ఏపీలో మొదలైన ఆపరేషన్ ఆకర్ష్!?

ఆంధ్రప్రదేశ్ లో కూడా ఆపరేషన్ ఆకర్ష్ మెదలైందా అంటే జరుగుతున్న పరిణామాలను చూస్తే ఔనని అనక తప్పదు. వైసీపీ నుంచి వలసల వెల్లువ కొనసాగుతున్నది. ఇప్పటికే ఇద్దరు వైసీపీ రాజ్యసభ సభ్యులు పార్టీకీ, తమ రాజ్యసభ సభ్యత్వాలకు రాజీనామా చేసేశారు. పార్టీకీ, పదవులకు రాజీనామా చేసిన మోపిదేవి, బీద మస్తాన్ రావులు ఇద్దరూ కూడా తెలుగుదేశం గూటికి చేరే అవకాశాలు మెండుగా ఉన్నాయి. తాను తెలుగుదేశం పార్టీలో చేరి చంద్రబాబు నాయకత్వంలో పని చేయాలని భావిస్తున్నట్లు మోపిదేవి వెంకటరమన విస్పష్టంగా చెప్పేశారు. బీద మస్తాన్ రావు కూడా తెలుగుదేశం తీర్థం పుచ్చుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ ఇద్దరి చేరికకూ తెలుగుదేశం అధినేత చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు కూడా చెబుతున్నారు. అయితే వీరి చేరికకు చంద్రబాబు ఆమోదం తెలపడం పట్ల తెలుగుదేశం శ్రేణుల్లో విస్మయం వ్యక్తం అవుతోంది.

ఈ ఇద్దరిలో ఒకరైన మోపిదేవి వెంకటరమణ జగన్ కు అత్యంత సన్నిహితుడిగా గుర్తింపు పొందారు. వాన్ పిక్ కేసులో మోపిదేవి వెంకట రమణ ప్రధాన ముద్దాయి. అలాగే జగన్ అక్రమాస్తుల కేసులలో కూడా కూడా మోపిదేవి ఉన్నారు. అంతే కాకుండా రేపల్లె కు చెందిన తెలుగుదేశం కార్యకర్తలు అనేక ఏళ్ల పాటు మోపిదేవి కారణంగా నానా ఇబ్బందులూ ఎదుర్కొన్నారు. ఇప్పుడు మోపిదేవి తెలుగుదేశం గూటికి చేరితే వారు ఆయనతో కలిసి పని చేయాల్సి వస్తుంది. ఇక బీద మస్తాన్ రావు విషయానికి వస్తే ఆయన గతంలో తెలుగుదేశంలోనే ఉండేవారు. అయితే పార్టీ ఇబ్బందుల్లో ఉన్న సమయంలో పార్టీని వదిలి వెళ్లిపోయారు. అయినా కూడా తెలుగుదేశం నాయకత్వం ఇటువంటి చేరికలు జగన్ ను, జగన్ నాయకత్వాన్ని బలహీనపరిచేందుకు అవసరమని చెబుతోంది.   పార్టీకీ, పదవులకు రాజీనామా చేసి వస్తే ఓకే అని చంద్రబాబు అంటున్నారు.  క్యాడర్ కూడా ఈ విషయాన్ని అర్ధం చేసుకోవలసి ఉంటుంది. మోపిదేవి, బాదం మస్తాన్ రావులు మాత్రమే కాదు.. ఇంకా పలువురు వైసీపీ రాజ్యసభ సభ్యులు కూడా రాజీనామాల బాటలోనే ఉన్నారని తెలుస్తోంది. ఆ పార్టీకి ఉన్న పదకొండు మంది రాజ్యసభ సభ్యుల్లో ఇద్దరు, ముగ్గురు మినహా మిగిలిన వారంతా కూటమి పార్టీల్లోకి  సర్దుకునే అవకాశాలే మెండుగా ఉన్నాయి. రాజ్యసభ సభ్యులే కాదు వైసీపీ ఎమ్మెల్సీలు కూడా పార్టీని వదిలేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ పోతుల సునీత వైసీపీకీ, తన మండలి సభ్యత్వానికీ రాజీనామా చేసేశారు. ఆమె రాజకీయ ప్రస్థానం తెలుగుదేశం పార్టీతోనే ప్రారంభమైనా, పార్టీ ద్వారా పలు అవకాశాలు అందిపుచ్చుకుని ఎదిగారు. అయితే తెలుగుదేశం ప్రతిపక్షంలోకి రాగానే పోతుల సునీత వైసీపీ గూటికి చేరి తెలుగుదేశం అధినేత చంద్రబాబు, లోకేష్ లపై ఇష్టారీతిగా నోరు పారేసుకున్నారు. చివరికి చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, లోకేష్ భార్య బ్రాహ్మణిలను కూడా ఆమె అనుచితంగా విమర్శించారు.  ఆమె బీజేపీ గూటికి చేరనున్నారు.  
అయితే రాజకీయాలలో విమర్శలు ప్రతి విమర్శలు సహజం అంటూ తెలుగుదేశం అగ్రనాయకత్వం ఇటువంటి  చేరికలపై పెద్దగా అభ్యంతరం పెట్టడం లేదు. నిబంధనలను పట్టించుకోకుండా అడ్డగోలుగా అవినీతికి పాల్పడిన వారిపై చట్ట ప్రకారం చర్యలు ఉంటాయని చెబుతూనే.. వైసీపీని బలహీనం చేయడం, అలాగే మండలిలో ప్రభుత్వానికి ఇబ్బందులు లేకుండా ఉండటం కోసం ఆపరేషన్ ఆకర్ష్ కు తెరతీసింది. కేవలం రాజ్యసభ నుంచి మాత్రమే కాకుండా మండలిలో కూడా పలువురు వైసీపీ ఎమ్మెల్సీలు గోడ దూకేయడానికి సిద్ధంగా ఉన్నారు. పోతుల సునీతతో మొదలు పెట్టి తాజాగా ఎమ్మెల్సీలు కర్రి పద్మశ్రీ, కల్యాణ చక్రవర్తి కూడా తమ మండలి సభ్యత్వాలకు రాజీనామా చేసేందుకు రెడీ అయ్యారు. వీరి బాటలోనే మరింత మంది ఉన్నారని చెబుతున్నారు. మొత్తం మీద జగన్ తనకు బలం ఉంది అని భావిస్తున్న రాజ్యసభ, శాసనమండలిలో ఆ పార్టీని బలహీనం చేయడమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లో ఆపరేషన్ ఆకర్ష్ మొదలైందని పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.