ఎం.పి.మందాతో ఢీ అంటున్న మంత్రి డి.కె.
posted on Aug 8, 2012 8:48AM
ఒకరిని ఒకరు గౌరవించుకోవటం సాంప్రదాయం. అది నేతలైనా సామాన్యులైనా ఒక్కటే. తమ గౌరవాన్ని తగ్గించేస్తున్నారని మహబూబ్‌నగర్ జిల్లాలో రెండేళ్ల నుంచి రాష్ట్ర మంత్రి డికే అరుణపై ఎంపి మందా జగన్నాథం మండిపడుతున్నారు. తనను చులకన చేస్తున్నారని ఆయన మంత్రి వైఖరిపై పీసిసికి, డిసీసీకి ఫిర్యాదు చేశారు. తన పేరు ముద్రించకుండా నియోజకవర్గంలో కార్యక్రమాలు కొనసాగిస్తున్నారని ఎంపి మందా జగన్నాథం మంత్రిపై ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా అటు పీసిసి కానీ, రాష్ట్రనేతలు కానీ, పట్టించుకోకపోవటంతో జిల్లాలో కాంగ్రెస్‌పార్టీకి తీరని నష్టం జరుగుతోందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అయితే వీరిద్దరూ మాత్రం నిత్యం పచ్చగడ్డి భగ్గుమనేలా వ్యవహరిస్తూనే ఉన్నారు. పొలమూరులో కూర్చీలతో తనను మంత్రి డికే తన్నించారని ఎంపి జగన్నాథం పీసిసి అథ్యక్షుడు బొత్సాసత్యన్నారాయణకు ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు బుట్టదాఖలు అయింది.
ఇటీవల ఎంపి వచ్చేలోపే మంత్రి కార్యక్రమాలు పూర్తి చేసేస్తున్నారు. ఒకవేళ కొంత కార్యక్రమం మిగిలి ఉంటే దాన్ని ఎంపికి వదిలేసి వెళ్లిపోతున్నారు. జగన్నాథం తన రాక చూసి మంత్రి వెళ్లిపోవటం జీర్ణించుకోలేకపోతున్నారు. శిలాఫలకాలపైనా, కార్యక్రమాల్లోనూ ప్రొటోకాల్ పాటించలేదని ఎంపి తరుచుగా అధికారులతో గొడవపడుతున్నారు. దీన్ని గుర్తించి అయినా అథిష్టానం ఒకసారి స్పందించాలని మహబూబ్‌నగర్ జిల్లా కాంగ్రెస్ నేతలు కోరుతున్నారు. అసలే బలం తగ్గిందని ఆందోళన చెందుతుంటే ఈ వివాదం పార్టీని ఎటువైపు తీసుకువెళ్తుందో అని వారు వాపోతున్నారు.