జకీర్ నాయక్ బాగానే ట్రై చేస్తున్నట్టున్నాడు..
posted on Jul 15, 2016 @ 1:11PM
మొత్తానికి తన మీద ఆరోపణలు తొలగించుకోవడానికి జకీర్ నాయక్ బాగానే ప్రయత్నిస్తున్నట్టు ఉన్నారు. జకీర్ నాయక్ చేసే వివాదాస్పద ప్రసంగాలతో యువత ఉగ్రవాదం వైపు మొగ్గుచూపుతున్నారన్న ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్ద దుమారమే రేగింది. అంతేకాదు జకీర్ నాయక్ ఇండియా వస్తే ఆయనను అరెస్ట్ చేయాలన్న డిమాండ్ల్లు కూడా వచ్చాయి. ఇక చేసేది లేక జకీర్ కూడా తను ముంబై రావాల్సి ఉండగా అది కూడా వాయిదా వేసుకున్నారు. అయితే ఆ తరువాత మహారాష్ట్ర స్టేట్ ఇంటెలిజెన్స్ డిపార్ట్ మెంట్ (ఎన్ఐడీ) తాను ప్రసంగాలు చేసిన వీడియోలు అన్నీ పరిశీలించి తాను మాట్లాడిన దాంట్లో తప్పేం లేదని క్లీన్ చిట్ ఇచ్చింది. అయినా కూడా జకీర్ ఇండియా రావడానికి భయపడుతున్నట్టు ఉన్నాడు.. అందుకే విదేశాల్లో ఉండే స్కైప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.
ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. ఢాకా ఉగ్రవాదులను ప్రేరేపించినట్లు తనపై వస్తున్న వార్తలు అవాస్తవమన్నారు. ఈ విషయంపై ఇప్పటివరకు ఏ భారత అధికారి తనను ప్రశ్నించలేదన్నారు. ఒకవేళ ప్రశ్నిస్తే.. దానికి సమాధానాలు చెబుతానన్నారు. ఈ విషయంలో తాను ప్రభుత్వానికి పూర్తిగా సహకరిస్తానన్నారు. తాను ఉగ్రవాదులకు స్ఫూర్తినివ్వడంలేదని.. కేవలం శాంతిదూతగా వ్యవహరిస్తున్నానని.. అమాయక ప్రజలపై ఆత్మాహుతి దాడులు బాధాకరమని అన్నారు. ఇంకా ఈరోజు తెల్లవారుజామున ప్రాన్స్ లోని నీస్ లో జరిగిన దాడి పై స్పందించి తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. అమాయకులను చంపడం నేరమని.. ఖురాన్‌లోనూ అదే చెప్పారని జకీర్ అన్నారు.