పొమ్మన్నారు.. పొగపెట్టారు.. బాలినేని
posted on Aug 28, 2024 @ 10:44AM
బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి, అన్నిటికీ మించి మాజీ ముఖ్యమంత్రి, పులవెందుల ఎమ్మెల్యే, వైసీపీ అధినేత అయిన జగన్ కు సమీప బంధువు. అటువంటి బాలినేని గత కొన్నేళ్లుగా వైసీపీలో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. అవమానాలను దిగమింగుకుని మరీ పార్టీలో కొనసాగుతున్నారు. పార్టీ ఆయనను పొమ్మన లేక పోగపెట్టినా ఆయన మాత్రం ఓపికగా వైసీపీ చూరుపట్టుకు వేళాడుతున్నారు.
అయితే అదే సమయంలో బాలినేని అవమానాలను జీర్ణించుకోలేక అధినేతను ధిక్కరించి, పార్టీకి వ్యతిరేకంగా ప్రకటనలు చేసినా జగన్ ఆయనపై చర్యలు తీసుకోలేదు. బాలినేని ధిక్కార స్వరం వినిపించిన ప్రతిసారీ తాడేపల్లి ప్యాలెస్ కు పిలిపించుకుని బుజ్జగించి దారికి తెచ్చుకున్నారు. ఇదంతా ఎన్నికలకు ముందు నాటి మాట. ఎన్నికలలో చివరికి ఏదో విదిల్చినట్లుగా ఒంగోలు అసెంబ్లీ స్థానంలో పోటీకి బాలినేనికి టికెట్ ఇచ్చినా, జిల్లాలోని మరే ఇతర నియోజకవర్గాల అభ్యర్థల విషయంలోనూ బాలినేని మాట పార్టీలో చెల్లుబాటు కాలేదు. బాలినేని డిమాండ్ లను, అభ్యర్థనలను జగన్ బేఖాతరు చేశారు. ఒంగోలు లోక్ సభ నియోజకవర్గం నుంచి పార్టీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డికి టికెట్ ఇవ్వాలని బాలినేని పట్టుబట్టారు, బతిమలాడారు అయినా ఫలితం లేకపోయింది. ఒక దశలో మాగుంటకు టికెట్ ఇవ్వకుంటే తాను పార్టీని వీడతానని హెచ్చరించే వరకూ వెళ్లిన ఫలితం లేకపోయింది. ఏది ఏమైనా ఎన్నికల ముందు అంతా జగన్ బాలినేనిని పొమ్మన లేక పొగబెట్టినా బాలినేని ఉక్కిరి బిక్కిరి అయ్యారు తప్ప జగన్ ను వదిలి, వైసీపీకి రాజీనామా చేసే ధైర్యం చేయలేకపోయారు. అలాగే బాలినేని ధిక్కార స్వరం వినిపించినా ఆయనపై చర్య తీసుకునే ధైర్యం జగన్ చేయలేకపోయారు.
ఏది ఏమైనా జగన్ బాలినేనిల మధ్యా ఎన్నికల ముందు వరకూ టామ్ అండ్ జెర్రీ గేమ్ నడిచిందనే చెప్పుకోవాలి. అందుకు ప్రధాన కారణంగా బాలినేనికి ఇతర పార్టీల తలుపులు మూసుకుపోవడం, వైసీపీని కాదని బయటకు వస్తే ఆయన అండగా నిలిచే పార్టీ లేకపోవడం ఒకటైతే.. బాలినేని వైసీపీని వీడితే ప్రకాశం జిల్లాలో పార్టీ మనుగడపై ఆశలు వదిలేసుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమౌతుందని జగన్ భావించడం. మొత్తం మీద ఇరువురూ కూడా పరస్పర ప్రయోజనాల కోసం తిట్టుకుంటూ, కొట్టుకుంటూ కూడా కలిసే ఉన్నారు.
ఎన్నికలు పూర్తై, ఫలితాలు వచ్చిన తరువాత ఇక టామ్ అండ్ జెర్రీ ఆటకు అవకాశమే లేదు. ఎందుకంటే బాలినేని స్వయంగా ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పరాజయం పాలయ్యారు. ఇక వైసీపీ అయితే ఘోరంగా పరాజయం పాలైంది. కనీసం విపక్ష హోదాకు కూడా నోచుకోకుండా అసెంబ్లీలో 11 స్థానాలకు పరిమితమైంది. దీంతో ఇప్పుడు ఇక బాలినేనికి వైసీపీతో అవసరం లేదు. వైసీపీపి బాలినేనితో పని లేదు. అందుకే బాలినేని కుండ బద్దలు కొట్టేశారు. పార్టీ మారడం ఖాయమన్న సంకేతాలు ఇచ్చేశారు. అలా ఇస్తూ కూడా పార్టీయే తనను వద్దనుకుంటోంది తాను కాదు అని చెప్పుకున్నారు. ఔను తాను కాదు.. తన పార్టీ వారే తనను వదిలించుకోవాలని చూస్తున్నారని వ్యాఖ్యానించారు. ఎన్నికల ఫలితాల తరువాత నుంచీ తాను పార్టీకి దూరంగా ఉంటున్నానని నెపం వేసి ఈవీఎంలపై తాను చేస్తున్న పోరాటానికి పార్టీ మద్దతు ఇవ్వలేదని విమర్శించారు. పార్టీ పట్టించుకున్నా పట్టించుకోకపోయినా తన పోరాటం కొనసాగుతుందని, ప్రజలే తనకు అండ అని పేర్కొనడం ద్వారా వైసీపీతో తెగతెంపులకు బాలినేని రెడీ అయిపోయారని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.