రష్యా పర్యటనకు బయల్దేరిన సీఎం చంద్రబాబు
ఐదు రోజుల పర్యటన నిమిత్తం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇవాళ రష్యా బయల్దేరి వెళ్లారు. గన్నవరం విమానాశ్రయం నుంచి ఉదయం ప్రత్యేక విమానంలో ఢిల్లీకి చేరుకున్న ఆయన ఢిల్లీ నుంచి మరో ప్రత్యేక విమానంలో రష్యా చేరుకుంటారు. సీఎం వెంట ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు, ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్, సీఎం కార్యదర్శులు సతీష్ చంద్ర, సాయిప్రసాద్, పెట్టుబడుల శాఖ ముఖ్య కార్యదర్శి అజయ్ జైన్, పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి ఆరోక్యరాజ్, రాజధాని అభివృద్ధి కార్పొరేషన్ ఛైర్మన్ లక్ష్మీ పార్థసారధి, నైపుణ్యాభివృద్ధి శిక్షణ డైరెక్టర్ లక్ష్మీనారాయణ, ఎకనామిక్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో కృష్ణ కిషోర్, ముఖ్యమంత్రి వ్యక్తిగత కార్యదర్శి పి.శ్రీనివాసరావు, ప్రధాన భద్రతాఅధికారి నగేష్‌బాబు ఉన్నారు.
రాష్ట్రానికి పెట్టుబడులే లక్ష్యంగా చంద్రబాబు పర్యటన సాగనుంది. రష్యా పర్యటనకు ఒక్క రోజు ముందు కొత్తగా నిర్మించిన కజకిస్థాన్ రాజధాని ఆస్తానాలో ముఖ్యమంత్రి పర్యటించనున్నారు. గతేడాది రష్యా పర్యటనకు వెళ్లిన ప్రధాని కజకిస్థాన్ రాజధాని అస్తానా నిర్మాణశైలికి ముగ్దడై ఈ నగరాన్ని పరిశీలించాల్సిందిగా సీఎం చంద్రబాబుకు సూచించారు.