ఏపీ నిర్ణయం వల్ల తెలంగాణకు దెబ్బ..!
ఏపీ రాష్ట్రంలో ఫోన్ల ధరలను తగ్గిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. సెల్‌ఫోన్ చార్జర్లు, బ్యాటరీలపై, స్టిల్ ఇమేజ్, వీడియో కెమెరా, బ్యాటరీ చార్జర్లపై వ్యాట్ తగ్గిస్తూ చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. దీంతో 14.5 శాతం ఉన్న వ్యాట్‌ను 5 శాతం తగ్గనుంది. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం.. ఉత్తర్వులు జారీ చేయడం కూడా జరిగిపోయింది.ఏపీలో విభజన అనంతరం సెల్ ఫోన్ అమ్మకాలు పెద్దగా పెరగలేదు. తెలంగాణ సహా పొరుగు రాష్ట్రాల కంటే ఏపీలో వాటి ధర ఎక్కువగా ఉంది. దీంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇది ఏపీ ప్రజలకు పెద్ద గుడ్ న్యూసే.
అయితే ఇది ఏపీ ప్రజలకు శుభవార్తనే కానీ.. పొరుగురాష్ట్రమైన తెలంగాణకు మాత్రం దెబ్బే అని అంటున్నారు. రాష్ట్ర విభజన అనంతరం మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉన్నా కానీ.. తెలంగాణ పరిస్థితి ఇప్పుడు నిధులు లేక కటకటలాడిపోతుంది. తెలంగాణ ప్రభుత్వం ఆదాయం కోసం అనేక ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. రాష్ట్రంలో ఉన్న మొండి బకాయిలను ముక్కుపిండి వసూలు చేయడానికి ప్లాన్ చేస్తుంది. ఇలాంటి సమయంలో ఏపీ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో తెలంగాణ ఆదాయానికి గండిపడే అవకాశాలు వున్నాయన్నది అధికారుల మాట. తెలంగాణలో గతంలో వ్యాట్‌ని 5 శాతానికి తగ్గించారు.. దాని ప్రభావం, ఇప్పుడు ఆదాయంపై పడింది. ఇప్పుడు ఏపీ కూడా ఇప్పుడు ఇదేబాట పట్టింది. మరి ఏం జరుగుతుందో చూడాలి.