దేశంలో కరోనా వ్యాప్తి.. మరణాల సంఖ్య పెరుగుతోందా?
posted on Apr 28, 2023 @ 12:14PM
దేశంలో కరోనా వ్యాప్తి ఉధృతి స్థిరంగా కొనసాగుతోంది. ప్రతీ రోజూ వేల సంఖ్యలో కేసులు నమోదౌతున్నాయి. వారం కిందటి వరకూ రోజుకు పది వేలకు పైగా కేసులు నమోదౌతూ వచ్చినా ఆ తరువాత ఆ సంఖ్య ఒకింత తగ్గింది. దీంతో కరోనా వ్యాప్తి తీవ్రత తగ్గుముఖం పట్టిందని అంతా భావించారు. ఇక కరోనా ఎంత మాత్రం పెండమిక్ కాదనీ, అది ఎండమిక్ దశకు చేరుకుందనీ, భయం అవసరం లేదనీ నిపుణులు కూడా చెబుతూ వచ్చారు.
అయితే ఉన్నట్లుండి కరోనా కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య పెరగడం సర్వత్రా ఆందోళనకు కారణమౌతోంది. గత 24 గంటలలో కరోనా బారిన పడి 44 మంది మరణించారు. ఇటీవలి కాలంలో ఈ స్థాయిలో మరణాలు సంభవించడం ఇదే మొదటి సారి. అదే సమయంలో కొత్తగా 7533 మందికి కొత్తగా కరోనా సోకింది. సామాజిక దూరం, మాస్కుల ధారణ గురించి వైద్య శాఖ ఎంతగా చెబుతున్నా, ప్రభుత్వాలు విస్తృతంగా ప్రచారం చేస్తున్నా జనం ఖాతరు చేయడం లేదు. అయితే ఈ అలక్ష్యం ప్రమాదకరమని వైద్య ఆరోగ్య శాఖ చెబుతోంది. స్థిరంగా కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతూ ఉండటం.. మరణాలు కూడా సంభవిస్తుండటంతో కరోనా జాగ్రత్తలు పాటించడం అనివార్యమని కేంద్రం ఆరోగ్య శాఖ చెబుతోంది.
కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాల ప్రకారం గత 24 గంటలలో కొత్తగా 7533 మంది కరోనా బారిన పడ్డారు. అదే సమయంలో 44 మరణాలు సంభవించాయి. దీంతో దేశంలో ఇంత వరకూ కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్య 5,31,468కి చేరింది.
ఔను నిజమే ఇటీవలి కాలంలో దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దేశ రాజదాని ఢిల్లీ సహా ఎనిమిది రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందని కేంద్ర ఆరోగ్యశాఖ ఆయా రాష్ట్రాలు,కేంద్రపాలిత ప్రాంతాల ప్రభుత్వాలను అప్రమత్తం చేసింది. ఢిల్లీ, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, హర్యానా, కర్ణాటక, కేరళ, మహారాష్ట్ర, రాజస్థాన్‌లతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాల్లో కరోనా కట్టడికి తగు చర్యలు చేపట్టాలని కోరింది. ఈ మేరకు 8రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, ప్రిన్సిపల్ సెక్రటరీలు, ఆరోగ్యశాఖ సెక్రటరీలకు ఇప్పటికే కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ లేఖ రాశారు.
గత నెల ప్రారంభం నుంచీ దేశంలో కొవిడ్ కేసులు సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, గడచిన వారం రోజుల్లో కొత్తగా నమోదవుతున్న రోజువారీ కేసుల సంఖ్య పదివేలకు పైగా ఉంటోందని కేంద్ర ఆరోగ్య సఖ కార్యదర్శి పక్షం రోజుల కిందట రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల కార్యదర్శులకు రాసిన లేఖలో పేర్కొన్నారు. అప్పటికీ ఇప్పటికీ కేసులలో స్వల్ప తగ్గుదల తప్ప పెద్దగా మార్పు లేదు. కరోనా మహమ్మారి నియంత్రణకు ఐదు అంచెల వ్యూహాన్ని అనుసరించాలని కేంద్ర ఆరోగ్య కార్యదర్శి భూషణ్ ఆ లేఖలో రాష్ట్రాలకు సూచించారు.
టెస్ట్-ట్రాక్-ట్రీట్-వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు పాటించాలని కోరారు. రాష్ట్ర ఆరోగ్య శాఖ ఈ అంశాలపై కీలక దృష్టితో సత్వర సమర్థవంతమైన ప్రజారోగ్య చర్యలను ప్రారంభించడం చాలా కీలకమని తెలిపారు. కోవిడ్ మహమ్మారి పూర్తిగా అంతమొందలేదని, నిర్లక్ష్యంగా ఉంటే ప్రమాదమని హెచ్చరించారు. మహమ్మారి పూర్తిస్థాయిలో అరికట్టాలంటే డేటా ఎప్పటికప్పుడు క్రమబద్దీకరించడం చాలా కీలకమని అన్నారు. అయితే ఆ దిశగా రాష్ట్రాల ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్న దాఖలాలు కనిపించడం లేదు.