సజ్జల.. జగన్ కు బంధమా..బందిఖానానా?

ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ అధికారం కోల్పోయిన తరువాత ఆ పార్టీ తీరు, పరిస్థితి నానాటికీ తీసికట్టు నాగంభొట్లు అన్నట్లుగా తయారైంది. రాజకీయాలలో గెలుపు ఓటములు సహజం. అయితే ఆ విషయాన్ని అంగీకరించలేక గెలిస్తే విర్రవీగడం, ఓడిపోతే బ్రహ్మాండం బద్దలైపోయినట్లు కుంగిపోవడం ఎంత మాత్రం సరికాదు. కానీ వైసీపీ మాత్రం సరిగ్గా అదే చేసింది. చేస్తోంది. అధికారంలో ఉన్నంత కాలం తమంత వాళ్లు లేరన్నట్లుగా  ముఖ్యమంత్రి జగన్ సహా వైసీపీ నేతలంతా చెలరేగిపోయారు. అదే ఓటమి తరువాత నోరెత్తడానికి కూడా బెంబేలెత్తిపోతున్నారు.

అధికారంలో ఉండగా చేసిన అక్రమాలు, అన్యాయాలు ఇప్పుడు తమ మెడకు చుట్టుకుని ఇబ్బందుల పాలు చేస్తాయా అన్న భయంతో వణికి పోతున్నారు. ఈ విషయంలో వైసీపీ అధినేత కూడా మినహాయింపు కాదు. అందుకే పార్టీ పరాజయం తరువాత చాలా మంది సీనియర్ నేతలు మౌనముద్రలోకి వెళ్లిపోయారు. నోరెత్తడానికే కాదు, ప్రజలలో తిరగడానికి కూడా వెరుస్తున్నారు. అధికా రంలో ఉండగా మాట్లాడటమంటే ప్రతిపక్ష నేతలను బూతులు తిట్టడమే అన్నట్లుగా చెలరేగిన వారె వరూ కూడా ఇప్పుడు కనిపించడం లేదు. వినిపించడం లేదు. కొడాలి నాని, వల్లభనేని వంశి, ఆర్కే రోజా అనిల్ కుమార్ యాదవ్.. ఇలా చెప్పుకుంటూ పోతే కొండవీటి చాంతాడంత జాబితా ఉంటుంది.  పార్టీ అధినేత జగన్ కూడా అడపాదడపా పార్టీ కార్యకర్తలపై దాడులు జరిగాయంటూ మీడియా ముందు మాట్లాడటం తప్ప ఆయన పెద్దగా బయటకు రావడం లేదు. అసలు తాడేపల్లి ప్యాలెస్ లో ఉండడానికే ఇష్టపడటం లేదు. పార్టీ అధినేతగా తప్పదు కనుక అప్పుడప్పుడు తాడేపల్లికి వస్తూ ఎక్కువ సమయం బెంగళూరు ప్యాలెస్ లోనే గడుపుతున్నారు. రెండు నెలల వ్యవధిలో ఆయన ఆరు సార్లు బెంగళూరు వెళ్లారంటేనే పరిస్థితి అర్ధం చేసుకోవచ్చు. 

సరే ఇప్పుడు జగన్ విదేశీ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పరిస్థితుల్లో పార్టీ బాధ్యతలు ఎవరికో ఒకరికి అప్పగించాలి. అప్పగించకపోయినా పెద్ద ఫరక్ పడదు అది వేరే సంగతి. కానీ వైసీపీ సోషల్ మీడియా బాధ్యతలు మాత్రం ఎవరికో ఒకరికి అప్పగించక తప్పదు. ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత వైసీపీ సోషల్ మీడియా బాధ్యతల నుంచి పిల్ల సజ్జల అదే సజ్జల రామకృష్ణారెడ్డి కుమారుడు సజ్జల భార్గవరెడ్డిని తప్పించినట్లు వార్తలు వచ్చాయి. అలాగే ఎన్నికలలో పార్టీ పరాజయం తరువాత సజ్జల భార్గవరెడ్డి ఎక్కడా కనిపించలేదు. కానీ పార్టీ సామాజిక మాధ్యమ బాధ్యతల నుంచి సజ్జల భార్గవ్ రెడ్డిని తప్పించినట్లుగా అధికారిక సమాచారమేదీ లేదు. అంటే ఇప్పటికీ పార్టీ సోషల్ మీడియా వింగ్ సజ్జల చేతిలో ఉన్నట్లే లెక్క.  

పార్టీ ఓటమి తరువాత ఈ రెండు నెలల కాలంలోనూ సజ్జల భార్గవ్ కు వైసీపీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతల నుంచి తప్పించేసినట్లు అధికారికంగా ప్రకటించేందుకు జగన్ శతధా ప్రయత్నించారు.  పలువురి పేర్లు కూడా తెరమీదకు తీసుకువచ్చారు. వారిలో జగన్ బంధువు పేరు గట్టిగా వినిపించింది. అలాగే నాగార్జున యాదవ్ పేరూ వినిపించింది. అయితే వారిలో ఎవరినీ జగన్ ఫైనలైజ్ చేయలేదు. ఇందుకు సజ్జల వ్యక్తం చేసిన అభ్యంతరాలే కారణమని అంటున్నారు.  సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీలో తన స్థానం ఎలా ఉన్నా కుమారుడు భార్గవ్ కు మాత్రం సముచిత స్థానం ఉండాలన్న తాపత్రయంతో తన పలుకుబడి అంతా ఉపయోగిస్తున్నారని అంటున్నారు.

అలాగే జగన్ కూడా కారణాలేమిటో స్పష్టంగా తెలియడం లేదు కానీ, సజ్జలను కాదనలేకపోతున్నారని పార్టీ వర్గాల్లో గట్టిగా వినిపిస్తోంది. పార్టీ పరాజయం తరువాత ఓటమికి కారణాలుగా పార్టీ శ్రేణులు, నేతలూ కూడా సజ్జల, ఆయన కుమారుడే అని బాహాటంగానే చెబుతున్నారు. జగన్ సైతం వారి తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయినా కూడా సజ్జలను వదిలించుకోలేకపోతున్నారు.  ఇక ఇప్పుడు విదేశీ పర్యటన ముంగిట జగన్ కు పార్టీ సోషల్ మీడియా వింగ్ బాధ్యతల విషయంలో ఒక నిర్ణయం తీసుకోక తప్పని పరిస్థితి ఎదురైంది. అయితే ఆ బాధ్యతలు చేపట్టేందుకు ఎవరూ ముందుకు రాకపోవడంతో అనివార్యంగా పిల్ల సజ్జలనే కొనసాగిస్తారన్న ధీమా సజ్జలలో వ్యక్తం అవుతోందని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయిన నష్టం ఎలాగూ అయ్యింది. భవిష్యత్ లోనైనా పార్టీ పుంజుకోవాలంటే సజ్జల, పిల్ల సజ్జలల విషయంలో జగన్ మొహమాటం వదుల్చుకుంటే మేలని పార్టీ వర్గాలు అంటున్నాయి.