చాలా రోజుల తర్వాత రాజ్యసభకు చిరంజీవి.. హై కమాండ్ ఆదేశం..

  ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ నేత కేవీపీ పెట్టిన బిల్లు ఓటింగ్ కు అందరూ పాల్గొనాల్సిందే అని హైకమాండ్ విప్ జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే రాజ్యసభ సభ్యుడు, సినీ నటుడు చిరంజీవి ఈ రోజు పార్లమెంట్లో ప్రత్యక్షమయ్యారు. తన 150వ సినిమా షూటింగ్ బిజీగా జరుగుతున్నా.. తన పనులను పక్కనపెట్టి పార్లమెంట్ కు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బిల్లుపై ఓటింగ్ జ‌ర‌గ‌కుండా బీజేపీ వంక‌లు వెతుకుతోందని.. ‘బీజేపీ బిల్లుకి మ‌ద్ద‌తు తెలిపి తీరాలి.. లేదంటే వారికి ఇబ్బందులు త‌ప్ప‌వు’ ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో బీజేపీ ఉనికే లేకుండా పోతుంది అని వ్యాఖ్యానించారు. మ‌రోవైపు టీడీపీది కూడా అదే ప‌రిస్థితి అని ఎద్దేవ చేశారు.

ప్రైవేటు బిల్లుకు మద్దతిస్తేనే జీఎస్టీ బిల్లుకు మద్దతు..

  ఆంధ్రప్రదేశ్ కు ప్రత్యేక హోదా ఇవ్వాలని కేవీపీ రాజ్యసభలో పెట్టిన ప్రైవేటు బిల్లుపై నేడు ఓటింగ్ జరగనుంది. ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీ కూడా తమ బిల్లును గెలిపించుకోవడానికి శత విధాలా ప్రయత్నిస్తుంది. కాంగ్రెస్ పార్టీ నేతలు ఎలాగు ఓట్లు వేస్తారు.. ఇక టీడీపీ, వైసీపీ నేతలు కూడా ఓట్లు  వేయాల్సిందే. ఇంక పలు పార్టీలు కూడా బిల్లుకు మద్దతు పలికాయి. అయితే ఇప్పుడు ఈ బిల్లును గెలిపించుకోవాడానికి కాంగ్రెస్‌ పార్టీకి చిత్తశుద్ధి అవ‌స‌ర‌మ‌ని  టీడీపీ రాజ్య‌స‌భ స‌భ్యుడు టీజీ వెంక‌టేశ్ కొన్ని సూచనలు చేశారు. కేవీపీ ప్రైవేటు బిల్లుకు మద్దతు ఇస్తేనే జీఎస్టీ బిల్లుకు మద్దతిస్తామని బీజేపీకి కాంగ్రెస్ తేల్చిచెప్పాలని అన్నారు. బీజేపీకి మిత్రపక్షంగా ఉంటూనే రాష్ట్రానికి రావాల్సినవి సాధించుకుంటామని.. తాము ఏపీ ప్ర‌జ‌ల ప్ర‌యోజ‌నాలను కాపాడుకునే క్ర‌మంలో వెన‌క‌డుగు వేయ‌బోమ‌ని తేల్చి చెప్పారు.

మరో ఆప్ ఎంపీ బుక్.. స్పీకర్ సమన్లు..

  ఆప్ నేతలు ఎప్పుడూ ఏదో ఒక వివాదంలో చిక్కుకొంటూనే ఉంటారు. వారు వివాదాల్లో చిక్కుకోకపోతే ఆశ్చర్యం కానీ.. చిక్కుకుంటే ఆశ్చర్యం లేదు. ఇప్పుడు తాజాగా ఎంపీ భగవత్ మాన్‌సింగ్ వివాదంలో చిక్కుకున్నారు. ఇంతకీ ఆయన ఏం చేశారనుకుంటున్నారా.. పార్లమెంట్ భద్రతను షూట్ చేశారు. చేస్తే చేశారు.. అక్కడితో ఆగకుండా ఈ వీడియో కాస్త సోషల్ మీడియాలో పోస్ట్ చేసి అడ్డంగా దొరికిపోయారు. ఇక ఎప్పుడు అవకాశం దొరుకుతుందా ఆని ఎదురుచూసే విపక్షాలు ఊరుకుంటాయా.. ఆయన చేసిన పనిపై మండిపడుతున్నారు. ప్రజాసామ్యానికి టెంపుల్ లాంటి పార్లమెంట్ భద్రతపై స్టింగ్ ఆపరేషన్ చేయడమేంటని అంటున్నారు. పార్లమెంట్ భద్రత వ్యవహారాన్ని వీడియోలు తీయడం దారుణమని.. ఇది భద్రత నియమాలను ఉల్లంఘించడమే కాదు, సభ్యుల హక్కుల ఉల్లంఘన కిందకు కూడా వస్తుందని.. ఆయనపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీంతో లోక్‌సభ స్పీకర్ సమన్లు ఇచ్చారు.

అసలు ప్రత్యేక హోదా బిల్లు చర్చకు వస్తుందా..?

  జులై 22వ తేదీ.. ఏపీ ప్రజలు అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న రోజు. ఎందుకంటే కాంగ్రెస్ నేత కేవీపీ రామచంద్రరావు ఏపీకి ప్రత్యేక హోదా  డిమాండ్ చేస్తూ రాజ్యసభలో బిల్లు ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ బిల్లుపై ఈరోజు ఓటింగ్ జరగనుంది. దీంతో ఏం జరుగుతుందా అని అందరూ ఉత్కంఠంగా ఎదురుచూస్తున్నారు. మరోపక్క పార్టీలన్నీ ఎవరి వ్యూహాంలో వాళ్లు ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే పలు పార్టీలతో మంతనాలు జరిపి మద్దతు తెచ్చుకుంది. బీజేపీ కూడా బిల్లును అసలు చర్చకు రానీయకుండా ఎలా చేయాలా అని ప్లాన్ లు వేస్తుంది.   అయితే పరిస్థితి చూడబోతే నిజంగానే అసలు ఈ బిల్లు చర్చకు వస్తుందా అన్న సందేహాలు వస్తున్నాయి. ఎందుకంటే సాధారణంగా ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2.30 గంటల తర్వాత రాజ్యసభలో సభ్యులు ప్రతిపాదించే ప్రైవేటు బిల్లులపై చర్చ జరుగుతుంది. 2.30 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకూ చర్చ జరుగుతుంది. అయితే ఈరోజు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 ప్రైవేటు బిల్లులపై చర్చలు జరగనున్నాయి. ఇక మన ప్రత్యేక హోదా బిల్లు వంతు 14. ఈ నేపథ్యంలో 13 బిల్లుల ప్రస్తావన ముగిసి 14వ బిల్లుగా ఉన్న కేవీపీ బిల్లు అసలు సభలో ప్రస్తావనకు వస్తుందా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కానీ కాంగ్రెస్ మాత్రం  తప్పనిసరిగా ఈ బిల్లుపై ఓటింగ్ జరిపించాలని పట్టుబడుతోంది. మరి చూద్దాం ఏం జరుగుతుందో.

కాంగ్రెస్ వంతు.. టీడీపీలోకి ఎమ్మెల్సీ

  ఏపీ అధికార పార్టీ అయిన టీడీపీలోకి ఇప్పటివరకూ వైసీపీ ఎమ్మెల్యేలు వలసలు కట్టారు. ఎమ్మెల్యేలతో మొదలైన వలసల పర్వం ఎమ్మెల్సీలు ఆఖరికి మున్సిపల్ కార్పోరేటర్లు వరకూ సాగింది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ వంతు వచ్చింది. కాంగ్రెస్ పార్టీ నేత నరేశ్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరుతున్నట్టు వార్తలు వస్తున్నాయి. కాగా నరేశ్ కుమార్ రెడ్డి గత ఎన్నికలప్పుడు వైసీపీ నేత, ప్రస్తుతం జిల్లాలోని మదనపల్లి ఎమ్మెల్యేగా ఉన్న దేశాయి తిప్పారెడ్డి చేతిలో సింగిల్ ఓటు తేడాతో ఓటమిపాలయ్యారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించగా ఇటీవలే విజయం సాధించి ఎమ్మెల్సీగా మండలిలో అడుగుపెట్టారు. కాగా ఇప్పుడు ఆయన టీడీపీలో చేరనున్నట్టు తెలుస్తోంది. ఈ నెల 25న చంద్రబాబు సమక్షంలో నరేశ్ కుమార్ రెడ్డి టీడీపీలో చేరనున్నారు.

ఏపీ మంత్రివర్గ విస్తరణ.. ఎవరు ఇన్.. ఎవరు ఔట్..

  రాష్ట్రం విడిపోయి రెండేళ్లు అయింది.. ఎవరి రాష్ట్రంలో వారు ప్రభుత్వాలు ఏర్పాటు చేసుకొని కూడా రెండు సంవత్సరాలు అయిపోయింది. అయితే ఏపీలో టీడీపీ అధికారం చేపట్టి రెండేళ్లు గడిచినా మంత్రివర్గ విస్తరణానికి మాత్రం పునాదులు పడలేదు. ఇదిగో ఇప్పుడ జరగుతుంది.. అప్పుడు జరుగుతుంది అంటూ గత రెండేళ్లనుండి చెప్పుకుంటూ వస్తున్నారు తప్పా.. ఇంతవరకూ మంత్రివర్గ విస్తరణ జరిగింది లేదు.. అయితే ఇప్పుడు తాజా పరిణామాలను చూస్తుంటే చంద్రబాబు దీనికి త్వరలోనే శ్రీకారం చుట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే స్వయంగా ఈ విషయాన్ని ప్రస్తావించారట. దీంతో అప్పుడే మంత్రుల్లో టెన్షన్ స్టార్ట్ అయిందట. నాడు ముఖ్యమంత్రి చంద్రబాబు ఏపీ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసినప్పుడు ఆయనతో పాటు 19 మంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేశారు. అయితే అప్పటినుండి.. ఇప్పటిదాకా వారే మంత్రివర్గంలో కొనసాగుతున్నారు. అయితే ఇప్పుడు మరికొంతమందికి అవకాశం ఇవ్వచ్చు అని వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో టీడీపీ లో నేతలతో పాటు.. వైసీపీ నుండి టీడీపీలోకి వచ్చిన నేతల్లో కూడా ఆశలు చిగురిస్తున్నట్టు రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. అంతేకాదు ప్రస్తుతం మంత్రులుగా ఉన్న వారిలో కొంతమందిని తప్పించవచ్చని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలు నేతల  పేర్లు కూడా వినిపిస్తున్నాయి. టీడీపీ రాష్ట్రాధ్యక్షుడు కళా వెంకట్రావును తీసుకోవచ్చని అంటున్నారు. ఒకవేళ ఆయన్ని కనుక తీసుకుంటే మంత్రి మృణాళిని తన పదవిని కోల్పోవచ్చని తెలుస్తోంది. ఇంకా వైసీపీ నుండి వచ్చిన  వచ్చిన జ్యోతుల నెహ్రూకి కూడా మంత్రి పదవి దక్కవచ్చని అంటున్నారు. ఎమ్మెల్సీలుగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, గాలి ముద్దు కృష్ణమ నాయుడు, పయ్యావుల కేశవ్ లకు వాగ్ధాటి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వారిని కూడా క్యేబినెట్లోకి తీసుకుంటే బావుంటుందని ఆలోచిస్తున్నారట. మరి చూద్దాం చంద్రబాబు ఆలోచన ఎలా ఉందో.. ఆయన ఎవరికి అవకాశం కల్పిస్తారో.

ఉలిక్కిపడ్డ అనంతపురం.. జంట హత్యల కలకలం..

  అనంతపురంలో జంట హత్యలు కలకలం రేపతున్నాయి. జిల్లాలో మరోసారి పాతకక్ష్యలు భగ్గుమన్న నేపథ్యంలో ఈ హత్యలు జరిగినట్టు తెలుస్తోంది.  వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా, రుద్రంపేట కూడలిలో చంద్రబాబు నగర్‌లో ఇద్దరు వ్యక్తులను వేట కొడవళ్లతో నరికి చంపారు. వీరు  పరిటాల రవీంద్ర వర్గీయులైన పాత రౌడీషీటర్లు గోపినాయక్, వెంకటేశ్ నాయక్‌గా గుర్తించారు. వీరిద్దరికీ ఎమ్మెల్యే ప్రభాకర్ చౌదరి వర్గీయులతో గత కొంతకాలంగా విభేధాలున్నాయని.. ఈ కారణంగానే ఆటోలో కూర్చొని ఉన్న గోపి నాయక్, వెంకటేశ్ నాయక్‌‌లపై ప్రత్యర్ధి వర్గానికి చెందిన వారు వేటకొడవళ్లతో దాడి చేశారని.. దీంతో వారిద్దరూ అక్కడికక్కడే మరణించారని చెబుతున్నరు. అయితే వీరిపై దాడి జరగడం ఇదేం మొదటిసారి కాదని.. ఇంతకుముందు ఓ నాలుగు సార్లు వీరిపై  హత్యాయత్నాలు జరిగినట్టు తెలుస్తోంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకున్నారు. ఇదిలా ఉండగా ఇన్నిరోజులు కాస్త ప్రశాంతంగా ఉన్న అనంతపురంలో ఒక్కసారే రెండు హత్యలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురయ్యారు.

పుష్కర ఏర్పాట్లపై చంద్రబాబు అగ్రహం.. అవసరమైతే తీసేయండి..

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పుష్కర పనులపై పర్యవేక్షణ నిర్వహించారు. అయితే పనులపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేసినట్టు తెలుస్తోంది. కృష్ణా జిల్లా సీతానగరంలో పుష్కర పనులను పర్యవేక్షించడానికి వెళ్లిన ఆయన ప‌నులు జ‌రుగుతోన్న తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. పుష్క‌రాల‌కు మ‌రో 20 రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంద‌ని, అయినా ఇంకా ప‌నులు మంద‌కొడిగా జ‌రుగుతున్నాయ‌ని.. పనులు నిర్ణయించిన కాల వ్యవధిలోపు పూర్తి కాకపోవడంపై స‌మాధానం ఇవ్వాల‌ని ఆయ‌న చెప్పారు. అంతేకాదు ఆ గుత్తేదారుని తీసేసి మరొకరికి బాధ్యతలు అప్పగించాలని ఆదేశించారు. ఇంకా ఈ ఏర్పాట్ల గురించి..అధికారులు, కాంట్రాక్ట‌ర్ల‌తో ఆయ‌న చ‌ర్చించాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.

అట్టుడుకుతున్న యూపీ.. అతని నాలుక తెస్తే 50 లక్షలు

  యూపీ బిజెపి నేత దయాశంకర్ సింగ్ బీఎస్పీ అధినేత మాయావతిపై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేసి నేపథ్యంలో యూపీ అట్టుడుకుతోంది. ఓ మీడియా సమావేశంలో పాల్గొన్న ఆయన మాయావతి గురించి మాట్లాడుతూ..   'డబ్బులు తీసుకున్న వేశ్య కూడా తాను ఒప్పుకున్న పనికి కట్టుబడి ఉంటుంది. మాయవతి ఎవరు ఎక్కువ డబ్బులిస్తే వారికి టిక్కెట్లు అమ్మేస్తున్నారు' అని నోటికి వచ్చినట్టు వ్యాఖ్యానించారు. ఇంకేముంది ఈ వ్యాఖ్యలకు బీఎస్పీ నేతలు ఆగ్రహం కట్టలు తెంచుకుంటుంది. దయాకర్ సింగ్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చేసేది లేక ఆయన కూడా క్షమాపణ చెప్పారు. అయితే అక్కడితో అయిందా అంటే లేదు.. ఆయన పదవికి కూడా వేటు పడింది. తనను పదవి నుండి సస్పెండ్ చేస్తూ బీజేపీ నిర్ణయం తీసుకుంది. అక్కడితో అయినా ఆగిందా లేదు పరిస్థితులు ఇంకా ఉద్రిక్తంగా మారాయి. దేశవ్యాప్తంగా ఆందోళనలను ఉధృతం చేసిన బీఎస్పీ కార్యకర్తలు.. దయాశంకర్ సింగ్ పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నారు. ఆయన దిష్టి బొమ్మలను దహనం చేస్తూ నిరసన ప్రదర్శిస్తున్నారు. మరోవైపు బిఎస్పీ నాయకురాలు జన్నత్ జహాన్ దయాశంకర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై స్పందించి.. ఆయన  నాలుక తీసుకువచ్చినవారికి 50 లక్షల రూపాయలు ఇస్తామని ప్రకటించారు. దీంతో ఆమె ప్రకటన దేశవ్యాప్తంగా చర్చాంశనీయమైంది. మరోవైపు పోలీసులు కూడా దయాశంకర్ సింగ్ ను అరెస్ట్ చేసే పనిలో పడ్డారు. ఈ ఘటనతో అయినా నేతలు తమ నోటి దురుసును కాస్త తగ్గించుకుంటారేమో చూద్దాం..

దారుణం.. కుక్క పిల్లల్ని కాల్చి చంపారు...

  మనుషుల్లో కర్కసత్వం పెరిగిపోతుంది అని చెప్పడానికి కొన్ని ఉదాహరణలు చూస్తే చాలు. ఇటీవలే తమిళనాడుకు చెందిన మెడికో కుక్కని టెర్రస్ పై నుండి పడేసి తన పైశాచికాన్ని చూపించాడు. ఇప్పుడు తాజాగా అలాంటి ఘటనే వెలుగుచూసింది హైదరాబాద్ నగరంలోని ముషీరాబాద్‌లో. వివరాల ప్రకారం.. ముషీరాబాద్లోని పఠాన్ బస్తీలో కొందరు మూడు కుక్క పిల్లలను తాళ్లు కట్టి మంటల్లో వేసి పైశాచిక ఆనందం పొందారు. మళ్లీ వారేదో గొప్ప పని చేస్తున్నట్టు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు. అంతే ఈ దారుణాన్ని చూసిన వారు ఊరుకుంటారా.. వారిపై తిట్ల వర్షం కురిపించారు. ఇంక ఈ దృశ్యాలను చూసిన పీపుల్స్‌ ఫర్‌ యానిమల్స్‌ ప్రతినిధి, న్యాయవాది శ్రేయ ముషీరాబాద్‌ పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. పోలీసులు కేసు నమోదు చేసుకొని.. ఈ ఘటనకు సంబంధించి 8మంది మైనర్లను అదుపులోకి తీసుకుని విచారణ జరిపారు. కేవలం ఆకతాయితనంతోనే కుక్కలను దహనం చేసినట్లు పోలీసులు నిర్థారించారు. నిందితులను జువైనల్‌ కోర్టుకు తరలించగా రిమాండ్ విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది.  

ప్రత్యూష బెనర్జీ కేసులో ట్విస్ట్.. ప్రియుడిపై చార్జీషీటు

  బాలిక వధు సీరియల్ నటి ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. అప్పుడు పెద్ద కలకలం రేపిన ఈ కేసు కొన్ని రోజులుగా సైలెంట్ అయింది. అయితే ఇప్పుడు మళ్లీ తాజాగా ఈకేసులో కొత్త ట్విస్ట్ ఇచ్చారు పోలీసులు. ప్రియుడు రాహుల్ రాజ్ సింగే ఆమెను ఆత్మహత్య చేసుకునేలా ప్రేరేపించాడని పోలీసులు అభియోగాలు మోపారు. అంతేకాదు ఆమెపై హింసకు పాల్పడినట్లుగా కూడా రాహుల్ పై పోలీసులు అభియోగాలు మోపారు. దీనికి సంబంధించిన  101 పేజీల చార్జీషీటును కోర్టులో దాఖలు చేశారు. దీంతో ఈ నెల 30వ తేదీన అతను కోర్టు ముందు హాజరుకావాల్సి ఉంది.   కాగా ప్రత్యూష బెనర్జీ ఆత్మహత్య చేసుకున్న నేపథ్యంలో ఆమె ప్రియుడు రాహుల్ రాజ్ సింగ్ పై ఆరోపణలు ఉన్న సంగతి తెలిసిందే. ప్రత్యూష తల్లి రాహులే తమ కూతురు ఆత్మహత్య చేసుకునేలా చేశాడని.. అతనికి బెయిల్ ఇవ్వద్దని.. కఠినంగా శిక్షించాలని కోరారు. కాని కోర్టు  యాంటిసిపేటరీ బెయిల్ ఇవ్వడంతో అతను ప్రస్తుతం బయటే ఉన్నాడు. మరి 30వ తేదీన రాహుల్ కోర్టు ముందు హాజరవుతాడో.. లేదో చూడాలి..?

చంద్రబాబుగారు ఇప్పటికైనా టైం కేటాయించండి..

  ఒక పక్క ఏపీలో అధికార పార్టీ అయిన టీడీపీలోకి విపక్ష పార్టీల నుండి నేతలు వలసలు కడుతుంటే.. మరోపక్క తెలంగాణ రాష్ట్రం నుండి టీడీపీ నేతలు మాత్రం పార్టీ నుండి జంప్ అవుతున్నారు. ఇప్పటికే తెలంగాణ టీడీపీ నుండి పలువురు ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ అవ్వగా.. ఇప్పుడు మరో మాజీ మంత్రి, భువనగిరి మాజీ ఎమ్మెల్యే ఒకప్పుడు తెలుగుదేశం పార్టీలో నంబర్ 2గా చక్రం తిప్పిన దివంగత ఎలిమినేటి మాధవరెడ్డి సతీమణి ఉమా మాధవరెడ్డి పార్టీని వీడనున్నట్టు వార్తలు వస్తున్నాయి. అయితే అక్కడ అధికార పార్టీ అయిన టీఆర్ఎస్లో అందరూ చేరుతుండగా ఆమె కూడా టీఆర్ఎస్లో చేరుతారని అనుకున్నారు కానీ.. ఆమె కాంగ్రెస్లో చేరుతారని అంటున్నారు. అంతేకాదు దీనికి సంబంధించి ఆ పార్టీ శాసనసభా పక్ష నేత జానారెడ్డి, ఉమల మధ్య చర్చలు జరిగాయని కూడా చెబుతున్నారు. కాంగ్రెస్ కూడా ఆమె రాకకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చి.. ఓ ముహూర్తాన్ని ఖరారు చేసి.. ఓ భారీ బహిరంగ సభ ద్వారా ఘనంగా స్వాగతం పలికాలని చూస్తున్నారు.   మరి ఇప్పటికే తమ పార్టీపై నేతలు అసంతృప్తిగా ఉన్నట్టు టీ టీడీపీ కీలకనేతలు కొంతమంది చంద్రబాబు దగ్గర మొరపెట్టుకున్నారు. తెలంగాణ పార్టీ కోసం కూడా కొంత సమయం కేటాయించాలని కోరారు. మరి ఇప్పుడైనా టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు తెలంగాణ టీడీపీపై శ్రద్ద చూపించకపోతే ఉన్న ఇద్దరు, ముగ్గురు నేతలు కూడా పార్టీ మారే ముప్పు ఉంటుందని రాజకీయ విశ్లేషకలు చర్చించుకుంటున్నారు.

ఆ విషయంలో ఆడవాళ్లదే పై చేయి..

అబ్బాయిల కంటే అమ్మాయిలు ఏ విషయంలో తక్కువేం కాదు.. అన్ని రంగాల్లోనూ అబ్బాయిలతో పోటీ పడుతూ ఉన్నత స్థానాలను అధిగమిస్తున్నారు. అంతేకాదు ఇప్పుడు సోషల్ మీడియా సైట్లను కూడా అధికంగా వాడేస్తూ వారి కంటే మేమేం తక్కువ కాదు అని నిరూపించేశారు. అయితే మన దేశంలో కాదులేండి. ప్రాశ్చాత్య దేశంలో సోషల్ మీడియా సైట్లను వాడటంలో అమ్మాయిలే ముందున్నారంట. ఓ సర్వే తెలిపిన వివరాల ప్రకారం.. సోషల్‌మీడియా సైట్లు ఫేస్‌బుక్‌, ట్విటర్‌, ఇన్‌స్టాగ్రామ్, పింట్రెస్ట్‌, టంబ్లర్‌ల‌ను పాశ్చాత్యదేశాల్లో అమ్మాయిలే అధికంగా ఉప‌యోగిస్తున్నారట. ఇక ఫేస్ బుక్ ఉపయోగించే వారిలో అబ్బాయిల శాతం 66 ఉండగా.. అమ్మాయిల శాతం 76 గా ఉంది. ట్విట్ట‌ర్‌ విషయానికొస్తే 18శాతం ఫీమేల్ యూజర్లు, 17శాతం మేల్ యూజర్లు వాడుతున్నారు. ఇంకా పింట్రెస్ట్‌, ఇన్‌స్టాగ్రామ్‌ వంటి సైట్లను కూడా అమ్మాయిలే ఎక్కువగా వాడటం ఆశ్చర్యకరం.

ఏపీ ప్రత్యేక హోదా బిల్లుకు పెరుగుతున్న మద్దతు..!

  కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కేవీపీ రామచంద్రా రావు రాజ్యసభలో ఏపీ ప్రత్యేక హోదాపై పెట్టిన ప్రైవేటు బిల్లు జాతకం రేపటితే తేలిపోనుంది. రేపు జరగబోయే బిల్లు ఓటింగ్ లో.. బిల్లు ఆమోదించబడుతుందా.. లేదా అన్నదానిపై అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరోవైపు కాంగ్రెస్ నేతలు మాత్రం ఈ బిల్లును ఎలాగైనా ఆమోదింపజేసుకోవాలని గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. ఇప్పటికే బీజేపీ మినహా ఏపీలోని అధికార పార్టీ టీడీపీ సహా అన్ని పార్టీలు కేవీపీ బిల్లుకు మద్దతిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పుడు వేరే పార్టీ నేతలతో కూడా కాంగ్రెస్ నేతలు మంతనాలు జరుపుతున్నారు. దీనిలోభాగంగానే వారు తమిళనాడులో విపక్ష పార్టీగా ఉన్న ద్రవిడ మున్నేట్ర కగజం (డీఎంకే) ఎంపీ, ఆ పార్టీ అధినేత కరుణానిధి కూతురు కనిమొళిని కాంగ్రెస్ పార్టీ నేతలు కలిశారు. ఏపీ ప్రత్యేక హోదా బిల్లుకు తమ మద్దతు తెలపాలని ఆమెను కోరారు. దీనికి ఆమె సానుకూలంగానే స్పందించి తమ మద్దతు తెలుపుతామని హామీ ఇచ్చారు. తప్పకుండా ఓటు వేస్తామని చెప్పారు. దీంతో బిల్లుకు మరింత మద్దతు లభించినట్టుయింది.

నేను బకరాలా కనిపిస్తున్నానా..?

  నేనేమన్నా బకరా అనుకుంటున్నావా.. ఈ వ్యాఖ్యలు చేసిందెవరు అనుకుంటున్నారా.. ఇంకెవరు తెలంగాణ మంత్రి హరీశ్ రావు. ఓ ప్రిన్సిపాల్ పై హరీశ్ రావు మండిపడ్డారు. వివరాల ప్రకారం..  హరీశ్ రావు మెదక్ జిల్లా కల్హేర్ మండలం సిర్గాపూర్ లో పర్యటించి తిరిగి వెళుతున్న నేపథ్యంలో నల్లవాగు గురుకుల పాఠశాల వద్ద ప్రిన్సిపాల్ మెవాబాయి మంత్రి ప్రయాణిస్తున్న కాన్వాయ్ ని ఆపి.. తమ పాఠశాల హరితహారంలో పాల్గొనాలని, మొక్కలు నాటాలని కోరారు. అయితే దీనికి హరీశ్ రావు కూడా అంగీకరించి మొక్కలు నాటడానికి వెళ్లారు. అయితే అక్కడి మొక్కలు నాటడానికి కనీసం పార, పలుగు కాదుకదా... చుక్క నీరు కూడా అందుబాటులో లేదు. దీంతో ఆగ్రహంతో మంత్రి ప్రిన్సిపాల్ పై మండిపడ్డారు. హరితహారం కార్యక్రమానికి తనను ఆహ్వానించి సరైన ఏర్పాట్లు చేయలేదని..  తానేమైనా బకరా మంత్రిని అనుకుంటున్నావా? ఇవేనా ఏర్పాట్లు? తనను సరదాకి పిలుద్దామని రోడ్డెక్కారా? అంటూ మండిపడ్డారు. దీంతో మెవాబాయి కొంత మనస్తాపంతో, తప్పు జరిగిందని చెబుతూ, మొక్కలు నాటాలని కోరడంతో, హరీశ్ స్వయంగా గుంత తీసి మొక్కను నాటారు.

రేవంత్‌కు ప్రాణహానీ ఉంది..భద్రత పెంచండి-చంద్రబాబు

టీటీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్, టీడీఎల్పీ నేత రేవంత్‌రెడ్డికి ప్రాణహానీ ఉందని, ఆయనకు భద్రత పెంచాలంటూ కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్‌ను కోరారు టీడీపీ అధినేత, ఏపీ సీఎం చంద్రబాబు. ఈ మేరకు ఆయన లేఖ రాశారు. నిన్న ఢిల్లీలో రాజ్‌నాథ్‌ను కలిసిన రేవంత్ రెడ్డి, చంద్రబాబు రాసిన లేఖను అందజేశారు. కేసీఆర్ ప్రభుత్వ విధానాలపై రేవంత్ పోరాటం చేస్తున్నందున ప్రాణహానీ ఉందని లేఖలో చంద్రబాబు తెలిపారు. అదనపు భద్రతపై హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను ప్రస్తావించారు. రేవంత్‌కు భద్రత పెంచాలంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరారు.

మిస్టర్ వరల్డ్‌గా తొలి భారతీయుడు.. మన హైదరాబాదీనే..

భారతదేశాన్ని తొలి "మిస్టర్ వరల్డ్" టైటిల్ వరించింది. హైదరాబాద్‌కు చెందిన మోడల్, నటుడు రోహిత్ ఖండేల్వాల్ దీన్ని సాధించారు. ప్రపంచంలోని 46 దేశాల నుంచి ఎంతో మంది అందగాళ్లు హాజరైనా వారందరని పక్కకు నెట్టి  రోహిత్ "మిస్టర్ వరల్డ్" టైటిల్‌ను కైవసం చేసుకున్నారు.   బ్రిటన్‌లోని సౌత్‌పోర్ట్ థియేటర్‌లో మంగళవారం రాత్రి ఫైనల్ జరిగింది. ప్రముఖ డిజైనర్ నివేదిత సాబూ సిద్ధం చేసిన వస్త్రాలు ధరించి రోహిత్ తుది సమరానికి హాజరై టైటిల్‌ను ఎగరేసుకుపోయాడు. ఈ టైటిల్‌తో పాటు ప్రపంచ మల్టీమీడియా అవార్డు, ప్రపంచ టాలెంట్, మాబ్‌స్టార్ పీపుల్స్ ఛాయిస్ అవార్డ్ లాంటి సబ్‌ టైటిల్స్ కూడా గెలుచుకున్నాడు. అవార్డు కింద రోహిత్‌కు రూ.33.62 లక్షల నగదు బహుమతి లభించింది. ప్యూర్టోరికోకు చెందిన ఫెర్నాండో అల్వారేజ్, మెక్సికోవాసి ఆల్డో ఎస్పార్జా ద్వితీయ, తృతీయ స్థానాలను దక్కించుకున్నారు. రోహిత్ తొలిసారిగా ఈ టైటిల్ గెలుచుకున్న తొలి భారతీయుడు మాత్రమే కాదు..మిస్టర్‌ వరల్డ్‌గా ఎంపికైన తొలి ఆసియా వాసి.  

చనిపోయిన ఎక్సైజ్ ఇనస్పెక్టర్ కి ముఖ్యమంత్రి బదిలీ..

  మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ ఓ ఎక్సైజ్ ఇనస్పెక్టర్ ను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. అయితే ఇప్పుడు ఆ బదిలీ విషయంలో విమర్శలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది. అదెంటీ బదిలీ చేస్తే విమర్శలు ఎందుకంటారా..? అక్కడే ఉంది ట్విస్ట్.. ఇంతకీ ఫడ్నవీస్ బదిలీ చేసింది ఎవరిననుకుంటున్నారా.. మూడేళ్ల క్రితం చనిపోయిన ఓ ఎక్సైజ్ ఇనస్పెక్టర్ని. అసలు సంగతేంటంటే.. సందీప్ మారుతి అనే ఎక్సైజ్ ఇనస్పెక్టర్ ను కోల్హాపూర్ నుంచి నాసిక్ కు ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్టు ఫడ్నవిస్ స్వయంగా సంతకం చేశారు. అయితే అతను చనిపోయినట్టు తెలుసుకున్న ముఖ్యమంత్రి పొరపాటుకు కారకునిగా గుర్తించిన ఓ క్లర్క్ ను సస్పెండ్ చేశారు. ఇక దీని గురించి తెలిసిన విపక్షాలు ఊరుకుంటాయా.. దీనిపై ఉన్నత స్థాయి విచారణ జరిపించాలని విపక్షాలు ఇప్పుడు పట్టుబడుతున్నాయి.