ఫైళ్ళ దగ్ధం తీగ లాగితే లిక్కర్ స్కామ్ డొంక కదిలింది..!

తీగ లాగితే డొంక కదిలిందన్నది సామెత.. కానీ ఏపీలో ఒక తీగ లాగితే ఏకంగా రెండు డొంకలు కదిలాయి. జగన్ హయాంలో వైసీపీ నేతల అక్రమ సంపాదన, భూకబ్జాల వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందన్నది వెల్లడి అవుతోంది. ముఖ్యంగా మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్ది రెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కుమారుడు, ఎంపీ మిథున్ రెడ్డిల అక్రమాల జాబితా కొండవీటి చాంతాడును మించి పోయిందన్ని పోలీసుల దర్యాప్తులో వెల్లడౌతోంది.

జగన్ హయాంలో పెద్దిరెడ్డి భూదందాల పర్వం అడ్డూ అదుపూ లేకుండా సాగిందనడానికి సాక్ష్యాలను మాయం చేసే క్రమంలో మదలపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఫైళ్లను దగ్ధం చేశారన్న ఆరోపణలపై పోలీసులు విస్తృత దర్యాప్తు చేపట్టారు. ఆ దర్యాప్తులో భూదందాలతో పాటు మద్యం కుంభకోణం గుట్టు కూడా బయటపడింది. ఫైళ్ల దగ్ధం కేసులో పోలీసులు చేసిన సోదాలలో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డిల మద్యం దందా వెలుగులోనికి వచ్చింది. సోమవారం (ఆగస్టు 26) సీఐడీ ఉన్నతాధికారులు మదనపల్లె ఫైళ్లదగ్ధం కేసు దర్యాప్తులో భాగంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిధున్ రెడ్డి సన్నిహితుల ఇళ్లలో నిర్వహించిన సోదాలలో దొరికిన పత్రాలలో వందల కోట్ల నగదు లావాదేవీలు వెలుగు చూశాయి. ఈ లావాదేవీలన్నీ మద్యం కుంభకోణంకు సంబంధించిందేనని తేలింది.  

ఏపీలో మద్యం స్కాం మొత్తం.. పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి,  ఆయన కుమారుడు మిథున్ రెడ్డి కనుసన్నల్లోనే జరిగిందని తేలింది. డిస్టిలరీలను లాక్కోవడం దగ్గర నుంచి విచిత్రమైన బ్రాండ్లను ప్రవేశ పెట్టడం వరకూ.. కమిషన్లు దండుకోవడం సహా పెద్ద ఎత్తున అవినీతి  జరిగింది. అంతే కాకుండా మద్యం విక్రయాలు మొత్తం నగదు లావాదేవీలు జరపడం వెనుక కూడా  కుట్ర ఉందని వెల్లడైంది. మదనపల్లి సబ్ కలెక్టర్ ఆఫీసులో ఫైర్ తర్వాత అధికారులు పెద్దిరెడ్డి సన్నిహితుల ఇళ్లల్లో సోదాలు నిర్వహించారు.  హైదరాబాద్ సహా పలు చోట్ల నిర్వహించిన సోదాల్లో కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అక్కడే లిక్కర్ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు కూడా దొరికాయి.

ఇప్పటికే వాసుదేవరెడ్డి దగ్గర తీసుకున్న వాంగ్మూలాల ఆధారంగా ఆ సాక్ష్యాలను విశ్లేషిస్తున్నారు. ఇంకా డిస్టిలరీలు పోగొట్టుకున్న పాత యజమానుల నుంచి కూడా పోలీసులు  వాంగ్మూలాలు రికార్డు చేశారు. ఏపీలో మ ద్యం కుంభకోణానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారం సీఐడీ సంపాదించిందని తెలుస్తోంది.  ఈ కుంభకోణంలో మిథున్ రెడ్డి పాత్రపై పూర్తి స్థాయిలో ఆధారాలు, సమాచారం లభించింది. దీంతో సీఐడీ ఆయనను అరెస్టు చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. సో నేడో, రేపో ఏపీ  లిక్కర్ స్కాంలో మిథున్ రెడ్డి అరెస్టు ఖాయమని వైసీపీ వర్గాలే అంటున్నాయి.