ఫామ్ హౌస్ కే కేసీఆర్ పరిమితం.. ఆహంకారమా? .. కుంగుబాటా?
posted on Aug 20, 2024 @ 3:27PM
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో పరాజయం బీఆర్ఎస్ కు మరీ ముఖ్యంగా ఆ పార్టీ అధినేతకు భారీ షాక్ అనే చెప్పాలి. తెలంగాణలో తన మాటకు తిరుగులేదు అన్న రీతిలో పదేళ్ల పాటు రాష్ట్రాన్ని తన నోటి మాటతో, కను సైగతో శాశించిన కేసీఆర్ ఆ ఓటమి తరువాత సైలెంటైపోయారు. ఒక వేళ అయనా మాట్లాడినా పట్టించుకునే వారూ, లెక్క చేసే వారూ లేకుండా పోయారు. పార్టీ ఎమ్మెల్యేలను గంటల తరబడి ప్రగతి భవన్ (ఇప్పుడు ప్రజాభవన్) గేట్ల మందు పడిగాపులు పడేలా చేసిన కేసీఆర్ కు ఇప్పుడు పిలిచినా సొంత పార్టీ ఎమ్మెల్యేలే కాదు ద్వితీయ శ్రేణి నేతలూ అందుబాటులోకి రాని పరిస్థితి ఎదురైంది.
తెలంగాణ ఆవిర్భావం తరువాత వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికలలో విజయం సాధించి ముఖ్యమంత్రిగా అధికార పగ్గాలు అందుకున్న కేసీఆర్ తనను తాను సర్వశక్తిమంతుడిగా ఊహించుకున్నారు. మరీ ముఖ్యంగా రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీలను నిర్వీర్యం చేసేయడంతో రాష్ట్రంలో ఇక తనకు తిరుగేలేదన్న భావనకు వచ్చారు.
గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి కేసీఆర్ కు, బీఆర్ఎస్ కు దిమ్మదిరిగేలా చేసింది. ఎందుకంటే.. రాష్ట్రంలో తమకు బీజేపీ నుంచి మాత్రమే నామమాత్రపు పోటీ ఉంటుందని, రాష్ట్రంలో తెలుగుదేశం, కాంగ్రెస్ లకు అసలు చోటే లేదని కేసీఆర్ భావించారు. కాంగ్రెస్ పట్ల, ఆ పార్టీ నేతల పట్ల చాలా చులకన భావన వ్యక్తం చేశారు. అటువంటి కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి రావడం, ఆ తరువాత జరిగిన లోక్ సభ ఎన్నికలలో బీఆర్ఎస్ కు కనీసం ఒక్కటంటే ఒక్క స్థానం కూడా దక్కకపోవడంతో కేసీఆర్ డీలా పడిపోయారు. దీనికి తోడు తాను తానా అంటే తందానా అనే పలువురు ఎమ్మెల్యేలు పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ పంచన చేరారు. ఇంకా పలువురు అదే బాట పట్టే అవకాశాలున్నాయనీ, బీఆర్ఎస్ ఇప్పుడో అప్పుడో బీజేపీలో వినీలమైపోతుందన్న చర్చ కూడా తెలంగాణలో జోరుగా సాగుతోంది.
ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ కేడర్ లో ధైర్యం, స్థైర్యం నింపాల్సిన కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్ కే పరిమి తమైపోయారు. కేవలం ఒక్కటంటే ఒక్క రోజు మినహాయిస్తే ఆయన అసెంబ్లీకి కూడా గైర్హాజరయ్యారు. పార్టీ పరాజయం తరువాత ఈ తొమ్మిది నెలల కాలంలో ఓ మూడు నాలుగు సార్లు మినహా ఆయన బహిరంగంగా కనిపించింది లేదు. ఇక్కడే పరిశీలకులలోనూ, పార్టీ నేతలు, శ్రేణులలోనూ కేసీఆర్ ది అహంకారమా, కుంగుబాటా అన్న అనుమానాలు వ్యక్తం ఔతున్నాయి. కేసీఆర్ సహజంగా దూకుడుగా వ్యవహరించే రాజకీయ వేత్త. కానీ అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ ఓటమి పాలై తాను ప్రతిపక్ష నేత పాత్రకు పరిమితమైన తరువాత ఆయన చాలా వరకూ ఫామ్ హౌస్ కే పరిమితమైపోయారు.
అసెంబ్లీ ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత ఆయన బయటకు వచ్చి సభలలో మాట్లాడిన దాఖలాలు లేవు. కేవలం పార్లమెంటు ఎన్నికల ప్రచారం సందర్భంగా మాత్రమే ఆయన ప్రజా సమూహంలోకి వచ్చి గళం వినిపించారు. పార్లమెంటు ఎన్నికలలో బీఆర్ఎస్ జీరో పెర్ఫార్మెన్స్ తరువాత ఆయన మరీ నల్లపూసై పోయారు. తెలంగాణ పితగా తాను రాష్ట్రాన్ని శాశ్వతంగా పాలిస్తానని భావించేవారు. విపక్ష నేతలెవరూ తన కాలిగోటికి కూడా సరితూగరని భావించేవారు. మరీ ముఖ్యంగా రేవంత్ రెడ్డిని ఆయన చాలా చులకనగా చూసేవారు. ముఖ్యమంత్రిగా తాను అధికారంలో ఉన్నంత కాలం కేసీఆర్ రేవంత్ రెడ్డి పేరు ఉచ్ఛరించడానికి కూడా ఇష్టపడలేదు. అయితే ఇప్పుడు రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమత్రి. కేసీఆర్ అహంకారపు కోట గోడల్ని బద్దలు కొట్టిన నాయకుడు. ఇప్పుడు కేసీఆర్ మౌనానికీ, ప్రజా జీవితానికి దూరంగా ఉండడానికీ అదే కారణమని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
కారణమేదైతేనేం కేసీఆర్ క్రియాశీలంగా లేకపోవడం బీఆర్ఎస్ ను మరింత బలహీన పరుస్తోంది. కేటీఆర్, హరీష్రావు ఎంత ప్రయత్నించినా కేసీఆర్ క్రియాశీలంగా లేని లోటును పూడ్చ లేకపో తున్నారు. బీఆర్ఎస్ అధికారంలో ఉన్నంత కాలం పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా, డిఫాక్టో సీఎంగా అత్యంత ప్రభావమంతంగా, శక్తిమంతంగా కనిపించిన కేటీఆర్ ఇప్పుడు తేలిపోతున్నారు. హరీష్ రావు పరిస్థితి కూడా దాదాపు అంతే.
బీఆర్ఎస్ అధికారంలో ఉండగా ట్రబుల్ షూటర్ గా చక్రం తిప్పిన ఆయన ఇప్పుడు స్వయంగా ఇబ్బం దుల్లో కూరుకు పోతున్నారు. ఈ పరిస్థితుల్లో బీఆర్ఎస్ ఏ మాత్రంగానైనా నిలదొక్కుకోవాలన్నా, ప్రజా క్షేత్రంలో బలోపేతం కావాలన్న కేసీఆర్ తన మౌనం వీడి జనంలోకి రావాలి. అయితే కేసీఆర్ ఫామ్ హౌస్ వదిలి బయటకు వచ్చే పరిస్థితులు కనిపించడం లేదు. ఆయన ప్రజా జీవితంలో క్రియాశీలంగా వ్యవహరించకపోవడానికి కారణం ఏమిటన్నదానిపై విస్తృతంగా చర్చ జరుగుతోంది. పరిశీలకులు అయితే కేసీఆర్ మౌనానికి, ముఖం చాటేయడానికి కారణం అయితే అహంకార లేకుంటే కుంగుబాటు అని విశ్లేషిస్తున్నారు.