కోడికత్తి కేసు విచారణ మే 10కి వాయిదా
posted on Apr 28, 2023 @ 10:10AM
కోడి కత్తి కేసు విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ కేసులో నిందితుడు శ్రీనివాస్ ను రాజమండ్రి జైలు నుంచి వీడియో కాల్లో ఎన్‌ఐఏ కోర్టు విచారించింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని గతంలో సీఎం జగన్ పిటిషన్ దాఖలు చేశారు. అడ్వకేట్ కమిషనర్‌ను నియమించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణ చేపట్టాలని అభ్యర్ధించారు. అయితే ఈ రోజు కీలకమైన విచారణ జరుగుతుందని భావించినప్పటికీ.. తాత్కాలిక న్యాయమూర్తి కావడం.. పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించకపోవడంతో కేసును వాయిదా వేశారు. ప్రధానంగా సీఎం జగన్ రెండు పిటిషన్లు దాఖలు చేశారు. తాను కోర్టుకు హాజరు కాలేనని పేర్కొంటూ ఒక పిటిషన్.. దానికి సంబంధించి అడ్వకేట్ కమిషనర్‌ను ఏర్పాటు చేసి విచారించాలని కోరారు.
దీనిపై ఇప్పటికే నిందితుడి తరఫు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై ఇవాళ వాదనలు జరగాల్సి ఉంది. అదే సమయంలో మరో పిటిషన్ కూడా దాఖలు చేశారు. ఎన్‌ఐఏ పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి విచారణ జరపలేదని, పూర్తి స్థాయిలో మరొకసారి ఈ కేసుపై విచారణ చేయాలని న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. అంటే తాను సాక్షిగా ఉన్న ఈ కేసు విచారణ సాధ్యమైనంత సుదీర్ఘ కాలం సాగాలని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. ఎందుకంటే ఇప్పటికే.. కోడికత్తి దాడి కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) స్పష్టం చేసింది. ఈ కేసులో లోతైన దర్యాప్తు జరపాలంటూ జగన్ ఎన్ఐఏ కోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టివేయాలని కోరింది. ఈ కేసులో ఎలాంటి కుట్ర కోణం లేదనీ.. ఇదంతా సమయం వృధా వ్యవహారమనీ ఎన్ఐఏ కుండ బద్దలు కొట్టేసింది.
ఈ కేసులో నిందితుడిగా గత నాలుగేళ్లుగా జైల్లో ఉన్న జనుపల్లి శ్రీను తెలుగుదేశం పార్టీ సానుభూతి పరుడు కాదని పేర్కొంది. దీంతో తన హత్యకు కుట్ర అంటూ విపక్ష నేతగా పట్టుబట్టి సాధించుకున్న ఎన్ఐఏ దర్యాప్తు, జగన్ నాడు చెప్పిన దాంట్లో ఇసుమంతైనా వాస్తవం లేదని తేల్చేసింది. కోడికత్తి కేసులో మరింత లోతైన దర్యాప్తు జరపాలంటూ జగన్ దాఖలు చేసుకున్న పిటిషన్ కు ఎన్ఐఏ కౌంటర్ వేసింది. ఎయిర్ పోర్టులోని ఫ్యూజన్ రెస్టారెంట్ ఓనర్‌కు ఈ ఘటనతో సంబంధం లేదని స్పష్టం తేల్చేసింది.
గత వాయిదాలో సీఎం జగన్ తరపు న్యాయవాది రెండు పిటిషన్ లు దాఖలు చేశారు. విచారణకు రాకుండా మినహాయింపు ఇవ్వాలని, అలాగే కోడి కత్తి కేసులో కుట్ర కోణాన్ని వెలికి తీయడంలో ఎన్ఐఏ విఫలమైందనీ, మరింత లోతైన విచారణ చేపట్టేలా ఎన్ ఐ ఏ ను ఆదేశించాలని ఆ పిటిషన్లలో కోరారు. ఈ నేపథ్యంలోనే గురువారం (ఏప్రిల్ 27)న విచారణ కీలకం కానుందని అంతా భావించారు. అయితే ఈ కేసు విచారణ చేసిన న్యాయమూర్తి ప్రవెూషన్‌పై కడప జిల్లా కోర్టుకు బదిలీ కావడంతో ఆ స్థానంలో వచ్చిన తాత్కాలిక న్యాయమూర్తి.. పూర్తి స్థాయిలో బాధ్యతలు స్వీకరించిన తర్వాత విచారిస్తానని పేర్కొంటూ కేసును మే 10వ తేదీకి వాయిదా వేశారు.