మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం ఎప్పుడో?
తెలంగాణ రాష్ట్ర మంత్రి వర్గ విస్తరణ ముహూర్తం, ఖరారు అయినట్లా, కానట్లా అంటే, అయ్యీ కానట్లుగానే ఉన్నట్లు తెలుస్తోంది. అవును, వారం రోజుల క్రితం, మార్చి 24న మంత్రి వర్గ విస్తరణకు కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అదే సమయంలో ఏప్రిల్ 3 ముహూర్తం అని కూడా ప్రచారం జరిగింది. అలాగే కొత్త మంత్రులు వీరే అంటూ నాలుగు పేర్లు, నాలుగు ముఖాలు తెరపైకి వచ్చాయి.
అయితే రోజు రోజుకూ సీన్ మారుతున్న సంకేతాలు వస్తున్నాయి. నిజానికి, ఓ వంక రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు జరుగుతున్న సమయంలో, కాంగ్రెస్ అధిష్టానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ తో పాటుగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర వ్యవహరాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ ను రాత్రికి రాత్రి ఢిల్లీ పిలిపించుకుని మరీ మంత్రివర్గ విస్తరణపై చర్చించి నిర్ణయం తీసుకోవలసిన అవసరం, అర్జెన్సీ ఏమొచ్చింది అన్న అనుమానాలు వచ్చాయి. మంత్రి వర్గ విస్తరణ కాదు మరేదో ఉందనే కథనాలూ వచ్చాయి. అయితే ఆ అనుమానాలు అంతగా నిలవలేదు.
అయితే ఈ ఐదారు రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ స్వరూప స్వభావాలు మెల్ల మెల్లగా మారుతూ వస్తున్నాయి. నిజానికి రేపు ఎప్పుడైనా జరిగేది కేవలం మంత్రి వర్గ విస్తరణ మాత్రమే కాదు. మంత్రి వర్గంలో ఉన్న ఖాళీలను నింపే క్రతువు మాత్రమే కాదు, మంత్రి వర్గంలో భారీగానే మార్పులు చేర్పులు ఉంటాయని అంటున్నారు. అవును జరిగేది, మంత్రి వర్గ విస్తరణ కాదు, మంత్రి వర్గ పునర్వ్యవస్తీకరణ అంటున్నారు. తెలంగాణ విషయంలో పార్టీ అధిష్టానం ఇంతవరకు ఒక లెక్క ఇకపై మరో లెక్క అనే నిర్ణయానికి వచ్చిందని కాంగ్రస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ముఖ్యంగా, దీర్ఘకాల ప్రణాళికతో దేశ వ్యాప్తంగా పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేసేందుకు నడుం బిగించిన రాహుల్ గాంధీ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలను, ముఖ్యంగా తెలంగాణపై ప్రత్యేక దృష్టిని కేంద్రీకరించారని తెలంగాణను రోల్ మోడల్ గా చూపించాలని రాహుల్ సంకల్పించారని అంటున్నారు.
ఈ నేపధ్యంలో అధికారంలోకి వచ్చి పట్టుమని పదిహేను నెలలు అయినా కాకముందే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్త మవుతున్నట్లు వస్తున్న వార్తల విషయంలో అధిష్టానం సీరియస్ గా ఉందని అంటున్నారు. అందుకే మంత్రి వర్గం సర్జరీ కి సిద్దమయినట్లు తాజా సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ఒక విధంగా, డిఫరెంట్ సోర్సెస్ నుంచి సేకరించిన గ్రౌండ్ రిపోర్ట్స్ ఆధారంగా మంత్రివర్గంలో భారీ మార్పులు చేర్పులు చేపట్టేదుకు కాంగ్రెస్ అధిష్టానం భారీ కసరత్తే చేసినట్లు చెపుతున్నారు.
అంతే కాదు మార్చి 24న ఢిల్లీలో జరిగిన చర్చల్లోనే, మంత్రి వర్గ పని తీరును సమీక్షించినట్లు చెపుతున్నారు. కీలక శాఖలను నిర్వహిస్తున్న మంత్రులకు ముఖ్యమంత్రికి మధ్య సరైన సమన్వయం లేక పోవడంతో ఈ శాఖల్లో మార్పులు తప్పవని కాంగ్రెస్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. నిజానికి అన్నిటికంటే ముఖ్యంగా మంత్రివర్గంలో సమన్వయలోపం కొట్టొచ్చినట్లు కనిపిస్తున్న నేపధ్యంలో కొందరు మంత్రుల శాఖలు మార్చడంతో పాటుగా అవసరమైతే ఉద్వాసనలు వెనకాడరాదనే నిర్ణయానికి అదిస్థానం వచ్చినట్లు కాంగ్రెస్ వర్గాల సమాచారం.
అదొకటి అలా ఉంటే, మూడవ తేదీ ముహూర్తం విషయంలోనూ ఇంకా పూర్తి స్పష్టత రాలేదని అంటున్నారు. ముఖ్యంగా ఇటీవల ఢిల్లీకి దగ్గరైన రాష్ట్రానికి చెందిన సీనియర్ నాయకుడు ఒకరు కీలక మార్పుల విషయంలో తొందరపాటు నిర్ణయాలు మంచిది కాదని సూచించినట్లు తెలుస్తోంది. ఈ నేపధ్యంలో, అధిష్టానం పునారలోచనలో పడిందని అంటున్నారు. ఈ సందర్భంగా సదరు సీనియర్ నాయకుడు గతంలో ఫిర్యాదుల ఆధారంగా నిర్ణయాలు తీసుకుని భారీ మూల్యం చెల్లించిన విషయాన్నీ గుర్తు చేసిన మీదట, మరో సారి రాష్ట్ర నాయకులతో మరింత లోతుగా చర్చించిన తర్వాతనే ముహూర్తం ఖరారు చేయాలనే ఆలోచనకు అధిష్టానం వచ్చిందని అంటున్నారు. అదే జరిగితే, మూడవ తేదీ ముహూర్తం మిస్సయ్యే అవకాశం లేక పోలేదని అంటున్నారు.ఏప్రిల్ 8,9 తేదీల్లో అహ్మదాబాద్ లో జరగనున్న ఏఐసీసీ రెండు రోజుల సమావేశాలు ముగిసిన తర్వాతనే, ముహూర్తం ఖరారు అవుతుందని అంటున్నారు.