భర్తకు నైట్ షిఫ్ట్‌..భార్యపై గ్యాంగ్ రేప్‌

భర్త లేని సమయం చూసి ముగ్గురు కామాంధులు వివాహితపై గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారు. గుజరాత్‌లోని సూరత్‌లో జరిగింది ఈ ఘటన. పూనా-ముంబయి రోడ్డులోని మార్కెట్ సమీపంలో గల రెసిడెన్షియల్ సొసైటీలోని ఒక ఇంటిలో భార్యభర్తలు నివసిస్తున్నారు. టెక్స్‌టైల్స్ కంపెనీలో పనిచేసే బాధితురాలి భర్త నైట్ షిఫ్ట్‌కు పనికి వెళ్లాడు. అదే సమయంలో ఆమెపై ఎప్పటి నుంచో కన్నేసిన ఇంటిపక్కన ఉన్న వ్యక్తి తలుపుకొట్టాడు. ఇంటి ముందు రూమ్‌లో ఆమె సోదరుడు నిద్రస్తుండటంతో అతడు లేచి డోర్ తీశాడు. వెంటనే ఓ వ్యక్తి అతడిని గదిలో పెట్టి తాళం వేశాడు. అనంతరం లోపలికి వెళ్లి నిద్రిస్తున్న వివాహితపై అత్యాచారం చేశాడు. ఈ విషయం బయటకు చెబితే తన సోదరుడిని చంపేస్తామని బెదిరించి వరుసగా ముగ్గురు అత్యాచారానికి పాల్పడ్డారు. జరిగిన దారుణాన్ని బాధితురాలు తన భర్తకు చెప్పడంతో అతడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. 

మైనర్లకు వాహనాలు ఇస్తే తల్లిదండ్రులు జైలుకే..

పంజాగుట్ట ఫ్లైఓవర్ వద్ద తాగుబోతుల నిర్లక్ష్యానికి బలైన చిన్నారి రమ్య ఘటనతో హైదరాబాద్ పోలీసులు నిద్రలేచారు. ప్రమాదానికి కారణమైన వారంతా మైనర్లు కావడంతో ..పోలీసులు మైనర్లపై దృష్టి సారించారు. స్పెషల్ డ్రైవ్‌లు నిర్వహించి పలువురు యువకులను అదుపులోకి తీసుకుని..వాహనాలు సీజ్ చేశారు. లైసెన్స్ లేకుండా పట్టుబడిన 250 మంది మైనర్లకు వారి తల్లిదండ్రుల సమక్షంలో గోషామహల్ ట్రాఫిక్ శిక్షణ కేంద్రంలో కౌన్సెలింగ్ ఇచ్చారు. తల్లిదండ్రులు పిల్లలకు వాహనాలు ఇవ్వకూడదు. థ్రిల్ డ్రైవింగ్‌తో వారి ప్రాణాలతో పాటు ఇతరుల ప్రాణాలు పోతున్నాయి. వారికి ప్రాణం విలువ తెలియదు..పిల్లలను సరైన విధంగా గైడ్ చేయాలి అని తల్లిదండ్రులకు సూచించారు. ఇక మీదట మైనర్లకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రులను కూడా జైలుకి పంపుతామని పోలీసులు హెచ్చిరించారు.

రెయిన్‌ట్రీయే కావాలంటున్న ఐఏఎస్‌లు

నవ్యాంధ్ర రాజధాని అమరావతికి ఉద్యోగులు తరలిరావడం వేగం పుంజుకుంది. అలాగే వివిధ శాఖల ఉన్నతాధికారులు కూడా అమరావతికి క్యూ కడుతున్నారు. అలాగే నూతన రాజధాని ప్రాంతంలోని రెయిన్‌ట్రీ అపార్ట్‌మెంట్‌లో వసతి కావాల్సిన వారు తమ పేర్లను నమోదు చేసుకోవాల్సిందిగా రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ఆహ్వానించింది. దీంతో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ అధికారులు క్యూ కడుతున్నారు. ఇప్పటి వరకు గుంటూరు, కృష్ణా జిల్లాలతో రెయిన్ ట్రీలో వసతి కోసం మొత్తం 766 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో సీనియర్ ఐఏఎస్ అధికారులు  మన్మోహన్ సింగ్, జె.సి.శర్మ, అజేయ కల్లం, పి.వి.రమేశ్, అనిల్ చంద్ర పునేత, దినేశ్‌కుమార్, ఎస్.వి.ప్రసాద్, శ్రీనరేశ్, లవ్ అగర్వాల్, అనంతరాము తదితరులున్నారు. ఈ నెల 20 వరకు దరఖాస్తు చేసుకోవడానికి గడువు ఉంది.

ఇద్దరికి కాకుండా పోయిన సీఎం పదవి..

సీఎం పీఠం కోసం అరుణాచల్‌ప్రదేశ్‌లో జరిగిన రచ్చ అంతా ఇంతా కాదు. నబమ్‌టుకీ, కలిఖోపుల్ మధ్య జరిగిన పోరు సుప్రీంకోర్టు మధ్యవర్తిత్వంతో ముగిసింది. సుప్రీం ఆదేశాల ప్రకారం తానే సీఎంనని నబమ్‌టుకీ, కాదు కలిఖోపుల్ తలపడ్డారు. వీరిద్దరి తగువును పరిష్కరించేందుకు కాంగ్రెస్ హైకమాండ్ రంగంలోకి దిగింది. అయితే నాయకత్వాన్ని మారిస్తేనే కాంగ్రెస్‌లోకి తిరిగొస్తామని రెబల్స్ ఎమ్మెల్యేలు స్పష్టం చేయడంతో అనివార్య పరిస్థితుల్లో మాజీ ముఖ్యమంత్రి నబమ్‌టుకీ తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. దీంతో అరుణాచల్‌ప్రదేశ్ కొత్త ముఖ్యమంత్రిగా పెమా ఖండు ప్రమాణ స్వీకారం చేశారు. రెబెల్ ఎమ్మెల్యేల్లో ఖండు కూడా ఒకరు. రెబల్ ఎమ్మెల్యేల మద్థతు తనకుందంటూ నిన్న గవర్నర్‌ను కలిశారు. దీంతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సిందిగా గవర్నర్‌ ఖండూని కోరారు.

హైదరాబాద్‌లో చిన్నారుల మధ్య ఫైట్..ఒకరి మృతి

చిన్నారులు సరదాగా చేసుకున్న హేళన ఒక చిన్నారి మరణానికి కారణమైంది. హైదరాబాద్ టోలిచౌకిలోని ఐఏఎస్ కాలనీలో ప్రామిసింగ్ స్కాలర్స్ హైస్కూలులో ఒకటో తరగతి చదువుతున్న మహ్మద్ ఇబ్రహీం అనే ఆరేళ్ల చిన్నారి..మూడో తరగతి విద్యార్థిని చీమిడి ముక్కోడా అంటూ గేలి చేశాడు. దీంతో ఆగ్రహంతో ఊగిపోయిన ఆ విద్యార్ధి నన్నే టీజింగ్ చేస్తావా అంటూ తరగతి గదిలోనే ఇబ్రహీం మర్మాంగాలపై తన్నాడు. అక్కడే కుప్పకూలిన ఇబ్రహీం..కాసేపటి తరువాత లేచి ఇంటికి వెళ్లిపోయాడు.   అయితే తనకు మర్మాంగాల వద్ద నొప్పిగా ఉందని ఇంట్లో తల్లిదండ్రులకు చెప్పాడు. మొదట పట్టించుకోని తల్లిదండ్రులు ఉదయం మరోసారి చూడగా దెబ్బతగిలిన చోట బాగా వాపు వచ్చింది. వెంటనే ఇబ్రహీంను నిలోఫర్ ఆసుపత్రికి తీసుకువెళ్లారు. వైద్యులు పురుషాంగం, కడుపు ప్రాంతాల్లో చికిత్స చేశారు. కానీ ఫలితం దక్కలేదు. చికిత్స పొందుతూ తెల్లవారుజామున ఇబ్రహీం మరణించాడు. చిన్నారి తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.

కేంద్రానికి 2 కోట్లు బకాయిపడ్డ భారత తొలి మహిళా స్పీకర్

భారతదేశ తొలి మహిళా లోక్‌సభ స్పీకర్‌గా పనిచేసిన మీరాకుమార్ దాదాపు రూ.2 కోట్ల వరకూ కేంద్రానికి బకాయిపడ్డారు. మీరా తండ్రి దివంగత బాబూ జగ్జీవన్‌రామ్ భారత ఉపప్రధానిగా ఉన్న సమయంలో ఢిల్లీలోని కృష్ణమీనన్ మార్గ్‌లో ఆయనకు ఓ బంగళాను కేటాయించారు. ఆయన మరణం తర్వాత జగ్జీవన్ రామ్ సతీమణి ఇంద్రాణి అక్కడ ఉన్నారు. ఆమె మరణానంతరం వీరి కుమార్తె మీరా కుమార్ అదే బంగళాను వాడుతున్నారు. దీని జోలికి ప్రభుత్వం రాకుండా ఉండేందుకు , జగ్జీవన్ రామ్ స్మారక భవనంగా మార్చారని, అందుకు ప్రభుత్వ అనుమతి ఏమిలేదని తెలుస్తోంది. సుభాగ్ చంద్ర అనే సామాజిక కార్యకర్త, సమాచార హక్కు చట్టం కింద ప్రభుత్వానికి దరఖాస్తు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఈ భవంతికి సంబంధించి రూ.1.98 కోట్ల అద్దెను మీరా కుమార్ బకాయి పడ్డట్టు రికార్డులు వెల్లడించాయి. అద్దెను రద్దు చేయాలని కూడా ఆమె ఎటువంటి దరఖాస్తులు చేయలేదని తెలుస్తోంది.

గోల్డ్‌బాబును అందుకే చంపారా..?

"పింప్రీ గోల్డ్‌మాన్‌"గా పేరు గాంచిన దత్తా ఫూగే గత గురువారం హత్యకు గురవడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో కొడుకు స్నేహితులే ఆయన్ను చంపినట్టు పోలీసులు దర్యాప్తులో తేలింది. ఫూగే తన కొడుకు శుభం స్నేహితుల వద్ద లక్షన్నర రూపాయలను అప్పుగా తీసుకున్నాడు. దాని విషయంలో వారికి ఫూగేకు మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీనిలో భాగంగానే ప్రధాన నిందితుడు అతుల్ మోహిత్..శుభంకు ఫోన్ చేసి ఓ స్నేహితుడిని బర్త్‌డేకు రావాల్సిందిగా ఆహ్వానించాడు. తండ్రిని కూడా వెంట తీసుకురమ్మన్నాడు. వచ్చేటపుడు బిర్యానీ తీసుకురమ్మన్నాడు.   ఈ విషయం తండ్రి ఫూగేకు చెప్పి శుభం మరో స్నేహితుడు రోహన్‌తో కలిసి ఆహారం తెచ్చేందుకు కారులో వెళ్లాడు. వారు పార్టీ జరిగే ప్రదేశానికి వచ్చే సరికి మోహిత్, మరికొందరు ఆయుధాలతో ఫూగేపై దాడి చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిని ఫూగే అక్కడికక్కడే ప్రాణాలు వదిలాడు. దుండగులు చీకట్లో పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు శుభం ఇచ్చిన సమాచారంతో నిందితులను అదుపులోకి తీసుకున్నారు. లక్షన్నర రూపాయల బాకీ వసూలు కోసమే ఫూగేను హతమార్చినట్టు నిందితులు నేరాన్ని అంగీకరించారు. నాలుగేళ్ల కిందట దత్తాఫూగే 22 క్యారెట్ల బంగారంతో తయారు చేయించిన షర్ట్ ధరించి దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించాడు. ఆ షర్ట్ ఖరీదు కోటి రూపాయలు..బరువు మూడున్నర కేజీలు.

"అమ్మ" ధియేటర్లు వచ్చేస్తున్నాయి..

తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను "అమ్మ" అని ఆ రాష్ట్ర వాసులు పిలచుకోవడం ఎప్పటి నుంచో వస్తుంది. దానికి తోడు పేదవారికి అమ్మ పేరుతో అనేక పథకాలను చేర్చడం ద్వారా ఆమె పేదలకు మరింత దగ్గరయ్యారు. అలా "అమ్మ క్యాంటిన్లు, అమ్మ మినరల్ వాటర్, అమ్మ సిమెంట్, అమ్మ ఫార్మసి, అమ్మ ఆముదం స్టోర్లు" ఏర్పాటు చేసి దేశవ్యాప్తంగా మన్ననలు పొందారు. ఇప్పటి వరకు ఆరోగ్యం, ఆహారం వరకే పరిమితమైన జయలలిత తాజాగా వినోదంపై కూడా దృష్టిసారించారు.   ఒత్తిడితో అలసిపోయిన మనిషిని సేద తీర్చేశక్తి ఒక్క వినోదానికి మాత్రమే ఉంది. అయితే అన్ని ధరలు పెరిగిపోయిన ఈ రోజుల్లో వినోదాన్ని ఆస్వాదించాలన్నా జేబులు గుళ్ల చేసుకోవాల్సిందే. సంపన్న, ఎగువ మధ్యతరగతి వర్గాలు ఎంతైనా ఖర్చు చేయగలరు. కానీ రోజంతా కష్టించిన సొమ్మును కడుపు నింపుకోవడం కోసం కాకుండా వినోదం కోసం ఖర్చుచేయడంపై పేదల మనస్సులు అంగీకరించడం లేదు. అందుకే మరింత మంది పేదలకు సినిమాను అందుబాటులోకి తెచ్చేందుకు జయ అమ్మ థియేటర్లు అందుబాటులోకి తీసుకురానున్నారు. చెన్నై నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో టీనగర్, షెనాయ్ నగర్‌లలో అమ్మ థియేటర్లు సిద్థం అవుతున్నాయి. ఇక్కడ టిక్కెట్టు ధర రూ.10, రూ.20, రూ.30లుగా నిర్ణయించే అవకాశం ఉంది.

టాయిలెట్లు క్లీన్ చేసిన టీఆర్ఎస్ ఎంపీ

ప్రధాని నరేంద్రమోడీ స్వచ్ఛభారత్‌ పిలుపునందుకుని దేశంలోని రాజకీయ నాయకులు, సెలబ్రిటీలు రంగంలోకి దూకారు. ప్రతి ఒక్కరు చేతికి గ్లోవ్స్ తొడుక్కుని..ఫోటోలకు ఫోజులిస్తూ చెత్తను ఏరి పారేశారు. అయితే స్వచ్ఛబారత్ అంటే రోడ్డుపై చీపురు పట్టుకుని ఊడవటం కాదని చాటిచెప్పారు చేవెళ్ల టీఆర్ఎస్ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ధర్మసాగర్, గొల్లపల్లి ప్రభుత్వా పాఠశాలల్లో టాయిలెట్లను ఆయన శుభ్రం చేశారు. చేవెళ్ల మండలంలో 11 టాయిలెట్ క్లీనర్‌లను ఏర్పాటు చేశారు ఎంపీ. అలా ఏర్పాటు చేసిన వాహనాన్ని తనే స్వయంగా నడుపుకుంటూ వెళ్లి..స్కూల్లో టాయిలెట్స్‌ శుభ్రం చేశారు. ఆ తర్వాత విద్యార్థులతో మాట్లాడి..స్వచ్ఛభారత్‌కు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని సూచించారు. బిల్‌గేట్స్‌, ప్రధాని మోడీలు స్వయంగా టాయిలెట్స్‌ క్లీన్ చేసుకుంటుంటారని..మన టాయిలెట్స్ మనం శుభ్రం చేసుకోవడంలో తప్పులేదన్నారు విశ్వేశ్వర్ రెడ్డి.    

టీడీపీ నేతపై హత్యా ప్రయత్నం..

  గుంటూరు జిల్లాలో భయంకరమైన ఘటన చోటుచేసుకుంది. ఏకంగా టీడీపీ నేతనే హత్య చేసేందుకే ప్రయత్నించి బరితెగించారు రాజకీయ ప్రత్యర్ధులు. వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా నరసరావు పేటకు చెందిన మున్సిపాలిటీ కౌన్సిలర్ గా ఉన్న టీడీపీ నేత బాబురావుపై కొందరు దుండగులు దాడి చేశారు. మోటర్ సైకిల్ పై వెళుతున్న ఆయనను వెంబడించారు. అయితే ఎలాగైనా ఆయనను చంపాలన్న భావనతో.. కారును వెంబడించిన వారు ఆయన బైక్ ను కారుతో బలంగా ఢీకొట్టారు. దీంతో బాబురావు కిందపడిపోగా.. వారు ఆయన చనిపోయాడనుకొని అక్కడి నుండి పారిపోయారు. అయితే తీవ్రగాయాలతో అదృష్టవశాత్తు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న బాబురావు.. ఇంటికి సమాచారం అందించగా వెంటనే వచ్చి వారు ఆస్పత్రికి తరలించారు. ఈ దాడికి పాల్పడ్డ వారు ఎవరన్న విషయం తెలియరాలేదు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

స్మృతీకి ఇది కూడా దక్కలేదా.. ఎందుకిలా..!

  కేంద్ర మంత్రి స్మృతీ ఇరానీ ప్రాధాన్యత రోజు రోజుకి తగ్గిపోతుందా అంటే అవుననే సంకేతాలే వినిపిస్తున్నాయి. ఎందుకంటే తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అలానే అనిపిస్తుంది. ఇటీవలే ప్రధాని నరేంద్ర మోడీ క్యాబినెట్ ప్రక్షాళన చేసిన సంగతి తెలిసిందే. అప్పుడు అతి ప్రాధాన్యత కలిగిన మానవ వనరుల అభివృద్ధి శాఖ నుండి ఆమెను జౌళి శాఖను కేటాయించారు. దానికి స్మతీ ఇరానీపై ఈ మధ్య వచ్చిన ఆరోపణల నేపథ్యంలోనే ఆమెకు శాఖను మర్చేశారని వార్తలు వచ్చాయి. ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్, జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీ విద్యార్థుల గొడవ, దళిత విద్యార్థి రోహిత్ వేముల ఆత్మహత్య వివాదాలవల్లే స్మతీ ఇరానీ శాఖ మార్పుకు కారణాలు అని అన్నారు. అయితే ఇప్పుడు ఏమైందో తెలియదు కానీ పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్ కమిటీ నుంచి కూడా ఆమెను తొలగించారు.   నేడు కేబినెట్‌ కమిటీల్లో మార్పులు, చేర్పులు జరగగా.. స్మృతికి అందులో చోటు దక్కలేదు. పార్లమెంటరీ వ్యవహారాల కేబినెట్‌ కమిటీ నుంచి ఆమెను తొలగించారు. అయితే ఈసారి కూడా స్మృతీ స్థానంలో ప్రకాశ్ జవదేకర్ కే చోటు దక్కింది.  మానవ వనరుల అభివృద్ధి శాఖకు కూడా మోడీ ప్రకాశ్ జవదేకర్ ను నియమించారు. ఇప్పుడు ఆరు కేబినెట్‌ కమిటీల్లో నేడు మార్పులు చేయగా..  ఇద్దరు సహాయమంత్రులు, మరికొందరు స్వతంత్ర మంత్రులకు కమిటీల్లో చోటు కల్పించగా.. స్మృతి ఇరానీ పేరు ఎక్కడా లేదు. స్మృతి స్థానంలో మళ్లీ మానవవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన ప్రకాశ్‌జవదేకర్‌ను పార్లమెంటరీ వ్యవహారాల కమిటీలోకి తీసుకున్నారు. మరి ఇంతలా మోడీ స్మృతీ ఇరానీకి ప్రాధాన్యత తగ్గించడానికి గల కారణాలు ఏంటో ఆయనకే తెలియాలి.

ఆ పైశాచికం మాదే..ఐసిస్

  పారిస్ లో ఉగ్రవాద చర్యలు పెరిగిపోతున్నాయి. ఒక ఘటన జరిగి దానిని ప్రజలు ఎలాగోలా మరిచి పోయేలోపు మరో ఉగ్రదాడి జరిపి పారిస్ ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారు. తాజాగా పారిస్ లోని నిస్ నగరంలో కూడా మారణహోమం జరిపి వారి పైశాచికాన్ని ప్రదర్శించారు. పారిస్ లో బాస్టిలే డే సందర్భంగా అందరూ సంబరాల్లో మునిగి తేలిపోతుండగా.. మహ్మద్ అనే ఉగ్రవాది ట్రక్కుతో ఢీకొట్టి 10 మంది చిన్నారులతో సహా 84 మందిని చంపేశాడు. 202 మంది గాయపడ్డారు. వీరిలో 50 మంది పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అయితే ఇప్పుడు ఇంత మారణహోమం సృష్టించింది తమ పనే అని ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ ప్రకటించుకుంది. ఈ దాడి తమ పనేనని, మహ్మద్ తమ వాడేనని ఇస్లామిక్ స్టేట్ ప్రకటించుకుంది.

కోహ్లీని లవ్ చేసింది.. హత్యకు గురైంది..

  ఖండీల్ బలోచ్.. ఈపేరు గుర్తుండే ఉంటుంది. ఉండే ఉంటుంది.. ఎందుకంటే పాకిస్థాన్ కు చెందిన ఈ మోడల్ ఇచ్చిన ఆఫర్లు అలాంటి, ఇలాంటి ఆఫర్లు కాదు. అయితే ఇప్పుడు ఆమె దారుణ హత్యకు గురైంది. చంపింది కూడా ఎవరో కాదు తన సొంత అన్నయ్య. వివరాల ప్రకారం.. పాకిస్థాన్ కు చెందిన ఖండీలో బలోచ్ గతంలో పెద్దగా ఎవరికి తెలియకపోయినా.. టీ 20 వరల్డ్ కప్ జరుగుతున్న సమయంలో విరాట్ కోహ్లీకి ప్రపోజ్ చేస్తూ చాలా ఫేమస్ అయింది. టీ-20 సీరీస్ జరుగుతున్నప్పుడు పాకిస్థాన్ ఆడుతున్న తీరుపై ఆమె ఓ వీడియో పోస్ట్ చేసింది. ఆ వీడియోలో ఆమె అఫ్రీదిని తిడుతూ, ఏడుస్తూ కామెంట్ చేసింది. అంతేనా.. విరాట్ కోహ్లీని ప్రేమిస్తున్నానని.. తాను అనుష్కశర్మను వదిలేసి తనను లవ్ చేయాలని అంది. అక్కడితో ఆగిందా అంటే లేదు.. పాకిస్థాన్ కనుక గెలిస్తే.. తాను నగ్నంగా డ్యాన్స్ చేస్తానని ఆఫర్ ఇచ్చింది. అంతే కాదు ఇంకా సోషల్ మీడియాలో అశ్లీల ఫొటోలు పోస్ట్ చేస్తూ ఉండేది. దీంతో తమ కుటుంబ పరువు తీస్తుందని చెప్పి ఆమె అన్నయ్య హతమార్చాడు.

చంద్రబాబు రూట్ లోనే జగన్ కూడానా..!

  ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దాదాపు హైదరాబాద్ కు స్వస్తి పలికేశారు. హైదరాబాద్ నుండి తన చిరునామాను మార్చాలని ఉండవల్లి పంచాయితీ అధికారులను చంద్రబాబు కోరిన సంగతి తెలిసిందే. ఇంకా తన ఓటరు కార్డుపై ఉన్న చిరునామాను కూడా మార్చమన్నారు. ఎప్పటినుండో ఆయన విజయవాడ నుండే పాలన చేస్తున్నా.. తన చిరునామాను కూడా మార్చుకోవడంతో ఇప్పుడు పూర్తిగా ఏపీకి చెందిన వ్యక్తిగా మారిపోయారు.   అయితే ఇప్పుడు చంద్రబాబు రూట్ లోనే వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి కూడా పయనిస్తున్నట్టు తెలుస్తోంది. ఎందుకంటే ఆయన కూడా తన మకాంను ఎత్తివేసి ఏపీలోనే ఉండాలని నిర్ణయించుకన్నట్టు తెలుస్తోంది. గుంటూరు జిల్లాలోని ఎపి రాజధాని ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకోవాలని జగన్ భావిస్తున్నారట.  ఈ నేపథ్యంలోనే ఆయన అనుచరులు జగన్ కోసం అక్కడ ఓ ఇంటికోసం వెతుకుతున్నారంట. అంతేకాదు వైయస్సార్ కాంగ్రెసు పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా మంగళగిరి సమీపంలో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరి ఇక త్వరలో జగన్ కూడా హైదరాబాద్ ను వీడి ఇక్కడే మకాం మార్చేలా ఉన్నారు.

తాను పెంచుకున్న కుక్క చనిపోతుందని తెలిసి...!

సాధారణంగా మనం పెంచుకునే పెంపుడు జంతువులు చనిపోతున్నాయంటే ఏం చేస్తాం. మనం అయితే వాటికి నచ్చిన ఆహారాన్ని పెట్టి.. ఆ కొద్ది రోజులు ఇంకా ప్రేమగా చూసుకుంటాం. కానీ అమెరికాను చెందిన ఓ వ్యక్తి మాత్రం తాను ఎంతో ప్రేమగా పెంచుకుంటున్న కుక్క చనిపోతుందని తెలియగానే.. దానిని విహారయాత్రకు తీసుకెళ్లి అనేక ప్రదేశాలు చూపించాడు. వివరాల ప్రకారం.. అమెరికాలోని రాబర్ట్‌ కగ్లర్‌ అనే వ్యక్తి ఎప్పటి నుండో ఒక కుక్కని పెంచుకుంటున్నాడు. దానికి బెల్లా అని పేరు కూడా పెట్టాడు. అయితే దానికి కాన్యర్ వ్యాధి సోకి.. ఆరు నెలలకంటే ఎక్కువ బతకదని వైద్యులు చెప్పడంతో.. దానితో గడిపే ఆఖరి క్షణాలు ఎప్పుడూ గుర్తుండిపోవాలని విహారయాత్రకు తీసుకెళ్లాడు. న్యూయార్క్‌, డెట్రాయిట్‌, కెంటకీ, ఓహియో ఇలా పలుప్రాంతాల్లో తిప్పాడు. అయితే దురదృష్టవుశాత్తు.. బెల్లా డాక్టర్లు చెప్పిన గడువు కంటే ముందే చనిపోయింది. ఇక బెల్లా మృతిని ఏ మాత్రం తట్టుకోలేని రాబర్ట్ కన్నీరుమున్నీరైపోతున్నాడు. బెల్లా తనకు దేవుడిచ్చిన వరమనీ, దాని మరణాన్ని తట్టుకోవడం కష్టంగా ఉందని క్లగర్‌ వాయిపోయాడు.

రాష్ట్ర ప్రభుత్వాలతోనే దేశాభివృద్ధి సాధ్యం..

  ప్రధాని నరేంద్ర మోడీ రాష్ట్రపతి భవన్ లో అంతరాష్ట్ర మండలి సమావేశంలో పాల్గొన్నారు. దాదాపు పదేళ్ల తరువాత జరుగుతున్న ఈ భేటీలో మోడీ పలు అంశాల గురించి చర్చించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ...కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సయోధ్యతోనే దేశాభివృద్ధి సాధ్యమవుతుందని.. విస్తృత చర్చల ద్వారా విధానపరమైన నిర్ణయాలు తీసుకోవాలని సూచించారు. విధానాలు సక్రమంగా అమలు కావాలంటే రాష్ట్రాల పాత్ర కీలకమని చెప్పుకొచ్చారు. పథకాల అమలులో సమస్యలుంటే చర్చలతో పరిష్కరించుకోవచ్చని మోదీ అన్నారు. కిరోసిన్‌ వాడకాన్ని తగ్గించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, సబ్సిడీ, నగదు చెల్లింపులకు ఆధార్‌తో అనుసంధానం చేయనున్నట్లు తెలిపారు. ఆధార్‌ అనుసంధానంతో నిధులు దారి మళ్లకుండా అరికట్టవచ్చన్న మోదీ 79 శాతం మంది వద్ద ఆధార్‌ కార్డులున్నాయని తెలిపారు. కాగా ఈ సమావేశంలో ఆయా రాష్ట్రాల సీఎంలు, కేంద్రమంత్రులు, శాశ్వత సభ్యులు హాజరుకాగా సీఎంలు కేజ్రీవాల్‌, అఖిలేష్ మాత్రం డుమ్మా కొట్టారు.