దానం నాగేందర్‌కు క్లాసుపీకిన బొత్స

సుప్రీంకోర్టు తీర్పుతో కంగుతిన్న ప్రభుత్వం ప్రయివేటు ఇంజనీరింగ్‌ కాలేజీలో చదివే  బిసిలకు రిఎంబర్స్‌మెంట్‌ పాక్షికంగా చెల్లిస్తామనడంతో విద్యార్ధిలోకం ఆందోళన చేపట్టింది. పాత ఫీజలను మాత్రమే చెల్లించడానికి ముందుకొచ్చిన ప్రభుత్వం కొత్తగా పెంచిన ఫీజులను విద్యార్దులే చెల్లించాలనటంతో విద్యార్ధులతో పాటు మంత్రులను కలచివేసింది. దాంతో బిసిలలో మంత్రులుగా ఉన్న దానం నాగేందర్‌, ముఖేష్‌గౌడ్‌ ఆందోళనాకారులతో తమ గొంతుకూడా కలిపారు. అవసరమయితే తమ పదవులను త్యాగం చేస్తామని  ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రకటనలు చేశారు.  చేయిదాటిపోతున్నదనుకున్న పిసిసి ప్రసిడెంట్‌ వారిని పిలచి తలంటారని బోగట్టా.   ఇంకా ప్రభుత్వం నిర్ణయాన్ని తెలుపకుండానే ఎందుకు తొందరపడుతున్నారని... సంయమనంగా వ్యవహరించాలని, మంత్రులే ఇలా చేసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టకూడదని హితబోధ చేసి దానంను దారిలోకి తెచ్చుకున్నారు. అదే విధంగా ఇందిరమ్మ బాటలో ఉన్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి  ఫోన్‌లోనే ముఖేష్‌ గౌడ్‌ను నియంత్రించారు. దీంతో మంత్రివర్గంలో పెను ప్రమాదాన్ని తప్పించారు.ప్రస్తుతం ప్రభుత్వం కూడా బిసి విద్యార్ధుల రీఎంబర్స్‌మెంట్‌ విషయంలో ఆచితూచి అడుగులు వేస్తుంది. ప్రవేటు ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యాలను తమ నియంత్రణలోనికి తెచ్చుకోవడానికి ఆర్డినెన్స్‌ జారీ చేసింది.

గంజాయివనంగా మారుతున్న విశాఖ ఏజెన్సీ

అడ్డదారుల్లో డబ్బుసంపాదించుకోవాలను కుంటున్న వారికి విశాఖ ఏజెన్సీ బాగా కలిసొస్తుంది. గిరిజనుల బలహీనతలు గుర్తించి వారిని లోబరచుకొని కొంతమంది దళారులు గంజాయి పండిస్తున్నారు. వాటిని మహారాష్ట్ర, తమిళనాడుకు గుట్టుచప్పడుకాకుండా తరలించి క్యాష్‌ చేసుకుంటున్నారు. గంజాయితరలించడానికి గానూ ప్రత్యేకంగా ఏజెంట్లు ఉన్నారు. వారు బస్సులు, ట్రైయిన్లును  ఉపయోగించుకుంటున్నారు. పాడేరు ఇందుకు ముఖ్యకేంద్రంగా ఉందని తెలిసింది.ఏజెంట్లు సూట్‌కేసులు, లగేజీ బ్యాగులతో ఎక్కడికి పడితే అక్కడికి సులువుగా గంజాయిని తరలిస్తున్నారు. ఒకోసారి పోలీసులు కంటపడకుండా ఉండటానికి మినీ వ్యాన్‌లకు ఎప్పటికప్పుడు నెంబరు ప్లేట్లు కూడా మారుస్తున్నారు.ఈ మద్య తమిళనాడుసరిహద్దు ప్రాతంమైన చిన్నపన్నపాలెం దగ్గర ఎక్సైజ్‌, ప్రోహిబిషన్‌వారు కాపుకాసి నిందితులను పట్టుకున్నారు. అదే విదంగా పాడేరులో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్న పోలీసులు రాత్రి లాకప్‌నుండి కిటికీ ఊచలు వంచి పారిపోయినట్లు ఉదయాన్నే కనుగొన్నారు. ఏలూరులో 20 లక్షల రూపాయల గంజాయితోపాటు నిందుతులను కూడా పోలీసులు పట్టుకున్నారు. వీరుకూడా తెల్లారేసరికి పారిపోయినట్లు పోలీసులు గుర్తించారు.ఈ సంఘటన పలు అనుమాలను కలిగిస్తూ పోలీసుల చిత్తశుద్దిని శంకించేలా చేసింది. అలాగే పశ్చిమగోదావరి జిల్లా గుండుగొలను లోనూ, విశాఖ జిల్లా నర్సీపట్నంలోకూడా పలు మార్లు నిందుతులను పోలీసులు పట్టుకోవడంతో ఏజెన్సీ ఏరియాలో యధేచ్చగా  గంజాయి సాగుజరుగుతున్నట్లు నిర్దారణ అవుతోంది.  

త్వరలో మరో నాలుగు న్యూస్‌ ఛానళ్ళు

ఇప్పటికే ప్రసారమాద్యమాలన్నీ రాజకీయపార్టీలతో ముడిపడి ఉన్నాయి. ఏరాజకీయ పార్టీకి చెందని చానళ్లు రెండు మూడు కంటె రాష్ట్రంలో ఎక్కువ లేవని చెప్పవచ్చు . అయితే  చానళ్ల ప్రాముఖ్యతను గుర్తించిన వివిధ రాజకీయనాయకులు  తమ రాజకీయ ప్రయోజనాలకోసం త్వరలో మరో నాలుగు న్యూస్ ఛానళ్ల ఏర్పాట్లలో బిజీగా ఉన్నట్లు తెలిసింది. కాంగ్రెస్‌కు ఒక ఛానల్‌ ఉండాలనే విషయాన్ని గుర్తించిన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్‌రెడ్డి సాక్షి చానల్‌ను ప్రారంభించినప్పటికీ తరువాత జరిగిన పరిణామక్రమంలో అది వైయస్సార్‌ కాంగ్రెస్‌ ఛానల్‌గా మారింది. దీంతో కాంగ్రెస్‌కు ఒక ప్రత్యేక ఛానల్‌ కావాల్సి వచ్చింది. కాంగ్రెస్‌తో పాటు సిపిఐ,సిపియం,బిజెపిలు న్యూస్‌ ఛానళ్ళ ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్నాయి.  కాంగ్రెస్‌కు కేరళలో ఇప్పటికే జైహింద్‌ పేరుతో ఛానల్‌ ఉంది. దానికి ఎఐసిసి ఆర్దిక సాయం చేసింది. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఛానల్‌ ప్రాంరభించాలని రాష్ట్ర  నాయకులు అనుకుంటున్నారు. అధిష్టానం అనుమతిస్తే  అనుమతిస్తే బొత్స సత్యన్నారాయణ, చిరంజీవి ఈ ఛానల్‌ నిర్వహణాబాద్యతలు తీసుకోవడానికి రెడీగా ఉన్నామని చెబుతున్నారు. వారేకాకుండా మరికొంత మంది ఎంఎల్‌సీలు, ఎన్‌ఆర్‌ఐలు కూడా కాంగ్రెస్‌ ఛానల్‌కు చేయూత నిచ్చేందుకు  సంసిద్దత తెలియచేస్తున్నారు.   ప్రస్తుత ప్రపంచీకరణ నేపధ్యంలో ప్రతీవిషయాన్నీ అధికార సభ్యులు ప్రపంచీకరణతో ముడిపెట్టడాన్ని నివారిస్తూ, ఇప్పుడున్న విధానాలకు ప్రత్యామ్నాయ పద్దతులను చూపాలంటే తమ విధివిధానాలకు కట్టుబడి ఉండే చానల్స్‌ను ప్రారంభించాల్సిన అవసరం ఉందని  ఉభయ కమ్యూనిస్టులు చెబుతున్నాయి. ఎన్ని కార్యక్రమాలను చేపట్టినా ప్రజల్లోకి వెళ్లకపోతే ఫలితం ఉండదని అందుకే తాముకూడా న్యూస్‌ ఛానల్‌ ఏర్పాటుకు కృషి చేస్తున్నామని బిజెపి నాయకుడు కిషన్‌రెడ్డి చెప్పారు.

సోనియాగాంధీ ఒత్తిడికి గురవుతున్నారా ?

పదమూడు సంవత్సరాలనుండి రాజకీయాలలో రాణిస్తున్నా ఏనాడూ సంయమనం కోల్పోని సోనియా ప్రస్తుత పార్లమెంటు వర్షాకాల సమావేశాల మొదటిరోజు అద్యాని వాఖ్యలమీద, తెలంగాణ కాంగ్రెస్‌వారిమీద విరుచుకుపడటం స్వపక్ష, ప్రతిపక్ష నాయకులకు మింగుడు పడటం లేదు.  సోనియా వత్తిడిని తట్టుకోలేకపోవడమే దీనికి కారణమని  మానసిక విశ్లేషకులు చెబుతున్నారు. ట్రబుల్‌షూటర్‌గా ఉన్న ప్రణబ్‌ముఖర్జీ రాష్ట్రపతి కావడంతో పార్లమెంటులో  ప్రతిపక్షాల విమర్శలను  ధీటుగా ఎదుర్కొనే సత్తాగల నాయకులు పార్టీలో లేనందువల్ల ఆ భాద్యతలు కూడా సోనియానే  చేపట్టవలసి వచ్చింది. రాహుల్‌ను ప్రధాన మంత్రి చేసే విషయంలో కూడా ఆమె తీవ్ర వత్తిడి ఎదుర్కొంటున్నట్లు తెలిసింది. భావి ప్రధానిగా  ఉండాలంటే తప్పకుండా స్పష్టమైన మెజారిటీ కాంగ్రెస్‌ చేజిక్కించుకోవాలని రాహుల్‌  షరతువిధించిట్లు తెలిసింది. అలాగే చీటికి మాటికి యుపిఎ సభ్యులు అరచిగోలపెట్టటం, రాష్ట్రపతి ఎన్నికల్లో అనైక్యంగా ఉన్న ఎన్‌డిఎ కూటమి ఉపరాష్ట్రపతి ఎన్నికలకు ఐక్యంగా అభ్యర్ధిని  నిలవటం  సోనియాను ఒత్తిడికి గురిచేసింది. భాగసామ్య పక్షమైన సమాజ్‌వాది పార్టీ నాయకుడు అఖిలేష్‌ యాదవ్‌ ఒకసందర్బంలో కాంగ్రెస్‌ను రానున్న ఎన్నికల్లో ఓటమి చెందే పార్టీగా పేర్కోటం, వచ్చే ఆరునెలల్లో గుజరాత్‌తో సహా మరో ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలకు సిద్దపడవలసిరావడం సోనియాకు కత్తిమీద సాము. అసోంలో కాంగ్రెస్‌పాలనలో హింసాకాండ చెలరేగటంతో ప్రతిపక్షాలకు సమాధానం చెప్పవలసిరావడం కూడా సోనియా వత్తిడికి ఒక కారణంగా రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సోనియా తాను ఉగ్రరూపం ధరించడమేకాక తమ సభ్యులను కూడా రెచ్చగొట్టటం ఆశ్చర్యపరచిన విషయం. దీంతో ప్రతి విషయాన్ని ప్రభుత్వ అవినీతితో ముడిపెట్టే ప్రతిపక్షాలను సహించరాదని ఆమె తమ సభ్యులకు  స్పష్టం చేసినట్టయ్యింది. దేశంలోని వర్షాభావ పరిస్థితులు, తద్వారా దుర్బిక్ష పరిస్తితులు సోనియాకు సవాల్‌ విసురుతున్నాయి. ఆర్దిక మాంద్యం తగ్గించాలంటే రిటైల్‌రంగంలో విదేశీపెట్టుబడులు ఆహ్వానించక తప్పని పరిస్దితి. దీన్ని అమలు చేయాలంటే మమతబెనర్జీ, ములాయంసింగ్‌ అంగీకరించవలసి ఉంది. జాతీయంగానూ, అంతర్జాతీయంగానూ మన్‌మోహన్‌సింగ్‌ ప్రభుత్వ పనితీరు అనేక విమర్శలకు గురికావడం సోనియాను కలవరపెడుతుంది.  

అభివృద్దికి ఆమడ దూరంలో ఆదివాసీలు

అభివృద్ది ముసుగులో ప్రభుత్వాలు ఆదీవాసీల ఉనికినే దెబ్బతీస్తున్నాయి. వారి సంస్కృతీ సాంప్రదాయాలను పరిరక్షించడంలో అధికార యంత్రాంగం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. రాజ్యాంగం ప్రకారం ఆదీవాసీలకు లభించాల్సిన ప్రయోజనాలను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తుంగలో తొక్కుతున్నాయి. రాజ్యాంగంలోని 244,275 నిబంధనలు, ఐదవ షెడ్యూల్‌లోని పాలనా విధానాలూ గిరిజనులకు సాధికారతను కల్పించే రాజ్యాంగం లోని 73 సవరణలన్నీ కాగితాలకే పరిమితమయ్యాయి. కేంద్రంనుండి రాష్ట్రానికి నిధులు విడుదల అవుతున్నా అవి ప్రక్కదారి పడుతున్నాయి.     జనాభా ప్రాతిపదికన విడుదల అవుతున్న సబ్‌ప్లాన్‌ నిధులు,ఏజెన్సీ ప్రజల మంచినీటికోసం వెచ్చించే నిధులు దారి తప్పుతున్నాయి. గిరిజనాభివృద్దికి వస్తున్న కోట్లాదిరూపాయలను ఇతర రంగాలకు మళ్లించి గిరి పుత్రుల కడుపు కొడుతున్నది ఆయా రాష్ట్ర ప్రభుత్వాలే కావడం శోచనీయం. గిరిజనులకు ఉండే భూములను ప్రాజెక్టుల క్రింద ముంచేసి వారికి ఉన్న కొద్ది పాటి జీవానాధారం కూడా లేకుండా చేస్తున్నారు. మన రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టు వల్ల తూర్పు,పశ్చిమ గోదావరిజిల్లాల్లోనూ, ఖమ్మం జిల్లాలోనూ 300 ఆదీవాసీ గ్రామాలు ముంపునకు గురికానున్నాయి. దీంతో వేలాది గిరిజన కుటుంబాలు నిరాశ్రయం అవుతున్నాయి. బాక్సైట్‌ తవ్వకాల పేరుతోవందలాది తండాలను బలవంతంగా తరలిస్తున్నారు. పారిశ్రామిక కార్యకలాపాలతో ఉత్తరాంద్రలోని ఆదివాసీలకు నిలువ నీడ లేకుండా పోయింది. గిరిజనులు సేకరించుకునే అటవీ ఉత్పత్తులు స్వేచ్చగా అమ్ముకునేందుకు కూడా అధికారులు అడ్డు పడుతున్నారు. పాత పద్దతిలో పోడు వ్యవసాయం చేయడం, తాతముత్తాతల కాలంనాటి వ్యవసాయ పనిముట్లు వాడటం వల్ల దిగుబడులు తగినంతగా లేక గిరిజనుల బ్రతుకులు దుర్బరంగా మారాయి. గిరిజనోద్దరణకు ఏర్పాటు చేసిన సమీకృత గిరిజనాభివృధ్ది (ఐటిడిఎ) సంస్ధ ద్వారా కోట్ల రూపాయలు కెటాయిస్తున్నా ఆదీవాసీ జీవితాల్లో వెలుగులేకపోవడం 65 ఏళ్ల స్వతంత్య్ర భారతావనికి మాయని మచ్చ. ఇప్పటికైనా పాలకులు ఆదీవాసీల అభివృద్దికి చిత్తశుద్దితో పాటుపడాలి.

తెలంగాణా అర్చకుల ఆందోళన

ఇప్పటికే పలు రకాల ఆందోళనలతో అట్టడికి పోతున్న తెలంగాణలో మరో ఆందోళన ప్రారంభం అయ్యింది. తెలంగాణ అర్చకులు తమ డిమాండ్ల సాధనకౖ ఆందోళన చేపట్టారు. తమకు జీవో నెంబర్‌ 16 ఎ ప్రకారం ట్రెజరీ ద్వారా జీతాలు చెల్లించాలని ఆలయ అర్చకులు నిరసన బాట పట్టారు. అర్చకుల నిరసనలతో దేవతా మూర్తులకు పూజలు నిలచిపోయాయి. దీంతో నిత్యం భక్తులతో రద్దీగా వుండే దేవాలయాలు బోసిపోయాయి. భక్తుల కోరికలు తీర్చే దేవుడికే సేవ చేస్తున్నా తమ బాధలు పట్టించుకోనే నాధుడే కరువయ్యాడని పూజారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.     దేవాలయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వం ఉపాద్యాయులకు ఇస్తున్నట్లుగానే తమకు వేతనం ట్రెజరీల ద్వారా చెల్లించాలని అర్చకులు ప్రధానంగా డిమాండ్‌ చేస్తున్నారు. అర్చకులు ఆందోళన బాట పట్టడంతో యాదగిరి లక్ష్మీనరసింహస్వామి , మెదక్‌ ఏడుపాయల వనలక్ష్మీదేవి, బొంతపల్లి వీరభద్రస్వామి, సిద్దిపేట వెంకన్న లాంటి ప్రధాన ఆలయాల్లో పూజలు ఆగిపోయాయి. తెలంగాణావ్యాప్తంగా 12 వేల ఆలయాలున్నాయని అన్నిటిలోనూ ఆర్జిత సేవలను నిలిపివేయాలని అర్చక సంఘం పిలుపు నిచ్చింది. ఈ మేరకు ఈనెల 14 వరకు అర్చకులు ఆర్జిత సేవలు నిలిపి వేయనున్నారు. దేవాలయాల్లో పని చేస్తున్న అర్చకులకు ఆర్ధిక ఇబ్బందులతో బ్రతుకు దుర్బంరంగా వుందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా ప్రభుత్వం సత్వరమే స్పందించాలని లేకుంటే ఈ నెల 14 నుండి ఆందోళన ఉదృతం చేస్తామని తెలంగాణ అర్చకులు హెచ్చరిస్తున్నారు.

జగన్‌ గూటిలోకి ఇద్దరు మాజీ మంత్రులు, ముగ్గురు ఎంఎల్‌ఏలు?

గుంటూరు జిల్లాలోనూ తెలుగుదేశం పార్టీ ప్రాభవం కోల్పోతోంది. ఈ జిల్లాలో మాజీ మంత్రులిద్దరు, ముగ్గురు ఎంఎల్‌ఏలు వైసిపిలోకి వెళుతారన్న వార్తలు జోరందుకుంటున్నాయి. ఇప్పటికే కృష్ణాజిల్లాలోని నాయకులంతా వైసిపి బాట పట్టడంతో చంద్రబాబునాయుడు ఆందోళన చెందుతున్నారు.పార్టీకి పూర్వవైభవం తెచ్చే ప్రయత్నాల్లో భాగంగా వచ్చే ఎన్నికల్లో 100 సీట్లు బిసిలకు కెటాయించి, ఉచిత కరెంటుతో రైతుల సంక్షేమానికి పాటుపడతామని ఆయన ప్రకటించినా నాయకుల వలసలు ఆగడం లేదు. చంద్రబాబు ఎన్ని ప్రయత్నాలు చేసినా కార్యకర్తల్లో ఆత్మవిశ్వాసం నింపలేకపోతున్నారు.     ప్రభుత్వ వ్యతిరేకతను ప్రతిపక్షపార్టీగా ఎండకట్టలేకపోవడం తెలుగుదేశం పార్టీకి ప్రధాన అవరోధంగా మారింది. చంద్రబాబునాయుడు ఎన్ని జనాకర్షక పధకాలు మొదలు పెట్టినప్పటికీ వాటిని కార్యకర్తల్లోకి, ప్రజల్లోకి తీసుకెళ్లే నాయకత్వం గుంటూరు జిల్లాలో లేదు. క్రియాశీలకంగా పనిచేయగలిగిన కార్యకర్తలను, నాయకులను సమీకరించడంలో చంద్రబాబు మీన మేషాలు లెక్కిస్తూ ఆలస్యం చేస్తున్నారనేది జిల్లా నాయకుల ప్రధాన ఆరోపణ. ఇకనైనా క్రిందిస్ధాయినుండి క్యేడర్‌ను పెంచుకుంటూ కార్యకర్తల మనోభావాలను గుర్తించి పల్లెల్లోనూ పట్టుసాదించే దిశగా అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. జిల్లా పర్యటనకు వచ్చిన తెలుగుదేశం అధిపతి పార్టీని ప్రక్షాళన చేసి, అంకిత భావంతో పనిచేసి పార్టీకి పూర్వవైభవాన్ని సంతరింపచేసే నాయకులకు పార్టీ పగ్గాలు అప్పగించాలని తెలుగుదేశం అభిమానులు కోరుకుంటున్నారు.

ఆజాద్‌ బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనానికి అద్దెకట్టిన పీసిసి?

తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి గులాంనబీ ఆజాద్‌ ప్రచారం చేసేందుకు వచ్చినప్పుడు వినియోగించిన బుల్లెట్‌ప్రూఫ్‌ వాహనానికి పీసిసి పోలీసు శాఖకు అద్దె చెల్లించింది. వాస్తవానికి అథికారపార్టీకి ఎన్నికల్లో ఉపయోగించిన వాహనాల అద్దె బిల్లు వేయకుండా పోలీసులే పలు జిల్లాల్లో మేనేజ్‌ చేసేశారు. కానీ, తిరుపతి పోలీసులు దానికి భిన్నంగా ఎన్నికల నిబంధనల ప్రకారం ఆజాద్‌ పర్యటనను రికార్డు చేసి తమశాఖ బుల్లెట్‌ ప్రూఫ్‌ వాహనానికి అయిన ఖర్చును, అద్దెను కలిపి బిల్లు తయారు చేశారు.     ఎన్నికల నిబంధనల ప్రకారం పార్టీల నేతల వాహనాల ఖర్చు ఆ పార్టీలే భరించాల్సి ఉంటుంది. ఆ నిబంధనల ప్రకారమే అర్బన్‌ జిల్లా ఎస్పీ ప్రభాకరరావు గత నెల 11న పీసిసికి నోటీసు పంపించారు. ఆజాద్‌ పర్యటనలో మొత్తం 60కిలోమీటర్లు తిరిగారని, దానికి ఆయిల్‌, అద్దె ఖర్చుల కింద రూ.930 చెల్లించాలని ప్రభాకరరావు పీసిసిని కోరారు. దీనికి స్పందించిన పీసిసి ఈ బిల్లు చెల్లించాలని పీసిసి కార్యదర్శి ఎంఆర్‌సి రెడ్డిని కోరింది. అదీ నిబంధనల ప్రకారం చెలానా రూపంలో చెల్లించాలని సూచించింది. దీంతో పీసిసి తరుపున కార్యదర్శి ఎంఆర్‌సి రెడ్డి అర్బన్‌జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి చలానాను అందజేశారు. నిబంధనల ప్రకారం రశీదు కూడా తీసుకున్నారు. దీంతో ఆజాద్‌ పర్యటనకు పద్దతి ప్రకారం ఖర్చు చేసినట్లు అయిందని రెడ్డి, అర్బన్‌ జిల్లా ఎస్పీతో అన్నారు.

గుర్తింపు కోసం తెగబడుతున్న మావోయిస్టులు?

కేంద్ర, రాష్ట్ర బలగాలు మావోయిస్టుల ఊచకోత కోయటం ద్వారా తమ సత్తా చాటుకున్నాయని ప్రచారం ఎక్కువైంది. ఈ ప్రచారం నేపథ్యంలో మావోయిస్టులు పోలీసులతో నేరుగా తలపడేందుకు సిద్ధపడుతున్నారు. రద్దీ ఎక్కువ ఉండే ప్రాంతాల్లో తిరిగి పోలీసులను కవ్విస్తూనే ఎదుర్కోవాలని మావోయిస్టు కేంద్రకమిటీ ఆదేశాలిచ్చిందని సమాచారం. అందుకే మావోయిస్టులు ప్రాణాలకు తెగించి తలపడాలని నిశ్చయించు కున్నారని మన్యం వాతావరణం బట్టి అర్థమవుతోంది.     తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీ రహదారి ఒకవైపు విశాఖ, ఒరిస్సా ఏజెన్సీతోనూ, మరోవైపు ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్ర ఏజెన్సీతోనూ కలుస్తుంది. అందువల్ల ఆ రెండు రాష్ట్రాల్లో మావోయిస్టులు తూర్పుఏజెన్సీకి సులభంగా వలస వచ్చేస్తుంటారు. మరోవైపు నల్లమల అడవుల నుంచి కూడా ఇక్కడికి వలస వచ్చేస్తుంటారు. అన్నిటికీ ప్రధానకేంద్రంగా తూర్పుఏజెన్సీ ఉంది. తాజాగా ఛత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ పోలీసుస్టేషనుపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ దాడిలో ఒక జవాను మరణించాడు, మరొకరి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. దంతెవాడ తరువాత ఘటన తూర్పుఏజెన్సీలోనే జరుగుతుందని జిల్లా పోలీసులు అప్రమత్తమయ్యారు. గత అనుభవాల రీత్యా ఛత్తీస్‌ఘడ్‌లో తెగబడిన మావోయిస్టులు తూర్పుగోదావరి ఏజెన్సీలోనూ అదే పంథాలో విజృంభిస్తుంటారు. ఇలా తెగబడినప్పుడు ఎస్‌ఐల స్థాయి అథికారులను కోల్పోయిన చరిత్ర తూర్పుగోదావరి పోలీసులదే. పైగా ప్రధానరహదారిలో ఎదురుకాల్పులు జరుపుకోవటం ఆనవాయితీ. ఛత్తీస్‌ఘడ్‌లోని దంతెవాడ పోలీసుస్టేషనుపై దాడి జరిగిందన్న విషయం తెలిసిన వెంటనే గిరిజనులు వణికిపోతున్నారు. ఎందుకంటే ఒకవైపు మావోయిస్టులు, మరోవైపు పోలీసులు కూడా పట్టుదలగా వ్యవహరిస్తారని వారు భయపడుతున్నారు. ఎటువంటి విపత్తు సంభవించినా తమ గుర్తింపును చాటుకోవాలని మావోయిస్టులు సిద్ధపడటంతో భయానకపరిస్థితులు తప్పవని పరిశీలకులు అంటున్నారు.

ములాఖత్‌లు తగ్గించేందుకు జైళ్ళలో ఫోన్‌లు

జైళ్లలో ఫోను సౌకర్యం ఉంటే ములాఖత్‌లు తగ్గుతాయని ఉన్నతస్థాయిలో గుర్తించారు. ఖైదీలు జైలులో ఉన్నప్పుడు ఎలా ఉన్నారో అని వారి కుటుంబసభ్యులు ఆందోళన చెందకుండా ఈ ఏర్పాట్లు చేస్తే బాగుంటుందని సూచనలు వచ్చాయి. ప్రత్యేకించి ఖైదీ ఆరోగ్యపరిస్థితి కనుగొనేందుకు దూరప్రాంతాల నుంచి కుటుంబసభ్యులు రావటానికి ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఈ ఫోను ఏర్పాటు కొంత ఊరట కలిగిస్తుందని గుర్తించారు. అయితే ఈ ఏర్పాటు కోసం ఖైదీకి నెలకు 200 రూపాయలు ఖర్చు అవుతుంది.     ఖర్చయినా పర్వాలేదు కానీ, ఈ ఫోను వల్ల బయటప్రాంతాల్లో అరాచకాలు జరగకుండా కూడా చర్యలు తీసుకోవచ్చని జైలు ఉన్నతాధికారులు భావిస్తున్నారు. ఖైదీ ఆలోచనలు కూడా తమకు రికార్డింగుల రూపంలో తెలుస్తుందని అధికారులు అంటున్నారు. ప్రయోగాత్మకంగా ఈ ఫోను సౌకర్యం చర్లపల్లి జైలులో ప్రవేశపెట్టామని జైళ్లశాఖ డిప్యూటీ డైరెక్టర్‌ టిపిదాస్‌ తెలిపారు. ఖైదీల కుటుంబసభ్యుల ములాఖత్‌లు తగ్గాయని, కుటుంబసభ్యులు కూడా ఖైదీల ఆరోగ్యం గురించి వాకబు చేయటానికి అవకాశం కుదిరిందని వివరించారు. ఈ సక్సెస్‌ ఆధాంగానే రాజమండ్రి సెంట్రల్‌జైలులో మరోమూడు, 4నెలల్లో ఈ ఫోను సౌకర్యం కల్పిస్తామంటున్నారు. ఈ సౌకర్యం వల్ల సెంట్రల్‌జైలులో ఖైదీల మానసికపరిస్థితిని మెరుగుపరిచిందని నిర్ణయానికి వచ్చాక రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని తెలిపారు.

ప్రహసనంగా మారిన కౌలురైతుల రుణమంజూరు?

రాష్ట్రప్రభుత్వం రైతులు, కౌలురైతులు గుర్తింపుకార్డుల జారీ విషయంలో ప్రకటించిన చిత్తశుద్ధి రుణమంజూరుల్లో కనిపించటం లేదని ఆందోళనలు ఎక్కువయ్యాయి. అసలు కార్డుల ఆథారంగా బ్యాంకురుణాలు మంజూరు అన్న ప్రక్రియే రాష్ట్రంలో సక్రమంగా సాగటం లేదు. కేవలం ప్రభుత్వం రైతుశ్రేయస్సు ఆశించేదిలా కనిపించే ప్రహసనంలా ఈ కార్యక్రమం చేపట్టిందని విమర్శలు ఎక్కువయ్యాయి. ఈ ఏడాది 12లక్షల మంది కౌలురైతులకు కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. ఈ కార్డుల ద్వారా బ్యాంకులు రెండువేల కోట్ల రూపాయలు రుణాలు మంజూరు చేయాలని ప్రభుత్వం లక్ష్యం పెట్టుకుంది.       అయితే ఖరీఫ్‌సీజన్‌ ప్రారంభమై నెలదాటినా ఇప్పటివరకూ 1.13లక్షల కార్డులు కొత్తగా మంజూరు చేశారు. మొత్తం 25,294మంది కౌలురైతులకు రుణాలిచ్చారు. ఇంకా సుమారు 11లక్షల కార్డులను రాష్ట్రవ్యాప్తంగా ఎప్పటికి కౌలురైతులకు మంజూరు చేయగలరు? బ్యాంకు రుణాలు ఎప్పుడు మంజూరు చేస్తారు? రాష్ట్ర ప్రభుత్వం తన రాజకీయ సంక్షోభంలో పడి ఇటువంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలను నిర్లక్ష్యం చేస్తోందని విమర్శలు వస్తున్నాయి. గతేడాది 25,294మంది కౌలురైతులకు రూ.55.94కోట్ల పంటరుణాలు మంజూరు చేశారు. దీనిలో ఒక్కపశ్చిమగోదావరి జిల్లా నుంచే 16,793మందికి రుణం కింద రూ.37.96కోట్లు మంజూరు చేశారు. మిగతా జిల్లాల్లో ఈ రుణాలు నామమాత్రంగా మంజూరయ్యాయి. సిఎం సొంత జిల్లా చిత్తూరులోనూ కౌలురైతులకు అన్యాయం జరిగింది. ఈ జిల్లాలో ఇప్పటి వరకూ 13,927మందికి కౌలురైతుకార్డులు మంజూరయ్యాయి. ఇప్పటి వరకూ ఒక్క రుణం కూడా ఈ జిల్లాలో మంజూరు కాలేదు. దీంతో అక్కడి కౌలురైతులు ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కార్డులు చూపి రుణం పొందే అవకాశం తమకు ఎందుకు కల్పించలేదని సిఎంను సైతం నిలదేసేందుకు సిద్ధమయ్యారు. ప్రభుత్వం చిత్తశుద్థితో కౌలుదారులకు రుణాలు మంజూరు చేయాలని రైతు సంఘాల నాయకులు కోరుతున్నారు.

ఫలించిన సోనియా స్ట్రాటజీ!

వర్షాకాలం సమావేశాలు ప్రారంభమైన తొలిరోజే హడావుడి చేసి తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం గురించి రసాభాస చేసేందుకు ఆ ప్రాంత ఎంపీలు ప్రయత్నించారు. వారి ప్రయత్నాలను పసిగట్టిన కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ తమకు తలనొప్పిగా ఉన్న బిజెపిని అదుపుచేసేందుకు తెలంగాణాప్రత్యేక రాష్ట్రం అంశాన్ని అస్త్రంగా ఉపయోగించారు. సభలో గొడవ చేసేందుకు లేచిన తెలంగాణా ఎంపీలను సోనియా పిలిచి తెలంగాణా ప్రత్యేక రాష్ట్రం కావాలా? అయితే అద్వానీని అదుపు చేయండి అని ఆదేశించారు. హఠాత్తుగా కాంగ్రెస్‌ అధినేత్రి తమ ప్రధాన డిమాండు గురించి ఎత్తేసేటప్పటికి ఎంపీలు ఆశ్చర్యపోయారు. ఆ తరువాత వారు బిజెపి ఆవేశాన్ని తగ్గించేందుకు ప్రయత్నించారు.     వాస్తవానికి సోనియాగాంథీ తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం ఇస్తామని కానీ, ఇవ్వనని కానీ చెప్పలేదు. కేవలం సభలో గందరగోళం నివారించేందుకే తెలంగాణా ఎంపీలను ఆ ప్రత్యేకరాష్ట్రం పేరుతో అదుపు చేశారు. పైగా, తలనొప్పిగా ఉన్న బిజెపిని కూడా తెలంగాణా ఎంపిలపై ఆగ్రహం వ్యక్తం చేయటం ద్వారా అదుపు చేశారు. సోనియా రాజకీయచతురత అర్థం అయ్యేలోపే సభ పూర్తయిపోయింది. తెలంగాణా ఎంపీలు మాత్రం తమ ప్రత్యేకరాష్ట్ర డిమాండును సోనియా గుర్తించిందని ఆనందించారు. వాస్తవానికి ఆమె ప్రతీరోజూ ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయపరిస్థితులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న విషయం ఈ ఎంపీలకు తెలియదు. కేవలం సభసజావుగా జరిగేందుకే సోనియా ఆవేశాన్ని ప్రదర్శించి ఓ హిస్కెట్‌ వేశారన్న విషయం ఇకనైనా ఆ ఎంపీలు అర్థం చేసుకుంటే బాగుంటుంది. లేకపోతే ఇంకా ఆ వేర్పాటువాద ధోరణితోనే తమ సమయాన్ని వృథా చేసుకోవాల్సి వస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు.

దేశంలోని 12 రాష్ట్రాల కంటే సీమప్రత్యేకరాష్ట్రమే పెద్దదా?

దేశంలోని 12 రాష్ట్రాల కంటే రాయలసీమ ప్రత్యేకరాష్ట్రమే పెద్దదా? ఈ ప్రశ్న మేథావులను సైతం ఆలోచింపజేసేలా ఉంది. ఒక్క రాయలసీమను ప్రత్యేకరాష్ట్రం చేస్తే దానికి అవసరమైన జిల్లాలు కూడా ఏమేమి ఉండాలో అన్న అంశం గురించి కూడా రాయలసీమపరిరక్షణ సమితి క్షుణ్నంగా పరిశీలించేసింది. రాష్ట్రానికి హద్దులు, ఎల్లలు కూడా నిర్ణయించేసింది. ప్రత్యేకించి రాష్ట్రజనాభా వివరాలను కూడా సేకరించి పూర్తిస్థాయి నివేదికతో పరిరక్షణసమితి సన్నద్థంగా ఉంది. కేంద్ర ప్రభుత్వ దృష్టికి తెలంగాణా ప్రత్యేకరాష్ట్రం అంశం చేరటానికే ఏళ్లు పట్టేస్తే అస్సలు కష్టపడాల్సిన పని లేకుండా పూర్తివివరాలతో తాము పోరాడుతున్నామని పరిరక్షణ సమితి ప్రకటిస్తోంది.       మాకు తెలంగాణాను కలపాల్సిన పనేలేదని పరిరక్షణ సమితి ఛైర్మన్‌, తెలుగుదేశం పార్టీ రాష్ట్రకార్యదర్శి బైర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి అంటున్నారు. తమ సీమ రాష్ట్రం 60వేల చదరపు కిలోమీటర్ల పరిథిలో ఏర్పాటు చేయవచ్చని వివరిస్తున్నారు. దేశంలోని 12రాష్ట్రాల కంటే సీమరాష్ట్రమే పెద్దదంటున్నారు. తమ రాష్ట్రం కోసం వేరే ప్రాంతాల్లోని జిల్లాలు కలుపుకోవాల్సిన పని లేదని స్పష్టం చేస్తున్నారు. తమ రాయలసీమలో ఉన్న నంద్యాల, రాజంపేట, హిందుపురం, తిరుపతి, ప్రొద్దుటూరులను ప్రత్యేక జిల్లాలుగా ప్రకటించేస్తే సరిపోతుందని బైర్రెడ్డి చెప్పుకొస్తున్నారు. అసలు ఇంతలా సీమరాష్ట్రం గురించి కసరత్తులు చేస్తున్నారు సరే! మరి కేంద్రం దృష్టికి ఈ వివరాలు వెళ్లాయా అంటే మీడియా ఉంది కదా అని తప్పించుకుంటున్నారు. ఏమైనా సీమరాష్ట్రం ఎలా ఉండాలో కలలు కంటున్న బైర్రెడ్డి తమ సీమకే చెందిన తెలుగుదేశం పార్టీ అథినేత చంద్రబాబును ఒప్పించగలరా? అన్న సవాల్‌ను స్వీకరించాలని కాంగ్రెస్‌ పెద్దలు కోరుతున్నారు. తెలంగాణా ప్రాంతమే భౌగోళికంగా మార్చటం కుదరక ఆ రాష్ట్రం గురించి ఆ ప్రాంతవాసుల కలలను కేంద్రం పట్టించుకోవటం లేదు. మరి ప్రతిపాదనలో లేని సీమరాష్ట్రం వస్తుందా? చస్తుందా అని కాంగ్రెస్‌ నేతలు బైర్రెడ్డిని ప్రశ్నిస్తున్నారు. కర్నాటక రాష్ట్రంలో మాదిరిగా ఒక ప్రాంతీయపార్టీ పెట్టుకోవటానికి బైర్రెడ్డి ఈ ప్రయత్నాలు చేస్తే పర్వాలేదు కానీ, ఖచ్చితంగా సీమ ప్రత్యేక రాష్ట్రం ఇవ్వాలంటే కష్టమేనని వారు స్పష్టం చేస్తున్నారు. ఏమైనా రాయలసీమపై బైర్రెడ్డికి ఉన్న పట్టును ఆయన విశదీకరించిన హద్దులు, కొత్త జిల్లాల ప్రతిపాదనల్లో కనిపించదని కాంగ్రెస్‌ నేతలూ అంగీకరిస్తున్నారు.

వైద్యులు లేకండానే ఆస్పత్రులు నడిపేస్తున్న ప్రభుత్వం!

గుంటూరు జిల్లాలోని పిహెచ్‌సిల్లో వైద్యం అందని ద్రాక్షలా మారిందని రోగులు గగ్గోలు పెడుతున్నారు. ఈ ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో వైద్యులు అస్సలు అందుబాటులో ఉండటం లేదని వాపోతున్నారు. క్షేత్రస్థాయి సిబ్బంది కూడా ఇతర ప్రాంతాల్లో నివాసముంటున్నారని తెలిసి ఇటీవలే జిల్లా వైద్యశాఖాధికారులు వారినుంచి స్థానికంగా నివాస ముంటామని హామీ పత్రాలు తీసుకున్నారు. జిల్లాలో 77 ప్రాథమిక ఆరోగ్యకేంద్రాలు(పిహెచ్‌సి)లు ఉన్నాయి. అలానే ఎనిమిది వైద్యవిధానపరిషత్తు ఆసుపత్రులున్నాయి.     మొత్తం ఈ ఆసుపత్రుల్లో 175మంది డాక్టర్లు(వైద్యులు) పని చేస్తున్నారు. వీరంతా పని చేసే చోట నివాసముండటం లేదు. దీంతో జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ సీరియస్‌గా పరిగణించి పిహెచ్‌సి సమీపంలో ఉండలేమన్న 22 మంది వైద్యులను గుర్తించింది. వీరికి ఇచ్చే అద్దెభృతి(హౌస్‌అలవెన్సు) మూడు వేల రూపాయలు ఆపుజేసింది. వీరిని చూసి మిగిలిన వైద్యులైనా పిహెచ్‌సి ప్రాంతాల్లోనే నివసిశిస్తారని భావించింది. కానీ, వైద్యులు ఈ చర్యలను కూడా లెక్క చేయటం లేదు. దీంతో గ్రామీణ ప్రాంతాల వారికి వైద్యం అందటం లేదు. చిన్న సమస్య వచ్చినా జిల్లా ఆసుపత్రికి వచ్చే పరిస్థితుల్లో గ్రామీణులున్నారు. వైద్యఆరోగ్యశాఖ మహిళాక్షేత్ర సిబ్బందిని నియమించేటప్పుడే స్థానికంగా నివాసం ఉండాలని ఆంక్షలు విథించింది. మొత్తం 42మంది మహిళాక్షేత్రసిబ్బంది చేత స్థానికంగా నివాసముంటామని రాతపూర్వకంగా తీసుకుంది. ఈ హామీ తీసుకున్న తరువాతే వారిని విథులకు పంపించింది. వైద్యుల విషయంలో ప్రేక్షకపాత్ర పోషించటం కన్నా నివేదిక తెప్పించుకునైనా చర్యలు తీసుకోవాలని రాజకీయ నాయకులు వైద్యఆరోగ్యశాఖను కోరుతున్నారు. అసలే వర్షాకాలం జ్వరాలు సోకే సీజన్‌ కాబట్టి తక్షణ చర్యలు చేపట్టాలని వారు విజ్ఞప్తి చేస్తున్నారు.

గాలిలో 800 మంది విద్యార్థుల భవిష్యత్‌

తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలోని 800మంది విద్యార్థుల భవిష్యత్తుతో విద్యాశాఖాధికారులు చెలగాటమాడుతున్నారు. నగరంలోని ఆర్యాపురంలో గతేడాది చివరలోనే శ్రీ చైతన్య టెక్నో స్కూల్‌ను మూసేశారు.     ఇందులో చదువుతున్న 800మంది విద్యార్థులకు ఇతర స్కూళ్లలో ప్రవేశం కల్పించే చర్యలు తీసుకుంటామని తల్లిదండ్రులకు భరోసా ఇచ్చి విద్యాశాఖాధికారులు చేతులు దులుపుకున్నారు. అప్పుడే ఈ విద్యాసంవత్సరం ప్రారంభమై త్రైమాసిక పరీక్షలు దగ్గరపడుతున్నా ఇంకా విద్యాశాఖాధికారులు విషయం తేలుస్తారని తల్లిదండ్రులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇప్పటి వరకూ విద్యాశాఖాధి కారులు ఎటువంటి స్పందన తెలియజేయలేదు. ఈ టెక్నో స్కూలుకు సమీపగ్రామాల నుంచి విద్యార్థులు వచ్చేవారు. బస్సులో స్కూలుకు వచ్చి చదువుకుని తిరిగి వెళ్లేవారు. అటువంటిది విద్యాశాఖాధికారులు తేల్చిన తరువాత స్కూలు ప్రవేశం పొందవచ్చని విద్యార్థులు కూడా ఎదురుచూస్తున్నారు. అయితే ఇంతవరకూ విద్యాశాఖాధికారులు ఈ విద్యార్థుల గురించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని సమాచారం. విద్యాశాఖాధికారులు నిర్లక్ష్యంపై తల్లిదండ్రులు జిల్లా కలెక్టరుకు వినతిపత్రం సమర్పించాలని నిర్ణయించుకున్నారు. కలెక్టరు నీతూకుమారి ప్రసాద్‌ విద్యార్థుల సమస్యలను సీరియస్‌గా తీసుకుంటారని తల్లిదండ్రులు ఆశిస్తున్నారు

గోదావరికి వరద ఉదృతితో పొంచి ఉన్న ప్రమాదం

గోదావరికి ఎగువనుండి వరద ఉదృతి పెరగటంతో అధికారులు భద్రతా చర్యలు చేపట్టారు. తూర్పుగోదావరి లోని రామచంద్రా పురం మండలంలోని పేరిలంక గ్రామ ప్రజలను అధికారులు ఖాళీచేయించి సురక్షక ప్రాంతాలకు తరలించారు. పేరిలంకకు సమీపంలో ఉన్న గ్రామాలను కూడా ఖాళీ చేయిస్తున్నట్లు తెలుస్తుంది. గోదావరి పరివాహక ప్రాంతల్లోని కరకట్ల రక్షణకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే దవళేశ్వరం బ్యారేజిలోని అన్ని గేట్లను ఎత్తివేశారు. దాదాపు 3 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. వరద ఉధృతి మరింత పెరిగే సూచనలున్నాయని అధికారులు చెబుతున్నారు. చేపల వేటను నిషేదించారు. గోదావరి చుట్టు ప్రక్కల ప్రాంతాల ప్రజలను కూడా అప్రమత్తం చేశారు.

మంగళగిరి నరసింహస్వామి గాలిగోపురానికి పగుళ్లు

దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద గాలిగోపురం కలిగిన మంగళగిరి నరసింహస్వామి ఆలయగోపుర పగుళ్లు భక్తులను కలవర పెడుతున్నాయి. శ్రీకాళహస్తి గుడి గోపురం పడిపోయినట్లు ఇది కూడా ఎప్పుడు కూలిపోతుందో అని భక్తులు ఆందోళన చెందుతున్నారు. అతి ప్రాచీనమైన ఈ గుడి గాలిగోపురం 11 అంతస్తులను కలిగివుంది. గోపురం పగుళ్లపై నివేదిక సమర్పించడానికి గాను పలుదఫాలగా దీనిపై అనేక కమిటీలను దేవదాయ శాఖ నియమించింది. మొదటిసారిగా 2010 లో దేవాదాయశాఖ ఆద్వర్యంలో కమిటి పరిశీలన జరిపింది. అయితే పురావస్తు శాఖ చొరవతో చెన్నై ఐఐటి నిపుణులు పరిశీలించి గాలిగోపురం పునాదులు లోతుగా లేనందువల్లనే ఇలా జరిగిందని నిర్దారించింది. అత్యాధునిక పద్దతులతో ఆలయ గాలిగోపురం మరమ్మత్తుల చేయవచ్చని తెలిసింది. అత్యంత ప్రజదరణకలిగిన ఈ ఆలయ నిర్మాణాన్ని వెంటనే చేపట్టాలని కోరుతున్నారు. పానకాల స్వామిగా ప్రసిద్దిచెందిన ఈ ఆలయం భక్తులకు కొంగు బంగారంమై పదికాలాల పాటు విలసిల్లాలని భక్తులు కోరుచున్నారు.

ఇందిరమ్మ బా(ఆ)టలవసరమా?

ఇంజనీరింగ్‌ కళాశాల యాజమాన్యాల ధన దాహం, రాష్ట్ర ప్రభుత్వ పిసినారి తనంతో ఇంటర్‌ విద్యార్దులు నలిగి పోతున్నారు.ఫీజుల రీఎంబర్స్‌మెంట్‌ పాక్షింకంగా మాత్రమే చెల్లిస్తామన రాష్ట్ర ఫ్రభుత్వం అంటోంది. పాత ఫీజలు మాత్రమే చెల్లిస్తామని కొత్తగా పెరిగిన ఫీజలను విద్యార్ధులే భరించాలనటంతో విద్య మద్యతరగతి, దిగువ మద్యతరగతి వారికి ఇంజనీరింగ్‌ విద్య అందని ద్రాక్ష గా మారింది. ఇకపై విద్యార్ధులు చదుకోవడం మాని చదువుకొనటంపై దృష్టి సారించవలసి వస్తుంది.     అన్ని రాష్ట్రాల్లో అడ్మిషన్లు ముగిసి క్లాసులు జరుగుతున్నా ఇంతవరకు మన రాష్ట్రంలో మాత్రం ఎంసెట్‌ కౌన్సిలింగ్‌ కాదుకదా కౌన్సిలింగ్‌ డేట్‌కూడా ప్రకటించలేదు. ముఖ్యమంత్రి ఇందిరమ్మ బా(ఆ)ట లో సాగుతున్నారు. ఇప్పటికే తూర్పుగోదావరి, శ్రీకాకుళం జిల్లాల పర్యటన ఆటపాటలతో సాగగా ప్రస్తుతం ఖమ్మం జిల్లాలో కట్టుదిట్టమైన భద్రతా చర్యలమద్య ఇందిరబాట పర్యటనను కొనసాగిస్తున్నారు. రాష్ట్ర సమస్యలను, విద్యార్ధుల అడ్మిషన్లను గాలికి ఒదిలి వేయటం రాష్ట్ర ప్రజలకు ఆగ్రహాన్ని కలిగిస్తుంది. మన రాష్ట్రంనుండి మహారాష్ట్రలోని రత్నగిరి ఫెర్టిలైజింగ్‌కి గ్యాసు తరలించడం వల్ల ముఖ్యమంత్రి పై నిన్నటి వరకు ప్రతిపక్షాల, ప్రజల విమర్శలతోపాటు ముఖ్యమత్రి పదవికి కూడా ముప్పు వాటిల్లింది. సరైన సమయంలో ప్రధాన మంత్రిజోక్యంచేసుకొని గ్యాస్‌ మనరాష్ట్రంకి కేటాయించటంతో సమస్య సద్దుమణిగింది. ఇలాంటి పరిస్థితుల మద్యముఖ్యమంత్రి ఖమ్మం జిల్లా పర్యటన విమర్శల పాలవుతూ ఉంది. రాష్ట్ర ప్రభుత్వం ఉదాసీన వైఖరి కొనసాగిచడం రాజకీయ విశ్లేషకులకు, ప్రజలకు మింగుడు పడటం లేదు. సుస్ధిరమైన మెజారిటీ ఇచ్చినా బాధ్యతా యుతమైన పరిపాలన అందించలేకపోవడం రాష్ట్ర ప్రజలకు శాపంగా పరిణమించిందని చెప్పక తప్పదు. కేంద్రం కోరిక మేరకు పరిపాలన కాకుండా ప్రజలభీష్టం మేరకు పరిపాలన సాగించాలని రాజకీయ మేధావులు కోరుతున్నారు.

నలిగిపోతున్న ‘సామాన్యుడు ‘

పెరిగిపోయిన ధరలు, స్కూలు కాలేజీల ఫీజలు, నిత్యావసర ధరలు, గ్యాసు, పెట్రోలు, దీనితో ఎలా బ్రతకాలో తెలియని సామాన్యుడు. ఎంత తగ్గించుకున్నా బ్రతుకు పోరాటంలో ఓడిపోవడం మామూలైపోయింది. నీల్సన్‌ సర్వే ప్రకారం మార్కెట్‌లో కొనుగోళ్లు మధ్యతరగతి వారు బాగా తగ్గించేశారు. ఫ్యాషన్లు ఇంకా తగ్గించేశారు. ఇదివరలో ఇన్‌ఫర్‌మేషన్‌ టెక్నాలజీ పుణ్యమా అని చిన్న వయస్సులో పెద్ద ఉద్యోగాలు చేసే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు చేసే యవతరం కూడా క్షణం క్షణం ఉద్యోగ భయంతోనే ఉన్నారు. ఉద్యోగ భద్రత లేని ఈ రోజుల్లో వారు కూడా షాపింగుల కోసం ఎగబడటం మానేసారని నీల్సన్‌ సర్వే చెబుతుంది. షాపింగ్‌లో 47 శాతం మంది ప్యాషన్స్‌, ఖర్చుల్లో పొదుపు 21 శాతం తగ్గించు కున్నారని చెబుతున్నారు.     గత రెండేళ్లుగా ఈ పొదుపు చర్యలు మరింత ఎక్కువయ్యాయని వారు తెలిపారు. ఎంత తగ్గించుకున్నా విద్య, వైద్యం ఖర్చులు విపరీతంగా పెరిగి ఖర్చులకు ఆదాయానికి ఏ మాత్రం కుదరటం లేదని మద్యతరగతి ప్రజలు బెంబేలెత్తుతున్నారు. ఏ రాజకీయ పార్టీ మద్యతరగతి ప్రజల గురించి ఆలోచించకుండా ఓట్ల కోసం మాత్రమే రాజకీయాలు చేస్తుంన్నారని వారు వాపోతున్నారు. మద్యతరగతి మనుష్యులు బ్రతికే మార్గాన్ని రాజకీయనాయకులు ప్రభోదిస్తే బావుంటుందని అనుకుంటున్నారు. లేదా ఇకనైన రాజకీయపార్టీలు, మేధావులు, రాష్ట్రంలో అత్యధికంగా ఉండే మద్యతరగతి ప్రజలకు ఉపయోగమైన ఆర్ధిక సంస్కరణలకు పూనుకోవాలని ఆశిస్తున్నారు.