మరో షాకిచ్చిన జెట్ ఎయిర్ వేస్..
posted on Jul 15, 2016 @ 5:14PM
ఈ మధ్య బ్రేక్ ఫాస్ట్ లో బొద్దింక సర్వ్ చేసి ప్రయాణికుడికి షాక్ ఇచ్చిన జెట్ ఎయిర్ వేస్.. ఇప్పుడు మరోసారి జెట్ ఎయిర్ వేస్ ప్రయాణికులకు షాకిచ్చింది. అదేంటంటే.. అదనపు క్యాబిన్ బ్యాగులపై.. అదనపు చార్జీలు వసూలు చేసేందుకు నిర్ణయించుకుంది. ప్రస్తుతం జెట్ ఎయిర్ వేస్ లో 7 నుంచి 10కిలోల బరువు గల ఒక క్యాబిన్ బ్యాగ్, ఒక ల్యాప్‌టాప్ బ్యాగ్, ఒక పర్సు(మహిళలకు)ను ఉచితంగా తీసుకెళ్లే సదుపాయం ఉంది. అయితే ఇప్పుడు అంతకంటే ఎక్కువ లగేజ్ ను కనుక తీసుకొస్తే రూ. 900 చొప్పున ఛార్జీలు వసూలు చేయాలని నిర్ణయించామని సంస్థ అధికారులు తెలిపారు. అయితే ఈ నిర్ణయంపై జెట్ ఎయిర్ వేస్ సంస్థ మాత్రం.. ఆదాయం కోసం తాము ఈ ఛార్జీలు వసూలు చేయడం లేదని.. ఎక్కువగా క్యాబిన్ బ్యాగులు తీసుకురావడంతో విమానంలో స్టోరేజ్ సమస్య ఏర్పడుతుందని చెప్పుకొచ్చింది. ఇక జెట్‌ఎయిర్‌వేస్ నిర్ణయంపై స్పందించిన పౌర విమానయాన శాఖ డైరెక్టర్.. ఈ నిర్ణయంపై పరిశీలిస్తున్నామని తెలిపారు.