60 రోజుల్లో 6 సార్లు బెంగళూరుకు జగన్!

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, పులివెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి, బెంగళూరుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తున్నారు. అధికారం కోల్పోయిన 60 రోజుల వ్యవధిలో కనీసం అరడజను సార్లు ఆయన బెంగళూరు వెళ్లారు. ఆయన తరచుగా బెంగళూరు వెళ్లడంపై రాజకీయవర్గాలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అదే సమయంలో జగన్ ఆంధ్రప్రదేశ్ లో స్థిరంగా ఉండకపోవడం వైసీపీ శ్రేణుల స్థైర్యం, జగన్ పై నమ్మకం కోల్పోయేలా చేస్తున్నది. 

ఇప్పటికే పార్టీ ఓటమి తరువాత వైసీపీలో ఫైర్ బ్రాండ్ లుగా గుర్తింపు పొందిన నేతలంతా సైలెంట్ అయిపోయారు. వీలైనంతగా పార్టీకీ, పార్టీ అధినేతకూ దూరం జరిగారు. వైసీపీ అధికారంలో ఉన్న కాలంలో జగన్ కు కళ్లు, చెవులు, నోరుగా వ్యవహరించిన సకల శాఖల మంత్రిగా పెత్తనం చెలాయించిన సజ్జల మీడియా కంట పడకుండా తప్పించుకు తిరుగుతున్నారు. అలాగే పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతలు నిర్వహించిన ఆయన పుత్ర రత్నం పిల్ల సజ్జల పోలింగ్ అయిన మరునాటి నుంచే అయిపు లేకుండా పోయారు. ఇక విపక్షాలపై విమర్శలంటూ బూతులే అన్నట్లుగా వ్యవహరించి గుడివాడ మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి కొడాలి నాలి ఇంచుమించు అజ్ణాతంలోకి వెళ్లిపోయారు. ఇక గన్నవరం మాజీ ఎమ్మెల్యే అయితే బయటకనిపిస్తే అరెస్టే అన్న భయంతో ఎవరికీ అందుబాటులో లేకుండా పోయారు. మరో ఫైర్ బ్రాండ్ రోజా రాష్ట్రం దాటేశారని ఆ పార్టీ వర్గాలే అంటున్నాయి. ఇప్పుడు ఇక వైసీపీ తరఫున మాట్లాడేందుకు పేర్ని నాని, అంబటి వంటి వారు తప్ప మరెవరూ కనిపించడం లేదు.

చాలా మంది సీనియర్లు ఇప్పటికే పార్టీ వీడి వెళ్లిపోయారు. మరి కొందరు రాజకీయాలకే స్వస్తి పలికారు. ఈ పరిస్థితుల్లో జగన్ రాజకీయంగా ఒంటరి అన్న భావనతో తాడేపల్లిలో స్థిమితంగా గడప లేకపోతున్నారనీ, అందుకే సందు దొరికినా, దొరకకపోయినా బెంగళూరు చెక్కేస్తున్నారని అంటున్నారు. దీనికి తోడు జగన్ హయాంలో అవకతవకలు, అక్రమాలు, అన్యాయాలు, దౌర్జన్యాలపై దర్యాప్తు సాగుతోంది. ప్రాథమికంగా కొందరు నేతలు, అధికారుల పేర్లే బయటకు వస్తున్నప్పటికీ ముందు ముందు జగన్ కూడా విచారణ ఎదుర్కొనవలసి వస్తుందనీ, ఆ భయంతోనే సాధ్యమైనంత వరకూ రాష్ట్రం బయటే గడిపేయాలని జగన్ భావిస్తున్నారనీ పరిశీలకులు అంటున్నారు.