మొత్తానికి మెత్తబడ్డ చైనా..
posted on Jul 16, 2016 @ 11:33AM
ఎన్ఎస్జీలో భారత్ సభ్యత్వం కోసం ఎప్పటి నుండో పడిగాపులు కాస్తున్న సంగతి తెలిసిందే. భారత్ కు సభ్యత్వం ఇవ్వడానికి అమెరికా, న్యూజిలాండ్ లాంటి అగ్రరాజ్యాలు అనుమతిచ్చినా.. చైనా మాత్రం అడ్డుపుల్ల వేస్తూనే వచ్చింది. గతంలో ఒకసారి ఒప్పుకున్నా.. పాకిస్థాన్ కు కూడా సభ్యత్వం ఇస్తే.. భారత్ కు ఇవ్వడానికి తమకేం అభ్యంతరం లేదని అడ్డుపల్ల వేసింది. అప్పటి నుండి ఇది పెండింగ్ లోనే ఉంది. అయితే ఇప్పుడు మాత్రం భారత్ సభ్యత్వంపై చైనా కాస్త వెనక్కి తగ్గినట్టు కనిపిస్తోంది. ఈ విషయంలో చర్చలకు చైనా సిద్ధంగా ఉందని భారత్ లో చైనా రాయబారి లీయు జింగ్ సాంగ్ పేర్కొన్నారు. దౌత్యవేత్తలతో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని ఆయన అన్నారు. భారత్ సభ్యత్వం విషయంలో చైనా పాత్ర మూడు విషయాలపై ఆధారపడి ఉంటుందన్నారు. ఆ మూడు.. నియమాలకు కట్టుబడి ఉండడం, చర్చలు, పరిష్కార మార్గం అని పేర్కొన్నారు. మరి దీనికి పాకిస్థాన్ ఎలా స్పందిస్తుందో చూడాలి.