పోలీసుల అత్యుత్సాహం.. కుటుంబాన్ని చితకబాదిన వైనం..

ఒక్కోసారి పోలీసులు అత్యుత్సాహం ప్రదర్సించి చిక్కుల్లో పడుతుంటారు. ఇప్పుడు అలా అత్యుత్సాహం ప్రదర్శించే బదిలీ అవ్వాల్సి వచ్చింది. ఈ ఘటన తమిళనాడులో జరిగింది. వివరాల ప్రకారం.. రాజా(45), ఉష(40) దంపతులు తమ కుమారుడు సూర్య(18)తో క‌లిసి బంగారు దుకాణానికి వెళ్లి బయటకు వస్తుండగా... ఏదో విషయంలో వారిలో వారు గొడవపడుతున్నారు. అయితే ఇది గమనించిన పోలీసులు కల్పించుకొని వారిపై దురుసుగా ప్రవర్తించారు. తాము ఒకే కుటుంబమని.. చిన్న గొడవ మాత్రమే అని చెబుతున్నా వినకుండా.. ఇష్టం వ‌చ్చిన‌ట్లు లాఠీల‌తో కొట్టారు. దీంతో వారికి తీవ్ర‌గాయాల‌య్యాయి. రాజా, ఉష, సూర్య ఆసుప‌త్రిలో చికిత్స పొందుతున్నారు. ఘ‌ట‌న‌పై స్పందించిన పోలీసు ఉన్న‌తాధికారులు కుటుంబంపై విరుచుకుప‌డ్డ పోలీసుల‌ని వేరే ప్రాంతానికి బ‌దిలీ చేశారు.

చంద్రబాబు టూర్ వెనుక మోడీ హస్తం..!

  ఏపీ ముఖ్యమంత్రి  చంద్రబాబు ప్రస్తుతం విదేశీ పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన కజకిస్థాన్ ను కూడా సందర్సించిన సంగతి విదితమే. అయితే ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. చంద్రబాబు కజకిస్థాన్ పర్యటన వెనుక ప్రధాని నరేంద్ర మోడీ హస్తం ఉన్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని చంద్రబాబే స్వయంగా వెల్లడించేసరికి అందరూ అవాక్కవుతున్నారు. అసలు విషయం ఏంటంటే.. చంద్రబాబు కంటే ముందే మోడీ కజకిస్థాన్లో పర్యటించిన సంగతి తెలసిందే. అయితే అక్కడ పర్యటించిన ఆయన కజకిస్థాన్ రాజధానిని చూసి ముగ్ధుడైపోయారట. దీంతో అక్కడ పర్యటించాలని తనకు పదే పదే చెప్పారని చంద్రబాబు వెల్లడించారు.   ఇక ఆస్తానాను చూసిన చంద్రబాబు కూడా.. ఈ రాజధాని తరహాలోనే ఏపీ రాజధాని అమరావతిని నిర్మించాలని అక్కడి అధికారులను కోరారట. అంతేకాదు రష్యా నుంచి విడిపోయిన తరువాత కేవలం పదేళ్లలోనే రాజధానికి అద్భుతంగా నిర్మించుకోగలిగారని.. తనకు ఇక్కడికి వచ్చిన తరువాతే ఆస్తానా రాజధాని ఈ స్థాయిలో ఉందన్న విషయం అర్ధమైందని.. కజకిస్థాన్ అధికారులు అమరావతిలో పర్యటించి కొత్త రాజధాని నిర్మాణంలో భాగస్వాములు కావాలని చంద్రబాబు వారిని కోరినట్టు తెలుస్తోంది. మొత్తానికి మోడీ గారు రాజధానికి నిధులు కేటాయించడంలో ఎలా వ్యవహరించినా.. ఇలాంటి సలహాలు మాత్రం బాగానే ఇస్తున్నారు.

కాశ్మీర్లో ఇంకా హైటెన్షన్..

  కాశ్మీర్లో ఇంకా ఉద్రిక్తత వాతావరణం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే అక్కడి అల్లర్ల వల్ల మృతుల సంఖ్య 30 కి పెరుగగా.. పలువురికి గాయాలైన సంగతి తెలిసిందే. భద్రతా దళాల సంఖ్య కూడా కేంద్రం పెంచినా.. ఆందోళనకారులు మాత్రం ఇంకా రెచ్చిపోతూనే ఉన్నారు. తాజాగా తీవ్రవాదులు హ్యాండ్ గ్రనేడ్ దాడి చేశారు. దీంతో పదిమంది సీఆర్పీఎఫ్ జవాన్లు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. కాగా హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వనీ ఎన్‌కౌంటర్ చేసిన నేపథ్యంలో నిరసనకారులు ఆందోళనలు చేపట్టారు. గత మూడు రోజులుగా జరుగుతున్న ఈ ఆందోళనలో.. మరో ట్విస్ట్ చోటుచేసుకుంది కుల్గాంలోని దమ్హల్ హంజిపోరాలో ముగ్గురు పోలీసుల ఆచూకీ లభించడం లేదు. పోలీస్ స్టేషన్‌పై దాడిచేసిన దుండగులు ఆయుధాలు, పోలీస్ రికార్డులు, వైర్‌లెస్ సెట్లను ఎత్తుకుపోయారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు భద్రతా బలగాలు ప్రయత్నిస్తున్నాయి.

చంద్రబాబు రష్యాలో.. మనసు ఏపీలో..

  ఏపీ సీఎం చంద్రబాబు ప్రస్తుతం రష్యా పర్యటనలో ఉన్న సంగతి తెలిసిందే. నిరంతరం రాష్ట్ర అభివృద్ధికి కృషిచేస్తూ.. విదేశీ పర్యటనల ద్వారా... రాష్ట్రానికి పెట్టుబడులు తేవడానికి గట్టిగా ప్రయత్నిస్తూ... రాష్ట్ర పరిస్థితులను ఎప్పుటికప్పుడు సమీక్షిస్తూ.. ఆదిశగా పాలన సాగిస్తున్నారు. అయితే ఇది మరోసారి నిరూపించారు చంద్రబాబు. ఆయన రష్యా పర్యటనలో ఉన్నాగానీ.. ఆయన దృష్టి మాత్రం రాష్ట్రంపైనే ఉంది. అక్కడి నుండే రాష్ట్రంలోని పరిస్థితుల గురించి తెలుసుకున్నట్టు తెలుస్తోంది. గత మూడు నాలుగు రోజుల నుండి రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా వానలు కురుస్తున్న నేపథ్యంలో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. వరద పోటెత్తింది. దీంతో పట్టిసీమకు కూడా వరద ముప్పు పొంచి ఉండటంతో పరిస్థితిని చక్కదిద్దే క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారంటూ ఆయన అక్కడి నుంచే ఇక్కడి అధికారులను అడిగి తెలుసుకున్నారు. పరిస్థితి చేజారకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కూడా ఆయన అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. మొత్తానికి చంద్రబాబు ఎక్కడ ఉన్నా మనసు మాత్రం ఏపీపైనే ఉంటుందని దీనిద్వారా తెలుస్తోంది.

కాశ్మీర్లో ఆరని మంటలు..

కాశ్మీర్లో పరిస్థితి ఇప్పుడు ఇంకా ఆందోళనకరంగా తయారైంది. గత రెండు రోజుల నుండి జరుగుతున్న అల్లర్లు.. ఈరోజు తారాస్థాయికి చేరాయి. ఇప్పటి వరకు ఈ ఆందోళనల వల్ల 23 మంది మృతి చెందారు. మరో 250 మందికి పైగా గాయాల‌పాల‌య్యారు. పలు చోట్ల కర్ఫ్యూ విధించారు కూడా. అయితే ఆందోళనకారులు ఇంకా రెచ్చిపోతున్న నేపథ్యంలో కేంద్రం మరో 800 మంది సీఆర్పీఎఫ్ బ‌ల‌గాల‌ను రంగంలోకి దింపింది. ఇప్పటికే 1200 మంది సహాయక సిబ్బందిని కశ్మీర్‌కు పంపగా.. అల్ల‌ర్లు రోజురోజుకీ పేట్రేగిపోతుండ‌డంతో కేంద్రం బలగాలను మరింత పెంచాలని నిర్ణ‌యం తీసుకొని 100 మంది సిబ్బంది చొప్పున ఎనిమిది బృందాల‌ను అక్క‌డి ప‌రిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పంపించింది.

జయలలిత ఇంటిని పేల్చేస్తా..

  తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఇంటినే పేల్చేస్తామంటూ బెదిరింపు ఫోన్ కాల్స్ వచ్చాయి. పొయెస్‌ గార్డెన్‌ లోని జయలలిత ఇంటిని పేల్చేస్తామంటూ.. ఓ ఆంగతకుడు పోలీస్ కంట్రోల్ రూంకి ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు దర్యాప్తు చేపట్టి ఆ కాల్ ఎవరు చేశారో అన్న విషయం తెలుసుకున్నారు.  ఈ ఫోన్‌ కాల్‌ విల్లుపురం జిల్లాలోని మరకణ్ణం ప్రాంతం నుంచి వచ్చిందని.. దీంతో ముఖ్యమంత్రి నివాసాన్ని పేల్చేస్తానని బెదిరించింది భువనేశ్వరన్ అనే 14 ఏళ్ల బాలుడని గుర్తించారు. దీంతో బాలుడిన్ని అదుపులోకి తీసుకుని విచారణ ప్రారంభించారు. అయితే బాంబు బెదిరింపును మాత్రం తేలిగ్గా తీసుకోని అధికారులు పొయెస్ గార్డెన్ చుట్టూ భారీ భద్రత ఏర్పాటు చేశారు. బాలుడు సరదాగా కాల్ చేశాడా.. లేకా ఎవరన్నా చేయించారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారిస్తున్నారు.

మాయవతికి కూడా అవే కష్టాలు..

  మన తెలుగు రాష్ట్రాల్లో పార్టీ ఫిరాంపులు కామన్ అయిపోయాయి. నేతలు ఇష్టమొచ్చినట్టు ఒక పార్టీ నుండి మరో పార్టీలోకి జంప్ అవుతున్నారు. ముఖ్యంగా.. తెలంగాణలో అయితే అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లో చేరుతుంటే.. ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీలో చేరుతున్నారు. ఇప్పుడు ఇదే సీన్ బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీలో కనిపిస్తోంది. ఇప్పటివరకూ నలుగురు నేతలు పార్టీని వీడగా ఇప్పుడు మరో కీలక నేత తన పదవికి రాజీనామా చేసి పార్టీ అధినేత్రి మాయావతికి మరో షాక్‌ ఇచ్చారు.   దాదాపు 35 సంవత్సరాలుగా పార్టీకి సేవ చేసిన బీఎస్పీ జాతీయ కార్యదర్శి పరందేవ్‌ యాదవ్‌ తన పదవికి రాజీనామా చేశారు.  పార్టీ ఓ కిరాణాకొట్టుగా మారిపోయిందని.. డబ్బుంటే పార్టీలో టిక్కెట్ల నుంచి పదవుల దాకా అన్నీ దక్కుతాయని పరందేవ్‌ ఆరోపించారు. తనలాంటి అంకితభావం కలిగిన నేతలను పక్కనబెట్టి ఎటువంటి విధేయత లేని వారిని ఎమ్మెల్సీలను చేస్తున్నారని విమర్శించారు.తాను ఇక వారణాశికి వెళ్లిపోతున్నానని చెప్పారు. దీంతో యూపీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో పరందేవ్‌ యాదవ్‌ పార్టీకి దూరమవ్వడం మాయవతికి పెద్ద దెబ్బ అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు పరందేవ్‌ యాదవ్‌ త్వరలోనే భాజపాలో చేరుతున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. కాగా బీఎస్పీ సీనియర్‌ నేతలు స్వామి ప్రసాద్‌ మౌర్య, ఆర్‌కే చౌదరి, రవీంద్రనాథ్‌ త్రిపాఠి ఇటీవలే పార్టీ నుంచి వైదొలిగిన విషయం తెలిసిందే.

అసదుద్దీన్ ఓవైసీ నోట..ఆశ్చర్యకరమైన మాట..

  ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసే మజ్లిస్ పార్టీ అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కొన్ని ఆశ్చర్యకరమైన వ్యాఖ్యలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ప్రస్తుతం ఐసిస్ ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న సంగతి తెలిసిందే. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ అసదుద్దీన్ ఐసిస్ పై మండిపడ్డారు. మానవత్వానికి ఐసిస్ అత్యంత ప్రమాదకారి అన్నారు. కేవలం ముస్లింలకే కాదు, ప్రపంచ మానవాళికే ఐసిస్ ప్రమాదకరంగా మారనుందని.. ముస్లింల ముసుగులో ఉగ్రదాడులకు పాల్పడుతున్న ఐసిస్‌తో ఇస్లాంకు సంబంధం లేదన్నారు. ఉగ్రదాడి అనగానే ముస్లింలను అనుమానిస్తున్నారని, అలా అనుమానించవద్దని విజ్ఞిప్తి చేశారు. దాని అధినేత అబూబకర్ పచ్చి అబద్ధాలకోరని, ఇస్లాం పేరుతో ఇస్లాంను దెబ్బతీసేందుకు ప్రయత్నిస్తున్నాడన్నారు. సజీవంగా కనిపిస్తే ముస్లింలు అతణ్ని వంద ముక్కలు చేయడం ఖాయమని హెచ్చరించారు. మదీనాపై ఉగ్రదాడి పెద్ద నేరమని, అది యావత్ ముస్లింలపై జరిగిన దాడని, ఇలాంటి దాడులను సహించేది లేదని అన్నారు.ఐసిస్ అంతం తప్పదని, దాని కోసం ముస్లింలు ఐక్యం కావల్సిన అవసరం ఉందన్నారు. అయితే ఇంతా మాట్లాడిన ఆయన.. ఎన్ఐఏ ఉగ్రవాదులు అంటూ అరెస్ట్ చేసిన వారు అమాయకపు యువకులని.. వారి తల్లిదండ్రులు నన్ను కలిశారు.. వారిని న్యాయం అందిస్తానని అన్నారు. ఆ యువకులు నిర్దోషులని తేలితే వారిని అరెస్ట్ చేసిన అధికారులను సస్సెండ్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలకు ఆంతర్యం ఏంటో ఎవరికి అర్ధంకాక అందరూ అవాక్కవుతున్నారు.

ఇప్పుడు భయపడి ఏం లాభం జకీర్ నాయక్..

  ఇస్లామిక్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ వ్యవస్థాపకుడు, ఇస్లాం బోధకుడు జకీర్ నాయక్ తాను తెలిసి చేసినా, తెలియక చేసినా.. తన ప్రసంగాల వల్ల కొంతమంది ఉగ్రవాదులుగా తయారవుతున్నారని.. ఉగ్రదాడులకు ఆయన బోధనలు కూడా కారణమవుతున్నాయన్న సంగతి బయటపడింది. అయితే తాను ఉగ్రవాదానికి పూర్తి వ్యతిరేకుడినని తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని చెబుతున్నా.. ఉగ్రవాదులకు బోధనలు వినిపిస్తున్నారన్నట్లు తేలిపోయింది. దీంతో ఆయన ఎప్పుడు ఇండియా వస్తాడో.. అప్పుడు సమన్లు జారీ చేయడానికి సిద్దంగా ఉన్నారు. అంతేకాదు ముంబైలో జకీర్‌ కదలికపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఇంటెలిజెన్స్ విభాగాలు, కౌంటర్ టెర్రరిజం ఏజెన్సీలు నిరంతర నిఘాకు సిద్ధమవుతున్నాయి. ఆయన పీస్ టీవీ అనే ఛానల్‌ను సైతం బంగ్లాదేశ్లో నిషేందించారు.   ఇదిలా ఉండగా జకీర్ నాయక్ మాత్రం ఇండియా రావడానికి భయపడుతున్నట్టు తెలుస్తోంది. భారత్ వచ్చేది ఉన్నా.. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఇప్పుడప్పుడే రానున్నట్టు తెలుస్తోంది. అతని షెడ్యూల్ ప్రకారం.. ఈరోజు ఆయన ముంబై రావాల్సి ఉంది..అంతేకాదు రేపు జరగాల్సిన ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ లో కూడా పాల్గొనాల్సి ఉంది. కానీ జకీర్ నాయక్ ఈ కార్యక్రమాలన్నింటినీ రద్దు చేసుకున్నారు.   మరోవైపు శివసేన పార్టీ కూడా జకీర్ నాయక్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తుంది. పాకిస్తాన్‌ నివాస కేంద్రంగా ఉన్న అజ్హర్‌ మసూద్‌ వంటివారు బహిరంగంగానే విషం చిమ్ముతారని, కానీ జకీర్‌నాయిక్‌ వంటి వారు సామాజిక సేవ పేరుతో, శాంతిని కోరుతున్న వ్యక్తులుగా కనిపిస్తూ పరోక్షంగా జాతి వ్యతిరేకులను ప్రోత్సహిస్తుంటారని శివసేన పేర్కొంది.

శక్తిమాన్ విగ్రహ ఆవిష్కరణ...

  పోలీస్ అశ్వం శక్తిమాన్ మృతి చెందిన సంగతి తెలిసిందే. ఉత్తరాఖండ్ లోని హరీశ్ రావత్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ నేతలు నిరసన తెలిపిన నేపథ్యంలో.. గణేష్ జోషి అనే భాజపా ఎమ్మెల్యే శక్తిమాన్ పై దాడి జరిపిన సంగతి విదితమే. ఆ దాడిలో శక్తిమాన్ కాలు విరిగిపోగా.. దాని కోసం విదేశాల నుండి కృత్రిమ కాలు తెప్పించారు. ఆపరేషన్ చేసి కృత్రిమ కాలు అమర్చారు. అయితే కొన్నిరోజులు బాగానే ఉండి.. ఇంకా కోలుకుంటుంది అనే లోపులోనే ప్రాణాలు కోల్పోయింది. అయితే ఇప్పుడు శక్తిమాన్ గుర్తుగా ఓ విగ్రహాన్ని తయారు చేయించారు.  ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి హరీశ్‌ రావత్‌ డెహ్రాడూన్‌ పోలీస్‌ లైన్‌లో శక్తిమాన్‌ విగ్రహాన్నిఆవిష్కరించనున్నారు. ఏప్రిల్‌ 20న శక్తిమాన్‌ కన్నుమూసింది.

మరో ఆఫర్ తో ఎయిర్ ఇండియా..

కొత్త కొత్త ఆఫర్లని ప్రవేశపెట్టడంలో ఎయిర్ ఇండియా ఎప్పుడూ ముందే ఉంటుంది. గతంలో ప్రయాణికుల కోసం ఎన్నో ఆఫర్లను తీసుకొచ్చిన ఎయిర్ ఇండియా ఇప్పుడు మరో కొత్త ఆఫర్ ను తీసుకొచ్చింది. అదేంటంటారా.. లాస్ట్ మినిట్లో అకస్మాత్తుగా ఎక్కడికైనా ప్రయాణించాల్సి వస్తే విమాన సంస్ధలు ధరలు అమాంతం పెంచేస్తాయన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు వాటికి చెక్ పెడుతూ ఎయిర్ ఇండియా.. రాజధాని ఎక్స్ ప్రెస్ టికెట్ ధరలకంటే తక్కువ ధరలకే టికెట్లను ఆఫర్ చేస్తూ ప్రయాణీకులను ఆకట్టుకుంటోంది. చివరి నిమిషంలో తమ విమాన టికెట్ల ధరలను మరింత తగ్గిస్తూ.. ఆక్యుపెన్సీ పెంచుకునే దిశలో ఎయిర్ ఇండియా ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ సందర్బంగా ఎయిర్ ఇండియా  సీఎండీ అశ్వనీ లోహానీ మాట్లాడుతూ.. చివరి నిమిషంలో విమాన ప్రయాణాన్ని ఎంచుకునే ప్రయాణికులకు అందుబాటు ధరలతో ఉపశమనం అందించడంతోపాటు, మిగిలిన ఖాళీ సీట్లు పూరించడమే తమ లక్ష్యమని చెప్పారు. రాజధాని ఎక్స్ ప్రెస్ ఎసీ టు టైర్ ధరలు ఢిల్లీ-ముంబై రూ. 2,870, ఢిల్లీ-చెన్నై రూ.3,905. ఢిల్లీ-కోలకతా రూ.2,890 ఢిల్లీ-బెంగళూరు రూ.4,095 లుగా ఉండగా.. ఇప్పుడు ఎయిర్ ఇండియా టికెట్ బుక్ చేసుకుంటే.. ఈ ధరకంటే తక్కువ ధరలకే.. తక్కువ సమయంలో విమానంలో ప్రయాణించవచ్చని తెలిపారు.

సోనియాను ముంచింది వారేనట..

పార్టీలో ఉన్నంతకాలం బాగానే ఉన్నా ఒక్కసారి వేరే పార్టీ మారితే చాలు.. అప్పటివరకూ ఉన్న పార్టీ నేతలపైనే విమర్శలు చేసేస్తుంటారు కొంతమంది నేతలు. ఇప్పటివరకూ అలాంటి నేతలను ఎంతో మంది చూసుంటాం. పొరిగింటి పుల్లకూర రుచి అన్న మాదిరి.. వేరే పార్టీ నీళ్లు వంటపట్టగానే సరి.. విమర్శలు గుప్పించేస్తారు. ఇప్పుడు ఆ జాబితాలోకి గుత్తా సుఖేందర్‌రెడ్డి కూడా చేరిపోయారు.   నల్గొండ పార్లమెంట్ సభ్యడు గుత్తా సుఖేందర్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి టీఆర్ఎస్లో చేరిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయన టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటి రెడ్డి బ్రదర్స్‌ పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్‌ పార్టీని, సోనియాను ముంచింది ఇప్పుడున్న ముఖ్య నేతలేనని.. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, కోమటి రెడ్డి బ్రదర్స్‌ వ్యాఖ్యలు గురివింద గింజ చందంగా ఉంటాయని.. తాను ఎంపీగా బరిలో లేకపోతే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి 2009, 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిచేవారా అని ప్రశ్నించారు. కడుపులో కత్తులు పెట్టుకుని ఉత్తమ్‌, వెంకట్‌రెడ్డి కౌగిలించుకున్నా, కరచాలనం చేసినా వృథానేనని ఆయన విమర్శించారు. నన్ను తిట్టేందుకైనా కాంగ్రెస్‌ నేతలంతా ఒక్కటైనందుకు సంతోషమని ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. కాంట్రాక్ట్‌ల కోసం కాదని, ప్రాజెక్ట్‌ల నిర్మాణం కోసం తాను పార్టీమారానని ఆయన అన్నారు. మరి గుత్తా వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో.. వారు గుత్తా మీద ఏం విమర్శలు గుప్పిస్తారో చూడాలి.

ట్రంప్ గోడ కడితే కట్టుకో.. నష్టం లేదు..

  వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో ట్రంప్ దిట్ట అని మనకు తెలిసిందే. దీనిలో భాగంగానే ఆయన మెక్సికో పై కూడా వివాదాస్పద  వ్యాఖ్యలు చేశారు. తాను కనుక అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే మెక్సికో సరిహద్దుల్లో గోడ కడతానని వ్యాఖ్యానించారు. అంతేకాదు  మెక్సికన్లు వలసదారులని, రేపిస్టులని, డ్రగ్ డీలర్లని కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. మరి ట్రంప్ చేసిన వ్యాఖ్యలకు మెక్సికో సైలెంట్ గా ఉంటుందా.. ఘాటుగానే సమాధానమిచ్చింది. ఆ దేశ ప్రెసిడెంట్ పెనా నీటో ట్రంప్ వ్యాఖ్యలకు స్పందించి.. ట్రంప్ మనస్తత్వం హిట్లర్, ముస్సోలినీ వంటి నియంతల మనస్తత్వం కలదని అన్నారు. రెండు దేశాల సరిహద్దుల్లో గోడ కట్టాలని భావిస్తే నిరభ్యంతరంగా కట్టుకోవచ్చని.. దాని వల్ల తమకు వచ్చే నష్టం ఏంలేదని.. అది అమెరికా ప్రభుత్వం అంతర్గత విషయమని తేల్చి చెప్పారు. మొత్తానికి ట్రంప్ తన నోటి దురుసుతో పక్క దేశాలతో కూడా వైరం పెంచుకునేలా ఉన్నారు.

కేరళ యువకులు మిస్సింగ్.. ఐసిస్ లోకి..!

  కేరళలో ముస్లిం యువకుల మిస్సింగులు కలకలం రేపుతోంది. మొన్నటికి మొన్న ఓ 15 మంది యువకులు కనిపించకుండా పోగా.. ఇప్పుడు మరో ఏడుగురు యువకులు కనిపించకుండా పోయారు. కసర్‌గోడ్‌లోని పడన్నా, త్రికారీపూర్ ప్రాంతాలకు చెందిన ఏడుగురు యువకులు కనిపించకుండా  పోయినట్టు ఫిర్యాదులు రావడంతో విషయం వెలుగు చూసింది. అయితే వీరంతా ఉగ్రవాద సంస్థ ఐసిస్‌లో చేరి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. మరికొందరు ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ను కలిసి తమ ఆవేదన వ్యక్తం చేయగా.. స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయాలని సీఎం వారిని కోరారు. ఈ సందర్బంగా ఎస్పీ థామస్ జోస్ మాట్లాడుతూ.. ఇన్వెస్టిగేషన్ కోసం ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసినట్టు తెలిపారు.  

డ్రైవర్ లేకుండానే రైలు కదిలింది..టెన్షన్ పెట్టింది..

యార్డులో ఆగివున్న రైలు దానంతట అదే కదలి రైల్వే అధికారులను పరుగులు పెట్టించింది. అరక్కోణం జంక్షన్ రైల్వేస్టేషన్ యార్డులో నిన్న రాత్రి చెన్నై విద్యుత్ రైలు యార్డులో ఆగిఉంది. ఇవాళ తెల్లవారుజామున ఆకస్మాత్తుగా రైలు దానంతట అదే కదిలింది..అందరూ చూస్తుండగానే 500 మీటర్ల దూరం వెళ్లి పట్టాలు తప్పి ఆగింది. ఐదు బోగిలు పట్టాలు తప్పడంతో ఆ ప్రాంతంలోని సిగ్నల్ వ్యవస్థ దెబ్బతింది. రైల్వే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని మరమ్మత్తులు చేపట్టారు. ఈ కారణంగా సిగ్నల్ వ్యవస్థ దెబ్బతినడంతో దాదాపు గంటన్నరపాటు రైళ్ల రాకపోకలు స్థంభించిపోయాయి. 

కాశ్మీర్‌లో తెలుగువారి అష్టకష్టాలు..

మోస్ట్‌వాంటెడ్ హిజ్బుల్ కమాండర్ బుర్హన్ వాని ఎన్‌కౌంటర్ నేపథ్యంలో జమ్మూకశ్మీర్ అట్టుడుకుతోంది. ఆందోళనకారులు పోలీస్‌స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా విధ్వంసానికి దిగడంతో ప్రభుత్వం శ్రీనగర్, అనంత్‌నాగ్, పుల్వామా తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. దీని ప్రభావం అమర్‌నాథ్ యాత్రపై పడింది. తెలుగురాష్ట్రాల నుంచి అమర్‌నాథ్ యాత్రకు వెళ్లిన ప్రయాణికులు కశ్మీర్‌లో చిక్కుకుపోయారు. ప్రకాశం జిల్లాకు చెందిన 150, చిలకలూరిపేటకు చెందిన 50, నెల్లూరు జిల్లాకు చెందిన 47 మంది యాత్రికులు బల్తాల్ వద్ద చిక్కుకుపోయినట్టు అధికారులు తెలిపారు. వీరిని స్వస్థలాలకు రప్పించేందుకు ఏపీ,తెలంగాణ ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి.

చిన్నారి రమ్య అంత్యక్రియలు పూర్తి..

ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తొమ్మిది రోజుల పాటు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడిన చిన్నారి రమ్య నిన్న సాయంత్రం మరణించింది. రమ్య మృతదేహానికి ఉస్మానియా ఆసుపత్రిలో పోస్ట్‌మార్టం అనంతరం అంబర్‌పేటలోని డీడీ కాలనీలోని రమ్య అమ్మమ్మ ఇంటికి తరలించారు. రమ్య మృతదేహాన్ని చూసిన బంధువులు, స్థానికులు కన్నీటి పర్యంతమయ్యారు. ప్రత్యేకంగా సిద్ధం చేసిన వాహనంలో రమ్య పార్థివదేహన్ని ఉంచి అంతిమయాత్ర నిర్వహించారు. ఈ అంతిమయాత్రకు కుటుంబసభ్యులతో పాటు బంధువులు, స్థానికులు పెద్దసంఖ్యలో హాజరయ్యారు. అంతకుముందు రమ్య మృతదేహాన్ని తెలంగాణ శాసనసభ స్పీకర్ మధుసూదనాచారి సందర్శించి నివాళుర్పించి..చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఉస్మానియా ఆసుపత్రి మార్చురి వద్ద రమ్య మృతదేహానికి మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నివాళుర్పించారు.  

కశ్మీర్‌లో ఆగని అల్లర్లు: పోలీస్ మృతి

మోస్ట్‌వాంటెడ్ హిజ్బుల్ కమాండర్ బుర్హాన్ వాని ఎన్‌కౌంటర్ నేపథ్యంలో కశ్మీర్‌‌లో అల్లర్లు తీవ్రరూపం దాలుస్తున్నాయి. ఆందోళనకారులు పోలీస్‌స్టేషన్లు, ప్రభుత్వ కార్యాలయాలే లక్ష్యంగా విధ్వంసానికి దిగడంతో ప్రభుత్వం శ్రీనగర్, అనంత్‌నాగ్, పుల్వామా తదితర ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. తాజాగా ఇవాళ ఆందోళనకారులకు, సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణల్లో ఒక పోలీసు మరణించాడు. అనంత్‌నాగ్ జిల్లాలో కొందరు నిరసనకారులు పోలీసుల వాహనాన్ని జీలం నదిలోకి తోసేశారు. ఈ ఘటనలో ఓ పోలీసు మరణించాడు. ఇప్పటివరకు జరిగిన ఘర్షణల్లో 16 మంది మృతి చెందగా..మరో 200 మందికి పైగా గాయపడ్డారు. పరిస్థితి అదుపుతప్పుతుండటంతో కేంద్రప్రభుత్వం అప్రమత్తమైంది..మరిన్ని అదనపు బలగాలు మోహరించింది.

చైనాలో ఇద్దరు భారతీయుల వెకిలి చేష్టలు..అరెస్ట్

దేశం కాని దేశంలో జాగ్రత్తగా ఉండాల్సింది పోయి..అక్కడ వెకిలివేషాలు వేసిన ఇద్దరు భారతీయులు ఊచలు లెక్కపెడుతున్నారు. హర్యానా రాష్ట్రానికి చెందిన ఇద్దరు వ్యక్తులు చైనాలో ఉన్న భారత్‌కు చెందిన టీకంపెనీలో పనిచేసేందుకు వెళ్లారు. ఈ నెల 7న వారు పనిచేస్తున్న హోటల్‌లో లిఫ్ట్ వద్ద తైవాన్‌కు చెందిన మహిళా టూరిస్ట్‌తో ఫోటో దిగుతూ..అసభ్యంగా ప్రవర్తించారు. వారి ఉద్దేశ్యాన్ని పసిగట్టిన సదరు మహిళ నిందితుల బారి నుంచి ఎలాగొలా తప్పించుకుని పోలీసులును ఆశ్రయించింది. రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించి అదుపులోకి తీసుకున్నారు.