ట్రంప్ గారు ఈ టీ తాగండి.. కొంచమైనా మారండి..
posted on Jul 15, 2016 @ 12:01PM
వివాదాస్పద వ్యాఖ్యలకి కేరాఫ్ అడ్రస్ డొనాల్డ్ ట్రంప్. అది ప్రత్యేకంగా ఎవరికి చెప్పాల్సిన పనిలేదు. అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న ట్రంప్ అసలు అలాంటి వ్యాఖ్యలు చేసే ఫేమస్ అయ్యారని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అయితే అలాంటి వ్యాఖ్యలు చేసే ట్రంప్ కు భారత్ కు చెందిన ఓ టీ సంస్థ ఝలక్ ఇచ్చింది.
అదేంటంటే.. ట్రంప్ కు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా కొన్ని వేల గ్రీన్ టీ బ్యాగులను పంపించింది. అంతేకాదు ట్రంప్ కు కొన్ని సలహాలు ఇస్తూ ఓ విడియోను కూడా పంపిందట. ‘‘ట్రంప్.. భారత్ తరపున మీకు నమస్కారాలు. ప్రకృతి సిద్ధమైన అస్సాం టీ బ్యాగులను మీకు పెద్ద మొత్తంలో పంపిస్తున్నాం. ఈ టీ శరీరంలోని ప్రమాదకర ఫ్రీరాడికల్స్‌పై పోరాడుతుంది. మనసును, శరీరాన్ని శుద్ధి చేస్తుంది. ఆరోగ్యం సమతౌల్యంగా ఉండేలా చూస్తుంది. మనుషులను స్మార్ట్‌గా కూడా చేస్తుందని నిరూపితమైంది. మీకోసం, అమెరికా కోసం, ప్రపంచం కోసం దయచేసి ఈ టీని రోజూ తాగండి’’.. ‘మిమ్మల్ని మీరు శుద్ధి చేసుకోవడానికి సమయం మించిపోలేదు’.. ‘‘ప్రపంచమంతా విచారిస్తోంది. మేం మిమ్మల్ని ఎలాగూ ఆపలేం. కాకపోతే మిమ్మల్ని మార్చగలం’’ అని కోల్‌కతాకు చెందిన టీ-ఎ-మి సంస్థ ఓ వీడియో చేసి దానితో పాటు 6వేల టీ బ్యాగులను న్యూయార్క్‌లోని ట్రంప్ టవర్స్‌కు టీ కంపెనీ పంపిన డెలివరీ పంపింది. అంతేకాదు ‘‘ఇంకా కావాలంటే కూడా పంపిస్తాం’’ అని తెలిపింది. మరి దీనిపై ట్రంప్ ఎలా స్పందిస్తారో చూడాలి.