గోల్డెమెన్ బంగారు చొక్కా ఎక్కడబ్బా..?
గోల్డెమెన్ దత్తాత్రేయ ఫుగే దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. ఫుగే కొడుకు స్నేహితులే ఇంతటి దారుణానికి ఒడిగట్టారన్న వార్తలు కూడా వచ్చాయి. దాదాపు కోటిన్నర విలువ చేసే బంగారు చొక్కాని ధరించిన దత్తాత్రేయ ఫేమస్ ఆ తరువాత గోల్డెమెన్ గా పేరుపొందాడు. అయితే అతని హత్య ఉదంతం తరువాత ఇప్పుడు అందరి సందేహం అతని బంగారు చొక్కాపై పడింది. ఇంతకీ ఫుగే బంగారు చొక్కా ఏమైందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫుగే కొడుకు శుభమ్ మాత్రం చించ్వాడ్‌లోని రాన్కా జ్యూయెలర్స్ వద్ద ఉందని తెలిపాడు. అయితే రాన్కా జ్యూయెలర్స్ యజమాని తేజ్‌పాల్ రాన్కా మాత్రం శుభమ్ వ్యాఖ్యల్ని ఖండించారు. గత మూడేళ్ల క్రితం ఫుగే తమకు చొక్కా తయారచేయమని ఆర్డర్ ఇచ్చాడని.. దానిని చేసి ఇచ్చామని.. ఇప్పుడు చొక్కాను తమ దగ్గర ఎందుకు ఉంచుకుంటామని అన్నారు. తాము వస్తువులను కుదవ పెట్టుకునే వ్యాపారం చేయడం లేదని, తమది కేవలం అమ్మకాలు, కొనుగోళ్ల బిజినెస్ మాత్రమేనని అంటున్నారు.
ఆయన ఇంకో వాదన కూడా వినిపిస్తున్నారు.ఆ చొక్కాను చెడగొట్టించి ఉండొచ్చని, ఆ పని చేయడం చాలా సులభమని తెలిపారు. అంతేకాదు ఆ తరువాత రెండుసార్లు వేరే వస్తువులు కొనేందుకు వచ్చారని.. అప్పుడు తమకు చెక్‌లు ఇచ్చాడని, అవి బౌన్స్ కావడంతో ఆయనపై కేసులు కూడా పెట్టామని రాన్కా అన్నాడు.
మరోవైపు ఫుగే మనీలెండరింగ్ కేసులో కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్నాడు. అప్పుల్లో కూరుకుపోయి ఇన్వెస్టర్లకు లక్షల్లో బాకీ పడ్డాడని.. అప్పుల కారణంగా అమ్మేసి ఉండవచ్చుననే ప్రచారం కూడా సాగుతోంది. కానీ ఆఖరికి ఆ బంగారు చొక్కా ఎక్కుడున్నది మాత్రం మిస్టరీగానే ఉంది.