బ్లాక్ మెయిల్ బాటలో విజయసాయి?!
posted on Aug 30, 2024 @ 12:15PM
ఆలూ లేదు చూలూ లేదు కొడుకు పేరు అన్నట్లుగా ఉంది విజయసాయి తీరు. ఎవరూ అడగకపోయినా ఆయన తనంత తానుగా నేను వైసీపీని వీడే ప్రశక్తే లేదని గొంతు చించుకుంటున్నారు. విజయసాయిరెడ్డి జగన్ కు దూరం జరుగుతున్నారని కానీ, ఆయన పార్టీని వదిలేసి మరో పంచన చేరుతారని కానీ ఎవరూ భావించడం లేదు. ప్రస్తతం వైసీపీనీ వీడి పోతున్న నేతల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా ఆ పార్టీ రాజ్యసభ సభ్యలు ఒకరిద్దరు తప్ప ఇంకెవరూ వైసీపీలో మిగిలే పరిస్థితి లేదన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ఇప్పటికే జగన్ కు అత్యంత సన్నిహితుడైన మోపిదేవి వెంకటరమణ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి, రాజ్యసభ సభ్యత్వానికీ కూడా రాజీనామా చేసేశారు. తాను తెలుగుదేశం గూటికి చేరనున్నట్లు విస్ఫష్టంగా చెప్పేశారు. ఆ సందర్భంగా మోపిదేవి వెంకటరమరణ వైసీపీపైనా, ఆ పార్టీ అధినేతపైనా సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు అది వేరే సంగతి. అదే విధంగా మోపిదేవితో పాటు మరో రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్ రావు కూడా పార్టీ సభ్యత్వానికీ, రాజ్యసభ సభ్యత్వానికీ రాజీనామా చేసేశారు. ఇదే దారిలో వైసీపీ రాజ్యసభ సభ్యుల అడుగులు పడుతున్నాయని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. జగన్ కు సమీప బంధువైన సుబ్బారెడ్డి, అక్రమాస్తుల కేసులో జగన్ సహ నిందితుడైన ఏ2 విజయసాయి రెడ్డి వినా మిగిలిన వారంతా వైసీపీని వీడుతారని పరిశీలకులు సైతం తమ విశ్లేషణల్లో అంచనా వేస్తున్నారు.
అంటే వైసీపీని వీడిపోతారని ప్రచారం జరుగుతున్న రాజ్యసభ సభ్యుల పేర్లలో విజయసాయి ఊసే లేదు. అయితే విజయసారి మాత్రం ఊరికి ముందే తాను పార్టీ మారే ప్రశక్తే లేదంటూ ట్వీట్ చేసేశారు. వాస్తవానికి విజయసాయిరెడ్డి పార్టీ మారతారని ఎవరూ లేశ మాత్రంగా కూడా భావించరు. ఎందుకంటే విజయసాయి రాజకీయం జగన్ తోనే మొదలైంది. జగన్ తోనే కొనసాగుతుంది. ఎందుకంటే జగన్ అక్రమాస్తుల కేసులో విజయసాయి ఏ2. అటువంటి విజయసాయి వైసీపీని వీడి బయటకు రావడమంటే.. జగన్ గుట్టుమట్లన్నీ వెల్లడి అయిపోతాయి. అలా వెల్లడి చేసే షరతుపైనే ఏ పార్టీ అయినా ఆయకు నీడ ఇస్తుంది. అన్నిటికీ మించి జగన్ హయాంలో జరిగిన అన్ని ఆర్థిక అవకతవకల వెనుకా ఆయన హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి.
ఎవరూ కనీసం ఊహా మాత్రంగా కూడా విజయసాయి వైసీపీని వీడుతారని అనుకోవడం లేదు. విజయసాయిని ఎవరూ వైసీపీలో ఉంటారా, గోడ దూకేస్తారా అని కూడా అడగలేదు. అయినా విజయసాయి తనంతట తానుగా పార్టీ మారడం లేదు అంటూ సోషల్ మీడియా వేదికగా గొంతు చించుకుంటున్నారు. దీంతోనే విజయసాయి మాటలకు అర్ధాలు వేరే ఉన్నాయా? అన్న సందేహాలు రాజకీయవర్గాలలో వ్యక్తం అవుతున్నాయి. లేదా పార్టీ మార్పు సంకేతాలను జగన్ కు పంపడం ద్వారా పార్టీలో తనకు ఇటీవలి కాలంలో తగ్గిన ప్రాధాన్యత, గుర్తింపును తిరిగి పొందేందుకు వైసీపీకి రాజీనామా అంటూ జగన్ కు హెచ్చరికలు పంపుతున్నారా? అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.