తాను పెంచుకున్న కుక్క చనిపోతుందని తెలిసి...!

సాధారణంగా మనం పెంచుకునే పెంపుడు జంతువులు చనిపోతున్నాయంటే ఏం చేస్తాం. మనం అయితే వాటికి నచ్చిన ఆహారాన్ని పెట్టి.. ఆ కొద్ది రోజులు ఇంకా ప్రేమగా చూసుకుంటాం. కానీ అమెరికాను చెందిన ఓ వ్యక్తి మాత్రం తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క చనిపోతుందని తెలియగానే.. దానిని విహారయాత్రకు తీసుకెళ్లి అనేక ప్రదేశాలు చూపించాడు. వివరాల ప్రకారం.. అమెరికాలోని రాబర్ట్‌ కగ్లర్‌ అనే వ్యక్తి ఎప్పటి నుండో ఒక కుక్కని పెంచుకుంటున్నాడు. దానికి బెల్లా అని పేరు కూడా పెట్టాడు. అయితే దానికి కాన్యర్ వ్యాధి సోకి.. ఆరు నెలలకంటే ఎక్కువ బతకదని వైద్యులు చెప్పడంతో.. దానితో గడిపే ఆఖరి క్షణాలు ఎప్పుడూ గుర్తుండిపోవాలని విహారయాత్రకు తీసుకెళ్లాడు. న్యూయార్క్‌, డెట్రాయిట్‌, కెంటకీ, ఓహియో ఇలా పలుప్రాంతాల్లో తిప్పాడు. అయితే దురదృష్టవుశాత్తు.. బెల్లా డాక్టర్లు చెప్పిన గడువు కంటే ముందే చనిపోయింది. ఇక బెల్లా మృతిని ఏ మాత్రం తట్టుకోలేని రాబర్ట్ కన్నీరుమున్నీరైపోతున్నాడు. బెల్లా తనకు దేవుడిచ్చిన వరమనీ, దాని మరణాన్ని తట్టుకోవడం కష్టంగా ఉందని క్లగర్‌ వాయిపోయాడు.

రాష్ట్ర ప్రభుత్వాలతోనే దేశాభివృద్ధి సాధ్యం..

  ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్ లో అంతరాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు పదేళ్ల తరువాత జరుగుతున్న ఈ భేటీలో మోడీ పలు అంశాల గురించి చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్యతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని.. విస్తృత చర్చల ద్వారా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. విధానాలు సక్రమంగా అమలు కావాలంటే రాష్ట్రాల పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. పథకాల అమలులో సమస్యలుంటే చర్చలతో పరిష్కరించుకోవచ్చని మోదీ అన్నారు. కిరోసిన్‌ వాడకాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, సబ్సిడీ, నగదు చెల్లింపులకు ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఆధార్‌ అనుసంధానంతో నిధులు దారి మళ్లకుండా అరికట్టవచ్చన్న మోదీ 79 శాతం మంది వద్ద ఆధార్‌ కార్డులున్నాయని తెలిపారు. కాగా ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, శాశ్వత సభ్యులు హాజరుకాగా సీఎంలు కేజ్రీవాల్‌, అఖిలేష్ మాత్రం డుమ్మా కొట్టారు.

వీడిన పసికందు కిడ్నాప్ మిస్టరీ..

విజ‌య‌వాడ పాత ప్ర‌భుత్వాసుప‌త్రిలో శిశువు కిడ్నాప్ మిస్టరీ ఎట్టకేలకు వీడింది. 36 గంటల్లో పోలీసులు వేగంవంతమైన దర్యాప్తు చేసి కిడ్నాప్ మిస్టరీని చేధించారు. రెండు రోజుల నుండి ట్విస్ట్ ల మీద ట్విస్ట్ లు ఎదురవుతున్న ఈ కేసులో ఎట్టకేలకు పోలీసులు శిశువును ఎత్తుకెళ్లిన కిడ్నాపర్లను పట్టేశారు. కృష్ణా జిల్లా అవనిగడ్డకు చెందిన వ్యక్తులు శిశువును అపహరించినట్టు సమాచారం అందుకున్న పోలీసులు.. వెంటనే రంగంలకి దిగి వారిని పట్టుకున్నారు. బిడ్డను క్షేమంగా తల్లిదండ్రులను అప్పగించారు. నిందితులను అదుపులోకి తీసుకొని పోలీస్ స్టేషన్ కు తరలించారు.   ఈ సందర్బంగా ఆంధ్రప్ర‌దేశ్ వైద్య‌, ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీ‌నివాస్ మాట్లాడుతూ అప‌హ‌ర‌ణ కేసును పోలీసులు స‌మ‌ర్థ‌వంతంగా ఛేదించారని అన్నారు. విజయవాడ డీసీపీ శ్రీనివాస్ తో సహా గాలింపు చ‌ర్య‌ల్లో పాల్గొన్న పోలీసుల‌ని మీడియా ముందు భుజం త‌ట్టి ఆయ‌న ప్ర‌శంసించారు. శిశువుని అప‌హ‌రించిన‌ వారికి క‌ఠిన శిక్ష ప‌డాల్సిందేన‌ని అన్నారు. రాష్ట్రంలో ఇటువంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా ప‌క‌డ్బంధీగా చ‌ర్య‌లు తీసుకుంటామ‌న్నారు.

మొత్తానికి మెత్తబడ్డ చైనా..

  ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వం కోసం ఎప్పటి నుండో పడిగాపులు కాస్తున్న సంగతి తెలిసిందే. భారత్ కు సభ్యత్వం ఇవ్వడానికి అమెరికా, న్యూజిలాండ్ లాంటి అగ్రరాజ్యాలు అనుమతిచ్చినా.. చైనా మాత్రం అడ్డుపుల్ల వేస్తూనే వచ్చింది. గతంలో ఒకసారి ఒప్పుకున్నా.. పాకిస్థాన్ కు కూడా సభ్యత్వం ఇస్తే.. భారత్ కు ఇవ్వడానికి తమకేం అభ్యంతరం లేదని అడ్డుపల్ల వేసింది. అప్పటి నుండి ఇది పెండింగ్ లోనే ఉంది. అయితే ఇప్పుడు మాత్రం భారత్ సభ్యత్వంపై చైనా కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో చర్చలకు చైనా సిద్ధంగా ఉందని భారత్ లో చైనా రాయబారి లీయు జింగ్ సాంగ్ పేర్కొన్నారు. దౌత్యవేత్తలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. భారత్ సభ్యత్వం విషయంలో చైనా పాత్ర మూడు విషయాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఆ మూడు.. నియమాలకు కట్టుబడి ఉండడం, చర్చలు, పరిష్కార మార్గం అని పేర్కొన్నారు. మరి దీనికి పాకిస్థాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.

ఆ విషయంలో మాత్రం ట్రంప్, హిల్లరీ ఒకటయ్యారు..

  అమెరికా అధ్యక్ష పదవి రేసులో ట్రంప్, హిల్లరీ క్లింటన్ ఇద్దరూ ఒకరిపై ఒకరు విమర్సనాస్ర్తాలు విసురుకుంటారన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే ఇప్పుడు ఒక విషయంలో మాత్రం ఇద్దరూ ఒకే అభిప్రాయానికి వచ్చారు. అదేంటబ్బా.. ఒకరు ఎడ్డెం అంటే.. ఒకరు తెడ్డం అంటారు.. అలాంటి వీరు ఒకే రకమైన అభిప్రాయానికి వచ్చారా.. ఆశ్చర్యంగా ఉంది కదా.. ఇంతకీ వారు ఏ విషయంపై ఒకే అభిప్రాయానికి వచ్చారబ్బా అన్నడే కదా డౌట్..!   అదేంటంటే.. పారిస్ లోని నీస్ ఘటనపై స్పందించిన వీరు ఒకే అభిప్రాయాన్ని తెలిపారు. ‘‘మనమో ప్రత్యేక ప్రపంచంలో నివసిస్తున్నట్టు ఉంది. ఇక్కడ శాంతిభద్రతలపై నమ్మకం లేదు. దేనిమీదా ఎవరికీ గౌరవం ఉండడం లేదు. దీనిపై కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. చూస్తుంటే ఇది ప్రపంచ యుద్ధంలానే కనిపిస్తోందని అభిప్రాయపడ్డారు. "పరిస్థితి మొత్తం అదుపు తప్పింది. వరల్డ్ ట్రేడ్ సెంటర్, శాన్ బెర్నార్డినో, పారిస్, ఓర్లాండ్ ఘటనలను మనం చూశాం. బలమైన, స్మార్ట్ లీడర్ షిప్ లేకుండా పరిస్థితి మరింత దిగజారుతుంది’’ అని ట్రంప్ అన్నారు.   ఇక హిల్లరీ క్లింటన్ మాట్లాడుతూ.. ‘‘ఇదో విభిన్న యుద్ధం. ఈ విషయంలో మనం సులభంగా తప్పుదోవ పట్టే అవకాశం ఉంది. ఇస్లాంను వాడుకుంటున్న జిహాదీలు, ఉగ్రవాదులతో ప్రపంచం మొత్తం యుద్ధం చేస్తోంది. ఉగ్రవాద గ్రూపులు, రాడికల్ జిహాదిస్ట్ గ్రూపులపై యుద్ధం చేసే సమయం ఆసన్నమైంది’’ అని అన్నారు. మొత్తానికి అన్ని విషయాల్లో పరస్పరం విభేదించుకునే వీరు.. ఈ విషయంలో మాత్రం ఒక్కటవ్వడం ఆనందించాల్సిన విషయమే.   కాగా పారిస్ లోని నీస్ నగరంలో ప్రజలు బాస్టిల్ డే సంబరాల్లో ఉండగా.. ఓ ఉగ్రవాది ట్రక్కుతో వారిపై దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ దాడిలో దాదాపు వందమంది మరణించగా.. వందల మందికి తీవ్ర గాయాలయ్యాయి.

రాయపాటి సాంబశివరావుకి సతీ వియోగం.. చంద్రబాబు ఓదార్పు

  టీడీపీ సీనియర్ నేత, గుంటూరు జిల్లా నరసరావుపేట లోక్ సభ సభ్యుడు రాయపాటి సాంబశివరావుకు సతీ వియోగం కలిగింది. రాయపాటి సాంబశివరావు సతీమణి లీలాకుమారి (67) గుండెపోటు కారణంతో కన్నుమూశారు. నిన్న ఉదయం వరకూ బాగానే ఉన్న లీలాకుమారి.. రాత్రి  గుండెపోటుకు గురయ్యారు. దీంతో కుటుంబ సభ్యులు వెంటనే స్పందించి ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే మరణించారు. మరోవైపు రాయపాటి భార్య మృతికి పలువురు టీడీపీ నేతలు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. టీడీపీ అధినేత, ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడు... రాయపాటికి స్వయంగా ఫోన్ చేసి లీలాకుమారి మృతికి సంతాపం ప్రకటించి.. రాయపాటిని ఓదార్చారు. ఈరోజు సాయంత్రం గుంటూరులోని లక్ష్మీపురంలో లీలాకుమారి అంత్యక్రియలు జరగనున్నాయి.

గోల్డె మెన్ ఇక లేడు..

  గోల్డ్ మెన్ ఈ పేరు వినే ఉంటారు. దత్తాత్రేయ అనే వ్యక్తి బంగారంతో తయారు చేసిన 3.5 కిలోల చొక్కాను ధరించి ఫేమస్ అయ్యాడు. అప్పటి నుండి ఆయన పేరు గోల్డె మెన్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు ఆయన దారుణ హత్యకు గురయ్యాడు. కొంతమంది దుండగలు ఆయనను అతికిరాతకంగా కొట్టి చంపారు. వివరాల ప్రకారం... దత్తాత్రేయ వక్రతుండ చిట్ ఫండ్ పేరుతో కంపెనీ ప్రారంభించారు. అయితే ఈయన అనేక మంది ఖాతాదారుల నుండి కోట్ల రూపాయలు డబ్బు వసూలు చేశాడు. అంతేకాదు ఈయనపై పలు అక్రమాలకు పాల్పడినట్టు కేసులు కూడా ఉన్నాయి.  ఈ నేపథ్యంలోనే నిన్న రాత్రి దుండగులు ఆయనపై దాడి చేసి రాళ్లతో కొట్టి, పదునైన ఆయుధాలతో పొడిచి చంపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఈ కేసులో భాగంగానే నలుగురు అనుమానితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో దత్తాత్రేయ మేనల్లుడూ కూడా ఉన్నాడు.   మరోవైపు ఆతని భార్య సీమా.. అర్ధరాత్రి కొంతమంది వచ్చి తన భర్తను తీసుకెళ్లారని.. భారతమాత నగర్ కు తీసుకెళ్లి తన భర్తను హత్య చేశారని వెల్లడించింది.  

మరో షాకిచ్చిన జెట్ ఎయిర్ వేస్..

  ఈ మధ్య బ్రేక్ ఫాస్ట్ లో బొద్దింక సర్వ్ చేసి ప్రయాణికుడికి షాక్ ఇచ్చిన జెట్ ఎయిర్ వేస్.. ఇప్పుడు మరోసారి జెట్ ఎయిర్ వేస్ ప్రయాణికులకు షాకిచ్చింది. అదేంటంటే.. అదనపు క్యాబిన్‌ బ్యాగులపై.. అదనపు చార్జీలు వసూలు చేసేందుకు నిర్ణయించుకుంది. ప్రస్తుతం జెట్ ఎయిర్ వేస్ లో 7 నుంచి 10కిలోల బరువు గల ఒక క్యాబిన్‌ బ్యాగ్‌, ఒక ల్యాప్‌టాప్‌ బ్యాగ్‌, ఒక పర్సు(మహిళలకు)ను ఉచితంగా తీసుకెళ్లే సదుపాయం ఉంది. అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ లగేజ్ ను కనుక తీసుకొస్తే రూ. 900 చొప్పున ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించామని సంస్థ అధికారులు తెలిపారు. అయితే ఈ నిర్ణయంపై జెట్ ఎయిర్ వేస్ సంస్థ మాత్రం..  ఆదాయం కోసం తాము ఈ ఛార్జీలు వసూలు చేయడం లేదని.. ఎక్కువగా క్యాబిన్‌ బ్యాగులు తీసుకురావడంతో విమానంలో స్టోరేజ్‌ సమస్య ఏర్పడుతుందని చెప్పుకొచ్చింది. ఇక జెట్‌ఎయిర్‌వేస్‌ నిర్ణయంపై స్పందించిన పౌర విమానయాన శాఖ డైరెక్టర్‌.. ఈ నిర్ణయంపై పరిశీలిస్తున్నామని తెలిపారు.

అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో సోనియాకు ఊరట..

  అగస్టా వెస్ట్ ల్యాండ్ కేసులో కాంగ్రెస్ పార్టీ అధినేత్రి సోనియా గాంధీ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ కేసులో ఆమెకు ఊరట లభించింది. ఇప్పటికే ఈ కేసులో ఎస్.పి త్యాగిని సీబీఐ విచారిస్తున్న సంగతి తెలిసిందే. ఈ కుంభకోణంకు సంబంధించి సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్‌, అహ్మద్‌ పటేల్‌లపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని ఎంఎల్‌ శర్మ అనే న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు. ఇక దీనిపై విచారించిన సుప్రీంకోర్టు.. ఇతరులపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చెయ్యమని సీబీఐకి ఆదేశాలు ఇవ్వలేమని తేల్చి చెప్పేసింది. కుంభకోణంపై ఇప్పటికే సీబీఐ దర్యాప్తు చేస్తున్నందున ఎఫ్‌ఐఆర్‌ నమోదు విషయం సీబీఐ పరిధిలో ఉంటుందని పేర్కొంది. కాగా కాంగ్రెస్‌ హయాంలో అగస్టా వెస్ట్‌ల్యాండ్‌ వీవీఐపీ చాపర్స్‌కు సంబంధించి రూ.3,600కోట్ల కుంభకోణం జరగగా.. దానిపై విచారణ జరుగుతున్న సంగతి విదితమే.

ఒకరినొకరు పొగిడేసుకున్న హరీశ్ రావు, గవర్నర్

తెలుగు రాష్ట్రాల ఉమ్మడి గవర్నర్ నరసింహన్ తెలంగాణ మంత్రి హరీశ్ రావుపై ప్రశంసల జల్లు కురిపించారు. హరిత హారంలో భాగంగా ఆయన ఈరోజు ఇబ్రహీంపూర్ లో జమ్మి చెట్టు నాటిన ఆయన మాట్లాడుతూ.. కొత్తగా తీసుకు వచ్చే ఏ పథకం విజయవంతం కావాలన్నా, సమర్థవంతమైన నాయకత్వం, ప్రజలను, అధికారులను ముందుండి నడిపించే పాలకపక్ష నేత అవసరమని, ఆ లక్షణాలు హరీశ్ రావులో చాలా ఎక్కువగా ఉన్నాయని అన్నారు. బంగారు తెలంగాణ సాధనలో భాగంగా హరీశ్ వంటి నేతలు ఎంతో అవసరమని అన్నారు. ఆయనో మాట అనుకున్నారంటే చేసే తీరుతారని, లక్ష్యం నెరవేరే వరకూ వదలబోరని, అటువంటి నేత మీకు అందుబాటులో ఉన్నారని తెలిపారు.   ఇక హరీశ్ రావు మాత్రం ఊరుకుంటారా ఆయన కూడా గవర్నర్ గారిపై కూడా ప్రశంసలు చేశారు. గవర్నర్ ది మాటంటే మాట, టైమంటే టైమని పొగిడారు. పదిన్నరకు వస్తానని చెప్పిన ఆయన, అంతకన్నా ముందే వచ్చి అందరికీ ఆదర్శంగా నిలిచారని అన్నారు. వారి నుంచి తామంతా స్ఫూర్తిని పొందుతున్నామని అన్నారు.

ఒక్క రూపాయికే ఫోన్..

  అతి తక్కువ ధరకే ఫ్రీ డమ్ 251 పేరుతో రింగింగ్ బెల్స్ అనే సంస్థ స్మార్ట్ ఫోన్ అందిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు కేవలం ఒక్క రూపాయికే స్మార్ట్ ఫోన్ అందిస్తామని ఓ మొబైల్ సంస్ధ ప్రకటించింది. ఇంతకీ ఏం కంపెనీ అనుకుంటున్నారా.. షియోమీ మొబైల్ సంస్థ. అసలు సంగతేంటంటే..  చైనాకు చెందిన ప్రముఖ మొబైల్‌ ఉత్పత్తుల సంస్థ షియోమీ భారత్‌లో అడుగుపెట్టి రెండేళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా షియోమీ వినియోగదారులకు కొన్ని ఆఫర్లు అందిస్తోంది. దీనిలో భాగంగానే కేవలం ఒక్క రూపాయికే ఫోన్లు, పవర్‌బ్యాంక్‌లు లాంటి వస్తువులను ఇవ్వనుంది. అయితే ఈ ఆఫర్ కేవలం మూడు రోజులు మాత్రమే ఉంది.. ఆఫర్ల వివరాలు.. * తొలి రోజు 10 షియోమీ ఎంఐ 5 ఫోన్లు, 100 పవర్‌బ్యాంకులు *  రెండో రోజు 10 రెడ్‌మీ నోట్‌3 ఫోన్లు, 100 ఎంఐ బ్యాండ్‌లు, * మూడో రోజున 10 ఎంఐ మ్యాక్స్‌ ఫోన్లు, 100 ఎంఐ బ్లూటూత్‌ స్పీకర్లను ఫ్లాష్‌సేల్‌కు ఉంచింది. అయితే దీనికోసం యూజర్లు ముందుగా రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉందని..  ఆ మూడు రోజుల్లో ప్రతిరోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఫ్లాష్‌సేల్‌ ఉంటుందని సంస్థ తెలిపింది. జులై 19లోగా రిజిస్ట్రేషన్‌కు సంబంధించిన వివరాలను ఫేస్‌బుక్‌ ద్వారా షేర్‌ చేస్తామని షియోమీ పేర్కొంది.

పారిస్ ఘటనపై వర్మ.. ఇక్కడా దేవుణ్ని వదల్లేదా..!

గత కొన్ని రోజులుగా సైలెంట్ గా ఉన్న రాంగోపాల్ వర్మ.. ఇప్పుడు మరోసారి పారిస్ లో జరిగిన ఘటనపై స్పందించి తన దైన శైలిలో ట్విట్టర్లో ట్వీటాడు. ఈరోజు తెల్లవారుజామున ప్రాన్స్ లోని నీస్ లో ఉగ్రదాడి జరిగిన సంగతి తెలిసిందే. ఓ ట్రక్కుతో ఉగ్రవాది మనుషులపై దాడి జరుపగా..ఆ దాడిలో 80 మందికి పైగా చనిపోయారు. అయితే దీనిపై స్పందించిన రాంగోపాల్ వర్మ... 'నీస్‌లో జరిగిన ఘటన బాగో లేదు. ఇలాంటి తీవ్ర ఘటనలు ఎక్కడైనా జరగొచ్చు. జరగకుండా ఉండాలని దేవుణ్ణి ప్రార్థించాలని ఉంది కానీ ఏ దేవుడిని ప్రార్థించాలో తెలియడంలేదు అని అన్నాడు. ఇలాంటి సామూహిక హత్యలు చేయడానికి బాంబులు అవసరంలేదు, వాహనాలు ఉంటే చాలని ఈ ఘటన నిరూపించింది. నీస్‌ దాడిని ఖండిస్తున్నాం అంటూ రాజకీయ నేతలు చేస్తున్న వ్యాఖ్యలు జోకుల్లాగా మారిపోయాయి. ఇలాంటి దాడులకు పాల్పడే క్రూరులు మంచి మాటలు వింటారా?' అని ట్విట్టర్‌ ద్వారా వెల్లడించారు వర్మ. మొత్తానికి ఈ విషయంలో కూడా వర్మ దేవుడిని వదిలిపెట్టలేదు.

జకీర్ నాయక్ బాగానే ట్రై చేస్తున్నట్టున్నాడు..

  మొత్తానికి తన మీద ఆరోపణలు తొలగించుకోవడానికి జకీర్ నాయక్ బాగానే ప్రయత్నిస్తున్నట్టు ఉన్నారు. జకీర్ నాయక్ చేసే వివాదాస్పద ప్రసంగాలతో యువత ఉగ్రవాదం వైపు మొగ్గుచూపుతున్నారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే రేగింది. అంతేకాదు జకీర్ నాయక్ ఇండియా వస్తే ఆయనను అరెస్ట్ చేయాలన్న డిమాండ్ల్లు కూడా వచ్చాయి. ఇక చేసేది లేక జకీర్ కూడా తను ముంబై రావాల్సి ఉండగా అది కూడా వాయిదా వేసుకున్నారు. అయితే ఆ తరువాత మహారాష్ట్ర స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ (ఎన్ఐడీ) తాను ప్రసంగాలు చేసిన వీడియోలు అన్నీ పరిశీలించి తాను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా కూడా జకీర్ ఇండియా రావడానికి భయపడుతున్నట్టు ఉన్నాడు.. అందుకే విదేశాల్లో ఉండే స్కైప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.   ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఢాకా ఉగ్రవాదులను ప్రేరేపించినట్లు తనపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు ఏ భారత అధికారి తనను ప్రశ్నించలేదన్నారు. ఒకవేళ ప్రశ్నిస్తే.. దానికి సమాధానాలు చెబుతానన్నారు. ఈ విషయంలో తాను ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తానన్నారు. తాను ఉగ్రవాదులకు స్ఫూర్తినివ్వడంలేదని.. కేవలం శాంతిదూతగా వ్యవహరిస్తున్నానని.. అమాయక ప్రజలపై ఆత్మాహుతి దాడులు బాధాకరమని అన్నారు. ఇంకా ఈరోజు తెల్లవారుజామున ప్రాన్స్ లోని నీస్ లో జరిగిన దాడి పై స్పందించి తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అమాయకులను చంపడం నేరమని.. ఖురాన్‌లోనూ అదే చెప్పారని జకీర్‌ అన్నారు.

మందు తాగాడు.. పిచ్చిగా మాట్లాడాడు.. పార్టీ నుండి సస్పెండ్ అయ్యాడు..

  గత రెండు రోజుల క్రితం ఆప్ నేత తాగి అసెంబ్లీకి వచ్చారని పలు ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు మరో నేత మద్యం మత్తులో తానేం మాట్లాడుతున్నాడో కూడా తెలియక.. ఆఖరికి పార్టీ నుండి సస్పెండ్ కు గురయ్యాడు. ఇంతకీ ఆ ఘనకార్యం చేసిన నేత ఎవరంటే.. జనతాదళ్ యునైటెడ్ పార్టీకి చెందిన నేత లల్లన్ రామ్. అలా చుక్క నోట్లో పడే సరికి తాను ఏం మాట్లాడుతున్నాడో తెలియక.. దమ్మున్నోడిదే రాజ్యం అంటూ.. కండలున్నోళ్ళ మద్దతున్నోడి జేబులోనే అధికారులు, ప్రభుత్వం ఉంటాయన్నాడు. తనకు చాలా మంది క్రిమినల్స్ మద్దతు ఇస్తున్నారని రెచ్చిపోయాడు. అయితే తన మాటలు రికార్డువుతున్నాయన్న సంగతి పాపం లల్లన్ రామ్ తెలుసుకోలేక పోయినట్టున్నాడు.. ఇంకేముంది సదరు రికార్డులను.. లల్లన్ రామ్ మాటలను జేడీయూ పరిశీలించింది. బిహార్‌లో మద్య నిషేధం అమల్లో ఉందని, నిబంధనలను ఉల్లంఘించి బీరు తాగారని చెప్తూ లల్లన్‌ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది. అంతేకాదు అతనిని పోలీసులు అరెస్ట్ చేశారు.

ట్రంప్ గారు ఈ టీ తాగండి.. కొంచమైనా మారండి..

  వివాదాస్పద వ్యాఖ్యలకి కేరాఫ్ అడ్రస్ డొనాల్డ్ ట్రంప్. అది ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన పనిలేదు. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న ట్రంప్ అసలు అలాంటి వ్యాఖ్యలు చేసే ఫేమస్ అయ్యారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అలాంటి వ్యాఖ్యలు చేసే ట్రంప్ కు భారత్ కు చెందిన ఓ టీ సంస్థ ఝలక్ ఇచ్చింది.   అదేంటంటే.. ట్రంప్ కు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కొన్ని వేల గ్రీన్ టీ బ్యాగులను పంపించింది. అంతేకాదు ట్రంప్ కు కొన్ని సలహాలు ఇస్తూ ఓ విడియోను కూడా పంపిందట. ‘‘ట్రంప్.. భారత్ తరపున మీకు నమస్కారాలు. ప్రకృతి సిద్ధమైన అస్సాం టీ బ్యాగులను మీకు పెద్ద మొత్తంలో పంపిస్తున్నాం. ఈ టీ శరీరంలోని ప్రమాదకర ఫ్రీరాడికల్స్‌పై పోరాడుతుంది. మనసును, శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఆరోగ్యం సమతౌల్యంగా ఉండేలా చూస్తుంది. మనుషులను స్మార్ట్‌గా కూడా చేస్తుందని నిరూపితమైంది. మీకోసం, అమెరికా కోసం, ప్రపంచం కోసం దయచేసి ఈ టీని రోజూ తాగండి’’.. ‘మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవడానికి సమయం మించిపోలేదు’.. ‘‘ప్రపంచమంతా విచారిస్తోంది. మేం మిమ్మల్ని ఎలాగూ ఆపలేం. కాకపోతే మిమ్మల్ని మార్చగలం’’ అని కోల్‌కతాకు చెందిన టీ-ఎ-మి సంస్థ ఓ వీడియో చేసి దానితో పాటు  6వేల టీ బ్యాగులను న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్స్‌కు టీ కంపెనీ పంపిన డెలివరీ పంపింది. అంతేకాదు ‘‘ఇంకా కావాలంటే కూడా పంపిస్తాం’’ అని తెలిపింది. మరి దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.

పారిస్ మారణహోమంపై పలువురి స్పందనలు..

  ఫ్రాన్స్ లోని నీస్ నగరంలో జరిగిన మారణకాండపై పలువురు దిగ్ర్భాంతి వ్యక్తం చేస్తున్నారు. అందరూ బాస్టిల్ వేడుకల్లో మునిగిఉండగా.. ఓ ఉగ్రవాది అత్యంత కిరాతకంగా ఓ ట్రక్కును వారిపై నుండి పోనివ్వడంతో దాదాపు 80 మంది మరణించారు. ఇంకా పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. వారిలో కూడా చాలామంది పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఉగ్రవాదులు సృష్టించిన ఈ మారణహోమాన్ని ప్రపంచ దేశాలు ముక్తకంఠంతో ఖండించాయి. భారత రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ, ప్రధాని నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్షుడు ఒబామా, రిపబ్లికన్ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, బ్రిటన్ కొత్త ప్రధాని థెరిసా మే తదితరులు తమ దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ప్రణబ్ ముఖర్జీ పారిస్ దాడి విషయం తెలిసి షాక్ కు గురైనట్టు తెలిపారు. ఫ్రాన్స్ తో కలిసి పనిచేస్తామని, క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మోడీ.. ప్రధాని నరేంద్రమోదీ ఈ దాడులను తీవ్రంగా ఖండించారు. ఇదో మతిలేని చర్య అని.. ఉగ్రవాదులను అరికట్టాలని అన్నారు. ఇంకా  క్షతగాత్రులు త్వరగా కోలుకోవాలని.. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బరాక్ ఒబామా.. పారిస్ పై ఉగ్రదాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని.. ఫ్రాన్స్ కు భారత్ అన్ని విధాలుగా అండగా ఉంటుందని పేర్కొన్నారు. ఫ్రాన్స్ ప్రజలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. డొనాల్డ్ ట్రంప్.. పారిస్ ఘటనపై స్పందించిన ట్రంప్ ఉగ్రవాదులపై మండిపడ్డారు. ఈ సందర్బంగా ఆయన రేపు జరగాల్సిన సమావేశాన్ని కూడా వాయిదా వేసుకున్నారు.

సూడాన్ నుంచి భారత్ కు క్షేమంగా...

  దక్షిణ సూడాన్ నుంచి 156 మంది భారతీయులు క్షేమంగా భారత్ చేరుకున్నారు. దక్షిణ సూడాన్ లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తిరిగి రప్పించేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ‘ఆపరేషన్ సంకట్ మోచన్’ సక్సెస్ అవ్వడంతో అక్కడ ఉన్న భారతీయులను ఇండియాకు తరలించారు. కేంద్రమంత్రి వీకే సింగ్ స్వయంగా రంగంలోకి దిగి.. అక్కడి ప్రభుత్వంతో చర్చలు జరిపిన వీకే సింగ్ చిక్కుబడ్డ 600 మంది భారతీయులను సురక్షితంగా విమానం ఎక్కించారు.   కాగా వారిని తీసుకొచ్చేందుకు వెళ్లిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్ సి-17 విమానం కొద్దిసేపటి క్రితం తిరువనంతపురం విమానాశ్రయంలో ల్యాండ్ అయింది. కాగా ప్రభుత్వం రక్షించి తీసుకొచ్చిన వారిలో 46 మంది కేరళీయులు కాగా ఇద్దరు నేపాల్ దేశస్థులు, ఆరుగురు మహిళలు, ముగ్గురు చిన్నారులు ఉన్నారు. మిగతా వారు దక్షిణాది రాష్ట్రాలకు చెందిన వారు. అయితే ఇప్పటి వరకు 500 మంది భారతీయులను రక్షించగా మరో 300 మంది వ్యాపారాల కారణంగా అక్కడ ఉండేందుకే మొగ్గు చూపినట్టు సమాచారం.

ఫ్రాన్స్‌లో జనాలపైకి ట్రక్కును నడిపిన ఉగ్రవాదులు..100 మంది మృతి

ఫ్రాన్స్‌లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఎప్పుడూ బాంబులు, తుపాకులతో జనంపై విరుచుకుపడే ఉగ్రవాదులు ఈసారి రూటు మార్చారు. నీస్ నగరంలో బాస్టిల్ డే సంబరాలు చేసుకుంటున్న సమయంలో వేగంగా వచ్చిన ఓ ట్రక్కు ప్రజల మీదకు దూసుకెళ్లింది. ఈ ఘటనలో 80 మంది మృతి చెందగా..100 మందికి పైగా గాయపడ్డారు. వీరిలో 42 మంది పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటనను ఉగ్రదాడిగా పోలీసులు అనుమానిస్తున్నారు. ఎందుకంటే ట్రక్కును నడుపుతూ వారు పోలీసులపైకి కాల్పులు జరిపారు. విచక్షణారహితంగా ట్రక్కును నడిపి ప్రజల ప్రాణాలు తీసిన డ్రైవర్ పోలీసుల కాల్పుల్లో మరణించాడు. అంతేకాకుండా ట్రక్ వెనుకభాగంలో తుపాకులు, పేలుడు పదార్థాలను కగుగొన్నట్టు చెబుతున్నారు. ఈ ఘటన జరిగిన ప్రాంతంలో ఎక్కడ చూసినా రహదారిపై మృతదేహాలు చెల్లాచెదురుగా పడి పరిస్థితి భయానకంగా ఉంది.