ఏలూరు వైసీపీ ఆఫీసు కూల్చేసింది ఎందుకంటే...

ఏలూరులో గత ఏడాది కాలంగా వున్న వైసీపీ కార్యాలయాన్ని శుక్రవారం (ఆగస్టు 16) నాడు కూల్చేశారు. దీని వెనుక రాజకీయ కారణాలు వున్నాయని కొంతమంది అనుకున్నారు. కానీ, అలాంటివేమీ లేవని వైసీపీ నుంచి తాజాగా బయటకి వచ్చిన ఆళ్ళ నాని స్పష్టం చేస్తున్నారు. శనివారం విలేకరుల సమావేశం ఏర్పాటు చేసిన ఆయన, వైసీపీ కార్యాలయం కూల్చివేత వెనుక వున్న అసలు విషయాన్ని స్పష్టంగా చెప్పారు. మీడియా సమావేశంలో ఆళ్ళనాని ఏం చెప్పారంటే...

‘‘వైసిపి ప్రాథమిక సభ్యత్వానికి కూడా నేను రాజీనామా చేస్తున్నాను. ఇకపై వ్యక్తిగతంగా అందరికీ అందుబాటులో ఉంటాను. ఏలూరులో పార్టీ ఆఫీస్ కూల్చివేతపై వినిపిస్తున్న ఆరోపణలు అపోహ మాత్రమే.  గత ఏడాదిగా పార్టీ కార్యాలయం ఉన్న స్థలాన్ని యజమానికి తిరిగి ఇవ్వాలని కోరిన విషయం పార్టీ రీజినల్ కో - ఆర్డినేటర్  మిథున్ రెడ్డికి కూడా తెలుసు. ఆగస్టు 1వ తేదిన పార్టీ కార్యాలయ స్థలాన్ని యజమానికి హ్యాండోవర్ చేయటం జరిగింది. ఆగస్టు 15  కార్యక్రమం అనంతరం స్థల యజమాని స్థలాన్ని పూర్తి స్థాయిలో హ్యాండోవర్ చేసుకున్నారు. ఇందులో ఎలాంటి ఆరోపణలకి తావు లేదు. పార్టీ కార్యాలయ స్థలాన్ని ఎవరైతే లీజుకు ఇచ్చారో  అతను అమెరికాలో ఉంటారు. అతని పేరు రవిచంద్ర నా మిత్రుడు. రాజకీయ పార్టీకి కార్యాలయం అంటే ఎవరూ ముందుకు రారు. కానీ, నా అభ్యర్థన మేరకు 2 సంవత్సరాల లీజు కోసం 2017లో ఆ స్థలం తీసుకున్నాము. ఆ తర్వాత దాంట్లోనే తాత్కాలిక నిర్మాణాలు చేపట్టాము. కానీ గత ఏడాదిగా ఆ స్థలం తిరిగి ఇవ్వాలని, దాన్ని డెవలప్మెంట్‌కి ఇచ్చుకుంటాం అని స్థల యజమాని కొరటం జరిగింది. ఆ విషయం గత ఏడాది రీజినల్ కో - ఆర్డినేటర్ మిథున్ రెడ్డికి చెప్పటం జరిగింది. ఆయన ఎన్నికలకు 3 నెలల ముందే స్థలం యజమానికి ఇచ్చేయాలని చెప్పటం జరిగింది. కానీ ఎన్నికల వేళ కార్యాలయం తీసేస్తే మంచి విధానం కాదు అని సమయం తీసుకోవటం జరిగింది.  15 రోజుల క్రితమే స్థలాన్ని యజమానికి హ్యాండోవర్ చేయాలని పార్టీ నాయకులు నిర్ణయించటం జరిగింది.  ఆగస్టు 1వ తేదీన స్థలాన్ని హ్యాండోవర్ చేసాము. ఆగస్టు 15 కార్యక్రమం నిర్వహణ కోసం స్థల యజమాని అనుమతి తీసుకుని కార్యక్రమాన్ని నిర్వహించాం.  అనంతరం ఆగస్టు 16 వ తేదిన స్థలాన్ని స్థల యజమాని పూర్తి స్థాయిలో హ్యాండోవర్ చేసుకున్నారు. అందులో వున్న నిర్మాణాలను కూల్చేశారు. ఇందులో ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదు... ప్రజలు నాయకులు గమనించాలి అని కోరుతున్నాను..

అలాగే కొద్ది రోజుల క్రితం నేను ఏలూరు జిల్లా వైసీపీ అధ్యక్ష పదవికి, ఏలూరు ఇన్‌ఛార్జ్ పదవికి రాజీనామా చేశాను.  అప్పుడు నేను పార్టీకి రాజీనామా చేయలేదు.  ఇప్పుడు నా వ్యక్తిగత కారణాల వల్ల పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నాను..  గెలుపు ఓటములకి అతీతంగా ఏలూరు ప్రజలకు ఎప్పటికీ రుణపడి ఉంటాను’’.