పుష్కరాల్లో పురోహితులకు డిజైనర్ దుస్తులు..
పవిత్ర కృష్ణా పుష్కరాలు వచ్చే నెల 12వ తేదీ నుంచి ప్రారంభం కానున్నాయి. కృష్ణానదికి హారతి ఇచ్చే సమయంలో సంబంధిత పురోహితులు డిజైనర్ దుస్తుల్లో కనిపించనున్నారు. ధోతీ, అంగవస్త్రంతో కూడిన నాలుగు రకాల దుస్తులను నిఫ్ట్ హైదరాబాద్ విభాగం డిజైన్ చేసినట్టు సమాచారం. ఎరుపు, పసుపు, పచ్చ, కాషాయం వంటి ముదురు రంగుల దుస్తులను హారతి ఇచ్చే పురోహితుల కోసం రూపొందిస్తున్నట్టు చెప్పారు. గతేడాది జరిగిన గోదావరి పుష్కరాల్లో హారతి కార్యక్రమం నిమిత్తం పూజారులు ధరించిన దుస్తులపై సీఎం చంద్రబాబు నాయుడు అసంతృప్తి వ్యక్తం చేశారని, దీంతో ఈ కృష్ణా పుష్కరాల్లో నదీమ తల్లికి హారతివ్వనున్న పూజారులకు కొత్త దుస్తులు రూపొందించాలని నిర్ణయించారు. గుంటూరు జిల్లా మంగళగిరి, అనంతపురం జిల్లాలోని ధర్మవరంలో తయారైన సాంప్రదాయక దుస్తులతో ఆకర్షణీయమైన రీతిలో పురోహితులకు దుస్తులు రూపొందనున్నాయి.