల వంటివే, వాటి నిబంధనలను ఎవరూ ఉల్లంఘించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు కోర్టు ఆదేశాలను పాటించకుండా, అమలు చేయకుండా ఉల్లంఘించే ప్రభుత్వాలకు విస్ఫష్ట హెచ్చరిక వంటివేననడంలో సందేహం లేదు.