మరింత ముదిరిన విద్యుత్ సంక్షోభం
posted on Aug 4, 2012 @ 10:35AM
రానున్న రోజుల్లో విద్యుత్ కోతలు మరింత పెరగవచ్చు. ఎందుకంటే వర్షాల కారణంగా సింగరేణిలో బొగుతవ్వకం పనులు ఆపేశారు. జలాశయాలు నిండక జలవిద్యుత్ దాదాపుగా ఆగిపోయింది. మరోవైపు బొగ్గుదిగుమతులు నిలచిపోయాయి. దీంతో విద్యుత్ సమస్య మరింత జఠిలం కానుంది. పవర్ ప్రాజెక్టుల్లో పదిహేను రోజులకు సరిపడా నిల్వలుండాలనేది నియమం. అయితే ప్రస్తుతానికి పవర్ ప్రాజెక్టుల్లో కేవలం మూడు రోజులకు సరిపడా నిల్వలు మాత్రమే ఉన్నట్లు తెలిసింది.
దీన్నుంచి తప్పించుకోవడానికి గానూ ఎపి జెన్‌కో తమ 22 యూనిట్ల మరమ్మత్తులకు గానూ షెడ్యూల్‌ను రూపొందించుకుంది. కేవలం బొగ్గు కారణంగా ఉత్పత్తి ఆగిపోయిన విషయాన్ని కప్పిపుచ్చి సాంకేతిక లోపాలు తలెత్తి ఉత్పత్తి ఆగిపోయినట్లు బిల్డప్‌లు ఇవ్వనుంది. కేంద్ర ప్రభుత్వ రంగంలోని ఎంటీపీఎస్‌లోనూ బొగ్గు నిల్వలు నిండుకున్నాయి. డిమాండ్ మేరకు పవర్ ప్రాజెక్టులకు సప్లై చేయవలసిన కోల్ ఇండియా చేతులెత్తేసింది. రామగుండంలో ఓపెన్ కాస్ట్‌ద్వారా బొగ్గు నేరుగా ఆటోమేటిక్ యంత్రాల ద్వారా అన్‌లోడిరగ్ జరుగుతుంది. అయితే ఈ పద్దతిలో రవాణా చేయవలసిన బొగ్గంతా తడిసి పోవడంతో ఇప్పుడది ఉపయోగంలోకి రాదు. ఎందుకంటె తడిసిన బొగ్గును వెంటనే వినియోగించుకునే అవకాశం ఉండదు. కేవలం మన రాష్ట్రానికే కాకుండా దేశం లోని అన్నీ ధర్మల్ స్టేషన్ల పరిస్థితి ఇలాగే వుండటం గమనార్హం.