వచ్చే నెల్లో పంచాయతీ ఎన్నికలు?
posted on Aug 5, 2012 6:31AM
వచ్చే నెల్లో పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు కాంగ్రెస్ పార్టీ సమాయత్తమవుతోంది. సంస్థాగత ఎన్నికలను ఐదంచెల పద్దతిలోనే నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి గాను అవసరమైన ఏర్పాట్లు చేయాలని సిఎంపై ఒత్తిడి పెరుగుతోంది. ఒకవైపు కేంద్రం నుంచి మరోవైపు రాష్ట్రంలోని కీలకమైన నేతల నుంచి ఈ ఒత్తిడి ఎదురవుతోంది. కేంద్ర మంత్రి కిశోర్‌చంద్రదేవ్ ఈ ఎన్నికలు నిర్వహించేంత వరకూ 10వ ఫైనాన్స్, 11వ ఫైనాన్స్ నిధులు అందబోవని స్పష్టం చేశారు.
గ్రామాల్లో అభివృద్థి కుంటుపడుతున్నందున రాష్ట్రప్రభుత్వం వెంటనే స్పందించాలని ఆయన సూచించారు. దీనికి రాష్ట్రప్రభుత్వం స్పందించకపోవటంతో కేంద్రం గ్రామాలకు విడుదల చేయాల్సిన నిధులను ఆపేసింది. ఫలితంగా గ్రామాలు అభివృద్థికి దూరమయ్యాయి. పంచాయతీతో పాటు మండల పరిషత్తు, జిల్లాపరిషత్తు ఎన్నికలు జరుగుతాయని భావిస్తున్నారు. ఈ రెండు అంచెల ఎన్నికలు జరిగితే స్థానిక సంస్థలకు ఎన్నికలు పూర్తయినట్లు అవుతుంది. రాష్ట్రముఖ్యమంత్రి ఎక్కడ పర్యటించినా ప్రతీ ప్రాంతంలోనూ ఈ పంచాయతీ ఎన్నికల గురించే కాంగ్రెస్‌నాయకులు నిలదీస్తున్నారు. దాదాపు ఇందిరమ్మ బాట కార్యక్రమమంతా ఈ తరహాలోనే నడిచింది. తాజాగా సిఎం చిత్తూరు జిల్లాలో విమానాశ్రయం వద్ద కూడా ఇదే విషయమై చర్చించాల్సి వచ్చింది. నెల్లూరు ఎమ్మెల్యే కూతూహలమ్మకు, చిత్తూరు జిల్లా నాయకులకు వచ్చే నెల్లో పంచాయతీ ఎన్నికలు జరిగేలా చూస్తానని సిఎం భరోసా ఇచ్చారు.