నలిగిపోతున్న ఎంసెట్ విద్యార్ధులు
posted on Aug 4, 2012 @ 9:48AM
దేశంలోని అన్ని ఇంజనీరింగ్, ఫార్మసి, మెడికల్ కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయి సిలబస్‌ను కవర్ చేస్తున్నారు. రాష్ట్రంలో మాత్రం మెడికల్ సీట్లు విద్యార్ధిసంఘాల ఆందోళన కోర్టు తీర్పులమద్య ఎలాగో కానిచ్చిన రాష్ట్ర ప్రభుత్వం ఇంజనీరింగ్ ఫార్మసీ కౌన్సిలింగ్ కొచ్చేసరికి చతికిల పడిరది. దీనికి కారణం రాష్ట్రం ప్రభుత్వానికి ముందు చూపు లేకపోవడమేనని తెలుస్తోంది. గత సంవత్సరమే అన్ని కాలేజీలకు ఒకే రకమైన ఫీజలుండవలసిందేనని హైకోర్టు తీర్పునిస్తే కాలేజీలను గ్రేడ్లుగా మార్చి ఫీజుల్లో తేడాలండవలసిందే అంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టు తీర్పుకు వేచిచూచింది.
సుప్రీం కోర్టు ధర్మాసనం మాత్రం అందరికీ విద్యాబుద్దులు ఒకేలా కల్పించాలని అంటూ ఈ కాలేజీల గ్రేడ్లేమిటంటూ నిలదీసింది. దీంతో ప్రభుత్వ న్యాయవాది రీ ఇంబర్స్‌మెంటు గురించి వివరిచడం జరిగింది. రీ ఎంబర్స్ మెంట్‌ను ఏ చట్ట పరిధిలో ఇస్తున్నారంటూ కోర్టు వేసిన ప్రశ్నకు సరైన సమాదానం ఇవ్వలేకపోయారు. కాలేజీ యాజమాన్యాలు పెంచిన ఫీజులు గురించి ప్రభుత్వం ఇప్పుడు గుండెలు బాదుకుంటుంది. కన్వీనర్‌కోటా, మేనేజ్‌మెంట్‌కోటా లంటూ ఫీజుల గురించి ముందు జాగ్రత్తలు పాటించకుండా ఇప్పుడు బాధపడుతుంది. ఇవన్నీ ముందుగానే చర్చించి ఎకడమిక్ ఇయర్ స్టార్ అయ్యేటప్పటికి సన్నధంగా ఉండవలసిన ప్రభుత్వం, అధికార యంత్రాంగం నిద్రలో జోగింది.
ఇద్దరు విద్యాశాఖ మంత్రులు ఉన్నప్పటికి ఆ శాఖ పనితీరు ఎంత అధ్వాన్నంగా ఉందో ఈ ఉధంతంతో అర్ధం చేసుకోవచ్చు. ఎంత వరకూ పదవులు కాపాడుకుంటానికే ప్రాధాన్యత నివ్వడమే కాని, ప్రజల సమస్యలుగాని, విద్యార్ధుల సమస్యలు గాని పట్టించుకున్న సందర్బం ఏ ఒక్క మంత్రికీ లేదని దీన్ని బట్టి తేటతెల్లం అయ్యింది. ఇప్పటికైనా అన్ని ఫార్మాలిటీస్ పూర్తిచేసుకొని కౌన్సిలింగ్ ప్రక్రియను త్వరగా ముగించాలని విద్యార్దులూ తల్లిదండ్రులూ కోరుతున్నారు.