‘దేశం’లో వర్గీకరణ ముసలం?
posted on Aug 4, 2012 @ 11:09AM
తెలుగుదేశం పార్టీ బిసి అజెండాతో ప్రజల ముందుకు వెడుతోందని ఆ పార్టీ అథినేత చంద్రబాబునాయుడు చెప్పుకుంటూ ఉన్నారు. అలానే ఎస్సీలనూ తెలుగుదేశం పార్టీ వైపు ఆకర్షించేందుకు బాబు ఎస్సీవర్గీకరణ అంశంపై సామాజిక వర్గాల ఆధారంగా సమావేశపరిచారు. ముందురోజు మాదిగల తోనూ, తరువాత రోజు మాలలతోనూ సమావేశం నిర్వహించి ఒక నిశ్చితమైన అభిప్రాయానికి వచ్చేందుకు వ్యక్తిగతమైన అభిప్రాయాలను సేకరించారు. ఈ అభిప్రాయాలన్నీ క్రోడీకరించి ఒక విధానం రూపొందించాలని బాబు కసరత్తులు చేస్తున్నారు.
అయితే మాలలు మాత్రం తాము తెలుగుదేశం పార్టీ వర్గీకరణ సమస్యను భుజంపై వేసుకోవటం వల్ల నష్టపోయామని, మళ్లీ అదే పోకడ అవలంబిస్తే కష్టమని, పార్టీ పరంగా మాట్లాడితే తెలుగుదేశం పార్టీ వర్గీకరణ సమస్యను ఎత్తుకోకపోవటమే సమంజసమని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యానాలపై ఘాటుగా స్పందించిన చంద్రబాబు పార్టీ విధానం కాదంటే వెళ్లిపోయినా పర్వాలేదన్నారు. దీంతో హతాశులైన మాలసామాజికవర్గ నేతలు తమ అభిప్రాయాలను మాత్రమే ఆయన ముందుంచారు. ఈ సమస్య తెలుగుదేశం పార్టీలో పెద్ద ముసలాన్ని తెచ్చిపెట్టినట్లు అవుతుందని రాజకీయ పరిశీలకులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే గతంలో వర్గీకరణ సమస్యను రాష్ట్రవ్యాప్తంగా పెంచినందుకు, మాదిగల తరుపున వ్యవహరించినందుకు బాబు ఇరకాటంలో పడ్డారు. ఆయన్ని మాల వ్యతిరేకిగా చూపి పివిరావు వంటి నాయకులు రాష్ట్రవ్యాప్తంగా మంచి పేరు సంపాదించారు. వర్గీకరణకు తెలుగుదేశం మెడలు వంచామని మాదిగలు చంకలు గుద్దుకున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో వర్గీకరణ సమస్య పెద్ద చిచ్చును తెచ్చి పెట్టింది. ఇప్పుడు కూడా పార్టీ విధానంగా వర్గీకరణ సమస్యను తెరపైకి తెస్తే తెలుగుదేశం మనుగడకే ముప్పువాటిల్లుతుందని మాలమహానాడు కార్యకర్తలు హెచ్చరించారు.