ఓ పతనమా? నీ పేరు సజ్జలా?
posted on Aug 22, 2024 @ 11:02AM
జగన్ అధికారంలో ఉన్నంత కాలం ఇష్టారీతిగా చెలరేగిపోయిన నేతలంత ఇప్పుడు తట్టాబుట్టా సర్దేసుకుని రాష్ట్రం వదిలి వెళ్లిపోతున్నారు. స్వయంగా వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డే తాడేపల్లి, బెంగళూరుల మధ్య షటిల్ సర్వీస్ చేస్తూ ఏపీకి చుట్టపు చూపుగా వచ్చి వెడుతున్నారు. యధా నేత తథా పార్టీ అన్నట్లుగా వైసీపీ నేతలు కూడా రాష్ట్రం దాటేస్తున్నారు. అలా దాటేస్తున్న వారంతా జగన్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని దౌర్జన్యాలకూ, దుర్మార్గాలకూ, అవినీతికీ పాల్పడిన వారే కావడం గమనార్హం. కొడాలి నాని, వల్లభనేని వంశీ, ఆర్కే రోజా వీళ్లంతా అధికారం అండ చూసుకుని అడ్డగోలుగా చెలరేగిపోయిన వారే. ఇప్పుడు వీరెక్కడా కనిపించడం లేదు. రాష్ట్రం దాటేశారు. కొడాలి నాని ఎక్కువగా హైదరాబాద్ లోనే ఉంటున్నారు. వల్లభనేని వంశీ ఎక్కడున్నారో తెలియడం లేదు. ముందస్తు బెయిలు కోసం మాత్రం కోర్టును ఆశ్రయించారు. ఇక ఆర్కే రోజా అయితే తన సహజ స్వభావానికి విరుద్ధంగా సైలెంటైపోయారు. చెన్నై చెక్కేశారని అంటున్నారు. ఇలా వైసీపీలో నోరున్న నేతలంతా నోరు కుట్టేసుకున్నారు.
ఇక జగన్ హయాంలో సకల శాఖల మంత్రిగా చక్రం తిప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి వైసీపీ అధికారం కోల్పోయాక మరీ నల్లపూస అయిపోయారు. అంతే కాదు.. పార్టీలోనే ఆయనపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. ఎన్నికలలో వైసీపీ ఘోర పరాజయానికి కారణం సజ్జలేనని పార్టీ నేతలూ, శ్రేణులూ బాహాటంగానే చెబుతున్నారు. దీంతో సజ్జల సైలెంటైపోయారు. జగన్ కూడా పెద్దగా పట్టించుకోవడం మానేశారు.
పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత సజ్జలకు అతికినట్లుగా సరిపోతుందని చెప్పాలి. నిజానికి ఒక జర్నలిస్ట్’గా, వ్యాపారవేత్తగా ఎదిగొచ్చిన సజ్జల రామకృష్ణా రెడ్డి గతం గురించి తెలిసిన ఎవరైనా, ఆయనొక జెంటిల్ మేన్, మంచి మనిషి అనే అంటారు. అయితే, రాజకీయ అరంగేట్రం తర్వాత ఆయనలో చాలా మార్పు వచ్చింది. సరే, అదలా ఉంచి, ప్రస్తుతంలోకి వస్తే, వైసీపీలో నెంబర్ 2 పొజిషన్’లో ఉన్నవిజయ సాయి రెడ్డిని ముఖ్యమత్రి జగన్మోహన్ రెడ్డి పక్కన పెట్టడంతో తెరపైకొచ్చిన సజ్జల, ఇక అక్కడ నుంచి, జగన్ రెడ్డి కళ్ళు, చెవులు, నోరూ అన్నీ తానే అన్నట్లు వ్యవహరించారు. అన్ని శాఖలకు ఆయనే మంత్రి అన్నట్లుగా వ్యవహారం నడిపించారు. ఆల్ ఇన్ వన్ సలహాదారుగా అవతరం ఎత్తారు. ఇప్పుడు అదంతా గతం. జగన్ అధికారం కోల్పోయిన తరువాత ఆయనకు మౌత్ పీస్ గా వ్యవహరించిన సజ్జల ఇప్పుడు తననే కాదు తన కుమారుడు పిల్ల సజ్జల అదే సజ్జల భార్గవ రెడ్డిని కాపాడుకోవాల్సిన పరిస్థితుల్లో పడ్డారు. జగన్ అండ చూసుకుని ఇష్టారీతిగా దాడులు, దౌర్జన్యాలు, అక్రమాలు, అవినీతికి పాల్పడ్డ వైసీపీ నేతలపై కేసులు నమోదౌతున్నాయి. అలాగే సజ్జలపైనా కేసు నమోదైంది. ఈ క్రమంలోనే ఆయన ఏపీ వదిలేసి హైదరాబాద్ కు షిఫ్ట్ అయిపోయారు.
జగన్ అధికారంలో ఉన్నంత కాలం ప్రభుత్వం తరఫున అయినా, పార్టీ తరఫున అయినా మీడియా ముందుకు వచ్చి మాట్లాడింది సజ్జల మాత్రమే. జగన్ కేవలం బటన్ నొక్కుడు సభలకు మాత్రమే పరదాలు కట్టుకుని బయటకు వచ్చి మాట్లాడేవారు. వైసీపీలో నోరున్న నేతలుగా గుర్తింపు పొందిన కొడాలి నాని, అంబటి రాంబాబు, రోజా, గుడివాడ అమర్నాథ్ వంటివారు సోషల్ ఎంత రెచ్చిపోయి మాట్లాడటం, బూతులతో చెలరేగి ప్రతిపక్ష నేతలపై అనుచిత వ్యాఖ్యలు చేయడానికే పరిమితం అయ్యారు. సజ్జల మాత్రం ప్రభుత్వ వెర్షన్ కు పర్యాయపదంగా నిలిచారు. ఆయన మాటలకు వెయిట్ ఉండేది. వివేకా హత్య కేసైనా, జగన్‌పై గులకరాయి దాడి గురించైనా వైసీపి వెర్షన్ సజ్జల రామకృష్ణా రెడ్డి నోటి నుంచే వచ్చేది. ఇప్పుడు వైసీపీ ఘోర పరాజయం తరువాత సజ్జల పార్టీకి శల్యసారథ్యం చేశారన్న విమర్శలు ఇంటా బయటా గట్టిగా వినిపిస్తున్నాయి. మొత్తం మీద వైసీపీలో ఎంత వేగంగా ఎదిగారో అంతే వేగంగా పతనమయ్యారు సజ్జల.