ఎవరీ క్యాష్‌గిరిబాబు..? పవర్ బ్రోకర్స్ యాక్టివ్ అయ్యారా?
posted on Aug 26, 2024 @ 6:47PM
(శుభకర్ మేడసాని, ఇన్‌పుట్ ఎడిటర్, తెలుగువన్)
వెల్‌కమ్ టు జర్నలిస్ట్ లాండ్రి. చంద్రబాబు పాలనలో ఒక అవినీతి అనకొండ గురించి కొన్ని నిజాలు తెలుసుకుందాం. ఎం.వి.శేషగిరిబాబు. ఒక సీనియర్ ఐఏఎస్ అధికారి. శేషగిరిబాబును ఆయన కింద పనిచేసే సిబ్బంది ప్రేమతో ‘క్యాష్‌గిరిబాబు’ అని పిలుచుకుంటారంట. అత్యంత వివాదాస్పద అధికారిగా ఆయన పేరు గడించారు. తన శాఖలోని సిబ్బందిని అంతులేని వేధింపులకు గురిచేస్తారని ‘మంచి’ పేరు వుంది. గతంలో స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో పనిచేసినప్పుడు ముఖ్యమంత్రి జగన్‌రెడ్డికి మీ సామాజికవర్గం అంటే ఇష్టం వుండదు. మీకు మీరు కోరుకునే పోస్టింగ్‌లపై ఆశ వదులుకోండి అని అధికారుల మొహమ్మీదే చెప్పేంత తెంపరితనం ఈ ఐఏఎస్ సొంతం. కేవలం జగన్ రెడ్డికి ఆ సామాజికవర్గం అంటే ఇష్టం వుండదు కాబట్టి, శేషగిరి అలా మాట్లాడ్డం కాదు. ఈయనగారిక్కూడా కమ్మ సామాజికవర్గం అంటే నరనరానా అంతులేని ద్వేషం అని చెప్పుకుంటారు. నిజానికి ‘క్యాష్‌గిరిబాబు’ జగన్ రెడ్డికి వీరభక్తుడు. జగన్ పాలనలో కొత్త విద్యా విధానాలు, బడులకు రంగులు వేయడం వంటి జగన్ లేకి పనులకు గొప్ప సంస్కరణలు అంటూ బహిరంగ సమావేశంలో మైకు ముందు విపరీతంగా పొగిడిన వీరభక్తుడు ఈ సీనియర్ ఐఏఎస్ అధికారి. ఒక బహిరంగ సమావేశంలో ‘క్యాష్‌గిరిబాబు’ నోటి నుంచి రాలిన ముత్యాలు ఇవిగో... ‘‘విద్యారంగంలో పలు విప్లవాత్మకమైన, వినూత్నమైన మార్పులు తీసుకువచ్చి, సామాన్యులకు కూడా నాణ్యమైన విద్య అందించాలనే తపనతో, ప్రత్యేక శ్రద్ధతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి, పాఠశాలలను, కళాశాలలను ఆధునీకరించడం, డిజిటల్ ఎడ్యుకేషన్, డిజిటల్ బోధనను ప్రవేశపెట్టడం లాంటి అనేక వినూత్న సంస్కరణలతో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విద్యకు అనేక అంశాల్లో కేటాయింపులు చేసిన గౌరవ ముఖ్యమంత్రివర్యులు’’. భజన పీక్స్‌లో వుంది కదూ!
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తన స్థాయి తగ్గించుకుని మరీ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్‌గా వచ్చారు. ఎవరైనా కావాలని స్థాయి తగ్గించుకుంటారా? మరి శేషగిరి ఎందుకు తగ్గించుకున్నారు? ఎందుకంటే, ముందే చెప్పుకున్నట్టు ఆయన క్యాష్‌గిరి కాబట్టి. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖలో ఏ స్థాయిలో అవినీతి వుంటుందో మీకు తెలియనిది కాదు. ఈయన గారిని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ శాఖ కమిషనర్‌గా ఎవరి సిఫారసుతో నియమించారు? ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియకుండా లేదా రెవెన్యూ మంత్రికి తెలియకుండా నియామకం జరిగిందా? ఒక పవర్ బ్రోకర్‌కు పైసలు చెల్లించి ఈ స్థానంలోకి వచ్చారనే వార్త పెద్ద ఎత్తున ప్రచారంలో వుంది. కమిషనర్ పదవిలోకి వచ్చీ రాగానే సబ్ రిజిస్ట్రార్ల పోస్టింగ్‌లో కాసుల కమీషన్ల వేట ప్రారంభించారు. ఆ కలెక్షన్ కోసం తన సామాజికవర్గానికి చెందిన ఒక ఆడిట్ రిజిస్ట్రార్‌ను తన ఏజెంట్‌గా నియమించుకుని, రెవిన్యూ మంత్రికి, ముఖ్యమంత్రి కార్యాలయానికి తెలియకుండా సబ్ రిజిస్ట్రార్ల బదిలీల ప్రక్రియ వేగవంతం చేశారు. రాష్ట్రంలో అత్యంత ఆదాయాన్నిచ్చే విజయవాడ బెంజ్ సర్కిల్ సబ్ రిజిస్ట్రార్‌ను బదిలీ చేశారు. దానికి పాత డిప్యుటేషన్లు రద్దు చేస్తున్నాం అని కలరింగ్ ఇచ్చారు. వాస్తవానికి అక్కడ పనిచేస్తున్న అధికారి గతంలో వైసీపీ వేధింపుల దాష్టీకానికి గురైన వ్యక్తి కావడం విశేషం. హైకోర్టు అతని సర్వీసు రికార్డును పరిశీలించి, ప్రభుత్వానికి అతని ద్వారా వందల కోట్ల పన్ను రాబడి తెచ్చిన తీరు చూసి, ఇటువంటి అధికారిని వేధించడమా అని హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేస్తూ, మళ్ళీ అదే బెంజ్ సర్కిల్లో అతనికి పోస్టింగ్ ఇవ్వండి అంటూ ఆదేశించింది. జగన్ రెడ్డికి, శేషగిరిబాబుకు నచ్చని సామాజికవర్గం వ్యక్తి కాబట్టి బదిలీవేటు వేశారు. తనకు నచ్చినవారిని బెంజ్ సర్కిల్లో సబ్ రిజిస్ట్రార్‌గా పోస్టింగ్‌లోకి తెచ్చారు. ఈ ఒక్క పోస్టింగ్ కోసం ఎన్ని కోట్లు చేతులు మారాయో మీ ఊహకు అందదు. రెవిన్యూ మంత్రికి తెలిసే జరిగిందా? శేషగిరిబాబు మొత్తం క్యాష్ చేసుకున్నారా అనేది తెలియాల్సివుంది. అంతేకాదు, రాష్ట్రంలో జల్లెడ పట్టి మరీ తనకు నచ్చని సామాజికవర్గానికి చెందిన ఉద్యోగస్తులను వేధింపులకు గురిచేసే పనిలో నిమగ్నమైనట్టు విశ్వసనీయ సమాచారం.
విజయవాడలో గుణదల, గాంధీనగర్ సబ్ రిజిస్ట్రార్లుగా పనిచేస్తున్న కృష్ణప్రసాద్, చైతన్యలను టార్గెట్ చేసి, ఆ స్థానాల నుంచి వారిని పంపించేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానాలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. వీరిద్దరూ కమ్మ సామాజికవర్గానికి చెందినవారు. గతంలో వైసీపీ ప్రభుత్వానికి వీరిద్దరు అంటకాగి పనిచేసినట్టుగా వీరిద్దరిపై ఆకాశరామన్న లేఖతో ప్రచారం జరుగుతోంది. ఈ ఆకాశరామన్న ఉత్తరాన్ని గుణదల సబ్ రిజిస్ట్రార్ కృష్ణప్రసాద్‌కు రిజిస్టర్ పోస్టులో పంపించారు. ఆకాశరామన్న ఉత్తరం కవర్ మీద ఫ్రమ్ అడ్రస్ మాత్రం పి.సురేష్, గూడవల్లివారి వీధి, డోర్ నంబర్ 27-33-43, టూ టౌన్ గవర్నర్‌పేట అని అని వుంది. వాస్తవానికి ఇది ఫేక్ అడ్రస్. ఈ ఆకాశరామన్న ఉత్తరం వెనుక పెద్ద కుట్రే వున్నట్టు తెలుస్తోంది. ఉత్తరంలో ప్రభుత్వానికి, ఏసీబీకి నివేదించామని బెదిరింపులు వున్నాయి. బలవంతపు బదిలీలకు మానసికంగా సిద్ధం చేయడం కోసమే ఈ బెదిరింపులకు దిగినట్టు తెలుస్తోంది. ఈ ఆకాశరామన్న ఉత్తరంలో వీళ్ళిద్దరినీ టార్గెట్ చేయడానికి అందులో పొందుపరిచిన అంశాలే అందుకు కారణం. ప్రధానంగా ఈ ఇద్దరినీ గత ప్రభుత్వానికి తొత్తులుగా అభివర్ణించడం పరమ వింత! రాష్ట్రంలో అధిక ఆదాయం వచ్చే రిజిస్ట్రేషన్ కార్యాలయాలుగా గుణదల, గాంధీనగర్‌లను పదే పదే ప్రస్తావించడం వెనుక కుట్రకోణం బయటపడుతోంది. వీరంతా కిందటి ఐజీగా పనిచేసిన రామకృష్ణకు శిష్యులుగా అపవాదు మోపారు. వైసీపీ ముఖ్య సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డికి ముఖ్య అనుచరులంటూ పేర్కొన్నారు. మరోవైపు వీరు కమ్మకులం పేరు చెప్పుకుని, లోకేష్ పేరును చెడగొడుతున్నారని పేర్కొన్నారు. ఈ ఇద్దరికీ కిందటి వైసీపీ ప్రభుత్వంలో మంచి పలుకుబడి వుందని, ఏసీపీని కూడా వీళ్ళు మేనేజ్ చేసేవారని చెప్పుకునేవారని... ఇలా ఒకదానికి మరొకదానికి పొంతన లేకుండా లేఖలో పొందుపరిచారు. ఈ ఫిర్యాదు ఇచ్చిన వ్యక్తి పేరు పర్వతనేని నాగరాజు, పటమట పేరుతో ముగించారు. పటమటలో పర్వతనేని నాగరాజు లేరు. రిజిస్ట్రేషన్ శాఖలో ఎలాంటి ప్రత్యక్ష, పరోక్ష సంబంధాలు కూడా లేవు. లేని వ్యక్తి ఎలా ఫిర్యాదు చేశారో తేలాల్సిన విషయం. కాపీ టు ఏసీబీ అని వున్న ఈ ఉత్తరం నిజంగా ఏసీబీకి పంపారో లేదో తెలియదుగానీ, గుణదల సబ్ రిజిస్ట్రార్ కృష్ణప్రసాద్‌కు పోస్టులో పంపారు. ఇలా పంపటం కూడా పైస్థాయి అవినీతి అధికారుల మైండ్ గేమ్‌లో భాగమని తెలుస్తోంది.