మళ్ళీ ఉద్యమానికి సిద్దమవుతున్న కేసిఆర్
posted on Aug 4, 2012 @ 10:09AM
అప్పుడప్పుడు పత్రికా ప్రకటనలు తప్ప ఈమద్యకాలంలో మరే కార్యక్రమాలు చేపట్టని జాక్, టిఆర్‌యస్ పార్టీలు మళ్ళీ పోరాటబాట పట్టాలని నిర్ణయించుకున్నాయి. ప్రసిడెంట్ ఎన్నికల ముందు తనకు సంకేతం అందిందని, సెప్టెంబరు నాటికి తెలంగాణ రాష్ట్రం వస్తుందని అందువల్ల మరే ఉద్యమాలు చేయనక్కర్లేదని చెప్పిన కెసిఆర్‌కి తెలంగాణ ప్రస్తావన కేంద్రం ఏ మాత్రం తీసుకు రావకపోవడంతో తప్పనిసరై ఉద్యమ బాట పడుతున్నట్లు తెలుస్తుంది. ఈ విషయంలో జాక్ ముందు నుండి పోరాటం తప్పదని చెబుతూ స్వంత ఎజెండాతో ముందుకు పోతుండటంతో టిఆర్‌యస్‌కు తన ఉనికికి ప్రమాదం వాటిల్లుతుందనే భయంతో తప్పనిసరి పరిస్థితుల్లో జాక్‌తో జతకట్టింది.
ఈ నెల 20,21,22 తేదీల్లో సమావేశమై ఉద్యమానికి కార్యరూపం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తుంది. సెప్టెంబరు 30న జాక్ పిలుపు ఆధారంగా తెలంగాణ మార్చ్‌ను జరపాలని ప్రతిపాదించారు. ఆ తరువాతి రోజు ప్రపంచ వైవిద్య సదస్సుకు ప్రపంచంలోని నలుమూలల నుండి ప్రతినిధులు వస్తుండగా ఈ కార్యక్రమం జరుప తలపెట్టటం గమనార్హం. ప్రపంచ ప్రతినిధుల భద్రతకు తెలంగాణ మార్చ్ ఇబ్బంది కలిగి స్తుందని ఆందోళనలు తలెత్తుతున్నాయి. అయితే ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ కార్యక్రమాన్ని వాయిదా వేయమని జాక్ నేతలు తేల్చిచెప్పారు. అంతకు ముందు సంవత్సరంలో జరిగిన మిలియన్ మార్చ్ సందర్భంగా తీవ్రమైన ఉద్రిక్తత చోటు చేసుకోవడం, ఉద్యమ కారులు ట్యాంకు బండ్‌పై ఉన్న తెలుగు ప్రముఖుల విగ్రహాలను ద్వంసం చేయటం, పోలీసులు విరుచుకు పడటం తెలిసిందే. ఇదే పరిస్థితి పునారావృతమవుతుందేమోనని ప్రభుత్వం మధన పడుతుంది. అయితే ప్రభుత్వం సంయమనం పాటిస్తే తెలంగాణ మార్చ్ శాంతియుతంగా సాగుతుందని జాక్ నాయకులు చెబుతున్నారు.