వచ్చే ఏడాది జనవరి నుంచి జన్మభూమి - 2!
posted on Aug 21, 2024 @ 11:35AM
గ్రామాలలో మౌలిక సదుపాయాల కల్పన, అభివృద్ధే లక్ష్యంగా జన్మభూమి 2 కార్యక్రమాన్ని వచ్చే ఏడాదిలోనే ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్ణయించారు. ఈ మేరకు కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల బలోపేతానికి నిధులు విడుదల చేశారు. జగన్ హయాంలో అభివృద్ధి ఆనవాళ్లే లేకుండా పోయాయి. గ్రామాల అభివృద్ధి కోసం వెచ్చించాల్సిన నిధులను పక్కదారి పట్టించారు. దీంతో గ్రామాలలో పారిశుద్ధ్యం నుంచి రోడ్ల వరకూ అన్నీ అధ్వానంగా మారిపోయాయి. దీంతో గ్రామాలకు మళ్లీ పునర్వేభవం తీసుకురావడం లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ లో జన్మభూమి 2 కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి నుంచి ప్రారంభం కానుంది. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులతో సమీక్షలో వెల్లడించారు. పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖపై సచివాలయంలో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఈ సమీక్షలో పాల్గొన్నారు. అలాగే ఆ శాఖ ఉన్నతాధికారులు కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు గ్రామీణ ప్రాంతాల అభివృద్ధే లక్ష్యంగా పంచాయతీరాజ్ శాఖను బలోపేతం చేస్తామని చెప్పారు.
2014-19 మధ్య చేపట్టిన వివిధ కార్యక్రమాల ద్వారా గ్రామాల రూపు రేఖలు మార్చేందుకు ప్రయత్నిస్తే, గత వైసీపీ ప్రభుత్వం వ్యవస్థలను నిర్వీర్యం చేసి గ్రామాలను సమస్యలకు కేంద్రాలుగా మార్చేసిందన్న చంద్రబాబు, మళ్లీ గ్రామాల్లో వెలుగు తెచ్చేందుకు, మౌలిక వసతులు కల్పించేందుకు పంచాయతీ రాజ్ శాఖకు జవసత్వాలు అందిస్తామన్నారు.
అలాగే వచ్చే ఏడాది జనవరి నుంచి జన్మభూమి-2 మొదలు అవుతందనీ, ఆ కార్యక్రమం ద్వారా ప్రతీ ఇల్లు, ప్రతి గ్రామంలో ఎలాంటి మౌలిక సదుపాయాలు అవసరమో గుర్తించి అందుకు తగిన విధంగా కార్యాచరణ చేపడతామన్నారు. విద్యుత్, గ్యాస్, మరుగుదొడ్ల, కుళాయి లాంటి వాటిని అందిం చేందుకు ప్రణాళికా బద్దంగా పనిచేయాలన్నారు. అలాగే గ్రామానికి అవసరమైన వీధి లైట్లు, డ్రైనేజీ కాలువలు, సిమెంటు రోడ్లు, తాగునీటి సరఫరా, సాలిడ్ వేస్ట్ మేనేజ్ మెంట్ సెంటర్లు వంటి సౌకర్యాలు కల్పించాలన్నారు. గ్రామం నుంచి సమీప ప్రాంతాల అనుసంధానం కోసం రోడ్లు, మార్కెటింగ్ ప్రాంతాలను గుర్తించాలన్నారు. వీటిని కూడా కనీస అవసరాలుగా గుర్తించి అందించేందుకు పంచాయతీ రాజ్ శాఖ సమగ్రమైన ప్రణాళికతో పనిచేయాలని చంద్రబాబు అధికారులకు దిశానిర్దేశం చేశారు.
వచ్చే ఐదేళ్లలో రాష్ట్రంలో 17వేల500 కిలోమీటర్ల మేర సీసీ రోడ్ల నిర్మాణం చేయనున్నట్టు సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా పేర్కొన్నారు. అలాగే 10 వేల కిలోమీటర్ల సీసీ డ్రైనేజీ కాలువల నిర్మాణం జరగాలన్నారు. వైసీపీ హయాంలో గ్రామాల్లో ఖర్చు చేయాల్సిన నిధులు దారి మళ్లాయన్నారు. దీని వల్ల కనీస స్థాయిలో కూడా మౌలిక సదుపాయాల కల్పన జరగలేదన్నారు. ప్రస్తుతం పంచాయతీ రాజ్ శాఖకు రావాల్సిన 990 కోట్లను ఆర్థిక శాఖనుంచి విడుదల చేస్తున్నట్లు చెప్పారు.
ఇంటింటికీ కుళాయి ద్వారా మంచినీళ్లు అందించేందుకు కేంద్రం తీసుకొచ్చిన జల్‌జీవన్ మిషన్ పథకాన్ని గత ప్రభుత్వం ఉపయోగించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. జల్‌జీవన్ మిషన్ కోసం రాష్ట్ర వాటా కింద ఆర్థిక శాఖ నుంచి 500 కోట్లు వెంటనే విడుదల చేస్తామన్నారు.
గత ప్రభుత్వ తీరువల్ల మూలనపడ్డ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ కేంద్రాలను మళ్లీ ప్రారంభించాలని సీఎంఆదేశించారు. నరేగా పనులపై చర్చించడానికి రాష్ట్ర వ్యాప్తంగా శుక్రవారం (ఆగస్టు 23) గ్రామ సభలు నిర్వహిస్తున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ చెప్పారు. అక్టోబర్ 2 నుంచి చెత్త నుంచి సంపద సృష్టి కేంద్రాలన్నిటినీ తిరిగి ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు స్పష్టం చేశారు.