కిరణ్‌ను తొలిగించాలంటున్న కాపు నాయకులు?
posted on Aug 4, 2012 @ 10:54AM
కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధినాయకత్వంలో కులసమీకరణలు చోటు చేసుకున్నాయని ఆరోపణలు గుప్పుమంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డిని మార్చాలని కేంద్ర నాయకత్వంపై నానాటికీ ఒత్తిడి పెరుగుతోంది. అయితే సమర్థులు లేనందు వల్ల ఇది కుదరదనే అభిప్రాయంతో కాంగ్రెస్ హైకమాండ్ ఉంది. అయితే ఎవరో ఒకరిని చూపి ముందు సిఎం కిరణ్ స్థానంలో తమవారిని కూర్చోపెట్టాలని కాపునాయకులు గట్టిపట్టుదలతో ప్రయత్నాలు సాగిస్తున్నారు. దీనిలో భాగంగానే కాపుసామాజిక వర్గం ప్రతినిధులు పిసీసీ చీఫ్ బొత్సాసత్యన్నారాయణపై ఒత్తిడి చేస్తున్నారని సమాచారం. తనకు అవకాశం ఇవ్వనందున తానేమీ చేయలేక పోతున్నానని బొత్సా వారికి వివరిస్తే కనీసం రాజ్యసభ సభ్యుడు, మెగాస్టార్ చిరంజీవికి అవకాశం ఇప్పించాలని వారు సూచించినట్లు భోగట్టా! దీంతో అంతకు ముందు చిరంజీవికి సిఎం అంటే ఇష్టపడని పిసీసీ చీఫ్ ఇప్పుడు తప్పేముందని మాట మార్చారు.
దీంతో తమ దౌత్యం ఫలిస్తోందని భావించిన కాపునాయకులు మరికొందరు కాంగ్రెస్ సీనియర్లతో ఇదే మాట అనిపించేందుకు ప్రయత్నిస్తున్నారు. సీనియర్లతో ఇలా వ్యాఖ్యానాలు చేయించిన తరువాత చిరంజీవికి మద్దతుగా కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిసేందుకు కాపునాయకులు ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే సోనియాగాంధీ తనను కలవటానికి చిరంజీవికి అపాయింట్‌మెంట్ ఇవ్వలేదు. దీంతో రాహుల్‌గాంధీ తరుపు నుంచి నరుక్కురావాలని కాపునాయకులు యోచిస్తున్నారట. ఆంధ్రా నుంచి వచ్చిన అందరితోనూ మాట్లాడుతున్న రాహుల్ మరి సిఎం పదవి విషయంలో ఏమి మాట్లాడతారో అన్న ఆసక్తి నెలకొంది. కాపునాయకుల ప్రయత్నాలు ఫలిస్తాయో లేదో? కానీ, రాష్ట్ర అధినాయకత్వంలోనూ కులసమీకరణలకు వీరి ప్రయత్నాలు కారణమవుతున్నాయి. సిఎం కిరణ్ కుమార్‌రెడ్డి గట్టి వాడు , సమర్ధుడు అనే భావనను హైకమాండ్ వద్ద కల్పించడానికి రెడ్డి సామాజిక నేతలు ప్రయత్నిస్తున్నారు. వీరి ప్రచారం కాపునాయకుల ప్రయత్నాలకు వ్యతిరేకంగా పని చేస్తుందని ఇప్పటికే సిఎం ఒక అభిప్రాయానికి వచ్చారు. అందుకే ఆయన ధీమాగా ఉన్నారు. విషయం ముందుగానే లీకైనందున కాంగ్రెస్ హైకమాండ్ జరుగుతున్న మొత్తం పరిణామాలపై దృష్టిసారించింది.